సమీక్ష

తెలంగాణ బతుకమ్మకు ఓ పట్టుకుచ్చుల పువ్వు

02-మే-2013

(దాసరాజు రామారావు “పట్టుకుచ్చుల పువ్వు” కవితా సంపుటి పై ఏనుగు నరసింహారెడ్డి సమీక్ష)

ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎంత ప్రయోజన రహితమయిందో తెలంగాణ ఉద్యమ సందర్భం
నిరూపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రకాంక్ష ఎంత బలీయంగా ఉందో 2009 తర్వాత జరిగిన ప్రతి ఉప ఎన్నికా నిరూపించింది. కానీ 2004
లో కానీ 2009 లో కానీ ఈ ఆకాంక్ష అంత స్పష్టంగా నిరూపించబడలేదు. ఒకవేళ 2009 డిసెంబర్ 9 తర్వాతి ప్రకటన అనంతరమే
సామాన్య ప్రజలలోకి, అన్నివర్గాల తెలంగాణ ప్రజలలోకి ఈ ఆకాంక్ష బలీయంగా వెళ్ళిందని భావించినా 2014 ఎన్నికలు ఏకపక్షంగా తెలంగాణ వాదం వైపు మొగ్గకపోతే పరిస్థితి ఏమిటి? ఆకాంక్ష బలహీనమైందేననో, బలహీనపడిందనో తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులు ప్రచారం చేస్తే పరిస్థితి ఏమిటి? పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని పరిమితత్వం కింద దీన్ని పరిగణించాలా? లేక form ఏదైనా అధికారం ఎప్పుడూ పాలకవర్గాల చేతుల్లోనే ఉండేట్లుగానూ, ప్రజల, సామాన్యుల ఇష్టాలకు వ్యతిరేకంగా అధికార మార్పిడి మెకనైజ్ చేయబడుతుందన్నట్లుగానూ నిర్ధారణకు రావాలా? గద్దర్ పదే పదే చెబుతున్నట్లు ఓట్ల ద్వారా,సీట్ల ద్వారా తెలంగాణ రాకపోతే ఎట్లా? ఔను తెలంగాణ ఎట్ల?
రకరకాలు గా ఆలోచన జేస్తుండు కవి.

“ఈ తాప కూడా
తొండి కొండి కుట్టిందో
ఆఖరి కొచ్చిన పచ్చీసాటల
సంపుడుపంజెం చేసైనా సరే
మన కాయ ఇంట్లబడాలే
మరచినవా యోధుడా
మానవాస్త్రాన్ని”

చాలా అమాయకంగా దాసరాజు రామారావు రాసిన కవిత్వం వెనుక సముద్ర గర్భ కల్లోలం ఉంది. 69 ఉద్యమం విఫలమైన
తర్వాత యువత ఏ బాటలు పట్టింది ఆయనకెరుక. ఇప్పటి రాష్ట్ర ప్రకటన విరమించుకున్నంక ఎన్ని గర్భశోకాలు
తలెత్తినవో ఆయన కెరుక. కానీ అందమైన “పట్టుకుచ్చుల పువ్వు” గా కనపడుతున్న ఆయన కవితా సంకలనంలోని
ఆఖరు కవితలోని ఆఖరు వాక్యాలు ఏం ప్రభోధిస్తున్నవో చూస్తే ఆందోళన కలుగుతుంది. బహుషా కవి
అలవోకగా రాసినా ఉద్దేశ్యపూర్వకంగా రాసినా ఆయన మానవాస్త్రాన్ని ప్రస్తావిస్తున్నాడు. శ్రీకాంతచారి లా,
యాదయ్య లా, వేణుగోపాల్ రెడ్డి లా కాదు, మానవచరిత్రలో తొలిసారి నాజీలు చవిచూసిన “మానవాస్త్రాలు” ఆయన ఉద్దేశ్యాలు.
ఇందుకు కవిని తప్పు పట్టలేం. కాలం అలాంటిది. అయితే ఆశ్చర్య కరంగా వెంటనే కరిగిపోయి ,ఉద్యమరథం మధ్యలో
నిలబెట్టి అర్ధాంతరంగా వెళ్ళిపోయిన యువత గురించి వలపోస్తడు. వాళ్ళంతా

