కథ

గులాబి ముల్లు

జూలై 2013

వేదవతి బ్యాగు తీసుకుని లోపల కొచ్చింది ఆటో దిగి. శాంతమ్మ మనసు వేదవతిని చూడగానే విలవిలలాడింది. జగన్నాధం మనసు ఆనందంతో గంతులేసింది. వేదవతి వారికున్న ఏకైక సంతానం! వారి ఆశలన్నీ ఆమె మీదే! వయసు మీరిపోతున్న ఆమెకి వివాహం చేయలేక పోతున్నారు. సంబందాలు వస్తున్నాయి.-పోతున్నాయి. కాని ఫలించడం లేదు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత పట్టణం నుండి తమను చూడటానికి వచ్చిన కూతుర్ని ఆప్యాయంగా ఆహ్వానించారు.

” అమ్మా!బాగున్నావా?” శాంతమ్మని చుట్టేస్తూ అడిగింది.
” నువ్వండగా నాకేం దిగులమ్మ! ” కౌగలిం చుకుంటూ చెప్పింది.
“నాన్నా! నువ్వు కొంచెం లావయ్యావు! ఆరోగ్యం బాగుందా? ” ఆప్యాయంగా అడిగింది.
” వేదా! నువ్వుండగా నాకేం వేదనలుంటాయి కనుక?” చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు తండ్రి.

” ఏదో లేమ్మా! ఆ ఆపరేషన్ అయినప్పటి నుండి కొంచెం పరేషాన్ తగ్గింది. అంతకు ముందయితే నన్ను హడల గొట్టేవాళ్ళు!” చెప్పింది శాంతమ్మ.
” అయినా కన్నా, తండ్రికి గుండె ఆపరేషన్ జరిగినా చూడ్డానికి రానంత బిజీ అయిపోయావామ్మా?” నిష్ఠూరంగా అన్నాడు జగన్నాధం.

” అందుకే గదు నాన్నా వచ్చింది!” చెప్పింది బాధగా వేదవతి.
” ఏంటీ దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు – ఆపరేషన్ అయిన ఆర్నెల్లకు నన్ను చూడ్డానికి వచ్చావా?” ఒకింత జీర గొంతుతో అడిగాడు జగన్నాధం

” పాపం అది మటుకు ఏం చేస్తుంది? సెలవులు దొరకలేదని చెప్పిందిగా. అప్పటికీ రోజూ సెల్ ఫొన్లో మాట్లాడుతూనే ఉందిగా! “శాంతమ్మ కూతురిని వేనకేసుకొచ్చింది.

” అవును నాన్నా! ఓ రెండు రోజులు తీరిక దొరికినా రానా? ఒక్క రోజులో వచ్చి పోయేంత దగ్గర కాదుగా మనూరు. ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేయాలి! వచ్చిన అలసటే తీరదు!” గునిగింది వేదవతి.

“నిజమే కాని – ఇప్పుడు ఎన్ని రోజులు సెలవు పెట్టావు? కనీసం ఒక నెల అయినా ఉంటావా?”
“నెలలా! రోజులా! ఉద్యోగం అక్కర లేక పోతే ఇక్కడే ఉండిపోవచ్చు!” బుంగమూతి పెట్టి చెప్పింది వేదవతి.
” అదేంటండి – రాక రాక వచ్చిన అమ్మాయిని అలా నిలబెట్టి మాట్లాడేస్తున్నారు. కాస్త విశ్రాంతి తీసుకోనివ్వండి” శాంతమ్మ జగన్నన్నాధంను వారించింది.
దాంతో వేదవతి స్నానాల గదిలోకి దూరింది.

ఓ గంట తర్వాత భోజనం చేస్తూ ముచ్చటించుకున్నారు – చుట్టు పక్కల జరిగిన విశేషాలు.
తరువాత – బ్యాగు లోంచి తీసి అమ్మకు ఇచ్చింది ఓ పట్టు చీర, తండ్రికి పట్టు పంచలు ఇచ్చింది.

” ఇవన్నీ నాకెందుకే పిచ్చి తల్లీ!” కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అంది తల్లి శాంతమ్మ. ఆమె జీవితంలో అంత మంచి పట్టు చీర చూడటం అదే మొదటి సారి మరి.

