కవిత్వం

ఆంటోనియో అకస్మాత్తుగా పరిచయమయ్యావు నాకు

01-మార్చి-2013

…and yet my poems issue from a tranquil fountain
-Antonio Machado (Portrait)

 

ఆంటోనియో అకస్మాత్తుగా పరిచయమయ్యావు నాకు, కాని
నీకు పరిచయమే, నా విశాలబాల్యప్రపంచపు వేసవిరాత్రుల
వెన్నెలవాన, ఆ సోమరి అపరాహ్ణాలు, వసంతవనాల శ్యామ
నికుంజాల్లో సంధ్యవేళ పొడుగ్గా పెరిగే ఊదారంగు నీడలు.

ఎన్నో దారుల్లో తొంగిచూసావు, తిరిగావు, ఐనా పెరట్లో
నిండుగా పండిన నిమ్మచెట్టునీడనే ఒక పాతభ్రాంతిదగ్గర
ఆగిపోయావు. మిన్ను విరిగి మీదపడ్డా ప్రాచీన విశ్వాసులు
దేవుణ్ణి వదలనట్టు నీ స్మృతుల్ని వదులుకోలేకపోయావు

విందురోజు కూడా తొందరపడడం తెలియని బీదజనం మధ్య
పుట్టిపెరిగావు,పసితనపు స్వప్నాలనుంచి వృద్ధప్రపంచపు
యుద్ధాలదాకా సుదీర్ఘప్రయాణం చేసావు.హృదయశల్యాన్ని
ఊడబెరకబోతే హృదయమే ఊడిపోయిన అనుభవం నీది

కాని ఎర్రటిద్రాక్షపాదులమీంచి వెలుతురులోకి చేతులుచాపే
లేతబంగారు నులితీగలు,నీలి దిగంతం మీద కొందల వెండి
నురగ,రాగిరంగు చెట్లు,బూడిదరంగు కొమ్మలు-నువ్వు నీ
లోకాన్ని చిత్రించిన రంగుల్తో నా లోకాన్ని గుర్తుపడుతున్నాను