కవిత్వం

జ్ఞాపకమే కవిత్వం

07-జూన్-2013

“వాయు” లీనం
వెయ్యి ముళ్ళను తాకినా
పదును ఒంట పట్టించుకోలేదు గానీ -
ఒక్క మల్లెను తాకి పరిమళ మెక్కిపోయింది

 

జ్ఞాపక పీఠ్
ఒకడు జ్ఞాపకం ఉండిపోయే కవిత్వం రాస్తున్నాడు !
ఇంకొకడు- వాడి జ్ఞాపకమే కవిత్వంలా జీవిస్తున్నాడు !

 

“విరి”థమెటిక్స్
వీళ్ళంతా కాలాన్ని వడ్డీలతో లెక్కించుకుంటారు-
వాడేమో వసంతాలతో !

 

రెల్లు విరిసే వేళలో…
ఎదర పెద్ద పండగ..
రెండు తీరాల వాళ్ళకీ పప్పలొండి పెట్టాలనుకుంటా
లంకల్నిండా పిండారబోసుకుంది గోదారమ్మ

 

పునరాగమనం
“మీకు పెరియో డాంటైటిస్ – త్వరలో పళ్లన్నీ రాలిపోతాయి”
జాలిగా చెప్పింది డెంటిస్ట్ !
కోరలు మొలవని శైశవం కోరకనే రానుందా – వాటే వండర్ !

 

యమ బీమా
వ్యాపార నాగరికతను మనుషుల్లాగే -
ఆ బీమా సంస్థ సైన్ బోర్డును గూడని నమ్మాయి పక్షులు !
ఓ వేకువన రెక్కలు విరుచుకుంటూ ఉండగా షార్ట్ సర్క్యూట్ !

 

యాంటీ డిప్రెసెంట్
కొండచిలువ చుట్టుకున్న పూలరెమ్మలా
పెద్దల ప్రపంచం దెబ్బకు కుంగి పోతుంటుంది హృదయం !
గత్యంతరమేముంది -
పసిప్రాయ ప్రవేశం చేసి వాళ్ళలో కలిసిపోతా !
వాళ్ళ లేత హస్తవాసితో కోలుకుంటా !

 

చిక్కు సమస్య
తలారా.. తోటమాలా .. ఏ ఉద్యోగం కావాలంటే-
ప్రాణాల్ని తుంచడమా, ఉద్యానాల్ని పెంచడమా :
ఉరి తాడా, విరి తోడా
అన్న అంతర్మథనం తో కాదు
ఎక్కువ “ఆర్జన” ఎక్కడో తేల్చుకోలేక !

 

జయభేరి
ఆనక “శునకమరణం” పొందిన -
అలెగ్జాండరూ, నెపోలియన్నూ,
ముస్సోలినీ, హిట్లరూ ఎట్సెట్రాల
జైత్రయాత్రల కోలాహలం కాదు -
గరళం మింగుతూ సోక్రటీసు వేసిన గుటక !