” తల్లీ – నాకెందుకే పట్టు పంచెలు – ఎంత పెట్టి కొన్నావో – వాపసు ఇచ్చి డబ్బులు పుచ్చుకో!” ఆనందంగా – బాధగా అన్నాడు జగన్నాధం.

“నాన్నా! డబ్బుకు దిగులు పడద్దు – ఈ లక్ష రూపాయలు మీ అవసరాలకు ఉంచండి బ్యాంకులో వేసి ” నోట్ల కట్టలు ఇస్తూ చెప్పింది వేదవతి.

జగన్నాధంకు నోట మాట రాలేదు. నిలువు గుడ్లు వేసుకు చూస్తూ ఉండి పోయాడు. ఆ నోట్లను – ఆమెను అలా చూస్తూ ఉండి పోయాడు.

“అదేంటే, అంత డబ్బు ఎక్కడిది!” విస్మయంగా – అనుమానంగా అడిగింది తల్లి.
“నాదే! దాచుకున్నాను – నెల నెల పంపించే కంటే – ఒకేసారి ఇస్తే బాగుంటుందని తెచ్చాను” చిన్నగా నవ్వుతూ చెప్పింది.
“కానీ వేదా! అప్పుడు నాన్నగారి వైద్యం కోసం రెండు లక్షలు అప్పు చేసి పంపించావు – ముందు ఆ అప్పు తీర్చు!” శాంతమ్మ కూడా గుండె దడ దడలాడుతూ వుంటే చెప్పింది.

“అప్పుల లెక్కలు – గొడవలు మీకెందుకు? నేను గాక మీకెవరున్నారు – అసలు మీ ఇద్దర్నీ నా దగ్గరికి రమ్మంటే రావడం లేదు.” చిరుకోపం ప్రదర్శిస్తూ చెప్పింది, వేదవతి సంభాషణని మారుద్దామని.

” తల్లీ వేదా! మనది నిప్పులాంటి వంశం! ఆ శ్రీ కృష్ణుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నాం. ఇది నీ సక్రమమైన సంపాదనలోంచే వచ్చిందా? ” అనుమానిస్తూ అడిగాడు జగన్నాధం, కంగారు పడుతూ .

” అంటే మీ ఉద్దేశ్యం – ” కోపంగా అడిగింది వేదవతి.
“లంచాలు కాదు గద! అదే అక్రమ సంపాదన!” శాంతమ్మ చెప్పింది.
“ఒకళ్ళని ముంచి తెచ్చింది కాదు గదా!” జగన్నాధం అడిగాడు అనుమానంగా.

“మీ కూతురి మీద నమ్మకం లేకపోతె తీసుకోవద్దు” రోషంగా చెప్పి గదిలోకి పోయి మంచం మీద అడ్డంగా పడుకుంది వేదవతి.
కాసేపటికి జగన్నాధం నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు.
శాంతమ్మ కూడా పిల్లిలాగా అనుసరించింది

“అమ్మ వేదా ! డబ్బు సుఖాలను ఇవ్వదు. డబ్బులోనే సుఖం ఉంది అనుకుంటే అంతకంటే మూర్ఖుడు ఇంకోడు ఉండడు” చెప్పాడు తండ్రిగా .

“మీ ఆపరేషన్ డాక్టరు గారు ఉచితంగా చేసారా?” వేదవతి అడిగింది.

“అబ్బే! ఆయనకేం పిచ్చా? లక్ష్ణన్నరమరీ వసూలు చేసాడు” శాంతమ్మ చెప్పింది మెటికలు విరుస్తూ.

“ఆ ఆపరేషన్ జరగబట్టి నాన్నగారు సుఖంగా వున్నారు. లేకపోతే అయన పరిస్థితి – నీ పరిస్టితి – నా పరిస్థితి ఎలా వుండేది! డబ్బులో సుఖం వుందో లేదో నాకు తెలీదు. కాని డబ్బు లేకపోతె మాత్రం దు:ఖం తప్పకుండా ఉంది. ఈ కాలం మనిషి బ్రతకాలంటే – గౌరవంగా జీవించాలంతే – ఖచ్చితంగా డబ్బు కావలసిందే!” వేదవతి ఆవేశంగా చెప్పింది.

“నిజమే – కనీస అవసరాలకు డబ్బు చాలా ముఖ్యం! కానీ అన్నీ డబ్బులో లేవు!” జగన్నాధం నచ్చ చెప్పబోయాడు.

