నీరెండ మెరుపు

గుర్తుండే ఓ కల లాంటి కవిత…

01-మార్చి-2013

నిన్నటి నుండి మంచు కురుస్తూనే వుంది. యే దిగులూ, ఆర్భాటం లేని ఇంత స్వచ్చత ఎలా అబ్బిందో దీనికి అనుకుంటూనే వున్నా వెన్నెలే కొత్త రంగులో ప్రతిఫలిస్తుంటే . సరిగ్గా అప్పుడే ముకుంద రామారావు గారి ‘మరో మజిలీకి ముందు ‘ నా పుస్తకాల సొరుగులోనుండి బయటకు తీసాను. ‘సమయానికి తగు మాటలాడెనె ‘ అన్న త్యాగరాజ కృతిలా ఈ కవిత దగ్గరే కళ్ళు, మనసు విడిది చేసాయి. కాస్తో కూస్తో ఈ కవితని తర్కించాక ఏదో రహస్యం మనసుని తట్టి లేపుతుంది.

——————————————————————-

మరో మజిలీకి ముందు

అద్దం ముందు ఆకాశమంత అబద్ధం
అద్దాల మధ్య బింబ ప్రతిబింబాల్లో
నిజానిజాల సందేహం

ఎండని చెమటతో తుడుచుకుంటూ
చలిని ఎండలో కాచుకుంటూ
పగుళ్ళు బారిన దేహాన్ని
చాలీ చాలని చినుకులతో తడుపుకుంటూ
రోజులు

అవును నిజ మే!
ఏక కణానికి ఏ ప్రతిపత్తీ వుండదు
మనసుకి హత్తుకోని
ఏ కలా మర్నాటికి గుర్తుండదు

ఎంత మోజుపడ్డా
ఎదుగుతున్న కొద్దీ
ఉన్న దుస్తులేవీ సరిపోవడం లేదు
ఎరిగున్న దారులేవీ
విశాలం కావడం లేదు
పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీలోలా!

ఆకొసకెలా చేరాలన్నది
ఎప్పుడూ తలెత్తే ప్రశ్నే!
వెనక్కి పోనూలేక
ఆగిపోనూలేక
మొదట్లా కాదు
ప్రాకారాలు దాటుతున్న ఆలోచనల్ని
లోపల సమస్యలు లాగిలాగి ప్రశ్నిస్తున్నాయి
నా కాళ్ళకింద భూమి
నన్ను తొలిచేస్తూనే ఉంది
నా వేర్లని తెలుసుకుందుకిప్పుడు
నన్ను నేనే తవ్వుకోవాల్సొస్తుంది

తొందరపడాలి
సాయంకాలం మంచుతెరలు దట్టమయ్యేలోగా
వాటిలోని పరిమళాల్ని
నా దారంతా పరుచుకుంటూ పోవాలి

——————————————————————

ఒక్కోసారేమిటి చాలాసార్లు మనకు మనమే నిలువెత్తు అబద్ధంలా కనిపిస్తాం మనసుని మభ్య పెట్టినప్పుడల్లా! అదేమిటో, సరిగ్గా అప్పుడే అద్దంలో చూసుకున్నామా అది ఆకాశమంత అగుపడుతుంది. నచ్చని ఘడియల్లోకి చేరి, మరింత గాయపరిచే జ్ఞాపకమయి కూర్చుంటుంది. ప్రతిదానికి రెండు కోణాలే కనిపిస్తాయి నిజమని, అనిజమని. మరి మూడొవది మనస్సులో మొలకెత్తే సందేహమే. బింబ, ప్రతిబింబాల్లో ఎటూ తేల్చుకోలేని సంశయమే జీవితాన్ని ముందుకో, వెనక్కో తోస్తుంది.

