నేను నడుస్తున్నప్పుడల్లా
నా పాదాల్ని అడుగుతాను
దారి నిన్ను చిరునవ్వుతో పలకరించిందా
ప్రేమగా ముద్దు పెట్టుకుందా
నీ పాదాల కింద దారి ఏమేమి పరిచి వెళ్ళింది
సుతి మెత్తని మంచుపూల పరిమళాల్నా
రాకాసి ముళ్ళ వనాల్నా, లేక
మనుష్యులు ఇక్కడ తమ జ్ఞాపకాలుగా
వదిలి వెళ్ళిన గులక రాళ్ళనా,
బతికి వున్నందుకు గుర్తుగా
భూమి తన ఉశ్వాస నిశ్వాసాలతో
నిన్ను వెచ్చగా చుట్టుకుందా?
ఎన్నెన్ని ప్రవ్నల జడివానలో
అలసి పాదాలు ఆగిపోతాయి
కానీ, దారి మాట్లాడినట్లు
అవి ఎన్నడూ, ఒక తీయని కబురునో
దాని ఆత్మ సందేశాన్నో చెప్పలేదు నాకు
ఇప్పటి వరకు ఎవరి పాదాలతో నన్నా
దారి మాట్లాడిందేమోనని దిగులుగా వెదుకుతాను
చెరగని పాద ముద్రల్ని ప్రేమగా తడుముతాను
మన అనాది ఆశల ఆకాశం నుండి
తెగిపడిన ఒక కలల ఇసుక మేఘపు
ముసుగు, మనల్ని కమ్ముకుంటుంది
ఒక ఇసుక దానిని, అది మనముందు పరిచి ఎగిరిపోయింది
నడుస్తున్నాం నడుస్తున్నాం
వందల ఏళ్ళుగా,పాతిక ,పదేళ్లుగా
కదలని మృతశిశువులా, దారి అట్లానే వుంది
గాలిని మోస్తూ మనుషులే కదులుతారు
ముందుకు, మునుముందుకు
తూర్పు పవనాన్నో, వేసవి వడగాల్పులనో
మలయమారుతాన్నో, తుఫాను నాటి పెనుగాలి కెరటాల్నో
మోసుకుంటూ, మనుష్యులే కదులుతారు
మెలమెల్లగా, గుంపులు గుంపులుగా, వంటరిగా
పూలదారులగుండా, పచ్చిక మైదానాల గుండా
సముద్రతీరాల గుండా, అడవి అంచుల గుండా
పర్వత సానువుల గుండా, బురద నేలల గుండా
మనుష్యులం మనమందరం అట్లా నడుస్తూనే వున్నాం
దారిపక్కన నిలబడిన పర్వత శ్రేణులన్నీ
అనాదిగా ఘనీభవించిన మనుష్యుల కన్నీటి చుక్కలు కాబోలు
మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన మనుష్యుల జాడలు
భూమి అడుగు పొరల్లోనో, బూడిద రంగు మేఘాల్లోనో
ఇంకా అట్లానే ప్రశ్నార్థకాల్లా మిగిలే వుంటాయి కాబోలు
దారి నుండి కొంచెం పక్కకు జరిగిన తర్వాత
గాలితో గుసగుసలాడుతాను
ఈ దారిన నడిచిన ఒక్కొక్కరికీ నువ్వు
మరల మరల పట్టుకొచ్చిన సందేశం ఏమిటని
నడక సాగే సమయాన
దారి మన పాదాలతో
ఇంకా సంభాషణ ప్రారంభించలేదనే సత్యం
గాలి చెబుతున్న నిజం
మనకి వినపడలేదెన్నడూ
దారి వదిలి పెట్టాకే
నిజాల్ని మనం అసలు ఎన్నడూ వినదలుచుకోలేదని
వినయంగా ఒప్పుకుంటాం
చాలా నచ్చింది. కవిత పొడుగ్గా వున్నా, భావం పొదిగిన తీరుతో ఎక్కడా పలచబడినట్టనిపించలేదు.
చాలా మంచి కవిత. కాని “నా పాదాల్ని అడుగుతాను” అని కవిత మొదలౌతుంది. వెంటనే “నీ పాదాల కింద ఏమేమి పరిచి వెళ్ళింది ” అని వస్తుంది . నీ పాదాలు అన్నప్పుడు ఎవరిని సంభోదిస్తున్నట్టు ? కొంచెం కన్ఫ్యూషన్ వుంది
పాదాలతో సంభాషణ…నాకు ఈ కవితలో నేను- నువ్వు అనే subject shifting నచ్చింది. లింగా రెడ్డి గారూ: మనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ‘నేను’ ని ‘నువ్వు’ అనడం మామూలే కదా…నీ పాదాల కింద అన్నప్పుడు కూడా నాకు అదే వినిపించింది. కేవలం ‘నీ కింద’ అని రాసి వుంటే వాక్యం బోసిగా వుండేది. నీ పాదాలు అన్నప్పుడు ఆ double emphasis కవిలోపలి సంభాషణలోని ఉద్వేగాన్ని చెప్తోంది నాకు…ఇది కేవలం నా reading మాత్రమే! మీతో సహా విమలక్క, వరవర రావు, శివసాగర్ లాంటి కవుల్లో నాకు ఈ subject shifting వొక బలమయిన లక్షణంగా కనిపిస్తోంది. ఇది మీ కవిత్వ పాదాల్ని నడిపిస్తున్న మౌఖిక సంస్కృతి నించి వచ్చిన మంచి లక్షణం అనుకుంటా.
manchi kavitha…
very nice poem .
విమల
కవిత పంపినందుకు ధన్యవాదాలు. చివరి రెండు పాదాలు నాకు resonate ఔతున్నై. నేను కవిత్వం గురించి పెద్దగా పట్టించుకుని చాల సంవత్సరాలైతుంది. అభి దిల్కష్ హాయ్ తేరా హుస్న్ మగర్ క్యా కిజే ఔర్ భి ఘం హాయ్ జమానే మెయిన్ మొహ్హబత్ కె శివా రహతెఇన్ ఔర్ భి హాయ్ వసల్ కి రహత్ కె శివా.
విభజన వార్త చాలా భాద కలిగించింది. విప్లవకారులే ద్రోహం చేసారనే భావన జీర్నించుకొలేకున్నాను. కార్మిక వర్గ అన్థర్జతియత కంటే “దేశ భక్తీ ” గొప్ప. కార్మిక వర్గం ఏమి చేయాలి అని ఒక్క మాట అయినా వినిపించిందా.