మాట్లాడుకుందాం

అమ్మ(ల)భాష

21-జూన్-2013

ఒకసారి వాసిరెడ్డి నవీన్ గారు ఒక సభలో మాట్లాడుతూ మాండలికాలనేవి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఉదాహరణకి కృష్ణాజిల్లాలో తన చిన్నప్పుడు విన్నమాట సిబ్బిరేకులు (ఈ సిబ్బిరేకుల్నికూరలచట్టి మీద మూతకు వాడేవారు నేను పెరిగిన పల్లెటూళ్ళో) ఇప్పుడు వినిపించడంలేదని చెప్పారు.

వేరే ప్రాంతాల్లో లేని మాటలు, ప్రయోగాలు, యాసలు అన్ని ప్రాంతాల్లో కనబడతాయనేది భాషాప్రియులకు అనుభవైకవేద్యం. ఒకే ప్రాంతంలో దగ్గర దగ్గరగావున్న ఊళ్ళలోకూడా కొన్నిసార్లు గమ్మత్తైన తేడాలు మాటలలో కనబడతాయి ….. బెజవాడ నుండి గుంటూరు వెళ్తే గేదెలు బర్రెలైనట్టు.

ఇదే తర్కాన్ని కొనసాగిస్తే ఒకఊరికి, అలాగే ఒక కుటుంబానికి, అసలు కేవలం ఒక మనిషికి ప్రత్యేకమైన యాస, ప్రయోగాలు, పదజాలం కనబడే అవకాశం వుంది.

మా కుటుంబంలో ఆడవారి మాటలలోనే ఎవరికి వారికి స్వంతమైన ఎన్నో తమాషాపదాలు, ప్రయోగాలు జ్ఞాపకం వస్తాయి. కొన్ని తెలిసినవి, కొన్ని మరెక్కడా నేను విననివి. పోయిన సారి వ్రాసిన కలకంఠికి కొనసాగింపుగా కొన్ని మీతో ప్రస్తావిస్తాను.

ఒకావిడ ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఆవిడ వాడే విశేషణాలు విలక్షణంగా వుండటమే గాక ఆ సందర్భంలోని వ్యక్తులకు అతికినట్టు సరిపోయేవి. చిన్నగా గుండ్రంగా వున్న మనిషి పొట్లంలా ఉన్నదనీ, ముద్దుగాబొద్దుగా వున్న చిన్నపిల్లలగురించి బంతెల్లేవున్నారనీ, ఒక లావుపాటి పిన్నిగారిని చీమల్లే (నిదానంగా నింపాదిగా వుండే ఆమె నడకమీద కామెంటు) అనీ, ఇలా …..

ఎక్కడికెళ్తే అక్కడ కూలబడే బధ్ధకస్తురాలిని సండెల్లే కదలవేంటి అని కోప్పడేది. అస్తమానం తిరుగుతూ ఒకచోట నిలవకుండా ఏపనీ సరిగ్గా చేయనివారిని బటాసోరల్లే చేస్తున్నారనేది. ఈ సండు, బటాసోరు అన్నమాటలు ఇంకెవరూ వాడగా నే వినలేదు.

ఇలాగే మరొక ఆవిడ – ఎవరైనా ఖర్చు పెట్టడంలో పెద్ద చెయ్యి అయితే వాళ్ళదంతా బారామూరా అనేది. పెద్ద ఖర్చు వదిలేసి చిన్నచిన్న ఖర్చులు పట్టించుకునేవాళ్ళను ‘ఏనుగులెల్లేదారిపట్టించుకోరు గానీ చీమలెల్లేదారి కావాలి’ అని విసుక్కునేది. కదలకుండా ఎవరైనా పడుకుంటే మన్నుతిన్న పింజారి అని ఆమె అభివర్ణన.

ఒక అక్క అవసాన దశలో తన చెల్లెల్ని చూసి ‘నువ్వేట్లా వుంటావే నేను లేకుండా చిన్న మోడువి’, అన్నమాట ఆ చెల్లెలు పదేపదే గుర్తు చేసుకుంటుండేది. ఈ సంభాషణ జరిగినప్పుడు వారిద్దరి వయసు అరవై పైమాటే.
వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు అల్ల్రరి వేషాలను చూసి ఒకామె ముద్దుగా కించిత్ గర్వంగా ‘సోదిగున్న’ అని విసుక్కునేది. (బుడుగును వాళ్ళమ్మ రాధ పోకిరీవెధవ, తిప్పకాయవెధవ అని కోప్పడటం గుర్తుకొస్తుంది – ఇది తలచుకున్నప్పుడల్లా).

ఓ జేజెమ్మ వాళ్ళ పిల్లలతో భోజనాల దగ్గర జరిపే సంభాషణ ను గురించి మాఅమ్మ చెప్పేది.

మూడో కొడుకు: అమ్మా ఏవిటిది? తెల్లగావుంది?
అమ్మ: మజ్జిగ

మూడో కొడుకు: మాంచి పుల్లగా వుందిగా?
అమ్మ: ప్రొద్దునే కదరా తోడేసింది?

మూడో కొడుకు: అదే, నాలిక చిల్లులు పడుతోందిగా!
అమ్మ: ఓరి మాడ గదరా! కోతి మాడ!

ఈ మాడ (మోడు? మూఢ?) అర్థం ఏవిటో నాకిప్పటికీ తెలియదు.

మనలో చాలా మంది వారి వారి కుటుంబాల్లో స్త్రీల సంభాషణల్లో ఎన్నో ఇటువంటి ప్రత్యేకమైన మాటలు ప్రయోగాలు వినే వుంటారు. వీటిల్లో తరానికీ తరానికీ కనుమరుగైపోతున్నవి ఎన్నో.