బొమ్మలదేవుందిలే? నాకు తెలీని బొమ్మలా! పేరు ప్రఖ్యాతులదేవుందిలే? ఏ చరిత్రలో నువ్వు మిగిలేవుగనక! డబ్బుదేవుందిలే? కలిమిగలవాని బానిస కొడుకుగా జీవితాంతం సంపాదించుకుందేగా! దాన్నంతా ఇక్కడ ఎవడు లెక్క చేయవచ్చాడు గనక!
కానీ ఓ చిత్రకారుడా, నీలోనా నీబయటా నువ్వుగా కనపడే ఒక సౌకుమారత వున్నదే నీలో! నీ రేఖలో, నీ కుంచె చివరి నీలిమలో, దాన్ని మించి నీ బుద్దిలో నీకంటూ ఒక అరుదైన ఆలోచన వున్నదే, దాన్ని వ్యక్తిత్వం అంటాం. అది అందరికీ అబ్బేది కాదు. ఉన్నదందరిదీనూ వ్యక్తిత్వం కాదు. ఈ వ్యక్తిత్వపు అభివ్యక్తి పేరు పేరు హంపి. నేను ఈ తెలుగు జీవితంలో నా తరం చిత్రకారుల్లో చూసిన అరుదయిన ఒక ముగ్ధమూర్తి. రేఖలోనూ, రంగుల్లోనూ, పలుకులోనూ పొందికైన సుకుమారత్వముగల మనిషి.
హంపి అపుడపుడు హైద్రాబాద్ మహానగరానికి వచ్చేవాడు- చిత్రకారులు చంద్ర గారిని చూడ్డానికో, మోహాన్ గారిని కలవడానికో, గోపి గారిని పలకరించడానికో. అంతే అదొక్కట్టే పని. మానవుడు ఎలా వచ్చేవాడనుకున్నారు? మెల్లగా హాయిగా పసి పైరు పైని పసి గాలిలా నువ్వుతూ వచ్చేవాడు. ఎలా నడిచేవాడనుకున్నారు? “విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే” అని పదే పదే లెంపలేసుకుంటూ మెత్తగా నడిచేవాడు. కలవబోయే చిత్రకారులు ఉండేది ఒకటో లేదా నాలుగో ఫ్లోరో కానీ తను మాత్రం బిల్డింగ్ అడుగున చెప్పులు వదిలేవాడు. అందుబాటులో కుళాయి ఉంటే కాళ్ళు కడుక్కునేవాడు. ఏనాడు నేను చూడగా చెప్పుల కాళ్ళతో గురువులని కలిసింది లేదు. శిఖరం ముందు గులకరాయిలా ఒబ్బిడిగా కూచునేవాడు. నవ్విందే తప్పా నోరు విప్పగా చూసిన వారు లేరు, “ఒన్స్ ఏ వైస్ మాన్ సెడ్ నథింగ్” లా. ఎలా వచ్చాడో అలానే మెల్లిగా మర్లేవాడు. చీనియమయిన రేఖ చివరగా గీసే శిరోజపు చివరి అదృశ్యంలా. ఈతను ముగ్ద , సిగ్గరి, మనోహరుడు, మొండి, జ్ఞాని, చదువరి, సంభూతి. మౌనమే ఇతగాడి వ్యాఖ్యానము, ఇతను హంపి, చిత్రకారుడు.
