చలువ పందిరి

ఇస్ మోడ్ సే జాతే హై..

మే 2013

इस मोड़ से जाते हैं

విడుదలౌతూనే వివాదాల్లో చిక్కుకున్న సంచలనాత్మక చిత్రం, గుల్జార్ దర్శకత్వం వహించిన “ఆంధీ(1975)”. వివాదాల సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలో గుల్జార్ రాసిన నాలుగు పాటల్లో మూడుపాటలు క్లాసిక్స్ గా సంగీతప్రియులందరిచే ఈనాటికీ పరిగణించబడతాయి. “తేరే బినా జిందగీ సే కోయీ..” నా ఆల్ టైమ్ ఫేవొరేట్. ఎన్ని వందల పాటలు నచ్చినవి ఉన్నా.. నా మనసు ఈ పాట దగ్గరే నిలబడిపోతుంది. ఆ తర్వాత “తుమ్ ఆగయే తో నూర్ ఆగయా హై..” కూడా మరువలేని సాహిత్యమే. అయితే ఈ రెండూ స్ట్రెయిట్ లిరిక్స్. “ఇస్ మోడ్ సే జాతే హై..” అనే మూడో పాట లోతైన అర్థంతో పాటూ, కథ లోని మలుపులను కూడా తనలో ఇముడ్చుకున్న పాట. వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాహిత్యాన్ని, అందమైన పదాలతో రాయటం గుల్జార్ ప్రత్యేకత. స్వరపరిచేప్పుడు ఆర్.డి.బర్మన్ గుల్జార్ ని అడిగారుట.. “ఈ నషేమన్ ఏ ఊరి పేరోయ్..?” అని.

ఈ పాటకో చిన్న నేపథ్యం ఉంది. “Aaj Bichhade Hain” అని ఒక పాత ప్రైవేట్ ఆల్బం ఉంది. గుల్జార్ రచనే. అందులో ఉత్తమ్ సింగ్ స్వరకల్పనలో భూపేందర్ సింగ్ పాడిన ఈ “నజ్మ్” ఎంతో హాయి గొలిపేలా ఉంటుంది. ఇదే నజ్మ్ ని కాస్త సాహిత్యం మార్చి “ఆంధీ” చిత్రానికి వాడుకున్నారు గుల్జార్. ఆ నజ్మ్ ఇక్కడ వినవచ్చు:

http://www.dhingana.com/epilogue-by-gulzar-song-woh-jo-shair-tha-hindi-ghazals-3521bb1

సాహిత్యం:
कुछ सुस्त कदम रास्तॆं.. इस मॊड सॆ जातॆ हैं
कुछ तॆज कदम राहॆं.. इस मॊड सॆ जातॆ हैं

सहरा की तरफ़ जाकर, इक राह बगूलों में खो जाती है चकराकर
इक राह उधडती-सी छिलती हुई काँटों से, जंगल से गुज़रती है
इक दौड़ के जाती है और कूदके गिरती है, अनजानी ख़लाओं में
इस मॊड सॆ जातॆ हैं

उस मॊड पॆ बैठा हूं..
जिस मॊड सॆ जाती है हर एक तरफ राहॆं
एक रॊज तो यू हॊगा इस मॊड पॆ आकर तुम
रुक जाऒगी केहदॊगी वो कौन सा रस्ता हैं
जिस राह पॆ जाना है…जिस राह पॆ जाना है…

ఇప్పుడు “ఆంధీ” చిత్ర కథలోకి వచ్చేస్తే, పరస్పర ప్రేమానురాగాలు ఉన్నా పరిస్థితుల వల్ల విడిపోవాల్సివచ్చిన ఒక ప్రేమజంట కథ ఇది. జె.కె. అనే హోటల్ మేనేజర్, ఆరతి అనే ఓ రాజకీయనాయకుడి కుమార్తె వివాహం చేసుకుంటారు. ఇద్దరి మధ్యన అనురాగమైతే ఉంటుంది కానీ విభిన్నమైన వారి జీవన నేపథ్యాల వల్ల మనస్పర్థలు మొదలై ఇద్దరూ విడిపోతారు. కొన్నేళ్ల తరువాత ఇద్దరూ మళ్ళీ ఎదురుపడతారు. ఇద్దరిలో దగ్గరవ్వాలనే తపన ఉంటుంది కానీ అప్పటికి ఆరతి పేరుపొందిన రాజకీయనాయకురాలు. ఎన్నికల ప్రచార నిమిత్తం తిరుగుతున్న ఆరతి, తనకున్న ప్రాచుర్యం వల్ల పగలు పూట బయట తిరగలేక రాత్రి పూట మాత్రమే జె.కె ను కలవటానికి వస్తుంటూంది. ఆ సమయంలో జె.కె. పాతస్మృతులను నెమరువేసుకునే నేపథ్యంలో ఈ పాట వస్తుంది.

జె.కె., ఆరతి ల బంధం మొదలయిన సమయంలో వచ్చే పాట ఇది. ఇప్పుడే మొదలైన ఈ బంధం మనల్ని ఏ దరికి చేరుస్తుందో ! ఎన్ని మలుపులు తిరిగినా, అవాంతరాలెదురైనా, చివరకు నన్ను నీ చెంతకు చేర్చేదై ఉండాలీ పయనం అనే ఆశ, నమ్మకం పాటలో కనబడతాయి. చిత్రం చివరలో ఆరతి రాజకీయజీవితానికి ఆటంకం కలగకూడదదని ఇద్దరూ విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ పాట వినిపిస్తుంది. సంజీవ్ కుమార్ కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అందించిన పాత్ర ఇది. ఈ పాటలో అందంగా కనబడే సుచిత్రా సేన్ వయసు అప్పటికి నలభైనాలుగేళ్ళు అంటే నమ్మశక్యం కాదు.

