కథ

నాలుగొందల తొంభై ఎనిమిది

ఫిబ్రవరి 2018

నేను పోలీస్‌ స్టేషన్‌ లోకి అడుగుపెట్టే సరికి వాడు ఓరగా వేసిన చెక్క బెంచీ మీద, అరచేతుల్లో ముఖాన్ని పాతిపెట్టి కూర్చుని ఉన్నాడు. భుజం మీద చేయి వేస్తూ ప్రక్కన కూర్చున్నాను.

వాడు ఆ స్పర్శకు చప్పున లేచి  కూర్చుంటూ నా వైపు చూసాడు.

‘వచ్చావా’

‘సారీ… ట్రాఫిక్‌ రా.. కొంచం లేటైంది’

వాడు  రుమాలు తీసి ముఖాన్ని గట్టిగా అదుముతూ తుడుచుకుంటూ ‘ఫర్లేదు’ అన్నాడు.

‘ఏమైంది రా’

‘మా ఆవిడ నా మీద కేసు పెట్టింది’

‘మీ ఆవిడా? దేనికి?’ తెల్లబోతూ అడిగాను.

‘మొన్న రాత్రి గొడవైంది. కొట్టాను. ఈ రోజు పొద్దున్నే మా అత్తా మామా వచ్చారు. తనకి కేస్ పెట్టే  ఉద్దేశమే లేదు. మా మామ దొంగ… లం… కొడుకు చేసుంటాడు అంతా’ అంటూ వాడు కళ్ళల్లో వస్తున్న ఊటను తుడుచుకోవడానికి కాస్త ఆగాడు.

‘మరి వాళ్ళేరీ’ చుట్టూ చూస్తూ అడిగాను.

‘కాసేపట్లో వస్తార్ట. ఎస్‌. ఆర్‌. నగర్‌లో డాక్టర్‌ దగ్గర కాల్‌లో ఉంటే, స్టేషన్‌ నుంచి ఫోనొచ్చింది. అక్కడ బయల్దేరుతున్నపుడే నీకు కాల్‌ చేశాను. ఇబ్బంది పెట్టానా?’

నేను లేదన్నట్లు తలూపాను. వాడు బాగా ఆందోళనగా ఉన్నాడు. బాగా పీక్కుపోయి ఉన్నాడు. నేను వాడ్ని కలిసి దాదాపు ఎనిమిది నెలవుతోంది. పూర్వ విద్యార్థుల కలయికలో చూట్టం చివరిసారి. ఫోన్ లోనే ఎక్కువ మాట్లాడుకోవటం . . ఒకే ఊరిలో ఉన్నా, రోజూనో, వారాంతాల్లోనో కలుసుకునేంత దగ్గరితనం లేదు. మా ఉద్యోగాలు వీలు కల్పించవు. వాడు నాతో పాటు పదవ తరగతి వరకు చదువుకున్నాడు. మనిషి మెతక. చిన్నప్పుడు చాలా కుదురు. నూనె రాసి పాపిట తీసిన దువ్వు, పెద్ద కళ్ళు, చిన్ని కనుబొమలు, వాటి మధ్య ఆంజనేయస్వామి సిందూరం. తెల్ల చొక్కా, నీలం నిక్కరు, స్టీలు పెట్టెలో పుస్తకాలతో బడికొచ్చేవాడు. వాడు పొట్టిగా ఉండేవాడు. వాడు మొదటి బెంచి , నేనేమో మూడో బెంచి  . ఏ పాఠం బయటకు చదవాలన్నా వాడే మొదట ఉండేవాడు. తొమ్మిదో తరగతిలో ఇద్దరం ఒకే ప్రైవేటు. డిబేట్‌ కాంపిటీషన్‌లో వాడు అనర్గళంగా మాట్లాడుతూ మధ్యలో ఒకచోట సడెన్‌గా మర్చిపోయి పైకప్పును చూస్తూ గుర్తు తెచ్చుకుని, ఆ మిడిగుడ్లతో మళ్ళీ దానిని కొనసాగించటం నాకు బాగా గుర్తు. నాది వేరే గుంపు. వీడప్పుడప్పుడూ మాతో ఆటల్లో కలిసేవాడు. వేసవి సెలవుల్లో మా వాసుగాడితో కలిసి ఉలాసపేట నుండి మా వీధికి క్రికెట్‌ కోసం వచ్చేవాడు. అదేంటో వాడ్ని ఎప్పుడు చూసినా శుభ్రంగా ఉండేవాడు. మరీ ముఖ్యంగా నొసటన ఆంజనేయస్వామి సిందూరం.

పదో తరగతి తర్వాత చాలా మంది చెల్లా చెదురయ్యాం. సంక్రాంతికి ఊరికెళితే కలిసేవాడు. పెద్దగా మాట్లాడడు కానీ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ మాతో పాటే ఉండేవాడు. ఏదైనా జోకేస్తే నవ్వేవాడు. పై రెండు పళ్ళ మధ్య ఖాళీ స్పష్టంగా కనిపించి వాడి నవ్వు తమాషాగా, అందంగా ఉండేది. తరువాత్తరువాత అందరం బిజీ.. జీవితం, బాధ్యతలు, ఉద్యోగం.. కలయికలు తగ్గాయి. వాడి పెళ్ళికి పిలిచాడు. నేను కలకత్తా ట్రైనింగ్‌లో ఉండి వెళ్ళలేక పోయాను. తర్వాత వాడికి హైద్రాబాద్‌ ట్రాన్స్ఫరయింది. ఎలా కనుక్కున్నాడో నా నంబర్ కనుక్కుని  ఫోన్‌ చేశాడు. వాడు ఆ కొస. నేను ఈ కొస. ఫోన్‌లోనే అప్పుడప్పుడూ… పొడి పొడి మాటలు. వాడు వాళ్ళింటికి ఎప్పుడూ పిలవలేదు. నాకు వాడిని  పిలవాలని అనిపించలేదు.

కానీ మొన్న అలూమినీ మీట్‌లో మాత్రం నాతోనే ఉన్నాడు. వాడిలో ఏదో మార్పు వచ్చింది. ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వారానికొకసారైనా ఫోనుండేది. ఎప్పుడూ వాడు చెయ్యటమే. నేను చేద్దామను కోవటం. ఈలోగా వాడే చేసేవాడు. ఇదిగో ఈ రోజు అలాంటి ఫోనే అనుకున్నా.. కానీ వాడి గొంతులో ఆందోళన ..గాభరా .

‘ఏరియా పేరు చెప్పి .. ఫలానా  పోలీస్‌ స్టేషన్‌కు రా రా.. నా మీద కేసు పెట్టారు. తెలిసినవాళ్లెవరూ లేర్రా ఇక్కడ. నువ్‌ పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది.. ఒకసారి రారా ప్లీజ్‌ ’ అన్నాడు.

తలా, తోకా అర్థం కాలేదు కానీ, నేనెళ్ళటం అవసరం అనిపించింది. వచ్చాను. ఇదిగో వీడిలా ఉన్నాడు. మనిషి పీక్కుపోయి, కళ్ళక్రింద ముడుతలో, మురికో తెలీని ఒక పొర  వాడి కళ్ళద్దాల్లోంచి కనిపిస్తోంది. ఆంజనేయస్వామి సిందూరం చెమటతో కలిసి చెదిరిపోయి  ఉంది. వాడు మాటిమాటికీ కళ్ళు పెద్దవి చేస్తూ, రెప్పలను టప టపలాడిస్తున్నాడు. చేతికున్న గడియారాన్ని విప్పటం తిరిగి కట్టుకోవటం అదేపనిగా చేస్తున్నాడు.

‘ఏం కాదురా.. టెన్షన్‌ పడకు’ అన్నాను.