నిజమైన కళాకారుడికి తన కళయొక్క ఔన్నత్యం సదా తెలిసియుంటుంది, చాలా తక్కువసార్లు మాత్రమే కళకు తన చిత్రకారుడి తపన ఎరుక కలుగుతుంది. ఈ పరస్పర స్పృహ కల్గిన కళ మరియు కళాకారుడు తామిరువురు ఒకరికొకరు ఎదురయ్యే అపురూప కాలం అనేది ఒకటి తగులుతుంది. అది ఆ మనుజుడికి ఎదురు వచ్చిన క్షణాన తన దివ్యాత్మను కళకు అంకితమిస్తాడు. (కళా, కళాకారుడు ఏకం అయ్యే సంఘటన ఒకటి చెబుతా. మొక్కపాటి కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం నేను బాపు గారూనూ. బాపుగారు తెలుసా మీకు? మనిషి ఎవరెస్ట్ శిఖరమే కానీ మనిషి అయిదూ నాలుగో, అయిదు అయిదో ఎత్తు. పురాణ పాత్రలగురించి వచ్చింది ప్రస్తావన. తెలుసా! మీ జన్మలో ఊహించగలరా ఈ అపురూపాన్ని, భీష్ముడిని వర్ణిస్తున్నారు బాపుగారు “వారు యోధులండి! నిత్యం సాము గరిడలు చేసే వీరులండి! వారి చేతులు, భుజాలు చాతీ ఎట్లా వుంటాయో తెలుసా? కత్తి పట్టే ఆ పిడికిలి, నారి సారించే ఆ బాహువులు, కాయలు కాసిన ఆ చేతివేళ్ళు… ప్రతీది చేసి చూపిస్తున్నారు. మనిషి ఎలా వున్నాడో తెలుసా? మళ్ళీ మళ్ళీ తెలుసా? ఏడడుగుల పొడవైన వీరుడి రూపంలోకి ప్రవేశం అయిపోయాడు. ఒక చేత విల్లు ధరించి మరో చేతిని నేలపై ఆనించి నిస్సహాయ చూపులు చూసే వృద్ధభేరి భీష్ముడిలా మారిపోయి చూపారు. ఆ సమయంలో ఆయన భీష్ముడే అయిపోయాడు! అది కళా, కళకారుడు ఏకం కావడం అంటే! యదృశస్ చిత్రకరస్ తదృషే చిత్ర కర్మ రూప రేఖ.) అటువంటి శిల్పి ఆ చిత్రకారుడు. కళ తనకు ఇచ్చినదానిని కళకే అంకితం చేసే క్రమంలో తను దగ్ధం అయిపోతూ అజ్ఞాతంగా ఉండిపోతాడు, దానికి ఫలితం భారతదేశంలోని చాలమంది మాహా శిల్పుల, చిత్రకారుల విస్మృతిలో విలీనం అయిపోవడమే. ఇదే మహా స్తితి. బికారి మహా మహా బికారి అవడానికి నాంది. అపుడు నువ్వూ నేనూ లేదా రసికుడు కాదా వీక్షకుడు ఏం చెయాలి. ఆ తాపసిని ఆ కళాభిజ్ఞుఁడిని మనం సదా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
హంపి బొమ్మలు వేయగా ప్రత్యక్షంగా నేను చూసినవాణ్ణి. ఆ సమయలో ఈ కళాకారుడు, తన కుంచె, ఆ చిత్ర రచనకు ఒదిగిన కాగితం- మూడు ఒకటయ్యేవి. ఆ సమయంలో ఇవికాకుండా ఏదీ ఈ మనిషి దరిచేరేది కాదు, మునుపు పలికినట్లు యదృశస్ చిత్రకరస్ తదృషే చిత్ర కర్మ రూప రేఖ (విష్ణు ధర్మోత్తరం). ఆ సమయంలో ఇతనూ ఒక మహర్షే.
హంపి రేఖలు, రంగులు పూర్తి ప్రాచ్య రీతి. ఆ మనుషులు వారి చుట్టూ కట్టిన గీతలు, నిండిన రంగులు, కొప్పులో పూలు, కొమ్మ మీది నెమలి, దాని కంఠపు ధగధగల పచ్చదనం, కొకిలమ్మ వంటిన మెరిసే నలుపుదనపు నీలంపు సొగసు, బరంట్ యెల్లో గడ్డివామి అంచులపై కుప్పించి యెగసిన తపన మండలం కాంతి, గీసుకున్న తన చెల్లెలు నిలువెత్తు బొమ్మ పాదాల క్రింద మెత్తగా నలిగిన పచ్చిక పచ్చందనం అంతా తెలుగుందనం. బాపు, బాలి, చంద్ర… లు మనకు పరిచయం చేసిన కొన్ని మొహాలు, కొన్ని శరీరాలు, కళ్ళు, ఆ నడక, ఆ గుంపులు, వేపచెట్టు నీడ… వీటినుంచి ఎడంగా తన చిత్ర రచనా శాస్త్రాన్ని తను వేరుగా వ్రాసుకున్నాడు. హంపి బొమ్మల్లో కనపడే మూలాంశాలు అన్నీ తనవే, ఆ రంగు తను కలుపుకుందే, ఆ గీత తను తెలుసుకుందే, ఆ పర్స్పెక్టివ్ తను చూసిందే. రేఖ దాటని రంగు, రంగుని పొదువుకున్న రేఖ… నిజానికి హంపి ప్రతీ బొమ్మబొమ్మకు ప్రక్కన ఒక వ్యాఖ్యానం వ్రాయొచ్చు. కాని అది పాఠకుడికి అవమానం కదాని ఇక్కడ అటువంటి బోధించు పనులేం చెయబోవట్లేదు. హంపీ బొమ్మల్లో అంతా ఒక పద్దతి, డిసిప్లిన్ ఉంటుంది. ఎక్కడా కనికట్టు, ఇంద్రజాలం, టెక్నిక్, ఆక్సిడెంట్ కనపడదు. పూర్తిగా డ్రాయింగ్, పెన్సిల్ పై అదుపు ఉంటుంది. ఈ భాషంతా చిత్రకారులది. హంపీ సాధించిన ఈ ఎత్తు చూసి మాలో మేం ఎంత గింజుకుంటామో నాకే తెలుసు. ఆ విధంగా మిగతా గ్రుడ్డి లోకం ధన్యం.