ఆర్.డి.బర్మన్ అందించిన స్వరాలకు, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ ఇద్దరూ తమ తమ గళాలతో సంపూర్ణమైన న్యాయాన్ని చేకూర్చారు. మరి, పాట వాక్యార్థం లోకి తొంగి చూద్దామా..

इस मोड़ से जाते हैं,
कुछ सुस्त कदम रस्तें
कुछ तेज कदम राहें

ఈ మలుపు నుండే మరలుతాయి
కొన్ని నిదానంగా నడిచే దారులు
కొన్ని వడిగా నడిచే తోవలు

భావం: ఇక్కడి నుండి మొదలౌతుంది మన జీవనపయనం. ఇక్కడ మొదలుపెట్టి మనం ఎక్కడికి చేరతాము అనేది మనం నడిచే దారిని బట్టి ఉంటుంది.

पत्थर की हवेली को,
शीशॊं के घरोंदों में
तिनकों के नशेमन तक
इस मोड़ से जाते हैं…

రాతిభవనాల వైపో
అద్దాల బొమ్మరిల్లు వద్దకో
గువ్వగూటి వరకో
ఈ మలుపు నుంచే మరలుతాయి..

భావం: ఆ మలుపులో మొదలైన జె.కె., ఆరతి ల బంధం ఎలా రూపాంతరం చెందనుందో.. అని ఈ వాక్యాలు సూచిస్తాయి.
“రాతిభవనాల వైపు” అంటే రాయంత బలమైనదిగా మారనుందా?
“అద్దాల బొమ్మరిల్లు వద్దకు” అంటే అద్దమంత నాజూకైనదిగా మారుతుందా?
“గువ్వ గూటి వరకూ” అంటే గాలివాటుకి కూలిపోయే పుల్లలతో కట్టిన గూటి లాగా చిన్నపాటి ఇబ్బందులకే వీగిపోయేంత అల్పంగా ఉంటుందా? అని.
ఈ మూడింటిలో మన బంధం యొక్క గట్టిదనం ఈ మలుపులోంచి మనం వెళ్లటానికి ఎంచుకునే దారులను బట్టి ఉంటుంది అని భావం.

చ: आँधी की तरह उड़कर, एक राह गुज़रती है
शरमाती हुई कोई, क़दमों से उतरती है
इन रेशमी राहों में, एक राह तो वो होगी
तुम तक जो पहुँचती है,
इस मोड़ से जाते है..

తూఫానులాఎగసి మళ్ళిపోతుందొక దారి
బిడియపడే అడుగులతో వాలిపోతుందొక దారి
ఈ సుతిమెత్తని దారులలో
నీ దాకా చేర్చే దారొకటేదో ఉండేఉంటుంది
ఈ మలుపు నుంచే మరలుతాయి..

భావం: పరిస్థితులెలా ఉన్నా అతనికి భవిష్యత్తుపై ఆశ ఉందని చెప్తాయి ఈ వాక్యాలు. జీవన పయనంలో ఏదైనా తుఫాను రేగి పరిస్థితులు చేయిదాటిపోయినా, ఏ కారణాలవల్లైనా ప్రయాణం నెమ్మదై పోయినా, నిన్ను మాత్రం వదులుకోను.. ఎలాగోలా నిన్ను చేరే దారొకటి మాత్రం నేను వెతుక్కుంటాను’ అంటాడు అతను.

చ: एक दूर से आती है, पास आके पलटती है
एक राह अकेली सी, रुकती हैं न चलती है
ये सोच के बैठी हूँ, एक राह तो वो होगी
तुम तक जो पहुँचती है
इस मोड़ से जाते हैं..

దగ్గరికంటా వచ్చి మరలిపోయే దారొకటి
ఆగకుండా కదలకుండా ఉండే ఒంటరి దారొకటి
నేను మాత్రం కూర్చునే ఉన్నాను,
నీ దాకా చేర్చే దారొకటేదో ఉండేఉంటుందన్న తలంపుతో
ఈ మలుపు నుంచే దారులు మరలుతాయి..

భావం: ఎప్పుడైనా జీవితం తలకిందులైపోయినా, ఎక్కడికి చేరాలో ఎలా చేరాలో తెలియకపోయినా, నేను కూర్చుని ఆలోచిస్తాను.. నన్ను నీ దాకా చేర్చే దారి ఒకటేదైనా దొరుకుతుందనే ఆశతో వెతుకుతాను.. అంటే ఎన్ని అవాంతరాలెదురైనా నిన్ను వీడనని చెప్తుంది నాయిక.

ఇంతటి లోతైన భావార్ధం ఉన్న చక్కని పాటని క్రింద లింక్ లో చూడవచ్చు: http://www.youtube.com/watch?v=lfNS3mkyHmA

 

ఇక్కడ వినవచ్చు: http://mp3skull.com/mp3/is_mod_se_jaate_hain.html