కవిత్వం

మహా ప్రక్షాళనం..!!

19-జూలై-2013

అంబరపు మేఘాల్లోంచి చీల్చుకుంటూ వచ్చే
సూర్య కిరణాలు పుడమిని ముద్దాడే
వెచ్చదనాన్ని స్పృశిస్తూ …
నాలో నుంచి నేను బయటకొచ్చాను-
కల్మషపు కరచాలనాల మధ్య
కర్కష పలకరింపుల విషపు నవ్వుల్లో
నలిగిపోతున్న ‘నిజాయితీ ‘ చేసే
ఆర్తనాదం..!
తప్పని, చెప్పక, చెప్పలేక, చేతకాక
తప్పుకున్న సామాన్య్డు చేసే
మూగ రోదనం..!!

ఒకానొక అపరాహ్ణపు-మండుటెండలో ఎండుతోన్న
చెట్టు చేమల్ని ఆసాంతం పరికించాను-
ప్రాంతీయ ముసుగుల్లో, పోరాటపు కట్టడిలో..
వైషమ్యపు ఆనకట్టల్లో.. బంధింపబడి
సతమతమవుతోన్న ‘జల ‘ కన్నీరు..!
చావలేక, బతకలేక, బతుకీడ్చలేక,
ఆకలి కేకల మధ్య ఎండగడుతోన్న
పొలాల ఏకరువు..
ఎండిన డొక్కలెగసిపడుతోన్న రైతన్నలు
కార్చే రక్త కన్నీరు..!!

ఒకానొక చల్లని సమీరపు సాయంత్ర వేళల్లో…
ఓలలాడుతోన్న చిటారుకొమ్మల్ని
చూస్తూ..చుట్టూ పరికించాను-
కాంక్షా జ్వాలలు ఎగసిపడే విషపు చూపుల్లో..
కామపు మత్తులో జోగుతోన్న మానవత్వంలో..
పసి కూనల, పడతుల మాన ప్రాణాలు
దహించుకుపోతోన్న దుస్థితి..!
శిక్షే వేయలేని న్యాయస్థానాలు,
కక్షే మేలన్న వాదనలు..
వేదన రోదనల మధ్య ప్రక్షాళన
చేయలేని నపుంసకత్వపు పాలన అనిశ్చితి..!!

ఒకానొక తీయని వెన్నెల రేయిలో..
చుక్కల చీర కట్టిన అందమైన
ఆకాశాన్ని ఆనందంగా చూస్తే…
చీకటి రంగులో కలిసిపోయిన
‘నలుపు ‘ కబంధ హస్తాల్లో
రాజ్యమేలుతోన్న అరాచకీయం..!
సాక్షి లేక, ఉన్నా సాక్ష్యం పలకలేక
కళ్ళున్నా గుడ్డితనం ఆపాదించుకున్న
భారత మాత నిర్వీర్యం!!

నిజం! అదే అందమైన ప్రకృతిలో
అంధవిహీనం పులుముకున్న
మన జాతి, నీతి, నిజాయితీ..
తప్పులెక్కడని వెతకాలీ,
తప్పులేనిదెక్కడనీ చూపాలీ..!!
ఒక్కరూ,.. ఒక్కొక్కరూ.. మనమై కదలాలి..
కావాలి, కరగాలి, కరుడుగట్టిన
మనసు పొరల్లో మార్పు రావాలి..
కలవాలి, ఖండించాలి, విబేధించాలి..
అవినీతి కూకటి వేళ్ళ సామ్రాజ్యాన్ని
మహా ప్రక్షాళనం కావించాలి!!



4 Responses to మహా ప్రక్షాళనం..!!

  1. Prof. Rama Krishna Adury
    July 22, 2013 at 12:01 pm

    వెతలు,వేదనలు,రోదనలు,ఈ నిష్క్రియత్వం నుంచి ఒక గొంతు ఎలుగెత్తింది. పరిష్కార దిశలో అడుగు ముందుకు పడింది.

    • kavi savyasaachi
      August 16, 2013 at 5:50 pm

      ఒకానొక చల్లని సమీరపు సాయంత్ర వేళల్లో…
      ఓలలాడుతోన్న చిటారుకొమ్మల్ని
      చూస్తూ..చుట్టూ పరికించాను-
      కాంక్షా జ్వాలలు ఎగసిపడే విషపు చూపుల్లో..
      కామపు మత్తులో జోగుతోన్న మానవత్వంలో..
      పసి కూనల, పడతుల మాన ప్రాణాలు
      దహించుకుపోతోన్న దుస్థితి..!
      శిక్షే వేయలేని న్యాయస్థానాలు,
      కక్షే మేలన్న వాదనలు..
      వేదన రోదనల మధ్య ప్రక్షాళన
      చేయలేని నపుంసకత్వపు పాలన అనిశ్చితి..!! ee spandana …raavaali…ituvanti kavitvam…kaavaali

  2. Thirupalu
    August 16, 2013 at 10:52 pm

    ‘వేదన రోదనల మధ్య ప్రక్షాళన
    చేయలేని నపుంసకత్వపు పాలన అనిశ్చితి..!! ‘
    నపుంసకత, పుంసకత జెండెర్‌ కి అవమానం!
    ప్రభుత్వాల పాలనకు ప్రతీకలుగా వాడడం!
    ప్రకృతి సహజమైన జెండర్‌ ని వికృతి గా పాడడం!
    పురాతన కాలపు మనుషులు కాలుతున్న వాసన!
    చారిత్రక అవసరానికి తగిన ప్రతీకలుగా కావాలి ఇప్పుడు!

    • Thirupalu
      August 16, 2013 at 10:54 pm

      ‘వేదన రోదనల మధ్య ప్రక్షాళన
      చేయలేని నపుంసకత్వపు పాలన అనిశ్చితి..!! ‘
      ప్రభుత్వాల పాలనకు ప్రతీకలుగా వాడడం!
      ప్రకృతి సహజమైన జెండర్‌ ని వికృతి గా పాడడం!
      ‘ నపుంసకత,’ పుంసకత’ మ్యాన్‌ మేడ్‌ అవమానం!
      పురాతన కాలపు మనుషులు ఇచ్చిన బహుమానం!
      ఇది ఏర్చలేని కూర్చలేని ప్రతీకల ప్రభుత్వం!

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)