కవిత్వం

తొవ్వ

08-మార్చి-2013

నడిచి వచ్చిన తొవ్వ దొరుకదు
నగుబాటు కానుక.

రాత్రి వచ్చిన కల గుర్తుండదు
రసభంగమే వినోదం.

పదార్థం నిప్పుల మీద కాలుతూ
విరజిమ్మిన కొత్త వాసన
బతుకును ఊరిస్తది.
ఊహాలోకం లోకి విరిగిపడిన
ఉల్కాపాతం శరీరం చిద్రం చేస్తది

ఎన్నాళ్లైనా
పాటను మోసుకుంటూ తిరగవల్సిందే
సందేహాల సంకెళ్ళు
శిఖరం వైపు నడిపించలేవు

పడమటి కనుమలలో
పరిహాసాలుండవు
పాటలోకి చీకటి ప్రవేశించడం ప్రమాదం
అంతకంటే ప్రాణం లోకి చీకటి ప్రవేశించడం
పెద్ద విషాదం

స్వస్థ సమృద్ధమైన గ్రామాలు
రోగగ్రస్త నగరాల చుట్టూ చక్కర్లు కొట్టడం మాయ

వొత్తిడి గుండెను తొలుస్తది
ఒంటరితనం వొంటిని తొలుస్తది

ఊరు కాని చోట
దేశం కాని చోట
ఐనవాళ్ళు లేని చోట
పాదాలు అలసిపోతే
శవపేటికలు సంచరిస్తయి

బతకాలంటే
ఇంటి తుఫానులూ
ఇసుక తుఫానులూ
తట్టుకోవాల్సిందే

యెన్నాళ్ళైన కట్టెను మోసుకుంటూ
పాటను మోసుకుంటూ
బతకాల్సిందే

నడిస్తేనే తొవ్వ దొరికేది
యేడిస్తేనే బరువు దిగేది
తండ్లాడితేనే బతుకు దాటేది

అతి రాత్రైనా
కట్టె పట్టుకోని
కన్నీళ్ళకడ్డంగా
కాలాడించవల్సిందే!9 Responses to తొవ్వ

 1. March 8, 2013 at 1:02 am

  స్వస్థ సమృద్ధమైన గ్రామాలు
  రోగగ్రస్త నగరాల చుట్టూ చక్కర్లు కొట్టడం మాయ

  వొత్తిడి గుండెను తొలుస్తది
  ఒంటరితనం వొంటిని తొలుస్తది

  బతకాలంటే
  ఇంటి తుఫానులూ
  ఇసుక తుఫానులూ
  తట్టుకోవాల్సిందే..

 2. ns murty
  March 8, 2013 at 4:04 am

  సిద్ధారెడ్డి గారూ,

  మీరు నా అభిమాన కవులలో ఒకరు.

  ఈ కవిత అంతా బాగుంది గానీ, “సందేహాల సంకెళ్ళు శిఖరం వైపు నడిపించలేవు” అన్నది కవితలోని మీ “నడిస్తేనే తొవ్వ దొరికేది” అన్న మీ థీసిస్ కి ఆఘాతంగా నాకు కనిపిస్తోంది. సందేహం తలెత్తడమే చీకటి. నడక తప్పనపుడు (చేరలేకపోయినా) శిఖరం వైపు నడవక తప్పదు.

  (వాకిలి సంపాదకులకి ఒక విజ్ఞప్తి. కవుల సెల్ నంబరు వాళ్ళకి అభ్యంతరం లేకపోతే ఇవ్వమనండి / ఇవ్వండి. పాఠకులు ఇక్కడ స్పందించలేకపోయినా, ప్రత్యక్షంగా వారిని సంప్రదించే అవకాశం ఉంటుంది.)

 3. rama sundari
  March 8, 2013 at 12:39 pm

  నడిస్తేనే తొవ్వ దొరికేది
  యేడిస్తేనే బరువు దిగేది
  తండ్లాడితేనే బతుకు దాటేది….nijame..chinna padalloa bratuku satyanni chepparu.

 4. March 9, 2013 at 4:37 am

  manchi poem

 5. March 12, 2013 at 3:37 am

  నడిచి వచ్చిన తొవ్వ దొరుకదు
  నగుబాటు కానుక.

  రాత్రి వచ్చిన కల గుర్తుండదు
  రసభంగమే వినోదం….తాత్వికతను పరాకాష్టకు తీసుకెళ్ళిన వాక్యాలు.A good poem.

 6. March 12, 2013 at 3:07 pm

  Left the reader with a great tender feeling….Good one !

 7. pratap reddy kasula
  March 13, 2013 at 3:55 pm

  ఇంత భావోద్వేగమైన కవిత చదివి చాలా రోజులవుతోంది. సిధారెడ్డి గారికి థ్యాంక్స్… నా ఫీలింగ్స్‌ను తన కవితిలో నింపినట్లుగా ఉంది. హ్యాట్సాఫ్ టు సిధారెడ్డి. ఒక బాధ కాదు, ఒక్కటే…. బాధ – కలలు ఛిద్రమవుతున్న కొద్దీ కవిత్వం చిక్కనవుతుంటుందా…

 8. March 14, 2013 at 12:45 pm

  univrsal poem

 9. buchireddy
  March 15, 2013 at 1:38 am

  excellent poem reddy garu
  —————
  buchi reddy gangula

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)