కవిత్వం

యాదోంకి బారాత్‌

10-మే-2013

కళ్లపై రెప్పల తలుపులు పడతయి
బుర్రను పురుగులు తొలుస్తుంటయి
నిద్ర పట్టదు, పొద్దు గడువదు
దేహానికీ ఆత్మకూ మధ్య పేచీ
పడమటి పొద్దుకీ సూర్యోదయానికీ మధ్య పేచీ
దేహంపై ఆత్మ విసుక్కుంటూ ఉంటది
పక్షిలా ఆత్మ ఒక్కటే విహాయాసం
తడిసి ముద్దయిన మొండి శరీరాన్ని తోడు కోరుతది

***

ఈ జన్మో గత జన్మో
అసలు గుర్తు లేదు..
మనసూ శరీరం జోడు గుర్రాలు
ఉస్మానియా క్యాంపస్‌ యుద్ధ మైదానం
మాటలే కాదు, చేతలూ కోటలు దాటేవి
కలలు ఎర్రనివో.. పచ్చనివో..
ఎర్రటి తొవ్వల వెంట పచ్చనివో..
తెలియకున్నా అంతా తెలిసినట్లే
ఎదురీదడం, ఎదురెక్కడం, ఎదుర్కోవడం..

***

ఏమైందీ…
తెలియని వేటగాడి దెబ్బకు రాలిపడుతున్న పిట్టలు
ఆర్ట్స్‌ కాలేజీ అరుగుల మీద శోకం బొట్లు బొట్లుగా కారుతది
బిడ్డలూ.. నా కూనలూ..
టప్‌… టప్‌… ఒక్కటే టప్‌…
చెవ్వులు చిల్లులు పడుతున్న శబ్దం
చెట్టు పూలను రాలుస్తున్న సవ్వడి
ఎండుటాకుల మీద అడుగుల చప్పుడు

***

నమ్మకానికీ అపనమ్మకానికీ మధ్య పేచీ
బతుక్కూ చావుకీ మధ్య పల్చటి పొర
విశ్వాసం ఓ ఊతకర్ర, రెపరెపలాడే జెండా
ఎగిరే పక్షి
దేహాన్ని ఉడుకెత్తించి ఉసిగొల్పే ఆత్మ

***

వేసిన తొవ్వలు దరి చేర్చవు
అరికాళ్ల అచ్చులు పడుతయి
బతుకులను కాట కలిపిన చోట
కాటికి పోవడమే కడపటి దరి కాదు
దోసిలి పట్టి కన్నీటిని తాగాల్సిందే..
చెట్టు పుష్పించి పండాల్సిందే