ముఖాముఖం

నగర జీవితానికి పరాయి వాడిని – దర్భశయనం

22-మార్చి-2013

కవి, విమర్శకుడు దర్భశయనంతో సంభాషణ…
ఇంటర్వ్యూ: కోడూరి విజయ్ కుమార్

(1) సంజీవదేవ్ ముందు మాటతో వెలువడిన ‘జీవన వీచికలు ‘ నుండి మొన్న ఒంగోలు సభల్లో దేవీప్రియ ఆవిష్కరించిన ‘పొలం గొంతుక’ వరకూ కవిగా చేసిన ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తోంది?

వెనక్కి తిరిగి చూసుకుంటే కవిగా నేను నడచిన మూడున్నర దశాబ్దాల బాట కనబడుతున్నది. స్పష్టంగా నేను నడచిన బాట అది…అది నా యిష్ట ప్రయాణం…స్కూలు రోజుల్లో ఇష్టపడి కవిత్వం రాయడం మొదలు పెట్టాను …ఆ తర్వాతి కాలం లో ఇనుమడించిన యిష్టం తో దాన్ని కొనసాగించాను …ఇష్టంగా కవిత్వాన్ని చదివాను…ఇష్టమైన కవులతో, వ్యక్తులతో స్నేహించాను. ఇష్టమైన ప్రాంతాలకు వెల్లొచ్చాను. గడించిన అనుభవాలనీ, ఇష్టపడిన మనుషులనీ, ప్రాంతాలనీ కవిత్వం లో వ్యక్తీకరించాను, ఇష్టంగా!…ఫలానాది మాత్రమే చదవాలనో, రాయాలనో నియమమెప్పుడూ పెట్టుకోలేదు. చదివిన, రాసిన క్షణాలనీ, రోజులనీ గాడతరమైనవిగా భావించాను…భావిస్తున్నాను. ఈ లోకంతో గాదతరమైన సంబంధాన్ని కలిగి వుంటూనే, నేను ఏర్పరచుకున్న మరో లోకం లో ఇష్టపూర్తిగా సంచరించాను…సంచరిస్తున్నాను. సంజీవదేవ్, సి. నారాయణ రెడ్డి, కాలోజి, శివా రెడ్డి, పాపినేని శివశంకర్, చేకూరి రామా రావు, సునీల్ గంగోపాధ్యాయ్ , దేవి ప్రియ , వీళ్ళు నా పుస్తకాలను ఆవిష్కరించిన వాళ్ళు- ఇష్టపడి, వాళ్ళ మీద గౌరవంతో కోరుకున్నాను వాళ్ళను పుస్తక ఆవిష్కర్తలుగా !
వెనక్కి తిరిగి తరచి, తరచి చూసుకుంటే ఎన్నో కవిత్వానుభావాలూ, ఎన్నెన్నో ఘటనలూ … ఉత్సాహపరచిన సందర్భాలతో పోలిస్తే, నిరుత్సాహ పరచిన సందర్భాలు తక్కువే. నాకు అర్థమైన జీవితాన్ని సాధ్యమైనంత సరళంగా చెప్పటానికి ప్రయత్నించాను..నా కవిత్వ జీవితంలో ఇది ప్రధానమైన అంశం. ‘గాడత తో కూడిన సరళత’ నాకు ఇష్టమైన రూప మార్గం. వస్తుపరంగా విస్తారమైన జీవితానికి సంబంధించిన పలు భిన్న అంశాలనీ కవిత్వం లో వ్యక్తీకరించాలనే తపన వల్ల నా కవితా వస్తు ప్రపంచం విస్తారంగా రూపొందింది. ఇది నాకెంతో తృప్తిని ఇచ్చే అంశం. ఐతే, నా కవిత్వ ప్రయాణం సునాయసంగానో, సుఖంగానో సాగలేదు. శ్రమించాను.. ‘ఏ పుస్తకాన్నీ తెరవకుండా ఏ రోజూ మూయలేదు’ అన్నానొక కవితలో. అధ్యయనం కోసం ఎన్నో రాత్రుల్ని వెచ్చించాను. ఉద్యోగపు ఒత్తిళ్లను అధిగమిస్తూ, నా సమయాన్ని ప్రధానంగా సాహిత్యం కోసం వినియోగించుకునే ప్రయత్నం చేసాను.

