ముఖాముఖం

కవిత్వ రచనలోకి యాక్సిడెంట్‌గానే ప్రవేశించాను

జూన్ 2013

ఒక సరిహద్దు ప్రాంతంలో నిలబడి సరిహద్దులు లేని మానవతా సీమ కోసం కలవరిస్తున్న కవి, రచయిత దాట్ల దేవదనం రాజు. కవిత రాసినా, కథ రాసినా, ఒక మాట చెప్పినా అందులో మంచితనపు పరిమళం గుబాళిస్తే వెంటనే తెలిసిపోతుంది అది దాట్ల అక్షరమని! ముందు తరానికి చెందిన సాహిత్యజీవి అయినప్పటికీ ఈ తరంతో కలిసి నడుస్తున్న పథికుడు, స్నేహమే చిరునామా అయిన సున్నిత మనస్కుడు దాట్లతో ముఖాముఖీ.

 

1. దేవదానం రాజుగారూ, మీ కవిత్వ ప్రారంభం ‘అదీ యానాం లాంటి మారుమూల ప్రాంతం నుంచి’ ఎలా?

నన్నిలా కదిలిస్తున్నందుకు ముందుగా వాకిలికి థన్యవాదాలు. నా కవిత్వ ప్రారంభం ఆ తర్వాత 15 ఏళ్ళలో ఆరు కవితాసంపుటులు, రెండు దీర్ఘకవితలు వెలయించడం నాకే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. సాహిత్య వాతావరణం అసలే లేని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. అధ్యయనం పట్ల ఆసక్తి. దొరికిందల్లా చదవడమే పని. ఈ చదవడం వెనుక ఏ మూలో రచయిత కావాలనే కోరిక ఉంటే ఉండొచ్చు. నలభై ఏళ్ళ వయసు వచ్చేంత వరకూ రాయడానికి ప్రయత్నమే చేయలేదు. 1992లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన కవిత్వ శిక్షణాతరగతులకు హాజరైన కె.శివారెడ్డి బృందం శిఖామణి ఆహ్వానం మీద యానాం వచ్చారు. ఆ బృందంలో ఈనాటి లబ్దప్రతిష్టులైన అఫ్సర్‌, దర్బశయనం శ్రీనివాసాచార్య,సీతారాం,యాకూబ్‌, ఆశారాజు తదితరులున్నారు.మూడురోజుల పాటు క్షణం వీడకుండా వాళ్ళతోనే ఉన్నాను.

ఆ తర్వాత ఒక వారంరోజుల పాటు ఒకానొక ట్రాన్స్‌లో ఉన్నాను.ఫలితంగా నన్ను కవిత్వం ఆవహించింది.మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి స్మారక సభల్లో కవితలు చదవడం, అద్దేపల్లి రామమోహన రావు ‘కవిస్వరం’ పేరిట జరిపిన కవిత్వపఠనం లో నేనూ పాల్గోవడంతో నా కవిత్వ జీవతం తేజోవంతమైంది.

 

2. సాహిత్యంలో మీ తొలి పరిచయాలు…అవి కొనసాగిన తీరు?

సాహిత్యంద్వారా పరిచయమైన వారందర్నీ నాకు లభించిన ఎప్పటికీ తరగని సాహిత్య స్నేహసంపదగా భావిస్తాను ఆ స్నేహసంపద నాకు గర్వకారణం.

 

3. మీకు అప్పటికీ ఇప్పటికీ నచ్చిన కవులు? ఎందుచేత?

భావావేశం, శాబ్దికశక్తి, పదాల తూగు కారణంగా తొలిరోజుల్లో శ్రీశ్రీని ఇష్టపడేవాడిని.పద్యకవుల్లో జాషువా, జంధ్యాల పాపయ్యశాస్త్రి. వచన కవిత్వం విషయానికి వస్తే గుక్క తిప్పుకోలేనంత శైలీ విన్యాసం గల కె.శివారెడ్డి, శుభ్ర స్వచ్చ కవిత్వ చిరునామా అయిన ఇస్మాయిల్‌, అలతిపదాలతో అతి సూక్ష్మ పరిశీలనల్ని ప్రతీకలుగా మార్చి కవిత్వీకరించే శిఖామణి నాకు నచ్చిన కవులు. భావుకతతో గుండెల్ని తట్టే సాంద్ర కవిత్వం రాసే ప్రతి కవినీ అభిమానిస్తాను.

