నవల,వ్యాసం, పొయెట్రీ రాసినా కూడా సాహిత్య ప్రక్రియల్లో నాకు ఇష్టమైంది కథ.
రచనలు నా జీవితానికొక అర్థాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. అంత వరకూ నాలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టాయి.
రవీంద్రుడి గీతాంజలి నాకు ఇష్టమైన పుస్తకం. శరత్ సాహిత్యం ప్రభావంతో పత్రికల్లో ఏదైనా మంచి కథలు చదివినప్పుడు నేను కూడా రాస్తే బావుణ్నని అనిపించేది. ముఖ్యంగా రంగనాయకమ్మ, కాళీపట్నం రామారావు గారి కథలు చదివినప్పుడు పట్టి కుదిపి వేసి రాయకుండా ఉండలేకపోయాను. హైస్కూల్ లో చదువుతున్న రోజుల్లో రంగనాయకమ్మ గారి బలిపీఠం సీరియల్ గా వస్తూ ఉండేది. ఆ కథా వస్తువు,రచనా శైలి చాలా నచ్చి నేను అలా రాయడానికి ప్రయత్నించాను.
ప్రచురింపబడిన మొదటి కథ జ్యోతి మంత్లీ లో వచ్చిన ‘రిక్షా’ . నా చుట్టూ ఉన్న చిన్న వాతావరణం లోంచి పుట్టిన కథ అది. అది స్వీయానుభవం కూడా. ఆ కథలో రిక్షా వాలా టీచర్ ని డబ్బు విషయం లో మోసం చెయ్యడం ఇతివృత్తం. ఆ కథ ప్రచురింపబడినప్పుడు చదివితే, తర్వాత రిక్షా వాలా జీవితం గమనిస్తేను ఆ కథ అలా చెప్పి ఉండకూడదనిపించింది. అతని జీవితంలో ఆర్థిక కారణాలు అతడలా ప్రవర్తించడానికి దోహదపడ్డాయి. అది అర్థం అయ్యాక ఇంకెప్పుడూ నేనలాంటి కథ రాయలేదు.రచయితగా నేనెవరి తరఫున నిలబడాలో అప్పుడే నిర్ణయించుకున్నాను.
నేను పుట్టి పెరిగిన పల్లె వాతవరణం లోనే తర్వాత నివసించడం వల్ల చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి తెల్సుకోవడం కష్టం కాలేదు. వాళ్ల అనుభూతుల్తో నేనూ సులభంగా మమేకం కాగలిగాను.
ఒక స్ర్తీగా ఆర్థిక ఇబ్బందులు స్వయంగా తట్టుకోవలసి రావడం, దానిని భరించలేని తనం నించి నా కథలు పుట్టుకొచ్చాయి. నా కథల్లో పాత్రలు నా గురించి గానీ, నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి గానీ అయ్యి ఉండేవి.
కథల్లోని పాత్రలు సజీవంగా కళ్ల ముందు కదలాలని నేను అనుకుంటాను. నా చుట్టూ ఉన్న జీవితాలన్నీ బడుగుల బాథా తప్త జీవితాలే కాబట్టి నేను హాస్య కథల్లాంటివి రాయలేకపోయాను. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినవే మొదట్లో రాసిన ” గాజు పళ్లెం” , “పిండి బొమ్మలు”వంటివి.
“ఖాళీ సంచులు ” కథలోని ముఖ్య పాత్ర దుర్గ నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఆ కథని నేను ఆమెకి చదివి వినిపించిన తర్వాత గాలిలో నిరాధారంగా ఉన్న జీవితానికి ఒక బలమైన మార్గాన్ని ఏర్పరుచుకున్నానని నాతో చెప్పింది. “క్షతగాత్ర” కథ చదివిన తర్వాత బాగా చదువుకున్న డాక్టర్ల వంటి స్త్రీలు కూడా ఆ కథ లోని సంఘటనలతో తమ జీవితాల్ని పోల్చుకుని”చదువుతుంటే తమకు కన్నీళ్లు ఆగలేదని” ఫోన్లు చేసారు. ఇలాంటి సంఘటనలెన్నో! ఇటువంటివి జరిగినప్పుడు నా కథా రచనకొక సార్థకత ఏర్పడిందని నేననుకుంటాను.