కొన్ని కవితల్ని రాయడానికీ, పూర్తి చేయడానికీ కొన్ని సంవత్సరాల సమయమూ తీసుకున్నాను. నిర్మాణ సమయాల్లో అవసరం అనుకున్నపుడు తొందరపడక నిరీక్షించాను. సృజనకారునికి పనిచేయడం తెలిసినట్లే కొన్ని సందర్భాలలో నిరీక్షించదమూ తెలియాలని నా అభిప్రాయం. కవితా ప్రయాణం ఒక జీవితకాలమంత సుదీర్ఘమైనదనే ఎరుక నన్ను నిరంతర సాధనకు పురిగొల్పింది. బయటికి వ్యక్తీకరించిన అన్ని సందర్భాలలోనూ లోపల నాతో నేను సంభాషించాను. ఈ అంతర్గత సంభాషణ నా ఆలోచనలకు స్పష్టతనూ, మార్గాన్నీ యిచ్చింది.

(2) దర్భశయనం కవిత్వం అనగానే ఎక్కువగా పల్లెలు, రైతులూ జ్ఞాపకం వస్తారు…అలాగే మానవ సంబంధాలకు సంబంధించిన ఒక వేదన కూడా?…. ఈ విషయం లో మీ జీవిత నేపథ్యం చూపిన ప్రభావం ఏమయినా ఉందా?

నేను పల్లెటూళ్ళో పుట్టాను ….కళ్ళు తెరవగానే చూసింది పల్లెటూరి వాతావరనాన్నే. పదిహేడేళ్ళ వయసు వచ్చేదాకా మా జిల్లా కేంద్రమైన వరంగల్ నే చూడ లేదు.. బాల్యమంతా వూల్లలోనే గడిచింది. మా నాయిన పదహారేళ్ళు వ్యవసాయం చేసి, నష్టపోయి, కుటుంబ పోషణకష్టమై, ఉపాధ్యాయ వృత్తి లోకి వొచ్చాడు. ఆయన ఉద్యోగ జీవితం పల్లెటూళ్ళ లోనే గడిచింది. అందువల్ల పదవ తరగతి దాకా నా చదువు వూళ్ళ లోనే సాగింది. ఇంటర్ మీడియట్ కూడా కొంచెం పెద్ద ఊరైన నర్సంపేట లో జరిగింది. నా మిత్రులంతా రైతు బిడ్డలే. వాళ్ళ ఇళ్ళల్లో పొలాల్లో ఇష్టంగా తిరిగే వాడిని. తెల్ల వారి లేస్తే కంటికి ఎదురుగా పొలాలే…ముఖ్యంగా వారి పొలాలు. అలా చిన్నతనం లోనే ఆకుపచ్చ రంగు నాకు ఇష్టమైన రంగయింది. మంచేల మీద కూర్చుని చదువుకున్న రోజులు నాకింకా జ్ఞాపకమే …. పొలాన్ని దున్నడం నుంచి పంట కోతల దాకా అన్ని వ్యవసాయ పనుల్ని దగ్గరగా చూసాను…పరిగె ఏరుకోవడం పిల్లవాడిగా అప్పుడు నాకు ఇష్టమైన పని . అప్పుడూ, ఇప్పుడూ నాకు ఇష్టమైనది మిరప తోట. తోటలో అక్కడక్కడా బంతిపూలు వుంటే ఆ సోయగం ఎంత గొప్పది! పొలాలూ, చేలనే కాదు….అపుడపుడూ అడవికి వెళ్ళే వాడిని మిత్రులతో. సంచరించడం నా లక్షణం అయింది. సంచరిస్తూ మనుషుల నడుమ వుండే సంబంధాలని గమనించాను. పల్లెటూళ్ళ లోని అప్పటి మానవ సంబంధాలు నా మనసులో నాటుకుపోయాయి…కష్టమొచ్చినా, సుఖమొచ్చినా పంచుకునే వాతావరణం లో నేను పెరిగాను. క్రమంగా జీవితాల్లో వొచ్చిన మార్పూ, మనుషుల నడుమ దూరాలూ, వ్యక్తీకరణలో అబద్దాలూ, అవసరాలకే పరిమితం అయిన సంబంధాలూ నన్ను వేదనకు గురి చేసాయి. ఈ వేదనే నా నిరంతర కవితా వస్తువు అయింది.. ఇంటర్మీడియట్ తర్వాత రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాలలో చేరి బీ ఎస్సీ , ఎం ఎస్సీ (వ్యవసాయ ఆర్థిక శాస్త్రం) చదివాను. ఆ ఆరేళ్ళ వ్యవసాయం చదువు నన్ను నెలకో, మొక్కలకూ చేరువ చేసింది…వ్యవసాయం, ఈ దేశం లో ఎంత నిర్లక్ష్యానికి గురయిందో తెలుసుకున్నాను …

