నీరెండ మెరుపు

ఈ గోదావరి పద్యం నాదే, నాదే!

26-ఏప్రిల్-2013

నది మీద పద్యం ఎవరికిష్టం వుండదనీ!

ప్రతి కవి ఎప్పుడో ఏదో ఒక నది చుట్టూ అందంగా అక్షరాల చేతులు వేసి ఏదో ఒకటి రాసే వుంటారు కదా! నది తీరాన్ని ప్రేయసి లేదా ప్రియుడి  చెంపల కన్నా అందంగా ముద్దాడే వుంటారు కదా! ఇస్మాయిల్ గారు గోదావరి మీద రాసిన ఈ పద్యాన్ని నేను ఎన్ని సార్లు ఇష్టంగా చదువుకున్నానో గుర్తే లేదు. ఆయనకెంతో ఇష్టమయిన ఈ గోదారిని నిజంగా నేను ఒక్క సారే చూశాను.  ఆ ఒక్క సారీ  పనిమాలా ఈ గోదావరి పద్యం తీసుకు వెళ్ళి ఒక స్నేహితురాలికి పైకే వినిపిస్తే కవిత్వమేమిటో తెలియని ఆ స్నేహితురాలు ఎంత ముచ్చటపడిందో చెప్పలేను.

ఇంతా చేస్తే, నేను గోదావరి ప్రేమికుడిని కాదు.

నేను పుట్టింది కృష్ణ ఒడ్డున – పెరిగిందీ చదువుకుందీ ఆ కృష్ణ ఒడ్డున్నే! మా బడి పక్కనించే కృష్ణ ప్రవహించేది. బడి నించి వస్తూ కృష్ణా నది పక్కన కూర్చొని, ఆ ఆకాశాన్నీ, రెండు వేపులా ఆకుపచ్చని చేలనీ, చూస్తూ చూస్తూ గడిపిన బాల్యం. కానీ, ఇస్మాయిల్ గారి గోదావరిని చదవగానే ఇంకో ఏ ఆధునిక కవీ నాకు మహా ఇష్టమయిన కృష్ణా నది గురించి రాయలేదు కదా అని ప్రతి సారీ బాధపడుతూనే వుంటా. కానీ, నేను చేసిన చిలిపి పని ఏమిటంటే, ఈ పద్యం చదివిన ప్రతి సారీ గోదావరి అన్న చోటల్లా మా కృష్ణమ్మ పేరు పెట్టేశా. అలాంటప్పుడు ఇక ఈ గోదావరి పద్యం నాదే – ముమ్మాటికీ నాదే- కదా!

 

కొన్ని సాయంత్రాలు ఏదో ఒక కవిత్వ పుస్తకం పట్టుకొని ప్రకాశం బ్యారేజీ దగ్గిర కృష్ణమ్మ పక్కన కూర్చొని చదువుకునేప్పుడు ఆ నీటి గలగలల్లో ఎన్ని కొత్త వ్యాఖ్యానాలు విన్నానో నాకూ కృష్ణమ్మకే తెలుసు. ఆ బ్యరేజ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తూ చేతిలో కవిత్వ పుస్తకం వున్నప్పుడు నాకు నేను ప్రత్యేకంగా కనిపిస్తూ, నా లోపల ఏదో ఒక కవిత వినిపిస్తూ ..వెళ్ళే సమయాల్లో ఇస్మాయిల్ గారి ఈ కవిత రెండు మూడు సార్లు చదువుకున్నాను.

పంట కాలవల్ని దాటి,
కెరటాలుగా తాకే
తరుచ్ఛాయల వాత్సల్యాన్ని దాటి,
చెయివేసి మెడచుట్టూ
చెవిలో గుసగుసలాడే
చిరుగాలుల నేస్తాన్ని దాటి,

అని ఇస్మాయిల్ గారు గోదావరి గురించి మాత్రమే చెప్పుకున్నారా? కాదు. ..కాదు.                       .

ఈ కవితలో నాకు గోదావరి కంటే ఎక్కువ ఒక అందమయిన స్నేహం, అది జీవితాన్ని నడిపించే సూత్రంగా ఎట్లా మారుతుందో చెప్పినట్టు అనిపించింది.

అవును, నది లేని నేల, స్నేహం లేని మనిషి…అంత కంటే విషాదం ఇంకేమీ వుండదు కదా!

