కథ

మైధిలి

ఏప్రిల్ 2013

“ఏంటీ, మీ ఆవిడ కనపడ లేదు ప్రొద్దుటి నించీ? ఓ సారి చూడందే నాకు పొద్దు పోదని చెప్పరాదె”, జంకు ఛాయలు ఏ మాత్రం లేకుండా అడిగేశాడు రాణా. హద్దులు కట్టుకున్న సహనం ఒక్క సారిగా ఆవిరైపోయింది రఘులో. వెనక ఉన్న పటాలాన్ని కూడా పట్టిచ్చుకోకుండా, ఒక్క దూకుతో రాణాతో కలబడ్డాడు. ఎక్కువ సేపు పోరాటానికి ఆస్కారం లేకుండా అందరూ కలసికట్టుగా రఘూ ని చితక్కొట్టేశారు.

శరీరం పైన తగిలిన గాయాలకన్నా, మైధిలి నోట వినాల్సివచ్చే శూలాల లాంటి మాటల పోట్ల వల్ల కలగబోయే బాధను ఉహించుకుంటూ, ఆలోచనలు ఎంత వెనక్కి లాగుతున్నా, ఇంటి వైపు కాళ్ళీడ్చటం మొదలెట్టాడు రఘు.

రఘు, మైధిలి, హైదరాబాద్ వదిలి, గుంటూరు జిల్లాలో ఉన్న చివలూరు అనే కుగ్రామం లోకి వచ్చి కాపురం మొదలెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. మైధిలిది అచ్చెరువొందించే అందం, చక్కని అవయవ సౌష్టవం తో పాటు, ఒకప్పుడు బాగా బ్రతికిన ఠీవి, దర్పం పుణికిపుచ్చుకున్న రూపం. ఇరవై ఎకరాల స్వంత వ్యవసాయం చేస్తున్నా, రఘ నోట్లో నాలికని చూసినవాళ్లు ఉళ్లో అరుదు. పెత్తనం అంతా, మైధిలిదే. శరీరం ఎంత సుకుమారమో, మాట అంత కఠినం. అందరూ రాణాని చూసి భయపడి వాడి కంట పడకుండా తప్పుకు తిరుగుతుంటే, మైధిలి మాత్రం వాడెంత తన ఇష్టాన్ని వెకిలిగా వ్యక్తపరుసస్తున్నా, పట్తించుకోకుండా, ఎదురుగానే మెసలుతూ ఉండేది. పెళ్ళైన పరాయి స్త్రీమోహం వాడి బలహీనత, వాళ్ళని మాటలతోనే తప్ప వేరే రకంగా హింసించక పోవటం వాడి మంచితనం! ఇది పసికట్టేనేమో, మైధిలి అంత నోరున్నా, వాడెన్ని కూతలు కూసినా, చూసీ చూడనట్లుగా పోయేది. అది అలుసుగా తీసుకొనే, వాడు ఈ రోజు రఘుతో మరీ హద్దులు మీరాడు.

లంకంత ఇంటి ముంగిట్లోకి అడుగు పెట్టంగానే, రఘు రాకని, అవతారాన్ని, దూరం నించే పసిగట్టేసింది మైధిలి. మాటల తూట్ల కోసం సిద్ధంగా ఉన్న రఘు, మైధిలి మౌనాన్ని తక్కువ అంచనా వేసుకున్నాడు, తట్టుకోలేకపోయాడు. అడగని ప్రశ్నను అర్ధం చేసుకొని మరీ బదులిస్తున్నట్లుగా “ఆ రాణా మరీ బరితెగించి అసహ్యంగా మాట్లాడాడు… సహించలేక పోయాను” అంటూ గొణిగాడు. మైధిలి మౌనాన్ని కొనసాగిస్తూ రఘు గాయాలని తుడిచి శుభ్రం చేసింది. రఘూకి తెలుసు, తుఫాను రాబోతోందని!