ఎండని చెమటతో తుడుచుకుంటూ, చలిని ఎండలో కాచుకుంటూ, పగుళ్ళు బారిన దేహాన్ని చాలీ చాలని చినుకులతో తడుపుకుంటూ రోజులు – బాధని నవ్వుతోనో తాత్కాలిక ఆనందంతోనో కప్పిపుచ్చుకుంటూ, సంతోషం మూలల్లో కూడా ఏవో నీలినీడల్ని పోగేసుకుంటూ, నిలకడ లేని క్షణాలని వెలిగిస్తూ – విఫలమవుతూ అనుభవాలతో బీటలు వారే ఈ దేహానికెప్పుడూ చాలీ చాలని తృప్తే. ఈ ఒక్కలైనులోనే ప్రస్తుత జీవనగతి ఒదిగినట్టనిపిస్తుంది. యధేచ్చగా ప్రవహించాల్సిన జీవితమేదో ఎన్నో సర్దుబాట్లు, ఎడబాట్లు, ఒప్పందాల నడుమ ఉపిరాడని ఓ భావాజాలమని తేలిపోతుంది ఈ పదాలు పూర్తయ్యేపాటికి.

మరో అద్భుత వాక్యం ‘మనసుకి హత్తుకోని ఏ కలా మర్నాటికి గుర్తుండదు ‘. అది కలయినా, ఎదురొచ్చిన సంఘటనయినా, వెనక పేజీల్లోకి వెళ్ళిపోయిన మనిషైనా. ఇంత సూటిగా తాకిన అనుభూతి పదాలకు మరింత వివరణ అవమానం.

‘ఎరిగున్న దారులేవీ విశాలం కావడం లేదు’ – తరచి చూసేకొద్దీ ఎంత రాపిడి వుందీ వాక్యంలో అనిపించకమానదు. చూపు, కదలిక నిశ్చలమయినట్టనిపిస్తుంది దీని సారాంశమేంటో తెలిసాక. మోజుపడి నిజం చేసుకున్న కలలేవీ మన నిత్యావసరాలను తీర్చలేవు. అలాగే , ఏర్పరుచుకున్న దారులన్నీ అన్నివేళల్లోను అక్కరకు రావు. పోగేసుకుంటూ పోతున్న అనుభవాల రద్దీలో, జీవితం గడిచేకోద్దీ ఇరుకవుతూనే వుంటుంది.

నిజంవైపుకి పయనమెప్పుడూ సుఖాంతమే, సంతృప్తిభరితమే. కాకపోతే మార్గమేంటో, పయనమెలానో అన్నవే చిరకాలం మిగిలిపోయే ప్రశ్నలు. ఇదివరకులా కాదు. ఇప్పుడు ప్రహారి దాటుతున్న ఆలోచనలు న్యాయమైన స్వేచ్చకోసమో, సంశయ బంధనాలు తెంచుకునే దిశలోనో ప్రస్తుత గతాలను ప్రశ్నిస్తున్నాయి. నిజమైన నన్ను తెలుసుకునే కాలం ఒకటుంటుంది, దానికోసం నన్ను నేను తవ్వుకోవాలి. ఆట్టే సమయం లేదు. తొందరపడాలి…సాయంకాలం మంచుతెరలు దట్టమయ్యేలోగా, వాటిలోని పరిమళాల్ని నా దారంతా పరుచుకుంటూ పోవాలి – ఈ ముగింపులోనే మౌనంగా ఓ భావం మెరిసి మాయమవుతుంది.

ఇలాంటి కవితల్ని చదివినప్పుడు, ఉన్నచోటనే ఆగిపోతాం. కనీసం కొద్దిసేపైనా కాళ్ళు భూమినట్టిపెట్టుకుంటాయి. ఇప్పుడద్దంలో మనల్ని మనం దర్శించుకుంటే కనిపించేది సందేహాన్ని వీడిన స్వచ్చమైన చిరునవ్వే. మరో మజిలీకి ముందు ఇలాంటి కవితలు కొన్నైనా చదవాలి, ఒక్కటైనా రాసిపెట్టుకోవాలి.