‘ఏమైనా ఫర్లేదురా.. నేను చచ్చిపోతే బెటర్‌’

‘ఏడిశావ్‌.. ఇంత చిన్న విషయానికే చచ్చిపోతారా.. కేసేంటో కనుక్కోనీ.. నువ్వేం మర్డర్‌ చెయ్యిలేదు. కొట్టడం తప్పే.. మీ ఆవిడ రానీ.. నే మాట్లాడతా’.

అన్నానే కానీ ఏమ్మాట్లాడాలో నిజంగా నాకు తెలీదు. వాడు నావైపు చూడకుండా మళ్ళీ చేతుల్లో మొహం దాచుకుని కూర్చున్నాడు. మా బెంచ్‌కు ఎదురుగా ఉన్న రెండు కుర్చీల్లో ఒకటి ఖాళీ. రెండో దాంట్లో ఒకామె ఏదో రాస్తూ ఉంది.

నేను లేచి బయటకొచ్చాను. సిగిరెట్‌ తాగితే బావుణ్ణనిపించింది. పోలీస్‌ స్టేషన్‌ బయట కాల్చొచ్చో లేదో.. ఎందుకులే.. పోలీస్‌ స్టేషన్‌ను సినిమాల్లో చూడటమే కానీ ఎప్పుడూ వచ్చింది లేదు. ఈ స్టేషను అయితే సినిమాల్లో చూపించినట్లు అస్సల్లేదు. మహిళా స్టేషనంట. మరి మామూలు స్టేషన్లు సినిమాల్లో చూపించినట్లు ఉంటాయేమో.. . వంద గజాల జాగా ఉంటుందేమో. అందులో ఒక పాత పెచ్చులూడుతున్న గోడ కట్టడం. సగం పెంకు, సగం స్లాబు తమాషాగా.. వర్ణ సంస్కారం లేని గోడలు, పాచు పట్టిన గోడ ప్రక్కనే కిటికీ.. చుట్టూ కాస్త ఖాళీ జాగా. ఒకవైపు బళ్ళు పెట్టుకునే పార్కింగ్  ఉంది. రెండోవైపు ఒక పిచ్చి బాదం చెట్టు ఏపుగా పెరిగి ఉంది. దాని ఆకులు ఆవరణలో పరుచుకొని ఉన్నాయి. వాటి మధ్య చిన్న సిమెంటు మెట్లు గుండ్రంగా ఉండి మధ్యలో  ఇనుప గొట్టంతో జెండా స్తంభం. దానికెదురుగానే స్టేషన్‌ వాకిలి. ఒక పాత చెక్క టేబుల్‌, దానిమీద ‘మే ఐ హెల్ప్‌ యూ’ అని నీలి రంగు అక్షరాల తెల్ల బోర్డు. కుర్చీ ఉంది కానీ, ఎవరూ లేరు. అది దాటుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చాను. వాడింకా అలానే ఉన్నాడు. ప్రక్కన కూర్చున్నాను. ఇందాక గమనించలేదు కానీ లోపల ఓ రూము ఉంది. లైటు వెలుగుతోంది. అలికిడి లేదు. బహుశా ఎవరైనా లోపల ఉన్నారేమో… లేకపోవచ్చు కూడా. మొత్తం స్టేషన్‌లో నలుగురమే ఉన్నాం ఆ సమయానికి. మా ఎదురుగా రాసుకుంటున్నామె రాతపని ఆపి, శ్రద్ధగా ఒక కవర్‌లో దానిని మడతపెట్టి సొరుగులోంచి బంక బాటిల్‌ను తీసింది. బాటిల్‌లో బంక అయిపోయిందేమో.. ఆమె తంటాలు పడుతూ ఉంది. పరీక్షగా చూస్తే మా సుగుణత్తయ్యలా ఉంది. ఖాకీ బట్టలు వలన ఆమెలో చిన్న కరుకుదనం నాక్కనిపిస్తుందేమో కానీ.. ఆమె నిజంగా మా అత్తయ్యలానే ఉంది.

నేను, మావాడు, ఆమెతోపాటు ఇంకొకామె బాదం చెట్టు దగ్గర కూర్చుని ఉంది. నలుగురమే ఉండటం వల్లనేమో స్టేషన్‌ నిశ్శబ్దంగా, గూఢంగా ఉంది. టొక్కు . . టొక్కు మంటున్న సీలింగ్‌ఫ్యాన్‌ చప్పుడు తప్ప ఇంకే శబ్దం లేదు.

బాదం చెట్టు దగ్గర కూర్చున్నామె శూన్యంలోకి చూస్తూ ఉంది.

ఆమెకు ఏం కష్టమో?

నాకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. టైమ్‌ చూసాను. ఆరవుతూ ఉంది.  ఇరుకుగా, ముడుచుకు పోయినట్లుగా ఒక భావన.. ఎందుకో తెలీదు. వెళ్ళిపోవానిపిస్తోంది. టొక్కు . . టొక్కు . . టొక్కు లయబద్దంగా ఫ్యాన్‌ చప్పుడు. మెల్లగా లేచి బంకతో తంటాలు పడుతున్నామె దగ్గరకెళ్ళాను.

‘మేడమ్‌’

ఏంటన్నట్లు తలెత్తి చూసింది.

‘నా ఫ్రెండే.. వాళ్ళావిడ, అత్తా మామ కేసు పెట్టారంట.. ఏంటో తెలుసుకోవచ్చా? ఎవరితో మాట్లాడాలి?’

‘ఏం మాట్లాడతావ్‌? ఏదైనా మేడమ్‌ వస్తుంది. ఆమెతో చెప్పు. అప్పటిదాకా కూచో’ ఏకవచనంలో అంత కరుగ్గా చెప్పగానే … ఆమెను సుగుణత్తయ్యతో పోల్చటం తప్పనిపించింది.

నేను ఎర్రబడిన మొహంతో వచ్చి కూర్చున్నా. వాడు మొహం ఎత్తలేదు.  అక్కడ్నుంచి వెళ్ళిపోవాలనుంది. నాకేం పెద్ద పనిలేదు. ఇంటిక్కూడా తొందరేం లేదు. మా ఆవిడ , పాప వేసవి సెలవులకు వైజాగ్ వెళ్లారు . లేట్‌ అయితే ఏం కాదు.

కానీ కూర్చోబుద్ధి కావట్లే. వాడు మాట్లాడితే బావుణ్ణు. అసలేమయి ఉంటుంది?

నేనే కదిపాను.

‘అసలెందుకు కొట్టావ్‌ రా? కొట్టకూడదు కదా? ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ,…… స్టేషన్ల వరకూ వచ్చింది చూడు’

వాడు చేతుల్లోంచి మొహం తీయకుండా చెప్పాడు.

‘ఎప్పుడూ చెయ్యెత్తింది లేదురా .. మొదటి సార్రా .. కంట్రోల్‌ తప్పాను.. ఇదుగో  ఇక్కడ దాకా వచ్చింది “ అన్నాడు

‘సరే. టెన్షన్ పడకు ..ఫ్రీ గా ఉండు .  మొదటిసారి కదా.. SI తో మాట్లాడదాం. ఏదో ఆవేశం అని చెప్పొచ్చు  . . నేను మాట్లాడతాను. డోంట్ వర్రీ ’ అన్నానే కానీ … నిజంగా ఏం మాట్లాడాలి?

అలికిడైంది. తల తిప్పితే ముందొక ఆడపోలీసు, వెనకాలే ఒక మగ, ఆడ ఆ వెనకా ఇంకో ఇద్దరు ఆడవాళ్ళు చివర్లో ఇంకో ఆడపోలీసు.

లోపలికొచ్చాక.. ‘అక్కడ కూచో.. మీ వాళ్ళు, నువ్వు  బయటుండండమ్మా.. మేడం వస్తే పిలుస్తా’ అంది వచ్చిన ఆడపోలీసు ఒకామె, కాస్త దూరంగా వాటర్‌ డిస్పెన్సర్‌ దగ్గరకు నడుస్తూ, అతనికి బెంచీని చూపిస్తూ..