ఎనిమిదవ తరగతి ప్రాయం నుంచి హంపి బొమ్మలు వేస్తూనే వున్నాడు. మా దగాకోరు బొమ్మల దునియాలో ఒక్క పెద్ద నోరు తనకోసం మాట చేసుకోలేదు. “మా పూలే, మా మహత్మా…” అని పూనకం ఊగే మనుషులెవరి చీకటి హృదయాలకు హంపి గీసిన పూలే చరిత్ర రంగుబొమ్మలు తాకలేదు. పూలే బొమ్మలు చూశారా? హంపి గీసినవి ఇదిగో ఇక్కడ వున్నాయి.
నాకు తెలిసిన చిత్రకార ప్రపంచంలో ఇంతకన్నా ఈ మహత్ముడి జీవితాన్ని ఏ ఇతర రేఖలరంగుకారుడు ఈ కూర్పు రూపొందించలేదు. ఇవి హంపి కొరకు తనకు తాను బొమ్మగా నడిచి వచ్చిన ఘట్టాలు. ఊరూరా కమ్యూనిటి కేంద్రాలలో ఈ బొమ్మలు పటాలకెక్కవలసినవి. ఈ బొమ్మలతో పుస్తకాలు చేతులు ధరించవలసినవి. ఈ మైనార్టీ వాడి వెర్రి కన్నీటి నవ్వు నీటి రంగులో కలిసిపోయింది.
అయినా బొమ్మని వెదుక్కుంటూ, బొమ్మలు గీసేవాళ్ళని శ్వాసించాలనుకుంటూ తను హైద్రాబాద్ నగరానికి పలుసార్లు మళ్ళీ మళ్ళీ వచ్చేవాడు. హంపిని, తన బొమ్మని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు మనసున నింపుకున్న వాళ్ళు ఎవరూ నాకు తెలిసి ఎవరూ తగల్లా. (పాపము శమించు గాకా పాండు ఒకడుండేవాడు, కానీ వాడు బికారి, ఇతగాడు నిర్వికారి, ఇక రాలింది బూడిదే) ఈ మనిషి నవ్వే తీపి నవ్వులు ఎవడిక్కావాలి? అయినా పెదాలు నవ్వే ఎందుకు పూయాలి? కాపర్స్ మాట్లాడే చోట, సీసాల గల గలల చప్పుడులో ఈ పావురాయి కువ కువలు వినిపించుకునే చెవులు లేకపోయే. నడిసముద్రపు నావ రీతిగ సంచలిస్తూ ఉండేవాడు, పైకి పెదాలు నవ్వేవి, లోపల గుబులు కమ్మి దిగులు పడుతూ, దీనుడౌతూ మబ్బుపట్టీ , గాలికొట్టీ ,వాన కొట్టి, వరద కొట్టి మనిషి దూరం వెళ్ళిపోయాడు. ఏ మనసూ నొచ్చుకుంది లేదు. నగరం నవ్వుతూనే వుంది.
మనిషి ఒంటరి. సాక్షి పత్రికలో ఉన్నప్పుడు హైద్రాబాద్ బంజారా హిల్స్ లో డబల్ బెడ్రూం ఫ్లాట్ అద్దెకు తీసుకుంది ఎందుకని? ప్రపంచం మూల మూలలా హంపి ఎరుగని చిత్రకారుడు లేడు. స్టడీ చేయని చిత్రకళారీతి లేదు. తడిమి చూడని డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పుస్తకం లేదు. ఫ్లాట్ నిండా పుస్తకాలే. స్టడీ స్టడీ ఏక్దం స్టడి. పుస్తకాలు కాకుండా ఇంకేమన్నా ఆస్తా? అని చూస్తే అలసినపుడు వళ్ళు వాల్చడానికి ఒక చాప, దుప్పటి. ఒకటో రెండో జతల బట్టలు, కాసింత అందమైన గడ్డం ఆపైని బాదాము కళ్ళు అంతే. మూడుపూట్లా ఏం తినేవాడో తెలీదు. ప్రతి రోజూ పుస్తకాలు కొనేవాడు. హైద్రాబాద్ కాదనుకుని మళ్ళీ అమ్మ ఒడి రాజమండ్రికి మరలేటప్పుడు పుస్తకాలు తరలించడానికి లారీ కావాల్సి వచ్చింది. ముప్ఫైల్లో వయసు, పుస్తకాలు లారీడు, జేబులో డబ్బు నిల్లు, జ్ఞానం ఫుల్లు.
