జిందగీ

వసంతంలా వచ్చి వెళ్లిపోయింది ఆపా!

జనవరి 2013

మా ఇంట్లో నేను ఆరో ఆడ  సంతానం, మా  ఇంటిని చుట్టేసుకుని ఉన్న చుట్టం గరీబీ. నాకు చదువంటే చాలా ఇష్టం. అక్కల చదువులు  అలీఫ్ ..బె ., దగ్గరే ఆగిపోయినా,  నా చదువు మాత్రం ఏడో  తరగతి వరకూ సాగింది. అబ్బాజాన్ కు  తన కుట్టు మిషనే ప్రపంచం.   నమాజుకు మజీదుకు వెళ్ళడం కోసం తప్ప వీధి ముఖం  ఎరుగడు, కుట్టు మిషను  తనతోనే పుట్టినట్లు భావిస్తాడు. తలకి మించిన భారమైనా ఊరిబట్టలన్నీ  తీసుకొని రాత్రి పగలూ కుడుతుంటాడు. ఆయన కుట్టే రంగు, రంగుల బట్టలు చూస్తుంటే  అవి మా వంటి మీద ఎలా ఉంటాయో ఊహించుకునేవాళ్ళం. అవి కుట్టిన తర్వాత ఎదో వంకతో మా వయస్సు వారైతే ఆల్తీ చూసినట్లుగా మమ్మల్నిఆ బట్టల్లో   కాసేపు చూసుకొనే వారాయన.  రంజాన్ పండక్కి  అమ్మిజాన్ మా కోసం కొనే సరుకులు చూడటం కోసం  అందరంచుట్టూ మూగే వాళ్ళం. మా పెద్దక్క మాత్రం  అన్నీ మాకోసం త్యాగం చేసేది, వంటిల్లు గడప దాటి ఎరుగదు. ఐదుపూటలా అల్లాను  తలవటం. అబ్బాజాన్ కి కలాం షరీఫ్ (ఖురాన్ గ్రంధం)  చదివి  వినిపించటం ఆమెకి నచ్చిన/వచ్చిన పనులు.దాదీ చెప్పే కధల్లో “పరీ” (ఫెయిరీ) ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది నాకెప్పుడూ. ఆఖరి చేల్లినైన నేనంటే అక్కకి ప్రాణం. మిషన్ దగ్గరి బట్ట ముక్కలతో రంగు రంగుల రిబ్బన్లు చేసి నాకు జడలు వేసేది. నా చిట్టి అరిచేతుల్లో పండిన గోరింటాకును చూసి మురిసి పోయేది.

* * *

 

ఆ రోజు రంజాన్ పండుగ రోజు. నేను ఆటలతో అలసిపోయి ఇంటికొచ్చాను. ముందు గదిలో ఇద్దరు ముగ్గురు మొగవాళ్ళు, వారి మధ్యలో ఇస్త్రీ చేసిన తెల్లటి కుర్తా పైజామా, టోపీతో అబ్బా జాన్ కూచుని ఉన్నారు. పెరటి తోవనుంది వంటింట్లోకి చేరాను. ఇల్లంతా అత్తరు వాసన. అబ్బాజాన్ పక్కన తెల్లటి గడ్డంతో,  ”త్వాబ్” మరియు  ”ఇగల్” ధరించి  (అరబ్బులు ధరించే సాంప్రదాయాక అంగ వస్త్రం మరియు తలపై ధరించే వస్త్రం) తెల్ల్లటి ఓ ముసలాయన. వాళ్ళను చూస్తూ వంటింట్లోకి వెళ్లాను. వంటింట్లో పళ్ళాల నిండా మిఠాయిలు ఉన్నాయి. ఆపాజాన్ (పెద్దక్క) శుబ్రమైన బట్టాల్లో ఓ మూల కూర్చుని వుంది. నేను అక్క ముఖం వంక చూసాను. ఎదురుగా బొలెడన్ని మిఠాయిలున్నా మంచి బట్టలు కట్టుకున్నా అక్క ముఖాన నవ్వు లేదు. అమ్మీజాన్ ఓ నడి వయసు ఆవిడతో  మాట్లాడుతూ ఉంది. నాకు కొంత వింతగా అనిపించినా మిఠాయి చేతికోస్తూనే తుర్రుమనబోయాను. ఆ పెద్దావిడ నన్ను దొరకబుచ్చుకుని ఏమే మున్నీ! నువ్వూ  ఎక్కుతావా విమానం మీ అక్కతో అంది. నా కళ్ళు మెరిసాయి. ఓ, మా ఆపాజాన్ ఎక్కడుంటే నేనూ  అక్కడే అన్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది  ఆపాజాన్  ని “అల్మాస్ బిన్ సులేమాన్” అనే పేరు గల ఆ ముసలి అరబ్బు షెకుకిచ్చి  పెళ్లి చేసారని.

