కవిత్వం

ఆ పసి కేరింతలో

05-ఏప్రిల్-2013

సర్లేపొన్లేమ్మని అనుకునే క్షణమే వుందనుకో
ఆ క్షణంలోకి నువ్వు
ఎన్ని సార్లు మునకలు
వెయ్యగలవో తెలిసే వుందనుకో

ప్రతి మునకలో నువ్వు
మొదటి స్నానం చేసే పసికందువై ఇప్పుడే వచ్చావనుకో

***

ఆ క్షణాల తెలియని మూగతనమే కావాలి నాకు
అసలెవ్వరూ ఎవ్వరూ తెలీకుండా పోవాలి నాకు

ఇప్పుడే ఇక్కడే మళ్ళీ పుట్టాలి నీ పొత్తిళ్ళల్లో
నిన్నే ఒక్క నిన్నే నిన్ను హత్తుకు తిరగాలి
ఒక్క నీ చేతుల్లో ఒక్క నీ చూపుల్లో.

మూగనైపోతున్నా
మాటలన్నీ వదిలేసుకుంటున్నా

కొత్త మాటల లిపి కోసం
నీలోపలికి పరిగెత్తుకు వస్తున్నా.

ఈ కాళ్ళూ ఈ చేతుల ఆరాటాలన్నీ
ఒక్కొక్కటే
వదులొదులు అవుతున్నాయ్

ఈ కళ్ల కోరికల చూపులన్నీ
పక్షుల గుంపులై ఎగిరెగిరిపోతున్నాయ్

నీ ఆకాశంలోకి నన్ను పొదువుకొని వెళ్ళు

***

మొదటి స్నానానికి నేను కేరింతనై వస్తున్నా
నీ చేతుల సముద్రాల కింద నన్ను తడిపేయ్.