చలువ పందిరి

जलते हैं जिसके लिए..

జూలై 2013

సామాజిక సమస్యలపై సినిమాలు తీయడంలో నిపుణుడైన “బిమల్ రాయ్” దర్శకత్వంలో వచ్చిన సినిమా “సుజాత(1959)”. అంటరానితనం ప్రబలంగా ఉన్న అప్పటి రోజుల్లో, అది నేరమని చెప్తూ, ఆ జాడ్యాన్ని విమర్శిస్తూ, ‘అంటరానితనం’ ముఖ్య నేపథ్యంగా తీసిన చిత్రమిది. సుబోధ్ ఘోష్ అనే ప్రముఖ బెంగాలి రచయిత రచించిన కథ ఆధారంగా ఈ చిత్రం తయారైంది. సుబోధ్ రాసిన మరెన్నో కథలు హిందీ, బెంగాలీ సినిమాలుగా రూపొందాయి. 1959లో మూడవ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికవటంతో పాటుగా, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లను కూడా ఈ చిత్రం సంపాదించుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడింది.

సుజాత అనే ఒక హరిజన బాలిక బ్రాహ్మల ఇంట పెరుగుతుంది. కానీ సమాజంలో అంటరానిదనే హేళనకూ, అపహాస్యానికీ గురవుతూ వేదన పడుతుంది ఆమె. పెంచిన తల్లి సైతం ఆమెను కుమార్తెగా అంగీకరించలేకపోతుంది. తను వాళ్ళ “కూతురు లాంటిది” అన్న మాట తల్లిదండ్రుల నోట విన్నప్పుడల్లా తల్లడిల్లిపోతూంటుంది సుజాత. పెంచిన తల్లిదండ్రుల బంధువర్గంలోని ఒక బ్రాహ్మణ యువకుడు అధీర్ ఆమెను ఇష్టపడతాడు. ఆమెలోని సహజత్వమే ఆమెకు ఆభరణం అనీ, తనని పెళ్ళిచేసుకొమ్మనీ అడుగుతాడు. ఒక స్త్రీగా సుజాత అధీర్ ప్రేమను అంగీకరిస్తుంది. మనసు అతని సాంగత్యాన్ని కోరినా, తన చెల్లెల్ని అతనికిచ్చి చెయ్యాలని తల్లి ఆరాటపడుతోందని తెలిసాకా, పెంచినవారి కోసం తన ప్రేమను త్యాగం చెయ్యాలనుకుంటుంది సుజాత. చివరికి ఏమయ్యిందన్నది మిగిలిన కథ. “సుజాత” గా సహజనటి నూతన్, అధీర్ బాబుగా సునీల్ దత్ చక్కని నటన కనబరుస్తారు.

తన చిత్రాల్లో నాయికకు తగినంత గౌరవాన్ని ఇస్తూ, అతి తక్కువ సంభాషణలతో ప్రకృతి, వర్షం, సంగీతం – ఈ మూడింటి ద్వారా నాయిక భావాలను తెలపడం బిమల్ రాయ్ కళాదృష్టికి నిదర్శనం. ఈ చిత్రంలో కూడా చాలా సన్నివేశాల్లో సుజాత మనోభావాలను ఈ మూడింటి ద్వారానే నేర్పుగా తెలియజేస్తాడు దర్శకుడు. ఎస్.డి.బర్మన్ సంగీతాన్ని అందించారు. ఎస్.డి.బర్మన్ స్వయంగా పాడిన “సున్ మేరే బంధూరే”, గీతా దత్ పాడిన “నన్హీ కలీ సోనే చలీ”, ఆశా భోంస్లే పాడిన “కాలీ ఘటా ఛాయ్” పాటలు చాలా బాగుంటాయి. ఇవి కాక “జల్తే హై జిస్కే లియే” అనే ‘ఫోన్ పాట’ నాకు చాలా ఇష్టం. అధీర్ ప్రేమను అంగీకరించి ఇంటికి వచ్చిన వెంఠనే తల్లి తనకు ఒక హరిజనుడితో వివాహాన్ని కుదిర్చిందని తెలిసి సుజాత బాధపడే సమయంలో అధీర్ ఈ ప్రేమగీతాన్ని ఆమెకు ఫోన్ లో వినిపిస్తాడు. కన్నీరు నిండిన కళ్ళతో, బాధతో అధీ ఉత్సాహంగా పాడే ఈ పాటను మౌనంగా వింటుంది సుజాత. అప్పటి సినిమాల్లో ‘ఫోన్ లో పాట’ ఒక ప్రయోగమే అయ్యుంటుంది.

విలక్షణ గాయకుడు తలత్ మెహ్మూద్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ఈ గీతాన్ని రచించినది దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, ప్రముఖ ఉర్దూ కవి, సినీ గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురి. మరి ఈ ప్రణయగీత వాక్యార్థం తెలుసుకుందామా మరి…

जलते हैं जिसके लिए..

जलते हैं जिसके लिए, तेरी आँखों के दिए
ढूँढ लाया हूँ वोही गीत मैं तेरे लिए
जलते हैं जिसके लिए..

నీ కనులు జ్యోతులై దేనికొరకైతే ప్రకాశిస్తాయో
అదే పాటను నే వెతికి తెచ్చాను నీ కోసం..
దేనికొరకైతే ప్రకాశిస్తాయో..

 

दर्द बनके जो मेरे दिल में रहा ढल न सका
जादू बनके तेरी आँखों में रुका चल न सका
आज लाया हूँ वही गीत मैं तेरे लिए
जलते हैं जिसके लिए..

నా మనసులో తీరని వేదనై ఉండిపోయి
నీ కనులలో ఇంద్రజాలమై నిశ్చలంగా నిలిచిపోయిన
అదే పాటను నేనీవేళ తెచ్చాను నీ కోసం..
దేనికొరకైతే ప్రకాశిస్తాయో..

 

दिल में रख लेना इसे हाथों से ये छूटे न कहीं,
गीत नाज़ुक है मेरा शीशे से भी टूटे न कहीं
गुनगुनाऊँगा यही गीत मैं तेरे लिए
जलते हैं जिसके लिए..

చేజారకుండా మనసులో పెట్టుకో ఈ పాటను
గాజు కన్నా నాజూకైన నా పాటను పగులనీయకు
మళ్ళీమళ్ళీ ఇదే పాటను నేనాలపిస్తాను నీ కోసం
దేనికొరకైతే ప్రకాశిస్తాయో..

 

जब तलक न यॆ तेरे रस के भरे होंटों से मिले,
यूँही आवारा फिरेगा ये तेरी जुल्फों के तले
गाये जाऊँगा यही गीत मैं तेरे लिए
जलते हैं जिसके लिए..

తేనెలూరే నీ పెదవులను చేరనంతవరకూ
ఇలా అగమ్యంగా నీ కురుల అంచున దోబూచులాడుతుందది
ఇదే పాటను నే పాడుతూనే ఉంటాను నీ కోసం..
దేనికొరకైతే ప్రకాశిస్తాయో..

——————————

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు: http://www.youtube.com/watch?v=3X-zFcDGcZM

“సుజాత” పూర్తి సినిమాను ఇక్కడ చూడవచ్చు: https://www.youtube.com/watch?v=r1VDjZReGLo