“ఊరుకోండి – అది చెప్పేదాంట్లో వాస్తవం ఉంది. డబ్బు లేంది చిల్లుగవ్వకు కూడా ఈ కాలం మనిషి పనికి రాడు. ఇన్నేళ్ళుగా అర్చకత్వం వెలగబెడుతున్నారు – ఎవరైనా మిమ్మల్ని గౌరవించి ఇవి ఉంచం డి అని మీ అవసరాలు గుర్తించి ఇస్తున్నారా?” శాంతమ్మ అడిగింది.

“కాలం మారింది – ఆ కాలంలో పూజారి అన్నా – దేముడిలా చూసేవారు. ఈ కాలంలో దేవుడికే దిక్కు లేదు. దేవుడి మాన్యాలకే దిక్కు లేదు! ఇంత దేవుడిని నమ్ముకున్న నాలాంటి పూజారులకు దిక్కేముం టుంది? డబ్బున్నా వాడే దేముడిలా కొలవబడుతున్నాడు!” జగన్నాధం నిర్వేదంతో అన్నాడు. ఆయన కళ్ళల్లో సన్నటి నీటి పోర కనిపిస్తున్నది.

“కాలం మారింది నాన్నగారూ! కాలంతో పాటూ మనమూ మారాలి! కాలానికి ఎదురీదితే నశించి పోతాం! డార్విన్ పరిణామ సిద్దాంతం ప్రకారం సమర్ధులైన వాళ్ళే జీవిస్తారు. ఆటు పోట్లు తట్టుకుని, నాకున్న ఎన్నో అవసరాలు మానుకుని ఆ డబ్బు కూడా బెట్టాను. వద్దంటే చెప్పండి” బాధగా అన్నది.

“హు! మనకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు – వాళ్లకు దానం చేస్తాను” వేదవతి ఉక్రోషంతో చెప్పింది.

“అంతపని చెయ్యకే పిచ్చి తల్లీ! మీ నాన్న సంపాదనతో అస్సలు ఇల్లు గడవటం లేదు. చూశావుగా నా బట్టలు – అయన బట్టలు – జీర్ణావస్తలో వున్నాయి. ఆయనకి ఒక బాధ్యత లేదు. నలుగురూ నా మొహాన ఉమ్మేస్తున్నారు!” తల్లి మనసు బాధ పడింది. ఇరుగుపొరుగును, సమాజాన్ని తలుచుకొని.

“ఎన్ని సంబంధాలు చూసినా అందరికి ఎన్నో లక్షలు కట్నం కావాలి! అమ్మాయిని చూసుకుని – ఏమీ ఆశించకుండా పెళ్లి చేసుకునే ఒక్క మొగ వెధవా నాకు కనపడలేదు – ఒక వేళ వచ్చినా వాడు పరమ సన్నాసి బతుకు బతుకుతున్నవాడు అయి వుంటాడు” జగన్నాధం సాలోచనగా చెప్పాడు.

“ఏదో గంతకు దగ్గ బొంత చెయ్యమంటే – వింటేగా నా మాట” శాంతమ్మ.

“అమ్మా! నా పెళ్లి నాకొదిలేయ్యంది – కూతురైనా – కొడుకైనా నేనేగా – పెళ్లి చేసి నన్ను పంపిస్తే – వచ్చే అల్లుడు మిమ్మల్ని చూస్తాడని నమ్మకమేంటి? అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు?” ఆవేశంగా అడిగింది.

“అందుకని నువ్వు పెళ్లి మానేస్తావా?” శాంతమ్మ అడిగింది – విచారంగా

“అమ్మా! నా కోసం – మా కోసం, నీ జీవితం త్యాగం చెయ్యాల్సిన పని లేదు. నారు పోసినవాడు నీరు పొయ్యక మానదు. ఇన్నాళ్ళు బ్రతికామా – ఇంకో పదేళ్ళు బ్రతకలేమా? నువ్వు సెలవు పెట్టి వచ్చావుగా – సంబంధాలు చూస్తాను. ఎలాగు చేతిలో లక్ష ఇచ్చావుగా – లక్షణమైన సంబంధం తెస్తాను” జగన్నాధం ఆవేశపడ్డాడు.