ఇక్కడే వుంటే ఎమయ్యేవాడో తెలీదు! అక్కడ వుండి ఏమవుతున్నాడో కూడా కూడా తెలీదు. రాజమండ్రిలో కూచుని ఏం గీస్తున్నాడో, ఏం చెరుపుతున్నాడో కూడా తెలీదు. హంపి బొమ్మతో తిలకం దిద్దించుకునే అదృష్టం కథా కవిత్వ పుస్తకాలకు కలగట్లేదని అచ్చైన ఏ పుస్తకం చూసినా తెలిసిపోతుంది. ఏ పత్రికా పేజీల్లోనూ తన రంగు రెపరెపలాడ్డం లేదని వెలసి పొయిన పత్రికల ఏ బోసి పేజీ చూసినా అర్థమైపోతుంది. దినపత్రికల ఆర్ట్ ఎక్జిబిషన్ కాలమ్స్ లలో హంపి పేరు ఎప్పుడూ చూళ్ళేదు.
ఏ తత్వం బోధపడిందో, లేదా పుట్టుకతోనే కూడి ఉన్నదో, హాంపి మన మధ్య దూరంగా మౌనంగా వున్నాడు. నేను అలా ఉండలేక ఇదంతా వ్రాస్తున్నా. ఇంత వ్రాసినా హంపి చదువుతాడనే నమ్మకం నాకు లేదు. చదివేవాడు ఎవడో ఒకడు చదువుతాడు. దామెర్ల రామారావు ఏ నది నీరు తాగాడో గానీ ఆ ఒడ్డున దప్పికతొ ఉన్న హంపిని కలవడానికి వెడతాడు. హంపి బొమ్మలని చూసి కనీసం చదువరి తన దాహం అయినా తీర్చుకుంటాడని నాదో ఊహ, ఆశ.
వ్యాస రచయిత బ్లాగు: http://thisisanwar.blogspot.in/
ఆ నది మెట్లూ-అమ్మలూ-అమ్మయిలూ-కార్తీక దీపాల చిత్రం ఎంత బావుందోనండి! పరిచయం చేసిన అన్వర్ గారికి ధన్యవాదాలు. హంపిగారిది రాజమండ్రి అని చదివి సంతోషించాను. వీలైతే వారి కాంటాక్ట్ నంబర్ ఏదైనా ఇవ్వగలరా – if you don’t mind?
Give me your mail id , Madam.
అన్వర్‌గారు: హంపిగారి కాంటాక్ట్ నంబర్ నా బ్లాగ్‌లో కమెంట్ లో రాయండి . My blog has moderation – I won’t publish your comment.
Here is my blog link: https://boldannikaburlu.blogspot.com/
మీరు పాండు గురించి కూడా రాయాలి.
మీ పరిచయం అయ్యింది పాండు వలనే.
మీరు రాసింది చాలా బావుంది. ఈ శైలి మీకొక్కరికే సొంతం.
హంపి గారి బొమ్మలు చాలా బావున్నాయి. అతి తక్కువ నిడివిలో వేసిన బొమ్మల్లో కూడా అంతమంది మనుషుల మొహాల్లో హావభావాలు కొట్టచ్చినట్లు వేయడం చాలా బావుంది.
గీత కాదు, బొమ్మ వేసిన తీరు చూస్తే చటుక్కున “గంగాధర” ఆర్టిస్ట్ గుర్తుకొచ్చాడు.
అయినా ఎవరి కుంచె వారిదే. ఎవరి సంతకాలు వారివే.
Thank you Sai garu.
చిత్ర, శంకర్ అంటూ బొమ్మలతో కథ పరిచయమై (మాలాంటి పాఠకులకి) … వపా, బాపు, చంద్ర, బాలి, కరుణాకర్… అంటూ సాగిన ఆ బంధం ఎక్కడో తెగిపోయింది. మీ పరిచయం బావుంది. ఈ వ్యక్తి నిజంగా ప్రత్యేకం. వారి బొమ్మ , మీ రచన మరింత ప్రత్యేకం.
ప్రియమైన అన్వర్ గారు!