 

4. 1997లో మీ పుస్తకానికి అఫ్సర్‌ గారు ముందుమాట రాస్తూ “రాజు గారికి కవిత్వపఠనం ఓ వ్వసనం అయితే కవిత్వ రచన ఓ యాక్సిడెంట్‌” అన్నారు.ఇప్పటికీ కవిత్వం ఒక యాక్సిడెంట్‌ అనుకుంటున్నారా?

అఫ్సర్‌ మాట నూరుపాళ్ళూ నిజమే. కథల పట్ల అపేక్ష పెంచుకుంటున్నవాడిని. కథకుడ్ని మాత్రమే కావాలను కున్నవాడిని. అప్పటికే రెండు మూడు కథలు రాసినవాడిని. బహుశా 1992 లో కవులు తారసపడకపోతే కవిని కాక పోయుండేవాడిని. తర్వాత కాలంలో వరసగా ఆంధ్రభూమిలో అఫ్సర్‌ నా కవితలు ప్రచురించి నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు.

అఫ్సర్‌ నా మొదటి పుస్తకానికి (వానరాని కాలం) పేరు ఖాయం చేయడం, కౌముది గారు అనారోగ్యంగా ఉన్న సమయంలో ఎంతోవిలువైన ముందుమాట రాయడంద్వారా కవిత్వరచనయాక్సిడెంట్‌ అయినా సాహితీలోకంలో నాకొకస్థానం లభించింది.

 

5. తర్వాత కాలంలో మీరు కథల్లోకి మళ్ళారు. ఇంతకీ మీ మనసు కవిత్వంలో ఉందా? కథల్లో ఉందా?

తర్వాత కాలంలో కథలు రాయడం కాదు.ముందే రాసాను.అప్పటికే ఆంధ్రజ్యోతి,మయూరి పత్రికల్లో కథలు
వచ్చాయి. మొదటిగా “దాట్ల దేవదానం రాజుకథలు” ప్రచురించాక సుమారు తొమ్మిది సంవత్సరాలు కథలు రాయలేదు. అయితే ఆ కాలంలో కవిత్వంలో మునకలేసాను.మరల 2011 నుండి ” యానాం కథలు” రాయడం ప్రారంభించాను. కథ, కవిత నాకు రెండు కన్నులు. ప్రతిరోజు కొత్తగా కథలు, కవితలు చదవకుండా నిద్రపోను. రాసినా రాయకపోయినా ఏదీ చదవకపోతే ఏదో కోల్పోయినట్లే.

 

6. రైతు జీవితం మీ కవిత్వాన్ని ఎంతవరకూ ప్రభావితం చేసింది?

రైతు కుటుంబం లోంచి వచ్చినవాడిని. వ్యవసాయం తాలూకు సాదకబాధకాలు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాడిని. అందుకే రైతు నేపథ్యంగా చాల కవితలు రాసాను. “ముద్రబల్ల” దీర్ఘకవిత రాసాను. గొప్ప ఆనందకరమైన విషయం ఏమిటంటే నాకెంత మాత్రం పరిచయం లేని కూర్మాపురం గ్రామస్థులు రైతుకవిగా గుర్తించి “సర్‌ ఆర్థర్‌ కాటన్‌జలనిధి పురస్కారం” తో కాటన్‌ జయంతి నాడు గౌరవించారు. పుదుచ్చేరి ప్రభుత్వం వారిచే పొందిన “కళైమామణి”,”తెలుగురత్న” అవార్డులతో సమానంగా దీన్ని భావిస్తున్నాను.

 

7. సాధారణంగా మీరు కవిత్వం రాసే పద్ధతి ఏమిటి? ఒకేసారి రాస్తారా? రాశాక తిరిగి రాస్తారా?