ఈ నేపథ్యం నుంచే గ్రామాల గురించీ, రైతుల గురించీ, వ్యవసాయం గురించీ విస్తారంగా కవిత్వం రాసాను.. అలాగే మారుతున్న మానవ సంబంధాల గురించి కూడా! నేను పల్లెటూరి జీవితానికి దగ్గరైనంతగా నగర జీవితానికి దగ్గర కాలేక పోయాను. ఇంకో రకంగా చెప్పాలంటే, పల్లెటూరి జీవితం అర్థమయినంతగా నగర జీవితం అర్థం కాలేదు… దీనికి కొనసాగింపుగా మరో మాట కూడా చెబుతాను. … నేను నగర జీవితానికి పరాయి వాడిని …నేనేనా? బహుశా, ఈ దేశం లోని రైతులందరూ నగర జీవితానికి పరాయి వాళ్ళే …నగరాలు పరిపాలిస్తోన్న దేశంలో గ్రామాలు పరాయివి.. నా దుక్కాన్నీ, ఆగ్రహాన్నీ కవిత్వ రూపం లో చెప్పాను . చెప్పడం నా ధర్మంగా భావించాను … సారంగా చెప్పడం కూడా పల్లెతూరివాడిగా నా మరో ధర్మమని భావించాను. నా వస్తువుకూ, రూపానికీ స్థూలంగా వ్యవసాయ లక్షణం ఉందనుకుంటాను

(3) మీ కవిత్వం లో ఒక లయ లాంటిది పాటకుడికీ ధ్వనిస్తుంది …. తొలి నుంచీ ప్రయత్న పూర్వకంగా సాధించినదేనా?

ప్రాథమికంగా కవిత్వం ఒక కళ…. ఆ కళను అధ్యయనం చేసే క్రమం లో అదొక లయాత్మక సృజన అని అర్థమయింది ….మాటల కళాత్మకమైన కూడలి కవిత్వమైతే అది అర్థవంతమైన కూడలి కావడానికి లయని సాధించాలి అని నా అభిప్రాయం … చిన్నప్పటినుండీ కవిత్వాన్ని నిశ్శబ్దంగా కాకుండా, బిగ్గరగా ఎలుగెత్తి చదువుకోవడం అలవాటయింది … ఆ చదవడం లో ఒక ‘తూగు’ వుంటే బాగున్నట్టు భావించే వాడిని. అప్పుడైనా, ఇప్పుడైనా లయ లేని కవిత్వం నన్ను ఆకర్షించదు…లయ అనగానే సాధారణంగానే భాషకు సంబంధించింది అనుకుంటారు గానీ భావానికి సంబంధించింది కూడా…శబ్ద లయ ఎంత ముఖ్యమో అర్థ లయ కూడా అంతే ముఖ్యం… ఔచిత్యమైన భాష ద్వారా, భావన ద్వారా ఈ లయని సాధించవచ్చు… మాటకూ, మాటకూ నడుమ, పంక్తికీ, పంక్తికీ నడుమ అన్వయమూ, సామరస్యమూ కుదిరినపుడు లయపుడుతుంది …అది కవి భావనను పాటకుడిలో చేరవేయడానికి ఉత్ప్రేరకమవుతుంది … అల్లాగే కవితలో భావనా ప్రయాణాన్ని బట్టి అర్థ లయ జనిస్తుంది … భావధార తెగిపోతే లయ తెగిపోతుంది…వీటిని నా స్వానుభవంతో తెలుసుకున్నాను … శబ్ద లయను సాధించడానికి కొన్ని భాషా పరికరాలని ఆశ్రయించవొచ్చు…కానీ, అర్తలయను సాధించడం కష్టమైన పని… కవికి తాను ఎంచుకుంటున్న వస్తువు తాలూకు పరిథిని గురించిన స్పష్టతా, దానిని వ్యక్తీకరించే క్రమమూ, దాని ఆద్యంతాలూ, వ్యక్తీకరణలో ధార, వీటి పైన లయ ఆధారపడి వుంటుంది..తెలుగు వచన కవిత్వం లో లయను గురించి మాట్లాడుకున్నది చాలా తక్కువ, లేదా దాదాపు లెదనవొచ్చు….తొలి దశలో ఈ లయ కోసం ప్రత్యేకంగా ఆలోచన చేసేవాడిని…ఇపుడు నా కవిత్వం లో ప్రాణమైన భాగం… ఆ లయ రాలేదనుకున్నపుడు ఆ కవితని త్యజిస్తాను…

(4) తెలుగు కవిత్వానికి సంబంధించి 80 లు ఒక స్వర్ణ యుగం అనిపిస్తుంది…విప్లవ, స్త్రీ వాద, దళిత వాద భావ జాలాలకు సంబంధించిన కవులతో సహా, చాలా మంది శక్తివంతమైన కవుల్ని అందించిన కాలం….ఒక విమర్శకునిగా చెప్పండి, ఏమిటి 80 ల కున్న ప్రత్యేకత….?