“నాన్నా! పెళ్లి గురించి ఎందుకంత ఆలోచిస్తారు. ఆడపిల్ల ఖచ్చితంగా పెళ్లి చేసుకు తీరాలా? మొగపిల్లవాడైతే మీరు వాడిని ఇలా నిర్భందించేవారా? ` వాడి పెళ్లి వాడిష్టం అని వదిలి పెట్టేవాళ్ళు కాదా?”వేదవతి అడిగింది.
“కాని మన సమాజంలో ఆడపిల్ల పెళ్లి లేంది బ్రతకలేదు కదమ్మా! లోకం ఆడిపోసుకుంటుంది” శాంతమ్మ భయంగా చెప్పింది.

“అంతే కాదు – ఒంటరి ఆడపిల్లను బ్రతకనిస్తుందా ఈ సమాజం? ఆడది మొగతోడు లేకుండా మనలేదు ఈలోకంలో !” జగన్నాధం చెప్పాడు.

శాంతమ్మ ప్రోద్బలంతో జగన్నాధం కాలికి బలపాలు కట్టుకుని సంబంధాల కోసం తిరిగాడు. ఆ పదిరోజుల్లో కొన్ని సంబంధాలు చూసాడు. కొందరు అమ్మాయిని కూడా చూశారు .

వేదవతి రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాని ఆమె కుటుంబం – ఆమె బరువు బాధ్యతలు పెళ్లి కొడుకులకు ఆకర్షణీయంగా కనపడలేదు. దాంతో పారిపోయారు.
కొంతమందికి కట్నం కంటికి ఆనలేదు.

చివరికి ఆ రోజు వేణుగోపాల్ వేదవతిని చూసి మురిసి పోయాడు. అతని తల్లి సీతమ్మ – తండ్రి జానకి రామయ్య కట్నం గురించి ఆశపడుతుంటే అడ్డు పుల్ల వేశాడు వద్దని.

వేణు గోపాల్ కూడా అందగాడే! ఓ మోస్తరు ఉద్యోగం ఉన్నవాడే! ఎటొచ్చీ అతని ఉద్యోగాన్ని వేదవతి వున్న చోటికన్నా బదిలీ చేయించు కోవాలి – లేదా వేదవతి అతనున్న చోటికన్నా బదిలీ కావాలి – లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి.
వేదవతి వేణుగోపాల్ తో ఐదు నిముషాలు మాట్లాడతానన్నది.

“ఇదేం చోద్యం – పెళ్లి కాకుండానే పర్సనల్ గా మాట్లాడుతుందిట !” సీతమ్మ జానకి రామయ్యతో చెప్పింది.
“అది సాంప్రదాయం కాదు కదా?” ఆయన కూడా అన్నాడు.

కాని “ఫర్వాలేదు – మాట్లాడుతాను-” అంటూ వేణుగోపాల్ లేచి ఆమె వెంట మెడ పైకి వచ్చాడు. చుట్టూ చెట్లూ – మేడ చల్లగా ఉంది.
“నేను మీకు నచ్చానా?” అడిగింది వేదవతి సిగ్గుపడుతూ

“ఆ కాని ఆ ప్రశ్న నేను అడగాలి – నేను మీతో పోలిస్తే కాకి ముక్కుకు దొండపండులాగుంటా నేమో” బిడియపడుతూ చెప్పాడు వేణుగోపాల్

“అందం గురించి నేను ఆలోచించను. హృదయ సంస్కారం – మానవత్వం మంచితనం చాలు నాకు. బాగా అలోచించుకోండి . – నాకు కొన్ని బాధ్యతలున్నాయి , అమ్మా – నాన్నలు నా పైనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి నేను ఒక్కత్తినే సంతానాన్ని! అందుకే వారి బరువు బాధ్యతలు నావి! వారి నుంచి ఆస్థి పాస్తులేవీ నాకు సంక్రమించడం లేదు, అప్పులు తప్ప! నా జీతంలో కొంత భాగం వారి కోసం వెచ్చించవలసి వుంటుంది. ఇంకా అవసరమైతే వారిని మన దగ్గరే ఉంచు కోవలసి వస్తుంది కూడా!” చెప్పింది.

“ఓ ! వై నాట్! అలాగే మా అమ్మ నాన్నలు కూడా నా దగ్గరే ఉంటారు. వారికింక వేరే ఆసరా లేదు. వారి బాధ్యతలు నువ్వు స్వీకరించాల్సి ఉంటుంది . పెళ్లి కాగానే వేరు కుంపటి పెడితే నేను బాధ పడతాను” వేణు గోపాల్ తన అనుమానం చెప్పాడు.