తెల్లని చీర, జడలో మల్లెపూలు, నుదుట ఎర్రని బొట్టు, ఆ కళ్ళే కనక రఘు గమనించకుంటే, ఏవో ఉహల్లో తేలిపోయేవాడేమో. తన బొట్టు కంటే ఎరుపైన కళ్ళతో సూటిగా రఘు వైపు చూస్తూ “రాణా తో మాట్లాడే టైం వచ్చింది. నేను వాడిని కలవటానికి వెళ్తున్నాను” అని చెప్పి “ఈ వేళ లోనా” అని నసుగుతున్న రఘూని పట్టించుకోకుండా బయటకి నడిచింది మైధిలి.

ఆరు బయట నులక మంచాల పైన కొంత మంది, అరుగుపైన పేకాట ఆడుతున్న ఇంకొందరు, నోళ్ళువెళ్ళబెట్టి చూస్తున్నా పట్టించుకోకుండా, మైధిలి ఇంటి లోపలికి ప్రవేశించింది. లుంగీలో మందు కొడుతున్న రాణా, చెక్క స్తంభానికి వేళ్ళాడుతున్న గుడ్డి బల్బు వెలుతురులో, తెల్ల చీరలో మెరిసిపోతున్న మైధిలిని చూసి మాట పడిపోయిన వాడిలాగా, కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. మైధిలి రాణా ఎదురుగ్గా వచ్చి నిలబడి ఒక్క ఉదుటున తన పైట లాగి క్రింద పడేసింది. రాణా కళ్ళల్లో కామం బదులు కలవరమే ఎక్కువగా కనబడింది.

“ఇదేగా నీక్కావసింది? ఇన్నాళ్ళ నీ తపన నా శరీరం కోసమే అయితే, వచ్చి నీకు తోచినట్లు అనుభవించు. కానీ నా నుంచి ఏ స్పందనా ఆశించకు. ఒక కట్టె లాగా వచ్చి నీ పక్కగా పడుకుంటా..” అంటూ బాంబు పేల్చింది మైధిలి.
“పెళ్ళైన దాన్ని…నన్ను దయ చేసి వదిలెయ్” అని ప్రాధేయపడే ఆడవాళ్ళకు అలవాటు పడ్డ రాణా, మైధిలి మొరటు పలుకులతో మతి పోయిన వాడయ్యాడు, కొద్ది క్షణాలు. “నన్ను కోరి నా ఒళ్లో వాలాలంటే నేనేం చెయ్యాలో చెప్పు?” అంటూ, తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో, కనపడుతున్న అందాల మీద నించి కనులు తిప్పకుండానే బదులిచ్చాడు రాణా.

విప్పిన పైటను సరి చేసుకోకుండానే చొరవగా రాణా పక్కనే కూర్చొని, ఖాళీ అయిన గ్లాసును మందు తో నింపి, అది రాణాకు అందించి, “హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో ని బంగాళా నించి చివలూరి కాపురం వరకూ జరిగిన నా ప్రయాణాన్ని నువ్వు తెలుసుకోవాలి . ఆ తరువాత ఏమి చెయ్యాలో, నీకే తెలుస్తుంది” అంటూ గతాన్ని తవ్వటం మొదలెట్టింది మైధిలి.

***

నా మామగారు దాసు, హైదరాబాద్ లో ఒక పేరు మోసిన బిజినెస్ మ్యాన్. సక్రమమా కాదా అని ఆలోచించకుండా ఎన్నో వ్యాపారాలు చేసి కోట్లు గడించాడు. నా అత్తగారు మంజరి, మావయ్య కంటే పదేళ్ళు చిన్నది, అయినా, కూతురు అంటే నమ్మేటంతగా ఉంటుంది. వారిద్దరి ముద్దుల కొడుకు, భరత్. దాసు మొదటి భార్య నించి కలిగిన సంతానం, రఘు. రఘు అయిదేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయాడు.

