కవిత్వం

తాత్కాలికం

05-ఏప్రిల్-2013

తాత్కాలిక గమ్యం మనం చేరగానే
మనసు మళ్ళీ కొత్త ప్రయాణపు సన్నాహం చేస్తుంది
బతుకు కుదుపుల కుదేలవుతుంది
పలకరింపులు, పరామర్శలు
అలవాటుగా స్పృశిస్తునే ఉంటాయి

ఎవరిదో గెలుపు వాసనను ఆస్వాదిస్తూ
అమ్మకానికి ఆదాయాన్ని జతజేస్తూ
ఆనవాళ్ళు లేకుండానే ఆదమరచి
భారీ అంచనాలను వేస్తూ సేద తీరుతుంటుంది

సాయం పేరుతో స్వస్థానం వదులుతూ
సామరస్యం కోసమనే మనకు మనమే ఓదార్చుకుంటూ
చివరి అంచుకు జారిపడ్డ సందేహం
సరిగంచు చీరై శరీరాన్ని చుట్టుకుంటోంది

ఎటూ పాలుపోని బాగస్వామి చింతన
ఎరుపు, ఆకుపచ్చ చొక్కాలను చేత పట్టుకుని
ఎదకు ఈ ఆచ్చాదన సరిపోతుందా అని సంశయంతో
జ్ఞాపకాల మాలను తడిమి చూస్తుంటుంది

ఆశతో బంధించబడ్డ ఆమని రాగం
మామిడి పిందె . వేప ఆకు కు మధ్య నిలుచుని
ఉగాది రాకుండానే
ఆవేదనల పచ్చడి తయారు చేస్తుంటుంది

వెనుదిరిగిన బతుకు ప్రయాణం
అంతా ఆఖరే అనుకుని దూరాన్ని పెంచుకుంటూ
సగం తీరిన దు;ఖపు గడియల్ని వేసుకుని
మనల్ని అనుసరించని గడియారానికి
బ్యాటరీ వెయ్యాలా వద్దా అని అలోచిస్తుంటుంది

బంధాలు బద్దకాన్ని వదిలిపోయాక
అమ్మమ్మ సరుగు పెట్టెను తడిమి చూసుకుంటూ
ఎన్నో రాత్రుల కునికి పాట్లను జతకట్టి
తెల్లవారే సరికి ఖాళీ టీ కప్పుల్లో అనుభవాల్ని
మౌనంగా తలకెత్తుకుంటుంది.

జీవితం కదులుతున్న రైలు పెట్టె కాదు
గుండె నిండుగా మోసే బంధాల పూల తొట్టె !
అలాగని తెరవలేము
తెరిచినా ఎక్కువసేపు చూస్తూ ఉండలేము !

కళ్ళ వాకిళ్ళు తెరవగానే
మల్లెల్లాంటి ఆశలు కన్నీళ్లు అడ్డుకుంటుంటే
కొత్త అనుభవాల రెక్కల్ని తుంచేస్తే
భవిష్యత్ ప్రణాలికలు వర్తమానాన్ని మేలుకొలుపుతాయి.