 

* * *

 

ఐదేళ్ళకోసారి ఆపాజాన్  వసంతంలా  వచ్చేది. మెరిసిపోయే అక్కని చూసి మురిసి పోయే వాళ్లం. ఆపాజాన్ తెచ్చిన కానుకలతో మా ఇల్లు కళ కళ లాడేది. మా ఇంట్లో గరీబీని అక్క కొంత తరిమేసింది. అక్క సాయం తోనే  మిగతా అక్కలందరూ అత్తవారింటికి వెళ్లారు. కానీ నాకు మాత్రం ఎదో అనుమానం. అక్క మొఖంలో ఎదో వెలితి కనిపించేది.  ఎవరు లేని సమయంలో అమ్మ, అక్క ఒకర్నొకరు పట్టుకుని ఏడవటం నా దృష్టిని దాటి పోలేదు. మొత్తం మీద ఆపాజాన్ జీవితం సాఫీగా సాగిపోవటం లేదని నాకు అర్థం అయ్యింది. నా చిన్ని బుర్రకి పరిష్కారం తట్టేది కాదు. ఆపాజాన్ ఉన్నన్ని నాళ్లు  ఈద్ (పండగ) లాగా ఉండేది. ఆమె వెళ్తుంటే వసంతం వెళ్ళిపోతున్నట్టు  అనిపించేది.

***

ఆఖరి అక్క పెళ్ళిలో ఆపాజాన్ ప్రస్తావన వచ్చింది. ముసలి షేకు అల్మాస్ ఓ శాడిస్టు అని ఆపాజాన్ నానా హింసలు పెడతాడని, అయినా సరే డబ్బుకోసం అఖ్తర్ సాయిబు, కూతుర్ని అమ్ముకున్నాడని తూలనాడారు. అన్నీ తెలిసినా కూతురు మీద ప్రేమ కంటే ఆకలి, బీదరికమే జయించింది అమ్మీ అబ్బాని. అక్క పంపే రక్తం అంటిన రంగు కాయితాలు మా ఇంట రుమాలి రోటీలయ్యేయి.

***

ఆ రోజు చాలా మన్హూస్ రోజు. అక్క బదులుగా ఓ పెద్ద చెక్క పెట్టె వచ్చింది.  మా అక్క మొఖం చూపకుండా కఫన్ కప్పుకుని వుంది. నా గుండె పగిలింది, మా గూడు చెదిరింది. ఆ దుర్మార్గుడు అక్కకి కఫన్ కానుకగా ఇచ్చి దఫన్ చేయమని మాకు పంపించాడు. పరామర్శించడానికి వచ్చిన పెద్దలందరూ తలో రకంగా విమర్శలు, సానుభూతీ ప్రదర్శిస్తున్నారు.