సవతి తల్లి అయిన మంజరి నించి, తల్లి ప్రేమని పొందకపోగా, రఘు, భరత్ పుట్టిన తరువాత తండ్రికి కుడా దూరమై, ఒక ఒంటరి బాల్యాన్నే గడిపాడు. భరత్ స్వహతాగా చాలా తెలివైనవాడు. కాలేజికెళ్ళే వయసు నించే తండ్రికి బిజినెస్ లో సలహా సయాయలు అందిస్తూ ఉండేవాడు. రఘు మాత్రం పెద్దవాడైనా, ఎప్పుడూ, తండ్రి ఆజ్ఞల కోసం, ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. మా నాన్న, దాసుగారు, బాల్య స్నేహితులు. చిన్నప్పడి నించి నేను వాళ్ళింట్లోనే తిరుగాడుతూ వాళ్ళ కుటుంబంతో కలసిపోవటంతో, ఎప్పటికైనా ఆ ఇంటి కోడలినవుతానని, అందరూ అనుకుంటూ ఉండేవారు.

భరత్, నేను, ఇంచుమించు ఒకటే వయసువాళ్ళవ్వటం చేత బాగా చనువుగా మెలిగేవాళ్ళం. ఆ చిన్ననాటి స్నేహం, పరిచయం, ప్రేమగా ఎదిగింది. యమ్.బి.ఎ చదువుకని రెండు సంవత్సరాలు ఇంటికి దూరంగా వెళ్ళిన భరత్, చదువు పూర్తి అయిన తరువాత, డిగ్రీ తో పాటు, మాధురి అనే అందమైన గర్ల్ ఫ్రెండ్ తో తిరిగొచ్చాడు. మాధురి తండ్రి కుడా సిటీ లో పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వటం వల్ల, వాళ్ళ ఇంటి అల్లుడినైతే తమ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ఒక ఎత్తు వేశాడు భరత్.

నేను తనను నిలదీసినా, ప్రాధేయపడినా, చలించని భరత్, జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలన్న సూక్తిని, నాకే తిరుగు బోధ చేసాడు. దాసుగారి మాట జవదాటని రఘు మాత్రం, ముందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించటంతో, మా పెళ్లి , భరత్-మాధురీ ల పెళ్ళి, ఒకే సారి జరిగాయి.

ఒకే ఇంట్లో మొదలైన ఈ రెండు కాపురాలు, రెండు వేర్వేరు బాటలలో నడిచాయి. భరత్ తన తెలివితోనూ, కొత్తగా లభ్యమైన బలిమి తోను, బిజినెస్ లో ఇంకా పై పైకి వెళ్ళాడు. దాని వల్ల, ఇంట్లోను అతని గౌరవం మరింత పెరిగిపోయి, నోరు లేని రఘు పరిస్థితి, ఇంకా దిగజారిపోయింది. ఆత్మాభిమానం కొద్దిగా ఎక్కువ పాళ్ళలోనే ఉన్న నాకు మాత్రం, ఆ కాపురం నరకకూపం లాగా అనిపించటం మొదలయ్యింది.

దాసుగారు, బిజినెస్ నించి స్వయంగా రిటైర్ అవుతూ, అత్తగారి ప్రోద్బలంతో, పెద్ద వాడైన రఘూని పక్కకు త్రోసి, భరత్ కే తన బాధ్యతలన్నీ అప్పజెప్పాడు, ఆస్థి పంపకం మాట మాత్రం ఎత్త లేదు. భరత్, రఘు తో సంప్రదించకుండా పెద్ద పెద్ద పెట్టుబడుల, నిర్ణయాలు తీసుకొన్నాడు. ఒక ఏడాది పెద్ద ఎత్తున నష్టం వచ్చినప్పుడు, నా పోరు పడలేక, రఘు, భరత్ ని నిలదీశాడు. అప్పుడు భరత్ అందరి ముందరా రఘుకి చేసిన అవమానాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోయాను. వదిన అన్న మర్యాద లేకుండా , పెళ్ళికి ముందర ఉన్న మా ఇద్దరి మధ్యన ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకొని, భరత్ నాతో వ్యవహరిస్తున్న తీరు కుడా సహించటానికి కష్టం అవుతూ వచ్చింది.