రెండో ఆమె టకా టకా నడుచుకుంటూ లోపలికెళ్ళిపోయింది. అతడు మా వాడి ప్రక్కనే కూర్చున్నాడు. బక్కగా, చిక్కటి వెంట్రుకలు, మాసిన గడ్డం, ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. అతడు కూర్చున్నప్పుడే గుప్ఫుమంది.

 

ఫోన్ రింగైంది . ఎత్తాను. అవతల మా ఆవిడ.

‘‘చెప్పు బుజ్జీ’’

‘‘ఎక్కడున్నారు.. ఇంకా ఆఫీసులోనేనా’’

‘‘లేదు.. చిన్న పనుంటే బయటకొచ్చాను . . సేల్స్‌ కాల్‌’‘బొంకాను.

‘‘రేపు మా పద్మక్క వాళ్ళ మరిది పెళ్ళి. అనకాపల్లి వెళ్తున్నాం.. మీ వాళ్ళకు చెప్పి కారేదైనా అరేంజవుద్దేమో చెప్తారా’’

‘‘అలాగే.. గంటలో చెప్తా. పాప ఎలా ఉంది’’

‘‘బావుంది. క్రింద పిన్ని వాళ్ళింట్లో దీపుగాడితో ఆడుకుంటోంది’’

‘‘సరే . . నేను మళ్ళీ చేస్తాను’’ పెట్టేశాను..

వాడిని చూశాను. వాడు స్తిమిత పడి కూర్చున్నట్లు కనిపించాడు. మనిషి తెరిపిగా ఉన్నాడు. ఒక చేతి వేళ్ళలో ఇంకో చేతి వేళ్ళు జొనిపి.. రెండు బొటన వేళ్ళనూ తాకిస్తూ. . మూతిని సున్నాలా చుట్టి.. కళ్ళు పెద్దవిచేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు. కంటి రెప్పలార్పడం వేగం తగ్గింది. నేనేమీ మాట్లాడలా.. ఆ ప్రక్కన కూర్చున్నోడు ఇంచుమించు

నిద్ర పోతున్నట్లుగా గోడకు చేరగిలబడి పైకప్పును చూస్తున్నాడు.

ఏం చేసి ఉంటాడు. బయట ఉన్నవాళ్ళెవరు? తాగి భార్యను హింసించి  ఉంటాడా? మావాడు చేసిందీ అదే కదా? భార్యను కొట్టాడు. ఎందుకు కొట్టి ఉంటాడు. మొదటిసారికే కేసు పెడతారా? వీళ్ళిద్దర్నీ ఒకే జైలులో, ఒకే సెల్లులో,  ఎన్నేళ్ళుంచుతారో వీడిని జైల్లో… ఏమో! కేసేంటి అసలు… కేస్‌ తెలిస్తే ఎన్నేళ్ళు పడుతుందో చెప్పటానికి నేనేమైనా లాయర్‌నా.. . ఎవర్నడగాలి? ఎస్సై ఎప్పుడొస్తుందో…

ఆలోచనల్లోంచి బయటకొచ్చాను. మళ్ళీ ఇరుగ్గా, ఇబ్బందిగా ఉంది…

మెల్లగా లేచాను. వాడింకా అదే స్థితిలో ఉన్నాడు. వంగి చెవి దగ్గర ‘ఇప్పుడే వస్తాను’ అన్నాను.

‘ఎక్కడికి’ అన్నట్లు చూశాడు వాడు.

నేనేదో చెప్పబోతుండగా లోపలికి సబ్‌ ఇనస్పెక్టర్‌ వచ్చింది. ఆమె ఎస్సై అని నాకు అర్థమైంది. ఎవరూ చెప్పలేదు. కానీ అర్థమైంది. ఎలా అంటే నాక్కూడా తెలీదు..

ఆమె దడదడా నడుస్తూ లోపలికెళ్ళింది. లోపలున్నామె బయటకు వచ్చి మా ముందు ఖాళీ ఉన్న కుర్చీలో కూలబడింది. నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. నా ఆలోచన పసిగట్టినట్లు ఆమె నావైపు చూస్తూ ‘కాసేపు కూర్చోండి. మేడమ్‌ ఇప్పుడే వచ్చారు. పిలుస్తారు.’ అంది. ఆమె ఆ మాటంటుండగా ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు వచ్చారు. ఈసారి కూడా నాకెవరూ చెప్పలేదు. కానీ వచ్చినవాళ్ళెవరో .. అర్థమయ్యింది.

మావాడి భార్య , అత్త మామలు.

వాడి భార్య బాగా ఏడ్చినట్లు తెలుస్తూ ఉంది. ఒకవైపు కన్ను వాచి ఉంది. ఎడమ చేతి వ్రేళ్ళకు ఒక తెల్లని కట్టు కొత్తగా  ఉంది. బహుశా హాస్పిటల్‌ నుంచి డ్రెస్సింగ్‌ చేయించుకుని నేరుగా వస్తున్నారేమో ? ఆమె మౌనంగా నిలబడి వాడి వైపు చూసింది.

వాడింకా అలానే ఉన్నాడు. ఏం పట్టనట్లు. గచ్చుమీద ఒక కనిపించని కేంద్రాన్ని ఏర్పరుచుకుని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. గుండె కొట్టుకున్నట్లుగా., వాడి చెవి ప్రక్కన కణత సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ ఉంది.

నేను ఆమె దగ్గరకెళ్లి ఏం మాట్లాడాలో తెలీక ‘బావున్నారా  సిస్టర్‌’ అన్నాను.

ఆమె తెల్ల మొహంతో ఎవరన్నట్లు చూసింది.

నేను చిన్న పరిచయంతో విషయం చెప్పాను. ఆమె ఏ భావమూ లేకుండా తలదించుకొని నేలను చూస్తూ ఉంది.

వాళ్ళ నాన్న చప్పున అందుకొని ‘‘ఇలా రండి మాట్లాడదాం’’ అన్నాడు.

ఆమెను, వాళ్ళమ్మను వదిలి మేమిద్దరం బాదం చెట్టు దగ్గరకొచ్చాం. మేం చెట్టు దగ్గర నిబడగానే బయట లైటు వెలిగింది.

చీకటి వెలుగు నీడల మధ్య వాడి మామను పరిశీలనగా చూసాను. అతడు అంతా బావున్నాడు కానీ ఏదో తేడాగా ఉంది..

ఏంటది? ఏంటది… ఆ.. లేకితనం… మనిషి మొహంలో ఒక లేకితనం, చిన్నపాటి కఠినత్వం ఉన్నాయి. అతడి మొహానికి అతడు పెట్టుకున్న బంగారు రంగు ఫ్రేము కళ్ళజోడు అస్సలు నప్పక కృత్రిమంగా ఉంది. . అతడు మొహాన్ని చేత్తో తుడుచుకుంటూ.. సంభాషణ ప్రారంభిస్తూ..

‘నీకెప్పటినుంచీ ఈ వెధవ తెలుసు’ అన్నాడు.

నాకు చురుక్కుమంది. ‘మామూలుగానే మాట్లాడదామండి. ఆవేశపడకండి. వాడు నా క్లాస్ మేట్‌… పదో తరగతి దాకా’ అన్నాను.

‘‘ఈ వెధవ గురించి మాటలాడటమే తప్పు.. చూశావా. ఎలాక్కొట్టాడో.. అమ్మాయి చెయ్యి మీద కుర్చీ విసిరాడు. వేలు ఫ్రాక్చరయ్యింది. చంపేసేవాడేమో.. పక్కింటోళ్ళు చూడబట్టి సమయానికి కాపాడారు.. అయినా నగలు.. నగలు అంటూ మా ప్రాణం తీస్తున్నాడు. ఎనిమిదేళ్ళుగా నరకం .. ప్రతీనెలా.. ఇదే భాగోతం.. వీడిని లోపలేసి చిప్పకూడు తినిపిస్తేగానీ అణగడు… అందుకే ‘‘ఊపిరి పీల్చుకుని ఆగాడు.