“నేనంత మూర్ఖురాలిని కాదు. తల్లి దండ్రుల బాధ్యత పిల్లలదని నమ్మేదాన్ని. అత్తమామల సేవలు నాకు బరువు కాదు. మనందరం ఒకే కుటుంబం” వేదవతి చెప్పింది.

“మా వాళ్ళు పాతకాలం మనుషులు. కాస్త సర్దుకుపోతూ ఉండాలి!” చెప్పాడు అనుమానంగా వేణుగోపాల్.

“స్త్రీకి సహనం ముఖ్యం. అది నాకు బోల్డంత నేర్పారు మా వాళ్ళు. కాని కట్న కానుకలు ఇచ్చేంతగా మా దగ్గర లక్ష్మీ కటాక్షం నేడు. మరి మీ వాళ్ళ ఆశలు ఎలా ఉన్నాయో! నేను పేద ఇంటి దాన్ని!’ వేదవతి చెప్పింది.

“అవి ఆశించడం నాకిష్టం లేదు, మా వాళ్ళను ఆ విషయంలో ఒప్పిస్తాను”.

“థ్యాంక్యూ వేణు గారు! నా జీవితంలో మధురమైన వేణునాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.” అంటూ సిగ్గుతో బుగ్గలు ఎర్రబడితే కిందకు గబ గబా వచ్చేసింది. వేణు చిరుదరహాసంతో కిందకు వచ్చాడు. మెట్లు దిగి..

“పురోహితుడిగా, మీరు అంగీకారం తెలిపితే, ముహూర్తాలు పెట్టుకుందాం” జగన్నాధం చెప్పాడు పంచాంగం అందుకుంటూ.

“మేము ఇంటికి పోయి ఉత్తరం రాస్తాం – లేదా కబురు చేస్తాం!” జానకి రామయ్య చెప్పాడు పైకి లేస్తూ.

సీతమ్మను, జానకి రామయ్యను వేణుగోపాల్ ను, వారి వెంట వచ్చిన మాధవయ్యను ఊరి పొలిమేరల దాకా సాగనంపాడు జగన్నాధం.
ఎలాగూ పెళ్లికుదిరి పోతున్నది కదాని సెలవును పొడిగించింది వేదవతి. ఓ నాలుగు రోజులకు శుభవార్త విందామనుకున్న జగన్నాధంకు జానకిరామయ్య గారి నుండి వచ్చిన ఉత్తరం పిడుగుపాటు అయింది. అది చదివి సొమ్మసిల్లి పోయాడు జగన్నాధం.
ఆ ఉత్తరం శాంతమ్మ కూడ చదివి అచేతనురాలయింది.

స్నేహితురాలింటికి వెళ్లి వచ్చిన వేదవతి ఇంటి వాతావరణం లోని బరువును పసిగట్టింది. తల్లి దండ్రుల మొహాలలోని నిరుత్సాహాన్ని, విచారాన్ని, ఇంకా చెప్పనలవి కాని భావాల్ని చదివింది.

“ఏం జరిగిందమ్మా!” గాభరాగా అడిగింది వేదవతి..

“పోయింది – సంబంధం పోయింది – అంతా పోయింది” శాంతమ్మ ఏడుస్తూ చెప్పింది.

వేదవతి నిశ్చేష్టురాలైనా తేరుకుంది. తన విచారాన్ని బయటకు చూపించకుండా సరదాగా అంది. “వేణుగాక పోతే, అతని తాతలాంటి సంబంధం వస్తుంది. దానికే ఇంత విచారపడాలా? అయినా ఎన్ని సంబంధాలు తప్పిపోలేదూ – అందులో ఇదొకటి!”

“పోయింది సంబంధం కాదె – మన పరువు! ఇన్నాళ్ళు పులిలా గౌరవంగా బ్రతికిన నా పరువు బజారున పడింది!” జగన్నాధం కళ్ళు ఎరుపెక్కాయి. పెదవులు అదిరాయి.

“ఏమయిందమ్మా! నాన్న ఏమంటున్నారో నా కర్ధం కావడం లేదు” వేదవతి అయోమయంగా చెప్పింది. తండ్రిని ఆ మూడులో ఎప్పుడూ చూడలేదు.