చివరికి ఆ ఇంట్లో ఇమడలేక, మా పల్లెటూరు లో ఉన్న పొలాలని చూసుకుంటామని, ఎవ్వరు చెప్పినా వినకుండా, నేను రఘుతో వచ్చి, అరణ్య వాసం లాంటి ఈ చివలూరు కాపురం మొదలెట్టాను, అంటూ తన కధ ముగించింది, మైధిలి.

***

రాణా, అంతటి అందం కళ్ళ ముందు ఊరిస్తున్నా, సమయం వృధా అయిపోతోందన్న చింతతో కావచ్చు, ఒక చిన్న నిట్టుర్పు విడిచాడు. “నీ కధ వింటుంటే జాలేస్తోంది. నిన్ను చూస్తుంటే ఆవేశం వస్తోంది. ఇప్పుడు నిన్ను పొందాలంటే నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు” అంటూ ధైర్యంగా అడిగేశాడు, రాణా. “నీ ఈ తెగింపే, నీలో నాకు నచ్చిన లక్షణం. కానీ నీక్కావలసింది నీకు దొరకాలంటే మటుకు, నాకు మళ్ళీ జూబిలీ హిల్స్ బంగాళా లోకి వెళ్ళటానికి సహాయం చెయ్యాలి”, అంటూ ఒక సారి వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంది మైధిలి.

“ఏం చెయ్యటానికైనా నేను సిద్ధం…”, మత్తులో తూగిపోతూ అన్నాడు, రాణా. రాణా, మైధిలి, మరి కొంత సేపు, ఆ గదిలోనే గడిపారు. తను వచ్చిన పని సాధించుకున్న మైధిలి, చెదిరిన పైటను సరి చేసుకొని, రాణా ఇంటి నించి బయట పడింది. రాణా అనుచరులు అప్పటికే చాలా అసహనంగా బయటే కాపు కాస్తూ చూస్తుండగా, చెదిరిన బొట్టు, రాలిన మల్లె చెండు, చెరిగిన జుట్టు తో బయట పడిన మైధిలి మాత్రం, వారిని పట్టించుకోకుండా తన ఇంటి వైపుకు సాగింది. అనుచరులు మాత్రం, తమ లీడర్ జైత్రయాత్ర ను, చప్పట్లతో, ఈలలతో, ఒక చిన్న పండగ లాగా జరుపుకున్నారు.

***

రాణా తన గ్యాంగ్ తో పాటు హైదరాబాద్ చేరుకున్నాడు. భరత్ ని ఎదుర్కోవాలంటే చిన్న విషయం కాదన్నది రాణాకి అర్ధం అయ్యింది. చుట్టూ ఎప్పుడూ, సెక్యురిటీ, మందీ మార్బలం తో తిరిగే భరత్ ను ఒంటరిగా ఎలా పట్టుకోవాలో తెలుసుకోవటానికి, రాణా చాల రోజులు వాళ్ళ కుటుంబ రాక పోకలు, దైనిక చర్యల మీద నిఘా పెట్టాడు. ప్రతి శుక్రవారం సాయంత్రం, మాధురి అనాధ పిల్లల హాస్టల్ కి వెళ్లి, వాళ్ళతో, సమయం గడపటం గమనించాడు.

ఓ శుక్రవారం సాయంత్రం, అదను చూసుకొని, అనాధ శరణాలయంలో ప్రవేశించి, మాధురి ని కిడ్నాప్ చేసాడు. భరత్ ని ఒంటరిగా బయటకు రప్పించాలంటే, అంత కంటే సులువైన మార్గం కనిపించలేదు, రాణా కి. కిడ్నాప్ విషయం తెలియంగానే, అడిగిన డబ్బు సర్దుకొని, రాణా రమ్మన్న ఊరి బయట ఫ్యాక్టరీ గోడౌన్ కి, ఒంటరిగా వచ్చాడు భరత్. చెప్పిన చోట, డబ్బు వదిలేసి తిరిగి వెళ్ళ పోతున్న భరత్ పై అకస్మాత్ దాడి చేశాడు రాణా. తన డబ్బు తో బాటు తన ప్రాణానికే ఎసరు పెడుతునాడన్న విషయం గ్రహించిన భరత్, రాణా తో తెగించి పోరాడాడు. ఇద్దరూ, ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకొని కదలలేని పరిస్థితుల్లో, అలసి పోయి కూర్చొండి పోయారు. భరత్ కి అప్పటికే చాలా రక్తం పోయుండటం వల్ల, మరీ ప్రమాదకర స్థితిలో పడిపోయాడు.