80 లకు ముందు కూడా ఉత్తమ కవిత్వం వెల్వడింది…విప్లవ కవిత్వం ప్రజల ఆకాంక్షల్నీ, వేదనల్నీ స్ఫుటంగానే ప్రతిఫలించింది…ఉద్యమాలకు ఉత్ప్రేరకమయింది…80 లలో వొచ్చిన చాలా మంది కవులకు స్ఫూర్తినిచ్చిన కవిత్వమది…80 లలో వొచ్చిన మంచి పరిణామం ఏమిటంటే, కొత్తగా చాలా మంది రంగం మీదకు రావడమే కాకుండా వస్తు విస్తృతిని పెంచారు….అప్పటి వరకూ కవితా వస్తువులు కానివి వీరి వ్యక్తీకరణలో కవిత్వం లో భాగమయ్యాయి….వీళ్ళలో చాలా మంది వయసు ముప్పై ఏళ్ళ లోపే…80 లలో మొదలు పెట్టి వాళ్ళు తమ సృజనను తరువాత రెండు దశాబ్దాలపాటు కొనసాగించారు…కొందరు యిప్పటికీ బలమైన కవిత్వం రాస్తున్నారు…దళితుల, స్త్రీల, ముస్లింల జీవన నేపథ్యాన్నీ, వేదననూ, చూపునూ వాళ్ళు రచించి సాహిత్య వస్తు ప్రపంచాన్ని విస్తారం చేసారు…ఐతే ఎంతో బలంగా వీచిన దళితుల, స్త్రీల, ముస్లింల కవిత్వం ఒక దశకు వొచ్చేసరికి మందగించింది….కొనసాగింపుకు జరగాల్సినంత కృషి జరగలేదు….ఏదైనా వాదం ఉధృతంగా ఎగిసిపడినపుడు దాని తాలూకు సాహిత్యాన్ని అదే కాలంలో లక్ష్య దృక్పథంతో విశ్లేషించి, దానిలోని గుణ దోషాలని సూటిగా చెప్పగలిగే విమర్శ అవసరం. అలాంటి విమర్శ కాకుండా ఉదారంగా కితాబులిచ్చే సంప్రదాయం మంచిది కాదు….పైగా చెడుపు కూడా!…మంచి విమర్శ సకాలంలో సృజనకు సమాంతరంగా ఎదగకపోవడం ఒక పరిమితే….ఆ పరిమితి వల్ల పలు వాదాల సాహిత్యానికి మేలు జరగలేదన్నది నా అభిప్రాయం.

(5) ‘ఇష్ట వాక్యం’ పేర మీ సాహిత్య విమర్శ వ్యాసాలని కూడా తీసుకు వొచ్చారు …. ఇప్పుడు ఏది రాస్తే ఎక్కువ ఆనందం కలుగుతోంది?…కవిత్వమా…విమర్శా?

నా మొదటి ప్రేమ కవిత్వమే….కవిత్వాన్ని ఏక కాలంలో చదివానూ…రాసానూ! చదివే వేళలో నైనా, రాసే వేళలో నైనా శబ్దాన్నీ, అర్థాన్నీ నిశితంగా పరిశీలించడం అలవాటయింది…ఆ అలవాటు వల్లే విమర్శ రాసాను…అలా రాస్తూ ఎంతో తృప్తినీ పొందాను…వచనం రాస్తున్నా శబ్దం మీద ధ్యాస పెడతాను….మంచి వాక్యాన్ని సాధించేదాకా పదే పదే రాస్తాను…తెలుగు సాహిత్యంలో ఎన్నో గొప్ప రచనలు వొచ్చినా, వాటిలోని గొప్పదనాన్ని విశ్లేషించి విప్పి చెప్పిన సంయమన విమర్శ తక్కువే. రక రకాల విమర్శ మార్గాలున్నా నాకు ‘అభిరుచి విమర్శ’ అంటే యిష్టం! ఆ దృక్కోణం నుండే విమర్శ రాసాను. మనకు నచ్చిన రచన లోని లోతునీ, సౌందర్యాన్నీ, తలుకునీ చెప్పడంలో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని నేను పొందుతాను, విమర్శ రాసినపుడు కూడా!…ఇక ఎక్కువ ఆనందం అంటారా….కవిత్వం రాసినప్పుడే! … ఎందుకంటే, ముందే చెప్పినట్టు, కవిత్వమే నా మొదటి ప్రేమ!