“ఎంత నంగనాచివే! తల్లి దండ్రులన్నగౌరవం కూడా లేకుండా మా దగ్గర నీ బతుకు దాచి – ఇలా తలవంపులు తెస్తావా? నువ్వు నిజం
చెబితే మా చావు మేం చచ్చే వాళ్ళంగా – నీకు సంబంధాలు తీసుకురావడం, నలుగురి నోట్లో నవ్వుల పాలు కావడం జరిగేది కాదు” శాంతమ్మ ఏడుస్తూ చెప్పింది.

“నాన్నా! నువ్వన్నా కాస్త వివరంగా చెప్పు!” గాభరాగా అడిగింది.

“ధూ ! నా నోటేంబడి ఈ పాడు మాటలెందుకులే! వేదం చదివిన నోటితో – ఛీ ఛీ! ఇదంతా నా అసమర్ధతే కదా కారణం” జగన్నాధం తువ్వాలు మొహానికి కప్పుకున్నాడు ఏడుపును ఆపుకోవడానికి.

శాంతమ్మ కింద పడున్న ఉత్తరం తీసి వేదవతి చేతిలో పెట్టి లోపలి పోయింది. వేదవతి అదురుతున్న గుండెలతో ఉత్తరం తీసుకొని పడక గదిలో కెళ్ళి మంచం మీద పడుకుని చదవసాగింది.

“జగన్నాధం గారు! మాది చాలా సాంప్రదాయ కుటుంబం. మీదీ చాలా సంప్రదాయ కుటుంబం అని మన మధ్య ఎన్నో వందల కిలోమీటర్ల దూరం వున్నా మీ అమ్మాయిని చూద్దామని వచ్చాం.
మా వాడు ఇష్ట పడ్డాడని మా తాహతుకు తూగక పోయినా, మీ సంబంధం ఒప్పుకుందామని ముందుకు రాబోయాం! ఈలోగా మాధవయ్య గారికి ఓ అనుమానం వచ్చింది. మీ అమ్మాయీ లేదా – మీ అమ్మాయిలాంటి అమ్మాయిని ఎక్కడో చూసినట్లు గుర్తుకోచ్చింది. మనుషులు పోలిన మనుషులు ఉండ వచ్చని మేము సరిపెట్టుకొన్నాం. కాని అయన చాలా అతలాకుతలమై పోయారు. వెంటనే తన అనుమానం తీర్చుకోవడానికి తను ఎక్కడ చూసింది గుర్తు చేసుకుని – అక్కడ విచారించడానికి వెళ్ళారు. వెళ్లి నిజం తెల్సుకుని అదిరిపోయారు.
అందుకే ఈ సంబంధం వదులుకుంటున్నాం.
కాని నాదో చిన్న సలహా! మమ్మల్ని మోసం చేసే చేసారు. – మాకు సహనం ఎక్కువ కాబట్టి మేము మీ జోలికి రావడం లేదు. అదే ఇంకొకళ్ళయితే మిమ్మల్ని నిలువునా నడి బజార్లో కడిగే వాళ్ళు!
మీ అమ్మాయి మీద మీకు ప్రేమ ఉండచ్చు. పెళ్లి చేద్దామన్న ఆరాటం ఉండచ్చు. కాదనలేము. కాని అందుకు తగ్గట్టుగా ఆమెకు తగ్గ వాళ్ళను వెతకండి. – కాని మా లాంటి సాంప్రదాయ కుటుంబీకులను అవమానం చేయద్దు. మా జీవితాలతో ఆడుకోవద్దు. సమయానికి మాధవయ్య గారు గుర్తు చేసుకోక పొతే – విచారించి ఉండక పోతే మా వాడి జీవితం ఏమయ్యేదో తలచుకోవడానికే భయపడుతున్నాను.
పెళ్లి కాక ముందే కర్ణుడికి జన్మ ఇచ్చినట్లు కుంతీ దేవి పాండు రాజుకు తెలిపి ఉన్నట్లయితే – మహా భారత యుద్ధమే జరిగి ఉండేది కాదు. బహుశా పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం మీ వంశంలో తప్పు కాదేమో కాని మాకు అంతటి విశాల హృదయం లేదు. కాబట్టి ఈ సారి మీ అమ్మాయికి పెళ్లి చెయ్యదల్చుకుంటే వాస్తవాల్ని దాచి పెట్టకుండా వివరించి అందుకు అంగీకరీంచే వాడికే ఇచ్చి చేయండి. ఏ బాధలు మునుముందు ఉండవు.
గులాబీకి ముళ్ళు ఉంటాయి అంటే మా వాడు నమ్మేవాడు కాదు . – కాని వాడి మనసులోనే ఓ పెద్ద ముల్లు గుచ్చుకుంది కాబట్టి ఇప్పుడు నమ్ముతున్నాడు. – పౌరోహిత్యం చేస్తూ అటు ప్రజల్ని – ఇటు దేవుణ్ణి మోసగించగల మీ వంచనా శిల్పానికి జోహార్లు చెబుతూ మీకూ మీ సంబంధానికి తిలలు వదులుతున్నాను.
-జానకిరామయ్య.

