పాత పుస్తకం

మంకుతిమ్మ కగ్గ

ఫిబ్రవరి 2018

కన్నడ సాహిత్య చరిత్రలో ఒక గొప్ప రచన మంకుతిమ్మ కగ్గ. దీనిని దేవనహళ్ళి వేంకటరమణయ్య గుండప్ప (డి.వి.గుండప్ప) అనే ఆయన 1943లో వ్రాశాడు. మంకుతిమ్మ కగ్గ అంటే ‘మందమతి తిమ్మడి వెఱ్ఱిమాటలు’ అని అర్థం. ఇది నాలుగు పాదాలు కలిగిన 945 పద్యాల సమాహారం. వీటిలో అక్కడక్కడా ప్రాచీన కన్నడ భాష కనిపిస్తుంది. కొన్నింటిలో కవిత్వపు ఛాయలు గోచరిస్తాయి. లోతైన భావాలు కలిగి, కొన్ని పాడడానికి అనువుగా ఉంటాయి.

రచయిత వీటిని ‘మందమతి మాటలు’ అని చెప్పుకున్నా, ఇందులో గొప్ప జీవితానుభవాలు ఇమిడి ఉన్నాయి. జీవితానికి సంబంధించిన ప్రశ్నలతో, వాటి ద్వారా ‘సత్య దర్శనము ‘ చేయిస్తూ మారుతున్న దేశకాల పరిస్ఠితుల కనుగుణంగా మానవులు ఎలా తమ జీవితంలో సమతుల్యతను సాధించాలో వివరించి చెప్పే గ్రంథం కగ్గ.

డి.వి. గుండప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, తాత్వికుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త మరియు పాత్రికేయుడు. ఈయన 1887 లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించాడు. సంస్కృతాంగ్లాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. తరువాత మైసూర్ మహారాజా ఉన్నత పాఠశాలలో చదివినా, పదవ తరగతి పూర్తిచేయలేక చదువు మానివేశాడు.కాని అతడు వ్రాసిన వ్యాసాలు, రచనలు డిగ్రీ పాఠ్య పుస్తకాలకు మరియు పి.హెచ్.డి.కి అంశాలుగా ఎన్నుకోబడ్డాయి.

ఎందరో కన్నడ సాహితీవేత్తలు ‘కగ్గ ‘ పై వ్యాఖ్యానాలు చేశారు. వారిలో ముఖ్యులు శతావధాని డా.ఆర్.గణేశ్, ప్రొ. ఎచ్.ఎస్. లక్ష్మీనారాయణ భట్ట, స్వామి బ్రహ్మానంద మొదలైన వారు. కగ్గను ఆంగ్లంలోనికి ‘Thus Sang Mankuthimma’ పేరుతో అనువదించినవారు నరసింహభట్.

ఈ మానవ జీవితానికి అర్థమేమిటి? ప్రపంచం అంటే ఏమిటి? ఈ రెంటి మధ్య గల సంబంధమేమిటి? దైవం అంటే ఏమిటి? చావుపుట్టుకలు దేని కొరకు? సృష్టికి ఒక క్రమం ఉందా? గమ్యం ఏది? సృష్టికర్త తన సృష్టిని నిజంగా ప్రేమిస్తాడా? ఐతే జీవుల కెందుకీ బాధలు? సృష్టికర్త ఒకడే ఐతే సృష్టిలో మరెందుకిన్ని భేదాలు? అనాదిగా మానవుణ్ణి వేధిస్తున్న ఈ ప్రశ్నలకు జవాబులు వెదకడానికి కవి ప్రయత్నించడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

కన్నడిగుల ఇండ్లలో బాగా ప్రాచుర్యం పొందిన ‘కగ్గ ‘చరణాల్లో కొన్ని (నేను తెలుగులోనికి అనువదించినవి) మచ్చుకు:

ಹುಲ್ಲಾಗು ಬೆಟ್ಟದಡಿ, ಮನೆಗೆ ಮಲ್ಲಿಗೆಯಾಗು
ಕಲ್ಲಾಗು ಕಷ್ಟಗಳ ಮಳೆಯ ವಿಧಿ ಸುರಿಯೇ
ಬೆಲ್ಲ ಸಕ್ಕರೆಯಾಗು ದೀನ ದುರ್ಬಲರಿಂಗೆ
ಎಲ್ಲರೊಳಗೊಂದಾಗು ಮಂಕುತಿಮ್ಮ |

ఓ మంకుతిమ్మా! ఇంటిలో ఉన్నప్పుడు మల్లెపూవులా పరిమళాలను పంచు. పర్వతం ముందు నిలబడినప్పుడు గడ్డి పరకలా వినమ్రంగా వంగు. కష్టాల కడలి తరంగాలు నిన్ను తాకితే, తట్టుకొని బండరాయిలా నిబ్బరంగా ఉండు. పేదలు బలహీనుల పట్ల దయతో ప్రవర్తించు. కాని అందరి మధ్యన మసలుకో!

ಬದುಕು ಜಟಕಾಬಂಡಿ, ವಿಧಿ ಅದರ ಸಾಹೇಬ,
ಕುದುರೆ ನೀನ್,ಅವನು ಪೇಳ್ದಂತೆ ಪಯಣಿಗರು.
ಮದುವೆಗೋ ಮಸಣಕೋ ಹೋಗೆಂದಕಡೆಗೋಡು,
ಪದಕುಸಿಯೆ ನೆಲವಿಹುದು ಮಂಕುತಿಮ್ಮ ఈ

ఓ మంకుతిమ్మా! బ్రదుకు జట్కాబండి.విధి దానిని నడిపేవాడు. నీవు గుఱ్ఱానివి. ప్రయాణికులను నిర్ణయించేది దైవం. ఎగుడు దిగుడు బాట నేల. నీవు చేరేది ఉత్సవానికి కావచ్చు లేదా శ్మశానానికీ కావచ్చు.

ಅಶ್ವತ್ಥವಿಲ್ಲಿ ಬಾಡಿದೊಡೇನು? ಚಿಗುರಲ್ಲಿ; ।
ನಶ್ವರತೆ ವಿಟಪ ಪರ್ಣಂಗಳಲಿ ಮಾತ್ರ; ॥
ಶಾಶ್ವತತೆ ರುಂಡಮೂಲದಲಿ; ಪರಿಚರಿಸದನು ।
ವಿಶ್ವಪ್ರಗತಿಯಂತು – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా! అశ్వత్థ వృక్షం వంటిది ఈ జగత్తు. ఒక వైపు ఆకులు, చిగుళ్ళు ఎండి రాలి నశించిపోతుంటాయి. మరొక వైపు కొత్త పర్ణాలు, కొమ్మలు పుట్తుకొస్తూనే వుంటాయి. ఆకులు, చిగుళ్ళు శాశ్వతం కావు. కాని కాండం వేర్లు మాత్రం శాశ్వతం. ఒక చోట సృష్టి. మరొక చోట విలయం. ప్రపంచం సాగిపోతూనే వుంటుంది.

ಭಾನೂದಯಾಸ್ತಗಳಿನಲ್ತೆ ದಿಕ್ಕಾಲಗಳ ।
ಮಾನಗಣಿತವು ನಮಗೆ? ಭಾನುವಿರದೊಡದೇಂ?
ಅನಂತ್ಯ, ಶುದ್ಧಸತ್ತಾ ಮಾತ್ರ, ಬೊಮ್ಮನದು ।
ಲೀನನಾಗದರೊಳಗೆ – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా ! భానుని యొక్క ఉదయాస్తమయాల వల్లనే కదా ! మనం కాలాన్ని దిక్కులను తెలుసుకోగలుగుతున్నాం. ఒకవేళ ఆ సూర్యుడే లేకపోతే ? ఈ దిశాసమయాల భావన లెక్కడివి ? అప్పుడు మిగిలేది, కాలానికీ నింగికీ అతీతమైన పరమాత్ముని శుద్ధ చైతన్య మొక్కటే. అందుకే నువ్వీ అసంబద్ధమైన భావనలను వీడి, ఆ శుద్ధ బ్రహ్మమునందు చరించు.