(6) కవిత్వం అంటే కొంత కప్పినట్టు వుండాలని ఒక అభిప్రాయం వుంది. ఇన్నేళ్ళ మీ కవిత్వాన్ని చదివినపుడు, ఎంత క్లిష్టమైన వస్తువునైనా సరళంగా చెప్పడం కనిపిస్తుంది ?

కవిత్వాన్ని సరళంగా రాయడం నాకిష్టం!….అయితే గాడత లేని సరళత నాకు రుచించదు … ఎందుకు రాస్తాం?… నలుగురికి మన భావనల్ని వ్యక్తపరచడానికే కదా!…సరళంగా రాస్తే ఎక్కువ మందిని చేరగలం. పల్లెటూరి జీవితం లాంటి సరళతే నా కవిత్వం లోనూ వుంటుంది. అయితే చదునుగా చెబితే దానికి మనన యోగ్యత రాదు. మంచి కవిత్వానికే మనన యోగ్యత వుంటుంది. కవితాత్మకంగా చెప్పాలి … అది సరళంగానూ వుండాలి అనేది నా అభిప్రాయం. అదే నా మార్గం కూడా! కవిత్వ శైలి విషయం లోనే కాదు, జీవన శైలి విషయం లోనూ సరళతే నాకు యిష్టం!

(7) సమాజం సంక్లిష్టంగా వుంది కాబట్టి కవిత్వం సంక్లిష్టంగా వుంటుంది’ అన్న అభిప్రాయం విస్తృతంగా వున్న కాలంలో, ‘సమాజం సంక్లిష్టంగా వున్నపుడు బాధ్యత గల కవి ఆ విషయాన్ని తన కవిత్వం లో సరళతరం చేసి చెప్పాలి’ అని ప్రచారం చేసారు. ఆ సందర్భాన్ని కొంచెం వివరిస్తారా?

80 ల చివర్లో, 90 లలో ‘సంక్లిష్టత’ ఎక్కువగా చర్చల్లోకి వొచ్చింది. కవిత్వం ఎందుకు సంక్లిష్టంగా ఉంటోంది అన్న ప్రశ్నకు ‘జీవితం సంక్లిష్టంగా ఉంటోంది’ అన్నారు కొందరు. జీవితాన్ని ఇక్కడ నగర జీవితానికి సమానార్థకంగా తీసుకున్నారు కొందరు. మన రాష్ట్రానికి సంబంధించి, చాలా మంది కవులు పల్లెటూల్లనుంచో, పట్టనాలనుంచో వొచ్చిన వాళ్ళే కానీ జన్మతః నగర వాసులు కారు. కానీ విచిత్రంగా వీళ్ళు కవిత్వంలో సంక్లిష్టతకు బీజాలు జీవన సంక్లిష్టతలో ఉన్నాయన్నారు. అసలు సంక్లిష్టత అనేది సాపేక్షం. జీవితాన్ని ఆధారతలంగా చేసుకుని కవిత్వం రాస్తున్నపుడు, దాని తాల్లోకు అవగాహన కవికే లేకపోతే, దాని పొరల్ని కవే కనుగొన లేకుంటే, అతనేమి చెప్పగలడు ఇతరులకు? అందుకే జీవితం సంక్లిష్టంగా ఉందనుకుంటే, బాధ్యత గల కవి దాన్ని సరళతరం చేసి చెప్పాలన్నాను. ఏ విషయంలో నయితే కవికే స్పష్టత ఉండదో, అతని కవిత్వం లోనూ స్పష్టత ఉండదని నా అభిప్రాయం. సమాజం పట్ల తమకు బాధ్యత వుందని భావించే కవులను పరిధిలోకి తీసుకుని చెబుతున్నానీ మాటలు. అయితే, తనది పూర్తిగా ఆత్మాశ్రయమని ప్రయోగాలు చేసే కవికి కూడా స్పష్టత అవసరమనీ, సరళ మార్గం అనుసరనీయమనీ చెప్పగలను. ఏ వాదనలు ఎలా వున్నా, ఏ కవినా తనకు వీలైన దారి లోనే వెళ్తాడు.

(రెండవ భాగం వచ్చే వారం)