***

కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుంది అంటారు, కానీ అన్ని గాయాల్నీ మాన్పే  కాలం  నా గుండెకు మరో  గాయాన్ని చేస్తుందని నేనూహించలేదు. మరోమారు గరీబీ జయించి అక్క స్థానంలో నన్ను కూచోబెట్టింది. నా రోదన అరణ్య రోదనే అయ్యింది. ఆడ పిల్లని, పైగా బీద పిల్లని ఎవరు ఆదుకుంటారు ఈ దేశంలో. బీదరికానికి తలవంచాను. నా నికాః-  పెళ్ళికొడుకు షేకు లేకుండానే ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు సాక్షుల సమక్షంలో జరిగింది. నా అసమ్మతికి  ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదు. పెళ్ళంటే ఎన్నో ఊహించుకుంటుంది ప్రతి ఆడపిల్ల, కాబోయే పతి  తనను  ఏంటో అపురూపంగా చూసుకుంటాడని ఆశ పడుతుంది. నలుగురు స్నేహితురాళ్ళు హాస్యాలాడుతుంటే  సిగ్గుల మొగ్గ్గై తన వైవాహిక జీవితం ప్రారంబిస్తుంది ప్రతి ఆడపిల్లా.. అలాంటి అనుభూతి నోచుకోని నా దురదృష్టం  నన్ను వెక్కిరించింది. ఆకలి  పోరాటంలో ఓడిపోతూ  భారమైన హృదయంతో అసహ్యం, అసహనంతో, కోపంతో విమానం ఎక్కాను.

***

అప్పుడు తెలిసింది నాకు అక్క దుఖానికి కారణం. ఆమె ఒక నరరూప రాక్షసుడితో కాపురం చేసిందని. అక్కడున్నన్ని రోజులూ నరకమంటే ఏమిటో, అవమానం అంటే ఏమిటో తెలిసింది.మూడుపూటలా తిండి దొరికిందని సంతోషించాను, అందరినీ వదులుకొని దేశం కాని దేశాన ఈ దుర్మార్గుడి రాక్ష క్రీడలో పావునై  నలిగి పోతున్నందుకు  నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చాను.  నేనక్కడ ఓ యంత్రంలా చూడబడ్డానే  గాని మనిషిలా కాదు. ఏ చట్టాలూ,  ఏ మానవ హక్కులు నన్నాదుకోవడానికి రాలేదు. ఆ నరకం లో నిస్సహాయంగా ఒక సంవత్సరం గడచింది.

***

ఎన్నో రోజులు ఆ నరకంలో గడిపాక అల్మాస్ నన్ను అమ్మీ జాన్, అబ్బా జాన్ దగ్గరికి పంపడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు నాకింకా గుర్తే, అమ్మ ఒళ్లో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాను.మరోమారు అమ్మ  పెద్దక్కని  తలచుకొని గుండె పగిలేలా ఏడిచింది, అమ్మ వడిలో సేదతీరిన నేను,  నిశ్చయించుకున్నాను ఇక ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళకూడదని. బాగా అలోచించి నిశ్చయించుకున్నాను ఆ  రాక్షసుడికి “ఖుల” (ఇస్లాం లో స్త్రీ తరపునుంచి ఇచ్చే విడాకులు) ఇవ్వాలని. ఐతే  ”ఖుల” ఇవ్వాలంటే వరుడు ఇచ్చిన “మహార్”  సొమ్ము (వరుడు వధువుకు వివాహ సమయంలో తప్పనిసరిగా ఇవ్వాల్సిన డబ్బు లేక వస్తువులు) తిరిగి ఇవ్వాలి. నిఖానామా (వివాహ ప్రమాణ పత్రం) చూస్తే అందులో  ”మహార్” వెయ్యి దీనార్లు గా రాసి వుంది, అంటే మన విలువలో ఐదు వేలు. వెంటనే నా చిన్ననాటి స్నేహితురాలైన వకీలు కౌసర్ సాయంతో  ఐదు వేలు  ”మహార్” సొమ్ము ఆ రాక్షసుడి అకౌంట్లో వేసి ఇంటర్నెట్ ద్వారా  ఆ రాక్షసుడికి   ఇచ్చాను” ఖుల ”  ఖుల్లం  ఖుల్లా.