 

అది చదివిన వేదవతి సొమ్మసిల్లి పడిపోయింది. శాంతమ్మ వచ్చి ఎంత లేపినా లేవలేదు. జగన్నాధం తనకు తెల్సిన ఆర్ యం పీని తెచ్చి ఇంజెక్షన్లు చేయించాడు. ఓ గంట తర్వాత వేదవతి కోలుకుంది.
కాని గది తలుపు వేసుకుని పడుకుంది బయటకు రాకుండా.
ఆ రాత్రి తలుపు తట్టినా బయటకు రాలేదు.

జగన్నాధంకు అందోళన పెరిగింది. శాంతమ్మకు భయం పట్టుకుంది. వెంటిలేటరు లోంచి గడియ తీసి లోపలికి ప్రవేశించారు. వేదవతి స్లీపింగ్ పిల్సు వేసుకుని పడుకునుంది.
బలవంతాన తట్టి లేపితే మత్తుగా లేచికూర్చుని – పడిపోయింది.

“ఏంటమ్మా ఈ వయసులో మా గుండెల్లో చిచ్చు పెడదామనుకున్నావా ? కొడుకైనా – కూతురైనా నువ్వేనని గర్వంగా బ్రతుకుతున్నామే! మమ్మల్ని వంటరి వాళ్ళను చేసి పోదామనుకున్నావా?” జగన్నాధం ఏడ్చాడు ఆమె చేతులు పట్టుకుని.

“అదికాదే వేదా! నువ్వెవరి నన్నా ప్రేమించావా? మన కులం వాడు కాదా! మాతో చెప్పడాని కేమయిందమ్మా! నీ ప్రేమ విఫలమయిందా? నీ ప్రేమికుడు నిన్ను మోసం చేసి పారిపోయాడా? ఇన్నాళ్ళు నీ క్యారెక్టర్ మచ్చ లేంది అనుకున్నాం – కాని నువ్వు ఇలా దారి తప్పి శీలం పోగొట్టుకుంటావని నేను ఊహించలేక పోయాను” శాంతమ్మ ఏడుస్తూ చెప్పింది.

“పోనీలే వేదా! జరిగిందేదో జరిగిపోయింది. నీ శీలం పోయిందని ముందే చెబితే ఇంకొంచెం జాగ్రత్త పడే వాళ్ళం. కొంచెం ఆధునిక భావాలున్న వాడ్ని పట్టుకొచ్చే వాణ్ని. ! యవ్వనంలో ఎవరైనా పొరపాట్లు చెయ్యవచ్చు. మనం చూసే టివిలు – సినిమాలు యువతను పెడ త్రోవ పట్టిస్తున్నాయి. ఈ రహస్యం ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్త పడదాం. అంత మాత్రాన ఆత్మహత్య చేసుకుని మా గుండెల్లో ఆరని చిచ్చు రగిలించ వద్దు!” ఏడుస్తూ చెప్పాడు జగన్నాధం.

“చెడిపోవడం మన ఇంటా – వంటా – వంశంలో లేదే! నువ్వెల్లా నా కడుపున చెడబుట్టావో !” శాంతమ్మఏడ్చింది గుండెలు బాదుకుంటూ.
వేదవతికి క్రమంగా మత్తు దిగిపోయింది. పూర్తి మెలకువ కలిగింది.