కృతజ్ఞతలు అంటూ ఓ చిన్నపాటి మాట రాసి మీ ఈ అద్భుత ప్రయత్నాన్ని చిన్నబుచ్చలేను.
చిత్రకారుడు హంపి గారిని ల.లి.త. గారు పలకరించడానికి వీలుగా వారి వివరాలు ఇలా తెలియజెయ్య వచ్చా ?
–edited–
( తెలంగాణలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని
గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించి తెరకెక్కించిన “మా భూమి” సినిమాను పరిచయం చేస్తూ
ల.లి.త. గారు ఓ వ్యాసం రాస్తారని ఎన్నాళ్లగానో ఆశతో ఎదురుచూస్తున్న వాళ్ళందరి తరపునా మళ్ళీ అభ్యర్థిస్తూ )
కె.కె. రామయ్యగారు: మన్నించండి – నేను మీరనుకునే ల.లి.త గార్ని కాదు.
హంపిగారి ఫోన్ నంబర్ అన్వర్‌గారు నా బ్లాగ్‌లో షేర్ చేశారు. ధన్యవాదాలు.
ఐదేళ్ళ క్రితం రాయమండ్రి రమ్మని శశి నుండి ఫోను. వెళ్ళా కాకినాడనుండి. హంపి అని ఓ చిత్రకారుడున్నాడు, అతన్ని కలిసే అవసరం వుందనేది శశి కారణం. ఇద్దరం రాయమండ్రి నుండి బయల్దేరి లాలాచెరువు సెంటర్ దాటంగానే ఎడంవైపు వీథమ్మట నేరుగా వెళ్లి కుడివైపు వీథి చివర వున్న ఎడం వైపు ఇల్లు చేరాం. హంపి వచ్చారు లోపలనుండి . ఆ ఇంటి ఎదురుగ్గా వున్న నాలుగైదు సెంట్ల ఖాళీ స్థలంలో రెండుమూడు గదుల స్టూడియో లాంటి లైబ్రేరీలాంటి హంపి చిత్రాల కార్ఖానా లోకెళ్ళాం. హంపి డిజిటల్ కుంచె ద్వారా వేసిన పల్నాటి భారతానికి సంబందించి తన వర్క్ చూపించారు.తను తయారు చేయబోయే పల్నాటి భారతం యానిమేషన్ సినిమా కి డైలాగ్ వెర్షన్ రాసేందుకు రచయితని వెతుక్కుంటున్నాడు.(కోళ్ళ పోరుకదాని పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలో తొలికోడి కూసే విధానాన్ని మైన్యూట్ డీటెయిల్స్ తో రచించిన ద్విపద, దాని వివరణ ఆ తర్వాత హంపిగారికి మెయిల్ చేసినట్టు కూడా గుర్తు)
ఓ గంట హంపి చిత్ర వనం లో గడిపాం.
శశి కి ముందే హంపి వేళ్ళ మాయ తెల్సు కాబట్టి తనదైన గంభీర ముద్రతో వున్నారు. హంపి చిత్రాలు చూసిన నేను ఆ అబ్బురం నుండి బయటికి రావడానికి కొన్ని రోజులు పట్టింది. తర్వాత ఒకట్రెండు సార్లు ఫోన్లో మాట్లాడాను కూడా. ఎప్పుడూ చిత్ర తపస్సు లో వుండే ముని హంపి అని ఆ కొద్దిసేపటి పరిచయం తెల్పింది. ప్రాపంచిక కారణాలవల్ల మళ్ళీ హంపిని కలవలేదు.
ప్రియమైన శ్రీ కాకినాడ రా. రెడ్డి గారూ,
చిత్ర తపస్సు లో వుండే ముని లాంటి హంపి గారితో నేను కూడా ఈ సందర్భంలో మాట్లాడి ఓ అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాను.
హంపి గారి ఈమెయిలు, వారి మొబైల్ ఫోన్ నంబర్లు అందరికీ తెలిసేవిధంగా రాయడం అంత మంచిపని కాదని కొందరు స్నేహితులు, పెద్దలు నన్ను మందలించారు కానీ; హంపి గారూ వినయంతో కూడిన ఆప్యాయతతో పరవాలేదులే అని నన్ను క్షమించారు.
వారిదెంత పెద్దమనసు అంటే, వారి పెయింటింగ్స్ ని కొన్ని నేను వారి ఫేస్ బుక్ లేదా బ్లాగు నుండి డౌన్లోడు చేసుకుని మిత్రులకి చూపిస్తానన్నా వద్దని వారించలేదు.
మీ పదచిత్రం విశేషంగా ఉన్నది !
అద్భుతమైన పరిచయం….Thank you