‘ఏ నగలు’

‘అవే తాకట్టులో ఉన్న నగలు. ఏం నీకు చెప్పలేదా. అయినా రేపో మాపో విడిపించేస్తాం కదా.. డబ్బు సెట్టవ్వక గానీ.. లేకపోతే వాడి మొకాన కొట్టడానికి ఎంతసేపు’

నాకు అస్పష్టంగా అర్థమైనట్లు అనిపించింది. కానీ ఏదో అర్థం కాలేదు. వాడి ఆంజనేయస్వామి బొట్టు వెనక బుర్రలో భార్యను హింసించే గది ఒకటుందని నమ్మబుద్ధి కావట్లేదు.

‘పిలుస్తున్నారు.. మిమ్మల్నే’ పోలీసామె అరుపుకూ, కేకకూ మధ్యస్థంగా ఒక గొంతుతో మమ్మల్ని పిలిచింది.

మేం లోపలికి వెళ్ళేటప్పటికి ఆ తాగుబోతాయన తప్ప బెంచీమీద ఎవరూ  లేరు. లోపలకెళ్ళాన్నది అర్థమై నడిచాం. పుస్తకాలు, కాగితాలూ ముక్కిపోయిన వాసనొకటి పెద్దదవుతూ ఉండగా ఆ రూములోకి అడుగు పెట్టాము. వాడు, ఆమె కూర్చుని ఉన్నారు. వాళ్ళకెదురుగా ఎస్సై కూర్చుని ఎవరినో ఒక బూతుమాటతో ఫోన్‌లో సంబోధిస్తూ ఉంది. గక్కురుమన్నది నాకు. వాళ్ళత్త ఏ విధమైన భయమూ లేకుండా మెడలో పుస్తెలతాడు పట్టుకుని సవరదీస్తూ ఉంది.

‘చెప్పండి. ఏం చేద్దాం.. ఫోర్నయింటీ ఎయిట్  బుక్‌ చేద్దామా’ అంది ఎస్సై ఫోన్‌ను టేబుల్‌ మీద పెడుతూ.,  వాడి మామను చూస్తూ, …

వాడు గుటక మింగుతూ ఆందోళనగా ‘ఏంటీ ’ అన్నాడు.

‘ఫోర్నయింటీ ఎయిట్  సెక్షన్  విన్నావా.. అదే.. మళ్ళీ బయటకు రావటానికి మూడేళ్ళు పడుతుంది. జీవితం నాశనమైపోద్ది. కోర్టు చుట్టూ తిరగటానికి  నీ జీవితం సగం గడిచిపోద్ది. జైల్లో నీ కొవ్వణుస్తారు. మరేంటి  కేసేడదామా “అంది ఇనస్పెక్టర్‌ గుడ్లు పెద్దవి చేస్తూ ..

వాడు ఏడవటానికి సిద్ధమౌతున్న కళ్ళను కర్చీఫ్‌తో వత్తుకుంటూ ‘అమ్మా’ అన్నాడు , వాడి నొప్పంతా ఆ పిలుపులో వినిపించేసరికి నాకు గొంతు చేదుగా అనిపించింది .  చిన్న వణుకు కనిపిస్తోంది వాడిలో.

‘498  పెట్టాల్సినంత ఏం జరగలేదు మేడమ్‌. ఏదో చిన్న గొడవ’ అన్నాన్నేను.

నువ్వెవడివిరా మధ్యలో అన్నట్లు చూసింది నావైపు. ‘నేను తన క్లాస్‌మేట్‌ను మేడమ్‌. వాడు చిన్నప్పటినుంచీ తెలుసు. భార్యాభర్తల గొడవ. చెయ్యి చేసుకోవడం తప్పే. కాని ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. ఇకమీదట జరగదు. ఏదో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నాం మేడమ్‌. కేసులూ, కోర్టులూ అంటూ తిరగలేం. పిల్లలున్నారు. మీరే కనికరం చూపాలి’’ సాధ్యమైనంత వినయాన్ని తెచ్చిపెట్టుకుని, నా నటనాకౌశలం  అంతా చూపించాను.

ఎవరేం మాట్లాడలేదు.

‘చూడండి సిస్టర్‌.. మీరే కొంచం ఆలోచించండి. తనెలాంటి వాడో మీకంటే ఎవరికి ఎక్కువగా తెల్సు? కొట్టడం తప్పే. కానీ’ వాడి భార్యతో చెప్తూ ఏం మాట్లాడాలో తెలీక ఆగిపోయాను.

‘హలో, ఇలాటివన్నీ స్టేషన్‌కు రాకముందు చూస్కోవాలి. ఇక్కడ మేమున్నాం కదా… ఇగో పెద్దాయనా… ఏం చేద్దాం.. కేసు బుక్‌ చెయ్యమంటే చేస్తా. ప్రెస్‌ వాళ్ళు కాసేపట్లో వస్తారు. ఈ న్యూస్‌ ఐటమ్‌ కూడా ఇచ్చెయ్యొచ్చు ’ అంది ఇనస్పెక్టరమ్మ.

వాడు విలవిలలాడేడు. ‘‘మేడమ్‌. అసలు సమస్య నాకూ మా ఆవిడకూ కాదు. మాకసలు ఏం గొడవ లేదు. ఇదంతా వాళ్ళ నాన్న వల్ల’’ వాడు దు:ఖంతో ఆగిపోయాడు.

నాకు లోపల్నుంచి జాలి తన్నుకొచ్చింది. పాపం ఏడవలేడు. మాట్లాడలేడు. మగవాడు గట్టిగా ఏడవకూడదేమో కదా..

వాడి  మామ అందుకున్నాడు ‘‘ఇదే మేడమ్‌.. నగలు విడిపించుకురమ్మని వేపుకు తింటున్నాడు. మాకు కష్టం అని నా బిడ్డ అడగలేదు. ఇంకంతే.. ప్రతీసారి ఆ సాకుతో మెంటల్‌ టార్చర్‌.. ఇగో ఇప్పుడు చేతులు విరగ్గొట్టేదాకా వచ్చింది, మీ ఇష్టం మేడమ్‌.. ఏమైనా చెయ్యండి. ఇంకోసారి నా బిడ్డమీద చెయ్యి పడకూడదు. నగ ఊసు రాకూడదు. అలాగంటే ఓకే. లేకపోతే ఏ కేసు పెట్టినా, ఇద్దర్నీ విడదీసినా పర్లేదు’’.

వాడి భార్య చటుక్కున తండ్రి వైపు చూసింది. ఎర్రగా ఉన్న కనుగుడ్లతో అతన్ని వారిస్తూ… ‘‘అవేం మాటలు నాన్నా’’ అంది.

‘‘అయ్యో.. నగలు సమస్యే కాదు మేడమ్‌.. నగలు అడిగింది కరెక్టే. కానీ అవి..’’ వాడు మాట్లాడుతుండగానే ఇనస్పెక్టర్‌ కస్సుమంది.

‘‘ఇగో చూడు. మొగుడూ పెళ్ళాల గొడవ, మొదటిసారి కొట్టావ్‌ అంటున్నారు కాబట్టి ఇలా ఉన్నా. లేకపోతే ఈ పాటికి నిన్ను మొలతాడు మీద కూర్చోబెట్టేదాన్ని. ఫైనల్‌గా చెప్తున్నా . ఇకమీదట ఆమె మీద చెయ్యి పడొద్దు. నగల టాపిక్‌ రావద్దు. ఇంకోసారి స్టేషన్‌కు రావద్దు. పోండి.. రైటర్‌ దగ్గరకెళ్ళండి. ఫార్మాలిటీస్‌ కంప్లీట్‌ చెయ్యండి.’‘అని వాళ్ళ మామ వైపు తిరిగి ‘‘ఓకే కదా ‘‘అంది.