రాయాలకున్న అంశం మనస్సులోకి వచ్చితర్వాత ఓ కవిత్వపాదం బుర్రలో మొలకెత్తుతుంది. అది కవిత రాయడానికి దారి చూపుతుంది. ఒకేసారి రాయడం నా వల్ల కాదు. రాసాక రెండు మూడుసార్లు తిరగ రాస్తాను.

 

8. కవిత్వ నిర్మాణంలో విషయంలో మీ అభిప్రాయాలూ?

ఒక కవిత రాయడం మొదలెడతానా? కొంత రాసాక ఒక లయ లేదా పద్ధతి నాకు తెలియకుండానే వస్తుంది. అంటే ఒకానొక శైలి అసంకల్పితంగా నన్ను లాక్కెళుతుందన్నమాట.ఆ ప్రత్యేక నిర్మాణం ఆ కవితకే పరిమితం.

 

9. కవిత్వ నిర్మాణపరంగా మీరు ఎక్కువగా ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారు?

ఎవరి దగ్గర నుంచైనా ప్రత్యేకించి నేర్చుకోవడం ఉంటుందా? అలా నేర్చుకుంటే వచ్చేసే విద్యేనా అది? బహుశా అధ్యయనం, సాధన వల్లే అవగాహన కలిగిందేమో. అయితే మిత్రులు ఆకెళ్ల రవిప్రకాష్‌ సాహచర్యం వల్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని మెళకువలు గుర్తించాను.

 

10. “యానాం వేమన యేమనే” అనే అఫ్సర్‌ ప్రముఖ కవిత మీ స్నేహ ప్రభావమే అని కవిమిత్రులు అంటూ ఉంటారు. మీకు ఆ కవితకూ ఉన్న అనుబంధం ఏమిటి?

దీని గురించి చెప్పాలంటే ఈ చోటు చాలదు. అయినా క్లుప్తంగా చెబుతాను. గోదావరి మధ్య లంక. చుట్టూ ఎటు చూసినా నీరు.రోహిణి కార్తె లో మండుతున్న మిట్ట మధ్యాహ్నం. మాజేటి సుబ్రహ్మణ్యం అనే అతి సాధారణ వ్యక్తి ఎలాగో మా మధ్య చొరబడ్డాడు. మమ్మల్ని తదేకంగా చూసాడు. మా మాటలు విన్నాడు. “ఒకసారి ఆగండి, బాబయ్యా.” అన్నాడు. ఇక మొదలెట్డాడు వేమన పద్యాలు. చిత్రం..అందులో చాల పద్యాలు ఇంకా పరిశోధకులు గుర్తించలేదనిపించింది.సీతారాం బీరు పెట్టెలతో వచ్చిన అట్ట మీద రాయడం మొదలెట్టాడు. ఆ వేమన పద్యాలతో అంతా ధ్యానముద్ర లోకి పోయారు. శివారెడ్డి గారు అన్నారు`‘ ఏమయ్యా, నినొక్కడ్నీ ఇక్కడొదిలేసి మేం పడవ మీద పోతే ఏం చేస్తావ్‌? అని. అతను వెంటనే “అలా నీళ్ళ మీదుగా నడిచెళ్ళి పోతాను.నాకు బయమేంటీ? ” అన్నాడు.ఒక కొత్త వేమన మా ప్రాంతానికి చెందినవాడిగా తలచి అఫ్సర్‌ ఒక అద్భుతమైన కవిత రాసాడు. ఆ కవిత పుట్టిన సందర్బంలో ఉన్నాను కాబట్టి ఎప్పటికీ అది జ్ఞాపకాల పరిమళాన్ని అందిస్తునే ఉంటుంది.

 

11. ఇటీవల కాలం లో మీరు రాస్తున్న కవితల్లో పెద్ద మార్పు ఏమన్నా కనిపిస్తున్నదా?

పెద్ద మార్పు అనలేను. కాకపోతే నాకు తెలియకుండానే అభివ్యక్తి తీరు మారిందని చెప్పగలను. కావాలని కవిత పొడిగిద్దామనే భావన పోయింది. కొంచెం శ్రద్ధ పెరిగింది.

 

12. ముందు తరం కవిగా ఈ తరం కవుల కవిత్వంలో మీకు బాగా నచ్చుతున్న అంశాలు ఏమిటి?