“మడత పడ్డ నాలుకల మీద
కత్తులు పదును పెట్టుకోవాల్సి వుండె
రాజీ పడిన పదవుల మెడలో
అమరవీరుల త్యాగాల దండ వేయాల్సి వుండె
బహురూపాల పోరాటానికి నీ అధ్యయనం
మెళకువలు రచించాల్సి వుండె
అన్నింటికన్నా ముందు
తలనెగరేసి
పిడికిట్లో జెండా బిగించి
జై తెలంగాణ నినాదమై
ఉద్యమాల గుంపు ముందు
చిందు వేయాల్సి వుండె”

అంటడు. ఒకసారి కొట్లాడాలని, ఒకసారి శాంతంగానే ప్రయత్నం చేయాలని, మరో సందర్భం లో ఉద్యమం లో చిందేయాలని, త్యాగం చేయాలని, మానవాస్త్రం
కావాలని తండ్లాట తెలంగాణ వాదులది. కవిగా దాసరాజు రామారావుదీ అదే పరిస్థితి. తెలంగాణ పాఠం కావాలె అంటడు.
మా చరిత్ర మాక్కావాలె అంటడు. ఆయన నెమిలీకల పద్యం చెప్పినా, మిలియన్ మార్చింగ్ సాంగ్ పాడినా అనివార్యంగా
తెలంగాణ జీవితం, ఆకాంక్ష చిత్రితమవుతై. తెలంగాణ బతుకు చిత్రం ఎంత పరాయికరణ చెందిందో చెబుతూ ,

” గీ నౌకరీ గుర్రమెక్కినాక
అదెటు వురికితే అటువోవుడే
చెంగున గెంతిందో ఎల్లెల్కల పడ్డట్టే
అరక, ఇల్లు, ఐరావతం
అంటూ చక్కటి బొమ్మలతో
బోధ చేస్తున్నప్పుడు
అవ్వ,గుడిసె ,ఎద్దు
తడి ఊరిన పిల్లల కళ్ళల్లో కనిపిస్తయి”
అంటడు. పాఠ్య పుస్తకాల్లో స్థానీయ ఆచారాలు, వస్తువులు లుప్తమై ఆధిపత్య ప్రాంతాలు , వాటి ప్రతీకలు మాత్రమే
కనిపించడాన్ని ఇప్పుడిప్పుడే ప్రశ్నించడం మొదలయింది.

గోరుకొయ్యలు సంకలనం ద్వారా తెలుగు కవిత్వానికి దగ్గరైన దాసరాజు రామారావు
ఉపాధ్యాయుడు. అటు విద్యార్థులకు , ఇటు సమాజానికి పాఠాలతో పాటు తెలంగాణా పాఠాలు చెబుతుండు. భాషా సౌందర్యం
కన్నా భాషా వ్యవహారం ఈ కవికి ఇష్టం. ఈయన కవితల్లో తెలంగాణ ప్రజలు రోజూ వాడుకునే పదాలే ఉంటాయి.
“తాయిమాయి” , “యాష్ట” , ” తిరుగోలె” , ” గరిశె”, “పనగడి లేని దొడ్డి “, లాంటి పదాలు ఆత్మీయంగా తాకుతై.
అదే సందర్భంలో “మాదాకోళం తల్లీ”, ” బతుకోపదేశాలు”, “ఇచ్చిత్రం”, లాంటి పదాలు అటు గ్రాంధికమూ కావు,
ఇటు వ్యవహారంలోనూ లేవు. ఇలాంటి పదాలు పరిహరించడం కవి ఎదుగుదలకు అవసరం. విచిత్రం అనే పదాన్ని
తెలంగాణా గ్రామ్యంలో “ఇచ్చింత్రం” అంటారు. కాని “ఇచ్చిత్రం” అనరు.

నలభై కవితల పట్టుకుచ్చుల పువ్వు సంకలనంలో దాదాపు ప్రతి కవితా తెలంగాణనే పలవరిస్తుంది.
తెలంగాణా వ్యాప్తంగా పుంఖానుపుంఖంగా వస్తున్న కవితా సంపుటాలకు భిన్నంగా కవిత్వ రహస్యాన్నెరిగిన
తెలంగాణ కవిత్వమైన పట్టుకుచ్చుల పువ్వు ఒక విలక్షణమైన సంకలనం. గొప్ప కమిట్మెంట్ తో, సింబాలిక్ టైటిల్ తో
వచ్చిన అరుదైన సంకలనమిది. ఉద్యోగం రెక్కల గుర్రమని, డి.ఎ. ను కలగనలేని వేగమని, కొండలు పగిలినా వినిపించనంతటి మౌనం అని అద్భుతమైన అభివ్య క్తులున్న సంకలనం ఇది.