ఈ కవిత చదివిన తరవాత మీకూ అలాగే అనిపిస్తుందా? ఒక సారి ఆలోచించండి, అంత కంటే ముందు అనుభవించండి ఈ కవితని.

————————————————————————————————-

గోదావరి దాటాం

ఆకాశప్పాఠాలని
ఆగి ఆగి
వప్పగించే
వరిమళ్ళని దాటి,
ఎక్కాల పట్టీల్లా
ఎడతెగని
బాతుల
బారుల్ని దాటి,
కొమ్ముల
కుండలీకరణాలతో
లెక్కచెయ్యకండా నిలబడ్డ

లెక్కల్లాంటి గేదెల్ని దాటి
ఊళ్ళమ్మట వేదుతో
ఇళ్ళరుగుల పెదిమలపై
పలకరించే చిరునవ్వుల్లా
కలకలలాడే జనాన్ని దాటి,
చరిత్ర గమనంలా
విచిత్ర దృశ్యాల్ని మార్చి చూపించే
కలైడస్కోపు మలుపుల్లాంటి
మలుపుల్ని దాటి,
గొణుక్కుంటో గలగలమని
వణుక్కుంటో ముసలినౌకరులా
వెంటవచ్చే

పంట కాలవల్ని దాటి,
కెరటాలుగా తాకే
తరుచ్ఛాయల వాత్సల్యాన్ని దాటి,
చెయివేసి మెడచుట్టూ
చెవిలో గుసగుసలాడే
చిరుగాలుల నేస్తాన్ని దాటి,
చివరికి
చేరుకొన్నాం కోటిపల్లి.

 

రంగురంగుల చిట్టి బాల్యదృశ్యాలపై
చెంగుచెంగున గెంతే మా పిచికిమనసు
ఆచ్ఛాదన లేని
ఆకాశాన్నీ
సీమలూడ్చిన
భూమినీ చూసి
రెక్కలు చాచలేక
బిక్కు బిక్కుమంది.

 

ఇసకతిన్నెల
పసిడికండువా
పల్లెవాటు వేసుకొని మేనువాల్చి
పెళ్ళికొడుకులా నిరీక్షిస్తున్న నదిని చూసి
విస్తుపోయి, శోభనం గదిముందు
పెళ్ళికూతురులా
బిడియంగా భయంగా
అడుగువేసి ఆగాము.
అరచెయ్యిలాంటి దోనెని చాపి
ఆప్యాయంగా చేరదీసి
పగిలిన గాజుపెంకుల్లా
పదునుగా మెరుస్తున్న గుండెల్లో

పడవంత చోటివ్వగా,
ఉడువీధిలో విహరించిన
మా మనోవిహంగం
పక్షాల్నిడుల్చేసి
నగ్నంగా చేపై
నదీప్రవేశం చేసింది.

—————————————————————————————————————

ఇప్పుడిప్పుడే కవిత్వం చదవడం నేర్చుకుంటున్న నాకు కవిత్వ రహస్యాలు పెద్దగా తెలియవు. కానీ, కవిత్వం చదవడానికి – అది ఎంత తేలికది అయినా- ఎంతో కొంత మానసిక శిక్షణ అవసరమని అనిపిస్తుంది. ఇస్మాయిల్ గారి ఈ కవిత చదవడానికి అంత లోతయిన శిక్షణ అక్కరలేదు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక నదిని చూసిన, ఆ నది చుట్టూ కొన్ని ఊహల్ని అల్లుకున్న అనుభూతి వుంటే చాలు అనిపిస్తుంది. వరిమళ్లు, వూళ్ళమ్మట అరుగులూ, గేదెల పరుగులు …ఇవన్నీ మన అనుభవాలే కదా! కానీ, కవి ఎక్కడున్నాడంటే

రంగురంగుల చిట్టి బాల్యదృశ్యాలపై
చెంగుచెంగున గెంతే మా పిచికిమనసు

ఆ పిచ్చిక మనసు కవికి కావాలి. ఆ పిచ్చిక మనసు వుంటే

పడవంత చోటివ్వగా,
ఉడువీధిలో విహరించిన
మా మనోవిహంగం
పక్షాల్నిడుల్చేసి
నగ్నంగా చేపై
నదీప్రవేశం చేసింది.

ఈ కవిత ఒక మానసిక స్వేచ్చని అందుకోడానికి మనిషి పడే సంఘర్షణని కూడా చెప్పడం లేదూ?