ముందు తరం కవి అన్నారు కదా. ముందు ఆ మాటని జీర్ణించుకోనీయండి.కొత్త పద బంధాలతో రాస్తున్నవారు ఉన్నారు.కొన్ని ఇమేజెస్‌ను పరిశీలించినపుడు ఈ తరం కవుల్లోని పరిశీలనా శక్తి కవిత్వానికి కొత్త చూపు ఇస్తుందనిపిస్తుంది.

 

13. ఈ తరం కవులకు మీరు మీ మనసు లోంచి చెప్పాలనుకుంటున్న మాటలు ఏమన్నా ఉన్నాయా?

ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం చదవాలండీ. ఏమీ చదవకుండా ఒక భావాన్ని సాధికారికంగా అక్షరాల్లోకి ఒంపడం కష్టం. భాష మీద పట్టు రావాలంటే అధ్యయనం ఒక్కటే మార్గం అని గ్రహించాలి. మనకు ఘనమైన సాహితీ వారసత్వ సంపద ఉంది. యువతను ఆకర్షించే మార్గాలు వెదకాలి.

 

14. మీ భవిష్యత్‌ కార్యక్రమాలు ?

కథలతో ఈ మధ్యనే “యానాం కథలు” ఆవిష్కరించాను. నిర్దిష్ట స్థల కాలాదుల్ని కేంద్రంగా చేసుకుని వచ్చిన కథానికల సమాహారంగా యానాం ప్రాంత భౌగోళిక పరిసరాలతో చరత్రలతో ముడిపడిన ప్రజల జీవనాన్ని చిత్రించిన కథలు గా ప్రశంసిస్తున్నారు. ఫిబ్రవరి లో ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేసాను. ఏటా నా పుట్టినరోజు మార్చి 20 తేదీనకథ, కవిత, విమర్శ లకు నా పేరిట పురస్కారాలు ఇవ్వడానికి నిశ్చయించుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేసాను.

ఇన్ని మాటలు చెప్పుకుని నన్ను నేను తడుముకునే అవకాశం కలుగజేసినందులకు “వాకిలి” కి కృతజ్ఞతలు.

—————————

దాట్ల దేవదానం రాజు రచనల వివరాలు:
1 వానరాని కాలం (1997)
2.గుండె తెరచాప (1999)
3.మట్టికాళ్ళు (2002)
4.లోపలి దీపం (2005)
5.నది చుట్టూ నేను (2007)
6.పాఠం పూర్తయ్యాక (2012)

దీర్ఘ కవితలు:
1.ముద్ర బల్ల (2004) రైతునేపథ్యం
2. నాలుగో పాదం (2010)
౩. వౄధ్యాప్య నేపథ్యం- తమిళం లోకి అనువాదం జరిగింది

కధా సంపుటులు:
1. దాట్ల దేవదానం రాజు కధలు (2002)
2. యానాం కధలు(2012)

రాజకీయ వ్యంగ్య కథనాలు:
1. సరదాగా కాసేపు (2006)

చరిత్ర గ్రంధం:
1 యానాం చరిత్ర

సంపాదకత్వం:
1. దూరానికి దగ్గరగా (2002) వంతెన కవితలు
2.సూరయ శాస్త్రీయం(2008)

పురస్కారాలు:
1.వానరాని కాలం (సరసం అవార్డ్,1997)
2.మట్టికాళ్ళు (ఆంధ్ర సారస్వత సమితి,2003)
3. కళైమామణి,పుదుచ్చేరి ప్రభుత్వం,2003)
4.రీజెన్సీ కళావాణి పురస్కారం, (2004)
5.ఉగాది ఉత్తమకవి పురస్కారం,2008)
6. తెలుగు రత్న అవార్ద్,పుదుచ్చేరి ప్రభుత్వం,2009
7. సర్ ఆర్థర్ కాటన్ జలనిధి పురస్కారం,(2010)
8.కొ.కు సాహిత్య మణిహార్ పురష్కారం,2013)

—————

చిరునామా:
దాట్ల దేవదానం రాజు
8-1-048, ఉదయిని,
జక్రియనగర్‌,
యానాం 533 464
సెల్‌: 94401 05987