మాట్లాడుకుందాం

కలకంఠి

10-మే-2013

చర్చకు ఆహ్వానం!

చిన్నతనంలో పి.సుశీల పాట విన్నప్పుడు ఎవరో అందమైన అమ్మాయి పాడుతున్నది అనిపించేది. అందం అంటే ఏవిటి అంటే సుశీల పాడిన కొన్ని పాటలు గుర్తొస్తాయి ఇప్పటికీ.
అలాగే లలితం, మృదులం అంటే బాలసరస్వతి గానం, మాధుర్యం అంటే జిక్కీ కంఠం ..
వారి పాటలను విన్నప్పుడు ఆయా విశేషణాలు గుర్తురావడమే కాక, ఆమాటలకు వారి కలస్వనాలు నిర్వచనాలుగా గోచరిస్తాయి.

మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చిన్ననాడు పాడుతున్నప్పుడు అచ్చం ఒక అమ్మాయి పాడుతున్నంత బాగా ఉండేదని చెప్పుకునేవారని ఆయనను దేవుడిగా కొలిచే ఒక శాస్త్రీయసంగీతాభిమాని మిత్రుడు చెప్పేవాడు.
ఇక్కడ నాకో సందేహం కలుగుతూంది. స్త్రీకంఠానికి సహజమైన సౌందర్యసౌకుమార్యాలు కాకుండా ఇంకేమైనా లక్షణం వుందా గాయనీమణుల పాటలో? ముఖ్యంగా భాష, పదజాలం, ఉచ్చారణకు సంబంధించిన సౌలభ్యం, వినే వారిని అకట్టుకునే గుణం?

పాటల గురించేకాక మాటలగురించి అలో చించినా ఇదే ప్రశ్న తలెత్తుతుందొక్కొక్కసారి.
తెలుగుభాష అంటే వారి అమ్మలు, అమ్మమ్మలు, మేనత్తల మాటల నుండే నేర్చుకున్నానని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఇదే భావాన్ని మల్లాదిరామకృష్ణశాస్త్రిగారు కూడా వెలిబుచ్చడం గమనార్హం. తల్లిని ఆదిగురువుగా తలుస్తారు మనవారు.
అలాగే ఇంగ్లీషు భాష నాకు ఏవైనా అబ్బిందంటే దానికి కారణంగా నేను చిన్నప్పుడు చదివిన బళ్ళో కేరొలిన్ మిస్, బ్రిడ్జెట్ మిస్ అనే ఇద్దరు గొప్ప టీచర్లు గుర్తుకొస్తారు.
లెస్లీ కరోన్ మాట సినిమాలో విన్న తర్వాతే ఫ్రెంచి భాషలోని శబ్దసౌందర్యం తెలిసొచ్చింది.
వినడానికి కటువుగా వుండే జర్మన్ భాష కూడా అక్కడి ఆడవారి మాటలలో చక్కగా ధ్వనిస్తుందనుకుంటాను. మనకు పొరుగునవున్న తమిళం తెలియనివారి చెవులకు అంత సొంపుగా వినబడదు. శివాజీ గణేశన్ మాట్లాడితే మరీ ..
అయితే సుశీల, జానకి పాడిన తమిళపాటలు వింటే ఆభాష శ్రావ్యంగానే అనిపిస్తుంది.

ఒకభాషను సరిగ్గా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బాగుంటుందో అని అలోచిస్తే ఎందుకనో ఎక్కువ కలకంఠుల కంఠాలే జ్ఞప్తికొస్తాయి.
ఇది కేవలం నా ఊహా? మీకెవరికైనా ఇలా అనిపించిందా?