ನರನರೀ ಚಿತ್ರಗಳು, ನಾಟಕದ ಪಾತ್ರಗಳು ।
ಪರಿಪರಿಯ ವೇಷಗಳು, ವಿವಿಧ ಭಾಷೆಗಳು ॥
ಬರುತಿಹುವು, ಬೆರಗನರಸಿ ಮೆರೆಯುವುವು, ತೆರಳುವುವು ।
ಮೆರವಣಿಗೆಯೋ ಲೋಕ – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా! ఈ లోకం ఒక చిత్రమైన ఊరేగింపు. ఈ నాటకంలో ఎన్నో జిత్తులమారి నరుల పాత్రలు. పలువేషాలు, వివిధ భాషలు. ఇవన్నీ ఒక ఉత్సాహాన్ని వెదుక్కుంటూ వస్తాయి,అనుభవిస్తాయి, ఆనందిస్తాయి,తిరిగి వెళ్ళిపోతాయి. అంతే ! ఈ లోకం ఒక చిత్రమైన ఊరేగింపు.

ತನ್ನ ಮನೋರಥಂಗಳ ಚಕ್ರವೇಗದಿನೆ ।
ತನ್ನ ಮಣಿಹಾರಗಳ ಸಿಕ್ಕು ಬಿಗಿತದಿನೇ ॥
ತನ್ನ ಸಂಕಲ್ಪ ವಿಪರೀತದಿನೆ ಮಾನವನ ।
ಬೆನ್ನು ಮುರಿದೀತೇನೊ! – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా ! మానవుడు ‘కోరిక-తృప్తి-మరొక కోరిక ‘అనే విషవలయంలో పడి పరిగెడుతున్నాడు. అలా పరుగెత్తడంలో కంఠహారాలు చిక్కులువడి అతని మెడకు ఉచ్చులా బిగుసుకోవచ్చు. కోరికలను సాధించుకోవడానికి అతడు చేసే ప్రయత్నంలో అతని వెన్నెముక విరిగిపోనూ వచ్చు.

ಭ್ರಾಂತಿಯೋ ಸಂಪೂರ್ಣ ಸುಖದಾಶೆ ಬಾಹ್ಯದಲಿ ।
ಸಾಂತ ಲೋಕದ ಸೌಖ್ಯ, ಖಂಡಖಂಡವದು ॥
ಸ್ವಾಂತಕೃಷಿಯಿಂ ಬ್ರಹ್ಮವೀಕ್ಷೆ ಲಭಿಸಿರ್ದೊಡೇ- ।
ಕಾಂತ ಪೂರ್ಣಾನಂದ – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా! లౌకిక జగత్తులో సంపూర్ణ సుఖాన్ని పొందాలనుకోవడం భ్రమ. ఈ ప్రపంచంలో సుఖదు:ఖాలు నిరంతరం కలుగుతూనే ఉంటాయి. ఎవడైతే తన ప్రయత్నంతో ‘సార్వత్రిక సత్యాన్ని ‘ దర్శిస్తాడో వాడు సంపూర్ణానందాన్ని అనుభవిస్తాడు.

ಹೊರಗು ಹೊರೆಯಾಗದವೊಲ್ ಒಳಗನನುಗೊಳಿಸಿ, ನೀ-
ನೊಳಗು ಶೆಕೆಯಾಗದವೊಲ್ ಅಳವಡಿಸೆ ಹೊರಗ ॥
ಸರಿಸಮದೊಳೆರಡನುಂ ಬಾಳಿನಲಿ ಜೋಡಿಪುದೆ
ಪರಮಜೀವನಯೋಗ – ಮಂಕುತಿಮ್ಮ ॥

మనస్సాక్షిని అనుసరిస్తే లౌకిక వ్యవహారాలు భారంగా తోచవు. మనం ప్రతిదినం చేసే వ్యవహారాలన్నీ ఎలా ఉండాలంటే అవి మనస్సాక్షిని ఊపిరాడకుండా చేయకూడదు.