లేని ఓపికను తెచ్చిపెట్టుకొని, రాణా ని ప్రశ్నించాడు భరత్, తనను ఎందుకు చంపుతున్నాడో చెప్పమని. రాణా చెప్పిన కధ విని, భరత్, మోసపోయావని రాణాని హెచ్చరించాడు. మైధిలి, తన అర్ధ సత్యాలు, పూర్తి అబద్ధాల తో అల్లిన కధను నమ్మి, తన పై అకారణంగా దాడి జరిపావని, బాధ పడ్డాడు భరత్. తను పోయే ముందు, రాణా కి నిజం తెలియాలి అని తన కధను చెప్పటం ప్రారంభించాడు, భరత్.

***

“తల్లి లేదన్న కారణంగా రఘుని, చిన్నప్పటినించీ బాగా ముద్దు చేసేవారు, మా అమ్మా నాన్నలు. రఘు చిన్నప్పటినించీ చదువులో, చురుకుతనంలో వెనకబడి ఉండేవాడు. అయినా సరే మా నాన్న, పెద్ద కొడుకు మీద ప్రేమతో ఎవ్వరినీ ఏమీ అననిచ్చేవాడు కాదు, రఘు గురించి. మైధిలి, నేను, ప్రేమించుకున్న మాట కూడా వాస్తవమే.

నేను, యమ్.బి.ఎ పూర్తి చేసి తిరిగివచ్చే సమయానికి, మా నాన్నకి ఒంట్లో బాగాలేక బిజినెస్ ల నించి రిటైర్ అవుదామని నిర్ణయించుకున్నారు. నా కన్నా తక్కువ తెలివితేటలు, చదువు, అర్హతలు ఉన్న రఘుకే బిజినెస్ భారం అంతా అప్పగించాలని మా నాన్న ఏకపక్ష నిర్ణయం తీసుకొన్నారు. మా అమ్మ మంజరి ఎంత చెప్పినా నాన్న పట్టించుకోలేదు. అందరం కలిసే ఉంటాం కనక, ఇదేమీ పెద్ద విషయం కాదని, దాని గురించి గొడవ చెయ్యొద్దని చెప్పి, నేనే అమ్మని ఊరడించాను. నా మంచితనం వల్ల నేను ఏమి కోల్పోబోతున్నానో ఆ క్షణంలో గనక నేను ఊహించగలిగుంటే, బహుశా నా హక్కు కోసం నేను పోరాడి ఉండేవాడిని.

ఎప్పుడైతే మైధిలి నాన్నగారికి ఈ విషయం తెలిసిందో, మా నాన్న వద్దకు వెళ్లి, తన కూతురుని రఘుకి ఇచ్చి పెళ్లి చెయ్యమని అడిగాడు. మా నాన్న, పిల్లలిద్దరికీ ఇష్టమైతే అలాగే కానిద్దాం అని మాట ఇచ్చేసారు. ఈ విషయం తెలియంగానే నేను, మైధిలి దగ్గరకు పరిగెత్తాను, పెద్దలు మాకు చేస్తున్న అన్యాయం గురించి హెచ్చరిద్దామని. మైధిలి అప్పుడు ప్రవర్తించిన తీరు చూసి నాకు నిజంగానే మతి పోయింది.