“అమ్మా! నన్ను చెడిపోయిందానిగా ముద్ర వేస్తున్నారా? నాన్నా! నేను కాలు జారాననుకున్నారా?” విస్మయంగా అడిగింది వేదవతి.
“అనుకునేదేముంది – ఆ ఉత్తరంలో అంత స్పష్టంగా రాసి ఉంటే! కాకి పిల్ల కాకికి ముద్దు! నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసినా కన్న మమకారం – పెంచిన మమకారం ఎక్కడికి పోతుంది? కాకపోతే ఇంక ఈ ఊళ్ళో అర్చకత్వం వెలగబెట్టలేను. మమ్మల్ని కూడా నీ వెంట తీసుకుపో – ఎవరికీ తెలియని ప్రదేశానికి తీసుకుపో!” జగన్నాధం ఏడుస్తూ చెప్పాడు.

“నేను ఏ తప్పుడు పనీ చెయ్యలేదు నాన్నా!” తలవంచుకుని చెప్పింది .

“మరి ఇది తప్పుడు పని కాదంటే దరిద్రపు గొట్టు మొహమా! కాలు జారి – పెళ్లి కాకుండా – పిల్లాడిని కనడం?” శాంతమ్మకు కోపం వచ్చింది.

“నువ్వు చెప్పిందాంట్లో చివరి భాగం నిజం – కాని కాలు జారలేదు” వేదవతి చిరునవ్వుతో చెప్పింది.

“నీ మొహం మండ! పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని -కాలు జారలేదంటావు – తప్పుడు పని చెయ్యలేదంటావు?” శాంతమ్మ మండిపడింది.

“అమ్మా! మీకు అర్ధం కాదు. – మన పేదరికం నుండి బయట పడాలని నాన్నను దక్కించుకోవాలని …. నేను మీకు చెప్పకుండా ఓ పని చేశాను. నా మాతృత్వాన్ని అద్దెకిచ్చాను . నా దృష్టిలో అది దానాలలో కెల్లా గొప్ప దానం! నా గర్భాన్ని పిల్లలు లేని తల్లికి అద్దెకిచ్చాను. వారి సంతానానికి నెను తల్లినై నవమాసాలు మోసి కనీ వారికిచ్చాను. ఇందులో నేను కాలు జారింది లేదు. ఫలదీకరణం చెందిన వాళ్ళ అండాన్ని నా గర్భ సంచిలో డాక్టర్లు ప్రవేశ పెట్టి పెంచారు.” అంటూ సర్రోగేటేడ్ మదర్ గురించి కొంత వివరణ యిస్తూ వచ్చింది.

జగన్నాధం – శాంతమ్మ ఆమె మాటలు మ్రాన్పడి వింటూ వుండిపోయారు. “పెళ్లి కాకుండా తల్లి కావడం తప్పు కాదటే! ఇది లేలిస్తే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?” శాంతమ్మ ఉక్కిరిబిక్కిరి అవుతూ అడిగింది.

“ఏమో! తెలీదు – కాని మనం ఉన్న పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చింది. నా కొచ్చే రెండు వేలు బొటా బొటీ జీతంతో నేను ఎలా బ్రతకాలి. మిమ్మల్ని ఎలా బ్రతికించుకోవాలి! అందుకే ఆ అమెరికన్ జంటకు నా కడుపును ఐదు లక్షలకు అద్దెకిచ్చాను. వచ్చే నెల నాకు ఇంకో జంట నుంచి ఆహ్వానం వచ్చింది. ఆరు లక్షలకు. ఇది ఉభయ తారకం. కానీ తొమ్మిది నెలలు మోసిన బిడ్డను పరాయి వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉంటే గుండెల్లో బాధ ఎగదన్ను కొస్తుంది. ” వేదవతి కళ్ళల్లో నీళ్ళు తిరిగి నేల మీద పడ్డాయి.

“గులాబి ముళ్ళు గుండెల్లో గుచ్చుకున్నంత బాధ కలుగుతోంది.”

“ఛీ! ఇది మన సాంప్రదాయం కాదు. మన ఆచారం కాదు. ఎంత పరువు తక్కువ పని – ఎంత పనికి మాలిన పని చేసావే భ్రష్టురాలా!” జగన్నాధం ఆవేశం అణు చుకోలేక పోతున్నాడు..

“నాన్నా! కొంచెం విశాల హృదయంతో ఆలోచించండి. మారిన సామాజిక విలువలు గర్భదానం తప్పు కాదంటున్నాయి. ఇవి పట్టాణాలలో తప్పు కావు. కాకపోతే మన ఊరు ఇంకా మారలేదు. అందుకే పట్టణా కు వెళ్లి పోదాం!” చెప్పింది.మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)