ಮಲಗಿದೋದುಗನ ಕೈಹೊತ್ತಿಗೆಯು ನಿದ್ದೆಯಲಿ ।
ಕಳಚಿ ಬೀಳ್ವುದು; ಪಕ್ವಫಲವಂತು ತರುವಿಂ ॥
ಇಳೆಯ ಸಂಬಂಧಗಳು ಸಂಕಲ್ಪನಿಯಮಗಳುఈ
ಸಡಿಲುವುವು ಬಾಳ್ ಮಾಗೆ – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా ! పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, నిద్ర ఆవహించి అది చేజారిన రీతి, పక్వానికి వచ్చిన పండు చెట్టునుండి దానికదే రాలిపడిన రీతి, తగినంత జ్ఞానాన్ని, జీవితానుభవాన్ని సంపాదించుకున్న వాడు సకల ప్రాపంచిక అనుబంధాలను, సంకల్పాలను వీడి పడిపోతాడు.

ಹಸ್ತಕ್ಕೆ ಬರೆ ನಕ್ಕೆ; ಓದುತ್ತ ಓದುತ್ತ ।
ಮಸ್ತಕಕ್ಕಿಟ್ಟು ಗಂಭೀರವಾದೆ ॥
ವಿಸ್ತರದ ದರ್ಶನಕೆ ತುತ್ತತುದಿಯಲಿ ನಿನ್ನ ।
ಪುಸ್ತಕಕೆ ಕೈಮುಗಿದೆ – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా ! నీ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొన్న తర్వాత నాలో నేను నవ్వుకున్నాను. కాని చదువుకుంటూ పోగా, నాలో ఒక గొప్ప అనుభూతి, గౌరవభావం కలిగి దానిని నా నుదుటిపై ఆనించుకున్నాను. గంభీర మనస్కుడనై నీ పుస్తకానికి అంజలి ఘటించాను.

ಅಷ್ಟದಿಗ್ಗಜವೆ ನೀನ್? ಆದಿಶೇಷನೆ ನೀನು?
ಕಷ್ಟಭಾರವಿದೆಂದು ನಿಟ್ಟುಸಿರ ಬಿಡುವೆ!
ನಿಷ್ಠುರದ ನಿನ್ನ ಕನಿಕರ ಜಗಕೆ ಬೇಕಿಲ್ಲ
ಎಷ್ಟಾದರಷ್ಟೆ ಸರಿ – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా ! నువ్వేమైనా దిక్కులను మోసే గజానివా ? లేక ఆదిశేషునివా ? మరి ఎందుకు ‘ నేనింత బరువును మోస్తున్నాను, నేనింత బరువును మోస్తున్నాను‘ అని ఊరికే చెబుతుంటావు ? ఇక్కడ ఎవ్వరికీ నిన్ను వినిపించుకొని, నీపై జాలి కురిపించాల్సిన అవసరం లేదు. ఎవరి ‘ బరువు మోతలు’ వారికే ఉన్నాయి. ఈ ప్రపంచంలో అన్నీ ఒక క్రమపద్ధతిలో జరిగిపోతుంటాయని తెలుసుకో !

ಸಂದೇಹವೀ ಕೃತಿಯೊಳಿನ್ನಿಲ್ಲವೆಂದಲ್ಲ ।
ಇಂದು ನಂಬಿಹುದೆ ಮುಂದೆಂದುಮೆಂದಲ್ಲ ॥
ಕುಂದು ತೋರ್ದಂದದನು ತಿದ್ದಿಕೊಳೆ ಮನಸುಂಟು ।
ಇಂದಿಗೀ ಮತವುಚಿತ – ಮಂಕುತಿಮ್ಮ ॥

ఓ మంకుతిమ్మా ! ఈ పుస్తకాన్ని చదివాక సందేహా లుండవని నే నడడం లేదు. ఈనాటి నమ్మకాలు ఎప్పటికీ నిలుస్తాయని నే నడం లేదు. ఎవరైనా లోపాలను ఎత్తి చూపితే తప్పకుండా స్వీకరిస్తాను. కాని ఇప్పటి కివే నిజాలని నా నమ్మకం.

**** (*) ****