“ఎప్పుడూ నా మంచి కోసమే తపించి పోయే, మా నాన్న మాట కాదనలేను”, అనేసింది మైధిలి. మనిద్దరమూ కనక వెళ్లి మన ప్రేమ గురించి చెప్తే, పెద్ద వాళ్ళు తప్పడుండా ఒప్పుకుంటారని నేను నచ్చజెప్పబోతే, దాని కంటే తన ప్రేమను త్యాగం చెయ్యటమే తనకు ఇష్టం అని చాలా సులువుగా చెప్పేసింది. అప్పుడు అర్ధం అయ్యింది, నాకు, తండ్రీ కూతుళ్ళ పన్నాగమేంటో! అయినా కూడా మైధిలిని ద్వేషించలేకపోయాను.

ఆ పరిస్థితిలో మానసికంగా కృంగిపోయున్న నన్ను, మళ్ళీ మామూలు మనిషిని చేసింది, మాధురితో స్నేహమే. మైధిలిని మర్చిపోవాలన్న తొందరలోనే, మా అన్న పెళ్లి రోజునే నేను కుడా మాధురిని పెళ్ళాడేశాను. కానీ, నా కాళ్ళ ముందే ఏమీ ఎరగనట్లుగా రఘుతో కాపురం చేస్తున్న మధిలిని చూసినప్పుడల్లా మా పాత రోజులు గుర్తొచ్చి కొంచెం ఇబ్బంది పెట్టేవి. అది గమనించే, మాధురి, మా అమ్మా నాన్నలను ఒప్పించి వేరే ఇంట్లో కాపురం పెట్టించింది. జూబిలీ హిల్స్ లోని బంగాళాకీ, మా నాన్న బిజినెస్ కీ, దూరంగా వెళ్లి, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాము.

ఒక రెండేళ్ళ లోనే రఘు అసమర్ధత వల్ల, బిజినెస్ నష్టాల పాలై, బంగళా కుడా వేలం వేసే స్థితి వచ్చింది. మా మామగారి పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించిన నేను, బంగాళా వేలం అవ్వకుండా, కట్టాల్సిన అప్పులు తీర్చాను. మైధిలి నాకు చేసిన ద్రోహం పూర్తిగా క్షమించలేక, తనను శిక్షించటానికా అన్నట్లుగా, ఆ బంగాళా ని, నా తల్లి పేరున వ్రాయించుకున్నాను. రఘుకి నా ఆఫీసు లోనే చిన్న ఉద్యోగం ఇచ్చాను. ఒకింత అహంతోనే ప్రవర్తించుంటానేమో, మైధిలి సహించ లేక పోయింది. మేమంత చెప్పినా వినకుండా, రఘుతో కలసి తన ఊరు వెళ్ళిపోయింది.”

భరత్ అతి కష్టం మీద ఊపిరి పీలుస్తూ తన కధ ముగించాడు. రాణా కొంత అనుమానంతోను, మరి కొంత ఆశ్చర్యం తోను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆర్పని కళ్ళతో తననే చూస్తున్న భరత్, ఈ లోకం వదలి వెళ్లిపోయాడని రాణా గ్రహించేలోగా, పోలీసులు చుట్టుముట్టారు.

***

ఒక ఆరు నెలలు గడచి పోయాయి. ఇల్లు, బిజినెస్ బాధ్యతలను ఈ సారి, మైధిలే తన భుజాల మీద కెత్తుకుంది. రఘు తన వంతుగా భార్యకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తూ, మంజరి ని, మాధురి ని కుడా చక్కగా ఆదరిస్తూ, తన బాధ్యతలను తనకు వచ్చిన విధంగా మోస్తున్నాడు. కానీ, పడక గదిలో మాత్రం ఇంతకు మునుపున్న ఉత్సాహం చూపించలేకపోతున్నాడు. ఎంతో సహనంతో ఎదురు చూసిన మైధిలి, ఒక రోజు కారణమేమిటో తెలుసుకుందామని రఘుని, సున్నితంగానే అడిగింది.