వాళ్ళ మామకు ఈ తీర్పు నచ్చినట్లు లేదు. అయిష్టంగా తలూపాడు.

రైటర్‌కు ఫార్మాలిటీస్‌గా ఏడు వేలు, స్టేషన్‌ ఖర్చుకని వెయ్యి చెల్లించి అక్కడ్నుంచి బయటపడటానికి మాకందరికీ ఇంకో గంట పట్టింది. ఏవో సంతకాలు. నేనూ పెట్టాను. ఇప్పటికి గండం గడిచింది. . చాలు.. ఎంత తొందరగా ఇక్కడ్నుంచి బయటపడదామా అని ఉంది.

మామ, అత్త, వాడి భార్య ముగ్గురూ ఆటో ఎక్కారు. వీడితో కానీ నాతో కానీ మాట్లాడలేదు.

‘నేనెళ్ళనా’ అన్నాను.

‘కాసేపుండొచ్చు కదరా.. మాట్లాడదాం.. ’ అన్నాడు వాడు. జేబులోంచి కారు తాళాలు తీస్తూ..

‘ఏమైనా తిన్నావా’

నిజానికి నాకు ఆకలిగా ఉంది. చాలా సేపట్నుంచి సిగిరెట్‌ కూడా లేదు. ఈ ఆకలి మీద మంచి రవాదోశ తిని ఒక టీ తాగి, సిగిరెట్‌ ఒకటి తాగితే… చా…లా బావుంటుంది.

‘తిందాం పద’ అన్నాడు వాడు. కారెక్కాను.

తినే ప్లాను రెస్టారెంట్‌ కనపడక బార్‌ రెస్టారెంట్‌ కన్పించడంతో తాగుడు మరియు తినటం అనే ప్లాన్‌గా రూపాంతరం చెందింది. రవాదోశ కన్నా బీరుతో పెప్పర్‌ చికెన్‌ బావుంటుంది. నిస్సందేహంగా..

బార్ లో జనం పల్చగా ఉన్నారు . మూలన టేబుల్‌. కూర్చున్నాం. తాగటానికీ తినటానికీ ఆర్డరిచ్చి, సిగిరెట్‌ వెలిగించి నేనే మాటలు  మొదలెట్టాను.

‘‘చూడ్రా… గొడవ పెద్దదవ్వలేదు. సంతోషం. లేకపోతే ఈ పాటికి ఏం జరిగేదో.. క్లాస్‌లో అందరికీ నీమీద మంచోడు అనే అభిప్రాయం. మన ఫ్రెండ్సందరూ నిన్ను పప్పుగాడంటారు. ఏదో పరిస్థితులు. మీ మామ ఇస్తానన్న నగలు ఇవ్వలేదు. వాటికోసం ఇన్ని సంవత్సరాలు గొడవపట్టం ఏంటి. మీ ఆవిడ్ని కొట్టడం ఏంటి? నేనొచ్చాను కానీ నాకెవరు తెల్సు ఇక్కడ. ఏమీ చెయ్యలేను నేను. తోడుగా వచ్చాను. రెండోసారి పిలిస్తే రాగలనో.. లేదో.. నీకు తెలీంది కాదు. ప్రైవేటు ఉద్యోగాలు. . ఇక మీదట గొడవలొద్దు.. ఇద్దరూ ఏదైనా హాలిడేకు ఓ రెండ్రోజులెళ్ళండి.. నేను ప్యాకేజీ బుక్‌ చేస్తాను’’ అన్నాను.. భార్యాభర్తల గొడవ తరువాత ట్రిప్పుకెళితే గొడవలు సమసిపోతాయని, ఆహ్లాదంగా ఉంటుందని ఈ మధ్య ఎక్కడో చదివిన ఆర్టికల్‌ను గుర్తు చేసుకుంటూ..

వాడు తలెత్తి దెబ్బతిన్నట్లు చూశాడు ‘‘నీకేం తెల్సురా… అసలు విషయమేంటో  తెలుసా’’

వెయిటర్‌ సరంజామా తెచ్చి సర్దాడు. బీర్‌ను గుటకేస్తూ అడిగాను.

‘‘అంటే’’

‘‘నగలు … నగలు అని మాట్లాడుతున్నారు కదా.. అవేం నగలో తెల్సా’’

‘‘నీ పెళ్ళికి మీ అత్తవారు పెడతానన్న బాలెన్స్‌ .. అంతేగా’’..

వాడు నావైపు అసహ్యకరంగా ఓ చూపు చూసి

‘‘కాదు. నా సంపాదనతో నా భార్యకు, కొడుక్కి  నేను కొన్న  నగలు.. నాకు తెలీకుండా వాళ్ళ నాన్నకు ఆమె ఇచ్చిన నగలు.. ఆరేళ్ల క్రిందట వాడు అవి తాకట్టు పెట్టి ఇప్పటికీ విడిపించని నగలు.. ’’ గుడ  గుడా ఒక మగ్గు బీరు తాగేసి క్రింద పెట్టాడు, ఎర్రబడిన కళ్ళతో.

నేను గతుక్కుమన్నాను. కథ పూర్తిగా కొత్తగా ఉంది.

‘‘మరైతే ఆ విషయం స్టేషన్‌లో చెప్పవేం’’ అన్నాను.

‘‘ఎక్కడ చెప్పనిస్తున్నారు. ఆడది ఒక మగాడి మీద కంప్లైంట్‌ ఇస్తే చాలు. వాడో శాడిస్టు… వెధవ.. పుండాకోర్‌ గాడు.. వాడేం చెప్పినా అబద్ధం.. వాడ్నసలు మాట్లాడనిస్తున్నారా.. ఇందాక ఇనస్పెక్టర్‌ ఏమైనా అడిగిందా .. ఇలా జరిగిందట.. నిన్ను బొక్కలో తొయ్యాలా, లేక నోర్మూసుకుంటావా అని ఆప్షనిచ్చింది. మగోడికి ఆత్మ ఉండదు… మనసు ఉండదు.. వాడో రాయి.. చెత్త. ఇదేగా మనకున్న మర్యాద.. మగాడి కోసం చట్టాలే లేవు కదరా… ఒకటే చట్టం. మగాడంటే వాణ్ణి తిట్టు.. సాహిత్యంలో వాడ్ని మృగం అని రాయి.. కొత్తగా మృగాడు అనే పదం కనిపెట్టారు తెలుగు పత్రికల్లో .  సినిమాల్లో వాడ్ని ఆడదాన్ని హింసించినట్లు చూపించు, వాడు తాగుబోతు, తిరుగుబోతు, రాత్రిళ్ళు ఇంటికి లేటుగా వస్తే వాడు కులుకుతున్నట్లు, చిన్నప్పటి స్నేహితులతో కాసేపు కబుర్లు చెప్తే వాడు బేవార్స్‌. కుటుంబాన్ని పట్టించుకోడు. ఇవే కదరా బిరుదులు . మగాళ్లలో మా మామా ఉన్నాడు.. నేనూ ఉన్నాను.. ఇద్దరినీ ఒకేలా చూస్తుంటేనే చచ్చిపోవాని అన్పిస్తుందిరా.. నేనూ.. ఊ..’’ వాడు ధారగా కారుతున్న కంటిలోని ఊటను కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు.

నేను మౌనంగా కూర్చున్నాను.. మాట్లాడటానికేం లేదు.

వాడు  కళ్ళు తుడుచుకుంటూ, తాగుతూ, కళ్ళు తుడుచుకుంటూ మరి కాసేపటికి తెరిపిన పడ్డాడు. ప్రశాంతంగా ఉన్నాడు. బీరు పనిచేస్తోందా ? ఏడ్వటం వలన దిగిపోయిన భారమా?

