కవిత్వం

ప్రయాణమంటే…

02-మే-2013

ప్రయాణమంటే..
ఎన్ని మోసుకెళ్తూ
చివరికి
ఎన్ని వొదులుకుంటానో
తెలియని ఒక సందేహావస్థ

తీరా ప్రయాణం చేస్తున్నపుడు
ఒక కిటికీ పక్క ప్రదేశాన్ని
కిరీటిలా పట్టుకొని
ఆనందిస్తున్న తరుణంలో..
ఒక పెద్దాయిన
గాలికోసం అని అడిగినపుడు
ఆ స్థలాన్ని
మొహమాటంగా ఇచ్చినపుడు
ఉన్న ఒక్క చాక్లెట్
తినబోయె సరికి
నేలపై జారవిడుచుకున్నట్టు
తెల్లమొహం వేసిన
పిల్లవాడినవుతాను

తేరుకొని
పలకరింపుల తాయిలాలతో
కొనసాగిస్తున్నపుడు
వారి ఊరువచ్చి
దిగిపోతారు

నాదికాని ఒక చోటు
నాదై, వేరై
మళ్ళీ నాదవడం
చింతనకు నాంది అవుతుంది

ఒంటరిగా
కిటికీలోంచి చూస్తునపుడు
మరొకరు వచ్చి
నవ్వుల పలకరింపులు ప్రారంభిస్తారు
కొంత దూరం వెళ్ళాక
ఊరు వచ్చిందని
నేను దిగిపోతాను

ప్రయాణం ముగించాక
విడిపోయి,కల్సిన
కల్సి విడిపోయిన
వారిని తలుచుకుంటే
మళ్ళీ అదే ఆలోచన

ప్రయాణమంటే..
అన్నీ సర్దుకుని
ఒక చోటు నుంచి
మరో చోటుకు వెళ్ళడం
భౌతికమా..

అవేమీ కాక
వారైనా, నేనైనా
తలుచుకున్నపుడు
కలిసి జ్ఞాపకాల్లో
విహరించడం
మానసికమా..

లేక
ఉన్నచోటునుంచి
ఎవరూ లేని
ఎపుడూ చూడని
ఒకానొక
నిశ్శబ్ద ప్రపంచపు సౌందర్యాన్ని
అందుకోవడం
ఒక ప్రయత్నమా2 Responses to ప్రయాణమంటే…

 1. narasimhareddy anugu
  May 4, 2013 at 12:39 pm

  manchi poem. congrats

 2. దడాల వెంకటేశ్వరరావు
  May 9, 2013 at 10:13 pm

  ప్రయాణమంటే..
  అన్నీ తెలుసుకోవడానికి
  ఒక చోటు నుంచి
  మరో చోటుకు వెళ్ళడం
  ముమ్మాటికి బౌతికమే

  వారైనా, నేనైనా
  తిరిగి తెలుసుకున్నప్పుడు
  కలిగిన జ్ఞానంతో
  విహరించడం
  మానసిక ఉల్లాసమే ..

  ఉన్నచోటునుంచి
  ఎవరూ లేని
  ఎపుడూ చూడని
  ఒకానొక
  నిశ్శబ్ద ప్రపంచపు సౌందర్యాన్ని
  అందుకోవడం
  ఒక మహోన్నత ప్రయత్నమే

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)