“మన ఊళ్ళో, అందరూ నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఆ రోజు రాణా తో నువ్వు గడిపిన సాయంత్రం గురించి. నిన్ను చూసినప్పుడల్లా వాళ్ళ మాటలే నన్ను పొడుస్తున్నాయి”, తటపటాయిస్తూనే, అసలు విషయం బయటపెట్టాడు, రఘు.

“వాళ్ళ విషయం వదిలెయ్యి..నువ్వే మనుకుంటున్నావు?”, అడిగింది మైధిలి. “నా అనుమానం సంగతి పక్కన పెడితే.. వాళ్ళ గుసగుసలే నన్ను బాధిస్తున్నాయి”, అంటూ నాన్చాడు, రఘు.

సహనం కోల్పోయిన మైధిలి, ఇక ఆవేశాన్ని ఆపుకోలేక పోయింది. “నీ అసమర్ధత వల్లే, నా కష్టాలన్నీ. మీ నాన్నని, భరత్ ని ఎదిరించి నిలబడ గల సత్తా యే నీ లో ఉండుంటే, ఈ రోజు, ఇలాంటి పరిస్థితి, ప్రశ్న, వచ్చేది కాదు. నేను ఇంత కష్టపడి, పోయిన మన జీవితాన్ని సంపాదిస్తే, ఇదా, నువ్వు నాకిచ్చే బహుమానం? ఏవో గుసగుసలు విని నా శీలాన్నే శంకిస్తే, ఆ పరీక్ష తీసుకోవటానికి, నువ్వేమైనా పురుషోత్తముడైన, త్రేతాయుగపు రాముడనుకున్నావా? నేను ఆ రాత్రి రాణా తో ఏమి చేశానో, నీకిక ఎప్పటికీ చెప్పను. నీ జీవితాంతం, నువ్విలాగే జవాబు దొరకని ప్రశ్నతో సతమతం అవ్వాలి. అదే ఈ కలియుగ మైధిలి నీకు వేసే శిక్ష!” అని, నోరెళ్ళ బెట్టుకు చూస్తున్న రఘు ప్రక్క నించి లేచి, బట్టలు వేసుకొని, బయటకు నడిచింది.

***

ఉరి శిక్ష కోసం ఎదురు చూస్తున్న రాణాని ఆఖరి సారిగా కలవటానికి వెళ్ళింది మైధిలి.

“ఎన్నో అబద్ధాలు చెప్పి, నన్ను నీ ఇష్టం వచ్చినట్లు ఆడించుకొని, నీ పని కానిచ్చుకున్నావు. దారుణమైన విషయం ఏమిటంటే, దేని కోసమైతే వెంపర్లాడి, ఇంత పని చేశానో, అది కుడా చివరకి నాకు దొరక లేదు ” అంటూ, ఒకింత నిరాశక్తత తో, తన బాధను వెళ్ళగక్కాడు, రాణా.

“రాణా..నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. కానీ, ఒక్క విషయం చెప్తా విను. ఈ క్షణమే గనక రఘు, నువ్వు, నా ముందు ఉండి ఉంటే, నేను నిన్నే ఎంచుకుని ఉండేదాన్ని. మనమున్నది ఏ యుగమైనా, కొన్ని ధర్మాలు మాత్రం, ఎప్పటికీ మారవు. ఒక పెళ్ళైన పరాయి స్త్రీని కామిస్తే జరిగే మారణహోమం, ఆ నాటి రావణుడి కీ, ఇప్పటి నీకూ, తప్పలేదు. నీకున్న మిగిలిన క్రొద్ది సమయంలో, అసత్యమైనా, నిన్ను ఆనందింపజేసే ఒక విషయం చెబుతాను, విను. మన ఉళ్లో అందరూ, ఆ రాత్రి మనిద్దరం సుఖంగా గడిపామని నమ్ముతున్నారు. ఆ అల్ప సంతోషమే నేను నీకివ్వగలిగిన ఆఖరి కానుక…” అంటూ వెనుదిరిగిన మధిలి, మళ్ళీ రాణా వైపుకు తిరిగి “చివరిగా… సీ యూ ఇన్ హెల్!” అని చెప్పింది.

– * –