వెయిటర్‌ మమ్మల్ని విచిత్రంగా చూస్తూ ‘‘రిపీటా’’ అడిగాడు. బహుశా మగవాడు ఏడవటం అన్నది అతగాడికి ప్రోగ్రాం చెయ్యబడలేదనుకుంటా.. అతనికేంటి.. జనాభాలో తొంభైశాతానికి ఏడ్చే మడాగంటే లోకువే కదా..

‘నేనింక తాగను.. ఇంటికెళ్ళాలి’ అన్నాడు వాడు..

‘సరేలే .. కూర్చో.. కానీ ఆ నగల గొడవేదో పూర్తిగా చెప్పు .. తల పగిలిపోతోంది నాకు’’ అన్నాను.

వాడు ముందుకు వంగి, టేబుల్‌ మీద మోచేతులు ఆనించి, నా కళ్ళలోకి చూస్తూ చెప్పటం మొదలెట్టాడు.

‘‘నీకు తెల్సుకదా.. మాది అరేంజ్డ్‌ మారేజ్‌.. కట్నం వద్దనుకున్నాం. పెళ్లి ఖర్చులు సగం సగం అనుకున్నాం .మా పెళ్లి బానే జరిగింది .  అప్పుడు నేను మెడికల్‌ రెప్‌ను. పెళ్ళయిన రెండేళ్ళకు ప్రమోషన్‌ వచ్చింది. ఈ మధ్యకాలంలో నాకర్ధమైందేంటంటే మా మామ ఏపనీ చెయ్యడు. ఎప్పుడో ఎనభై నాలుగులో .. చేస్తున్న మున్సబు పనిని ఎన్‌.టి.ఆర్‌. తీసేసిన తర్వాత ఏం చెయ్యట్లే… ఏవో వ్యాపారాలంటాడు, కాంట్రాక్టులంటాడు, రాజకీయాలంటాడు, ఖద్దరు చొక్కా విప్పడు, క్రాపు చెరగదు.. అవన్నీ జరగాలంటే సంపాదనుండాలి. ఇప్పటిదాకా చేసిన కాంట్రాక్టులన్నీ లాసే.. తిరుగుతూ ఉంటాడు. పేకాటొకటి.. సంపాదించినదంతా సర్వనాశనం అయింది. రొటేషన్‌ చేస్తుంటాడు.. ఊర్నిండా అప్పు. ఒక తమ్ముడున్నాడీమెకి.. చదువుతున్నాడు.

తల్లికీ, కొడుక్కీ మాట్లాడే హక్కు గానీ, ధైర్యం గానీ లేవు. ఆ అబ్బాయి ఏదో జాబ్‌ చేస్తున్నాడు. ఇల్లు గడుస్తుంది. నాకో, నా భార్యకో, నా కొడుక్కో ఏ అచ్చటా ముచ్చటా లేదు అత్తగారింటినుంచి. నాకు కంప్లైంట్స్‌ కూడా లేవు. ఎవరి బ్రతుకు వాళ్ళది. ఎప్పుడైనా మేమెళ్తాం .. లేదా ఆమె, బాబు వెళ్తారు. అప్పుడప్పుడూ వాళ్ళొస్తారు. నాలుగు పూటలు వండుకుని తింటాం. అంతే. . నీకు తెలీందేముంది. నాకు జాబ్ లో విపరీతమైన ప్రెజర్‌.. టార్గెట్స్‌.. అన్నీ తట్టుకున్నా. . సంపాదన పెరిగింది.. భూములు కొనలేను.. ఏదో ఓ ప్లాట్‌ కొన్నా నాచారంలో.. లోన్లు.. శాలరీ డిడక్షన్‌.. గుట్టుగా కాపురం చేసుకుంటున్నా.. ఈ ఏడేళ్ళలో మూడు ప్రమోషన్లు.. ఏమ్మిగిలినా బంగారం కొనటం అవాటు. బాబు పుట్టిన తర్వాత.. డాక్టర్స్‌ కాన్ఫరెన్సుకు సింగపూరెళ్ళినపుడు వస్తూ వస్తూ మూడు తులాల  హారం, తులంన్నర చెవుల్లోకి  కొన్నా.. డబ్బు చాలకపోతే తెల్సిన డాక్టర్‌ దగ్గర తీస్కుని మరీ.. నాకు చాలా ఇష్టం. ఆమె పెట్టుకుంటే చాలా బావుంటాయ్‌ రా.. బయటకెళ్ళినపుడు ఎక్కడ కొన్నారని  అందరూ అడిగేవారు.. .. నాకు చాలా హాపీగా ఉండేది.. సడెన్‌గా పెట్టుకోవడం మానేసింది.. ఎప్పుడడిగినా ఇదిగో అదిగో అనటం తప్ప విషయం చెప్పలేదు. ఒకసారి గట్టిగా అడిగితే చెప్పింది. మా మామ ఏదో కోల్‌ బిజినెస్‌కంట… కావాలనీ, నెల్లో విడిపిస్తాననీ ఇంట్లో ఉన్న బంగారంలో 18 తులాలు తీసుకెళ్ళాడు, నగలు, బాబు మెళ్ళో కొన్న చైన్‌ సహా. తండ్రీ కూతురూ గుట్టుగా ఉంచుదామనుకున్నారు. ఆ కోల్‌ బిజినెస్‌ దొబ్బింది. ఎప్పట్లాగే… ఇదిగో.. అదిగో అంటాడే తప్ప క్లారిటీ లేదు.. నాకింతలో… ’’

నా ఫోన్‌ మ్రోగింది. మా ఆవిడ… అనకాపల్లి కార్‌ కోసం.. మర్చేపోయాను. వైజాగ్‌లో మా ఏజంటుకు  కు ఫోన్‌చేసి కారునూ, డ్రైవర్‌నూ పురమాయించి మా ఆవిడకు చెప్పినప్పటికి కొంత సమయం పట్టింది .  రెండో బీర్‌ను మగ్గులో పోసుకుంటూ వాడివైపు చూసాను.. చెప్పమన్నట్లు.

వాడు కొనసాగించాడు ‘‘మా ఏరియా మేనేజరొకడు చిన్న మెడిసిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ మెదలెడదాం.. పార్టనర్‌షిప్‌కొస్తావా అన్నాడు. జెనరిక్‌ మెడిసిన్‌.. మంచి ఫ్యూచరుంటుంది. మూడు లక్షలు కావాలి. నా దగ్గర బంగారం తప్ప ఇంకేం లేదు.. ఫ్రెండ్స్‌ తక్కువ.. బంగారం ఏ ముత్తూట్‌లోనో పెడదామంటే మా మామగాడు ఉలకడు, పలకడు.. నా కళ్ళముందే మేనేజర్‌ మంచి లాభాలు చూసాడు..ఇప్పుడు సర్జికల్స్ డిస్ట్రిబ్యూషన్  కూడా మొదలెట్టాడు.   అక్కడ్నుంచీ ఎప్పుడూ ఏదో ఒక అవకాశం వస్తూనే ఉంది. బంగారం ధర పెరుగుతూనే ఉంది. తండ్రంటే ప్రేమ.. మా ఆవిడ ఏమీ అనదు. నేను బాబు తన కుటుంబం అనుకోదు.. ఎప్పుడూ వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు.. మరి నేనెవరు? ఫ్రస్ట్రేషన్‌లో రెండు మాటలు వస్తాయ్‌ కదా.. మా మామ ఎంత తెలివైనోడంటే ఈ ఇష్యూని నేనేదో నగల కోసం వేధిస్తున్నానన్నట్లు మసి పూసి.. మా ఆవిడకు నిజంగా నేనో పిశాచిని అన్నట్లు ఒక అభిప్రాయం కల్పించాడు. బయటంటే.. ఇందాక చూశావు కదా.. స్టేషన్లో.. అలా అన్నమాట.. మొన్న రాత్రి మాటా మాటా పెరిగింది. మా ఆవిడేమందో తెల్సా ‘‘ఆ నగలు మర్చిపోండి. మా నాన్నకు కలిగినపుడు అంతకంటే మంచివి చేయిస్తారు. లేకపోతే డబ్బు మీ మొహాన కొడ్తారు’’ అంది.  అంటే నగలు మునిగిపోయి వేలంకెళ్ళినట్లే కదా.. నాకు పూనకం వచ్చింది  కంట్రోల్ తప్పిపోయాను.  మొదటిసారి  కొట్టాను. 18 తులాల్రా.. నాలాంటోడి సంపాదన.. ఎండలో.. వానలో.. ఈ ట్రాఫిక్ లో బండి ని నెట్టుకుంటూ , నీలుక్కుంటూ , డాక్టర్ల క్లినిక్కు వరండాల్లో నిలబడీ నిలబడీ, రక్తం మరగబెట్టి అవమానాలు పడి సంపాదించింది.. ఇప్పుడేమో ఇంక నేను మాట్లాడకూడదని 498 పెట్టి నా నోరు మూసేయిస్తాడన్నమాట. ఇది నా మీద జరుగుతున్న ఎమోషనల్‌ రేప్‌ కాదా?.. అన్నింటికంటే బాధేంటంటే వాడి తప్పు కప్పి పుచ్చుకోవడం కోసం, ఇంక ఆ నగలు విడిపించలేనని తెలిసీ.. నా భార్యను కూడా ఏదో మందు పెట్టినట్లు వాడికి అనుకూలంగా మార్చుకుని… ఇదిగో ఇలా కేసు పెట్టించి ’’.. గుడ్లనిండా నీళ్లతో వాడు మాట్లాడలేక ఆగిపోయాడు.