పల్లెటూళ్లో చుట్టూ ఉన్న వ్యక్తులందరూ నన్ను ఇన్ స్పెయిర్ చేసిన వాళ్లే. వాళ్ల నడవడికల ప్రభావం నా కథ మీద చాలా ఉంటుంది. మా ఇంటి పక్కనే ఊరి గ్రంధాలయం ఉండడం వల్ల గొప్ప గొప్ప కవులు, రచయితల రచనలు చదవడం వల్ల మొదట్లో బాగా ఇన్స్ స్పెయిర్ అయ్యాను. నన్ను బాగా ప్రభావితం చేసిన జీవితం మాత్రం ఈ పల్లె జీవితం. అలాంటి నేపధ్యంతో వచ్చినవే నా కథల సంపుటులు 1996 లో వచ్చిన “జీవరాగం”, 2002 లో “మట్టి- బంగారం “, 2007 లోని “అతడు- నేను”, ఇంకా ఇప్పుడు కొత్తగా రాబోతున్న మరో సంపుటం.
కథలు85 లో ప్రారంభించినా తొంభైవ దశకం ప్రారంభం వరకూ నేనెప్పుడూ ఏ సభలకూ వెళ్లలేదు. . ముఖ్యం గా అప్పట్లో బొమ్మూరు తెలుగు యూనివర్శిటీ సభలు, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో జరిగే సభలు,కంజిర, సంతకాలు సభలు , సాహిత్య వాతావరణాన్ని కలిగించేవి. ఎప్పుడూ నాకు నేనుగా ఈ పల్లెటూళ్లో కూర్చుని రాసుకోవడమే నాకు ఇష్టమైన విషయం. అందుకే సమావేశాలకు వెళ్లడం ఒక మార్పు కోసమే గానీ వాటి నుంచి నేను ప్రభావితమయ్యింది చాలా తక్కువ.
పల్లెటూళ్లలో జరుతున్న అన్యాయాల్ని ఎత్తి చూపుతూ చాలా కథలు రాసేను. ముఖ్యంగా స్త్రీలు ఎంతటి అణచివేతకి గురవుతున్నారో,దౌష్ట్యానికి బలైన స్త్రీలు ఎందుకు తిరగబడలేకపోతున్నారో చెప్పడానికి ప్రయత్నించేను.వెనక బడిన కులాల్లో స్త్రీలు కుటుంబ హింసతో బాటూ సామాజిక హింసని కూడా ఓర్చుకోవలసి రావడం నన్ను బాగా బాధించేది. విచిత్రంగా చాలా మందికి తాము హింసకు గురవుతున్నామని తెలీదు కూడా.దానిని ఎదిరించొచ్చని, బైట పడే మార్గాలు అన్వేషించొచ్చని తెలీదు. అయినా పల్లెటూళ్లలో స్త్రీలు దేనికైనా తిరుగుబాటు ధోరణి అవలంబించినా అది వెంటనే అణచివేయబడుతుందని తర్వాత అర్థమైంది నాకు. ఆ బాధ కూడా నా కథల్లో కనిపిస్తుంది.
అలాగే ఆర్థిక పరమైన వెనుకబాటు తనం వల్ల ప్రభావితమయ్యే సంఘటనలు నన్ను బాగా ఆలోచింపజేసేవి. నా కథల్లో ప్రతిబింబించేవి.
జీవితాన్ని ఏదో ఒక ఇజానికి సంబంధించిన పరిధిలోంచి చూడడం రచయిత తనకి తాను పరిధులు విధించుకోవడమేనని నేననుకుంటాను. కథని బట్టి పాత్రలకి సహజంగా నడుచుకునే స్వేచ్ఛనివ్వాలి. నిరంతర చైతన్యవంతమైన మనిషి జీవితంలో ప్రతి సంఘటనా ఒక కథా వస్తువే. ఆర్థిక, సాంఘిక అసమానతల్ని, వాటి మూలాల్ని,గ్లోబలైజేషన్ ప్రవాహంలో అన్నీ కొట్టుపోయేలా రాజకీయం చేస్తున్న ప్రభుత్వాల విధానాల్ని పరిశీలించి రాయడం రచయిత బాధ్యత.
పల్లెటూళ్లో చెరువుకెళ్లి చిన్న బిందెతో మంచినీళ్లు తెచ్చుకునే ఒక అమ్మాయి ఈ లోకంలో కథా రచయితగా నిలదొక్కుకునేలా చేసిన సాహిత్యానికి నేనెప్పుడూ తల వంచి నమస్కరిస్తాను.
నేనెరిగిన మొట్టమొదటి రచయిత్రి వరలక్ష్మి గారు .
నాబోటి వాళ్ళతో కూడా చక్కగా ఎన్నాళ్ళపరిచయమో అన్నట్టూ మాట్లాడుతారా రచయితలు అని ఎంత ఆశ్చర్య ( ఆనంద) పడిపోయానో !