కవిత్వం

పుస్తకమూ, అతనూ, నేనూ

01-మార్చి-2013

దీన్ని
గతంలో చదివాను చాలా సార్లే-
అర్థమయిందనుకున్నా-

మళ్ళీ మళ్ళీ చదివిన కొద్దీ
మళ్ళీ మళ్ళీ అర్థమయింది
ప్రతిసారీ కొంచెం ఎక్కువగా-

అవే అక్షరమాలలు
మళ్ళీ దర్శించినపుడు
కొత్తగా వూగుతున్నట్లు, కొత్త లయ పుడుతున్నట్లు-
కొత్తగా అర్థమవుతూ వొచ్చింది.

మళ్ళీ మళ్ళీ చదివాను
అక్షరాల్తో పాటు రాసినతనూ
నాతో మాట్లాడ్డం మొదలెట్టాడు

చదవడం ఇక సంభాషణ అయింది
శబ్దాల సాయంతో నిశ్శబ్ద సంభాషణ
అర్థానికి మించినదేదో
అందుతూ వొచ్చింది.

ఎన్ని మార్లు చదివినా – అంటే-
ఎన్ని మార్లు సంభాషించినా
తనివి తీరదు ఆస్వాదన ముగియదు

అతను లోకమ్మీద చివరి సంతకం
చేసి వెళ్ళి చాన్నాళ్లే అయింది ఈ
అయినా దేన్ని తెరిచినప్పుడల్లా
అగుపడ్తాడు స్ఫుటంగానో, లీలగానో – పుటపుటనా!

ఎందరినో ఎన్నిటినో ఎన్నెన్ని మార్లో
చదువుతూ చదువుతూ చదువుతూ
ప్రేమతోనూ, దయతోనూ
దీన్ని రాసి వుంటాడు కాబోలు
తననూ కొంచెం కొంచెం రంగరించుకుని-

నన్ను నేను రంగరించుకుంటూ
దీన్ని చదివినప్పుడల్లా, బహుశా,
అతనూ నన్ను చదువుతున్నాడేమో!