నాకు కడుపు రగిలిపోయింది వింటుంటే.. వాడి కళ్ళు చూసి కదిలిపోయాను..

‘‘ఊర్కో రా, ఏడవకు, ఏంటిది చిన్నపిల్లాడిలా ’’

వాడు సర్దుకున్నాడు . ‘‘థాంక్యూ రా.. నువ్వొచ్చావు.. నీతో చెప్పుకుంటే కొంచం ఫ్రీగా ఉందిప్పుడు.. మరేం చెయ్యమంటావ్‌ నన్ను.. ఇంక ఆ నగలు అడగొద్దా’’బేలగా అడిగాడు.

‘‘వెయిట్‌ చెయ్‌.. టైమొచ్చినపుడు అడగాలి.. ఇప్పుడు కొన్నాళ్ళు ఆ టాపిక్‌ ఎత్తకు.. బాబు డిస్ట్రబ్‌ అవుతాడు. వెళ్దామా’’

లేచాం.. వాడు నన్ను మళ్ళీ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర దించాడు. ఆ మర్నాడు వాడికి ఫోన్‌ చేశాను. అంతా మాములుగా ఉందని, అత్తా మామా బయల్దేరారనీ చెప్పాడు. ఆ సాయంత్రం నేను శ్రీలంక వెళ్ళాను. నాల్రోజుల  తర్వాత వచ్చాను. వాడికి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. తరువాత ఇంకో రెండ్రోజు తర్వాత.. స్విచ్ఛాఫ్‌.. ఇల్లు తెలీదు.. ఏమైందో తెలీదు..

ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ను  విషయం చెప్పకుండా వాకబు చేశాను.. ఫలితం లేదు.

ఆ తరువాత నాల్రోజులకు మా క్లాస్‌మేట్‌ ఫోన్‌ చేశాడు.. సారంశం ఏంటంటే వీడ్ని రిమాండ్‌లో ఉంచారు.. ప్రస్తుతం రాజమండ్రిలో జైల్లోనే ఉన్నాడు.. కేసు ఆ ఊరిలో  పెట్టారంట.. ఏవేవో చెప్పాడు. కేసు మాత్రం అదే..

గృహహింస.. మూడేళ్ళంట.. బెయిల్ కోసం వాళ్ళ నాన్న గారు ప్రయత్నిస్తున్నారు . వస్తుందో రాదో తెలీదు  .వాడి భార్యకు కాలు విరిగిందంట. బాబుతో కలిసి వాళ్ళ పుట్టింట్లో ఉంటుందంట.. వగైరా.. వగైరా.. ఫోన్‌ పెట్టేశాను.

బుర్ర మొద్దుబారిపోయింది. వెళ్ళి వాడిని కలవానిపించింది. ఈ వారం.. ఆ వారం .. అనుకుంటే కుదర్లేదు. పని, ఒత్తిడి, సీజన్‌ టార్గెట్‌లు, కుటుంబం, చికాకు, నెలలు గడిచాయి. నేను వాడిని మర్చిపోయాను దాదాపుగా. రెండేళ్లు పండక్కి ఊరెళ్ళలేదు. ఆ తర్వాత  సంవత్సరం ఊరికెళ్ళగానే వాడు గుర్తొచ్చాడు. ఒకపూట ఇంట్లో ఉండి, పలకరింపులు, భోజనాలు, ఒక గంట నిద్రయ్యాక మా ఫ్రెండ్‌తో కలిసి వాళ్ళింటికెళ్ళాను. వాళ్ళమ్మగారున్నారు. వాడు డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్  లో  ట్యూటోరియల్‌ నడుపుతున్నాడని చెప్పిందామె. ఏదో పచ్చరంగు పాంప్లెట్‌ తెచ్చిచ్చింది. పంచదార, నిమ్మకాయి కలిపిన నీళ్ళు తాగి పాంప్లెట్‌ను జేబులో పెట్టుకుని బయలుదేరాం. వాడితో ఫోన్‌లో మాట్లాడటానికి గిల్టీగా  ఉంది. నేరుగా వెళ్ళిపోతే?  బైకు తీసుకుని బయుదేరాను. ఎంత. అరవై కిలోమీటర్లు గట్టిగా పోతే గంటన్నర.

టౌను చేరుకుని, ఆ ట్యూషన్‌ సెంటర్‌ను పట్టుకోవడానికి ఇంకో పావుగంట. కొంచం పాత బిల్డింగే .. కానీ మెయిన్ రోడ్డుమీద ఉంది . ట్యూషన్‌  సెంటర్‌ మొదటి అంతస్తులో ఉంది. సాయంత్రం ఏడున్నర.. లైట్లు వెలుగుతున్నాయి. మెట్లెక్కుతుంటే ఏదో తెలీని భయమో, గుబులో, ఉద్వేగమో తెలీని ఒక ఫీలింగ్‌.. చిన్న బోర్డు మీద ‘‘విరించి ట్యూషన్స్‌’’కు దారి అని బాణం గుర్తు మెట్ల మలుపులో, దారి చూపిస్తోంది.

‘‘విరించి’’ వాడి కొడుకు పేరు కదూ..

సన్నని కారిడార్ కు ఆనుకుని అదో చిన్న హాలు. గోడ నిండా ఏవేవో పోస్టర్లున్నాయి. వివేకానందుడి కొటేషన్స్‌, గాంధీ, కలామ్‌ ఫోటోలు.. ఒక అమరిక లేకుండా.. ప్లాస్టిక్‌ కుర్చీల్లో ఒక పదిహేను మంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి శ్రద్ధగా వింటూ, మధ్యలో రాసుకుంటున్నారు. వాళ్ళకెదురుగా గోడకు ఉన్న తెల్ల బోర్డు మీద మార్కర్‌తో.. కెమిస్ట్రీను ఆశువుగా పాఠం చెప్తూ… రసాయనాలను వివరిస్తూ.. వాడు…

నేను చిన్నగా దగ్గాను. అలికిడికి అందరూ నా వైపు చూశారు. చాలా ఇబ్బంది గా అనిపించింది.  వాడు గుర్తుపట్టినట్లు కళ్ళు పెద్దవి చేసి ‘‘రా రా.. ఎప్పుడొచ్చావ్‌.. సర్‌ప్రైజ్‌ ‘‘అన్నాడు.

నేను తలూపాను. ‘‘ఒక్క పదినిముషాలు కూర్చో.. అయిపోయింది. వచ్చేస్తా ‘‘అన్నాడు.

నేను బయటకొచ్చి మొదటి అంతస్తు నుంచి రోడ్డునూ, తిరుగుతున్న వాహనాలనూ, వాటి లైట్లనూ, మనుషులనూ చూస్తూ నిల్చున్నాను.. ఏం మాట్లాడాలి ?

పది నిముషాల తర్వాత వాడొచ్చాడు. రావటం తోనే గట్టిగా కౌగిలించుకున్నాడు.

‘ఎలా ఉన్నావ్‌ రా. ఎప్పుడొచ్చావ్‌’

‘ఊ .. బావున్నాను. నువ్వు’

‘నాకేం … సూపర్. పద.టీ తాగుదాం .. ’

‘‘వద్దులే, ఇక్కడే కూర్చుందాంరా’’  పిల్లల కోసం ఉన్న ప్లాస్టిక్‌ కుర్చీల్లో ఇద్దరం కూలబడ్డాం. చాలా సేపు మౌనం. ఎక్కడో ఒక దగ్గర మొదలుపెట్టాలి కదా..

‘‘ఏమయ్యిందిరా.. ఫోన్‌ కూడా లేదు.. ఏం జరిగిందో తెలీదు. నేనూ ఈ మధ్య  ఊరికి రాలేదు ’ ఏదో మాట్లాడాలి కాబట్టి అన్నాను.

వాడు చాలా మామూలుగా ‘ఏం చెప్పటానికి లేదు రా.. అంతా ప్లాన్డ్‌.. ఆ తర్వాత రోజు   హైద్రాబాద్‌ నుండొచ్చి వైజాగ్‌లో ఎవరో లాయర్‌ను పట్టుకున్నారు. నాకు చెప్పకుండా మా ఆవిడ బాబుతో,  వైజాగెళ్ళిపోయింది. నేనెళ్ళాను.అక్కడ కేసుపెట్టారు. లాయర్‌ను బాగా తడిపాడు. పోలీసుల్ని కూడా.. వాడికి కావల్సింది కూతురి కాపురం కాదు. ఆ నగలో, లేక దాని బదుగా డబ్బో ఇవ్వకుండా తప్పించుకోవడం. తప్పు ఒప్పుకోవడానికి ఈగో.. రొచ్చులో కూరుకు పోయాడు. ఆ రొచ్చే సుగంధం అని నమ్మించడానికి ఆత్మవంచన. 498 పెట్టారు. నాకు మూడేళ్ళు పడింది. అంతా నాశనం అయిపోయింది. విడాకులైపోయాయి. బాబు సెకండ్‌క్లాస్‌. ఎప్పుడైనా చూడానిపిస్తే వెళ్ళి వరండాలో మాట్లాడి వచ్చెయ్యటమే. ఇప్పుడు మా ఆవిడ కూడా జాబ్‌ చేస్తోంది. కొడుకు, కూతురు తెచ్చే జీతంతో అతగాడు విలాసంగా ఉన్నాడు. ఇంక దేనిమీదా ఇంట్రస్ట్‌ లేదురా.. ఏముంది చెప్పు’’ చెప్పి శుష్కంగా నవ్వాడు. ‘‘ఫ్లాట్‌ అమ్మేసి కొంత డబ్బు బాబు పేరున వేశాను. కొంత బ్యాంకే తీసుకుంది. మిగిలిన డబ్బుల్తో ఇదిగో ఇక్కడ ట్యూటోరియల్‌ మొదలు పెట్టాను. పొద్దున్న, సాయంత్రం మూడేసి గంటలు. బానే ఉంది. నాలుగు వేళ్ళు నోట్లోకెళ్ళాలి కదా.. మనూర్లో ఉండానిపించలేదురా. ఎవరికీ నా పెయిన్‌ అర్థం కాదు. నేనేదో శాడిస్టునన్నట్లు చూట్టం… అందరికీ ఎక్స్ ప్లెయిన్  చేసేంత ఓపిక లేదు. అందుకే ఇక్కడ… ఇలా.. ప్రక్కనే రెండు వీధుల  తర్వాత రూమ్‌. . అలవాటైపోయింది. అమ్మా నాన్న అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటారు. సరేలే.. ఇంకేంటి.. వదిలెయ్‌.. మీ ఫ్యామిలీ ఎలా ఉంది’’ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు.

‘‘ఊ .. బానే ఉన్నారు. పాప కూడా స్కూల్‌కెళ్తోంది’’ ముక్తసరిగా చెప్పాను.

మళ్ళీ మౌనం.

‘‘మరి బయల్దేరతాన్రా’’ వాచీ చూసుకుంటూ చెప్పాను. తొమ్మిదవుతోంది. చీకట్లో వెళ్ళాలి.

వాడు బండి వరకూ వచ్చి వీడ్కోలు చెప్పాడు. పరిశీలనగా వాడ్ని అప్పుడు చూశాను.

వాడు ముందుకంటే లావయ్యాడు. కళ్ళలో ఆ కళా కాంతీ లేవు. మామూలుగానే ఉన్నాడు. కానీ చిన్నప్పట్నుంచీ నేను చూసినట్లు లేడు. బట్టలు చాలా సాదాగా ఉన్నాయి. వాడి శరీరం పొలుసు కట్టింది. వాడు జరిగింది చెప్పేటప్పుడు మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంటాడేమో అని భయపడ్డాను. కానీ అలా జరగలేదు. బహుశా వాడు ఏడవటం మానేశాడో.. కన్నీళ్ళు ఎండిపోయాయో.. తెలీదు. ఇంకా ఏదో లోపం కన్పించింది వాడి మొహంలో.. ఏంటది? ఏంటది? కనిపెట్టాను.

వాడి కనుబొమల మధ్య, కళ్ళద్దాల ఫ్రేముకు పైన ఎప్పుడూ ఉండే ఆంజనేయస్వామి సిందూరం లేదు.

**** (*) ****3 Responses to నాలుగొందల తొంభై ఎనిమిది

 1. February 5, 2018 at 10:23 am

  మగాడు – ఒక యంత్రం-కుటుంబం కోసం చిన్న చిన్న ఆనందాలు తో సరిపెట్టుకొని పాతికేళ్ళ ప్రాయం నుంచి ప్రారంభమయ్యే వెట్టి చాకిరి, జీవితాతం కొనసాగే బాధ్యత అనే బరువు చప్పుడులేకుండా చేసే ఒంటరి పోరాటం. ఒక స్త్రీ రోడ్డు మీద చిన్న ఆక్సిడెంట్ చేస్తే మొత్తం ట్రాఫిక్ స్తంభించే సమాజం లో మగాడు కూడా ఒక మనిషే అని గమనించదు….మగాడిగా పుట్టడటం ఏమైంత గొప్ప విషయం కాదు అనే విషయాన్ని తెలుస్తోంది నేటి రోజుల్లో.

 2. చందు తులసి
  February 6, 2018 at 10:09 am

  కాపురం అనేది భార్యా భర్త కలిసి….భరిస్తేనే నిలబడుతుంది. లేదంటే ఇలాంటి పరిస్థితులే మిగిలేది. కానీ ఈ కథలో భార్య….. భర్త కన్నా తండ్రి కి విలువివ్వడం ఆశ్చర్యం. పాపం ఆ పిల్లవాడు బలైపోయాడు. కరుణ…..ఇంకా మంచి కథ లు రాయాలి భయ్య

 3. Ajit Kumar
  February 25, 2018 at 8:10 pm

  ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ వద్దకు ఎలా వెళతామో, కేసై పోలీసు స్టేషన్ కు వెళ్ళాల్సివచ్చినప్పుడు లాయర్ వద్దకు వెళ్ళాలని అతడికీ ఇతడికీ తెలియకపోవడం దీనికంతా కారణం

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)