మా పరీక్షా మందిరానికి ఉన్న చిన్న కిటికీ లోంచి బయటకి చూస్తే ఖాళీగా ఉన్న నిరీక్షా మందిరం, ఆ బయట కచ్చా రోడ్డు, ఆ రోడ్డుకి ఇరుపక్కలా ఎర్రటి ఎండలో మాడుతూన్న సీనారేకు కప్పులతో ఉన్న గుడిసెలు కనిపించేయి. ఇంక ఆట్టే వ్యవధి లేదు. చీకటి పడే లోగా కేలిఫోర్నియా చేరుకోవాలంటే ఇక్కడ మూటా, ముల్లె సర్దుకుని, కారు వచ్చే వేళకి సిద్ధంగా ఉండాలి.
మేము – అంటే కొంతమంది వైద్యులు, నర్సులు, దుబాసీలు – అంతా కలసి మెక్సికోలో మారు మూలన ఉన్న ఈ చిన్న కుగ్రామానికి మొన్ననే వచ్చేం. కేలిఫోర్నియా-మెక్సికో సరిహద్దుకి దక్షిణంగా ఉన్న బాహాలో చిన్న చిన్న ఊళ్లకి నెలకోసారి వచ్చి, ఒక వారాంతం ఇలా వైద్య శిబిరం వేసి, అక్కడ ఉన్న బీదసాదలకి ఉచితంగా వైద్యం చెయ్యాలన్న సంకల్పమే ఈ ప్రయాణానికి కారణం.
ఈ ప్రయత్నానికి పూర్వగాథ లేకపోలేదు. అమెరికాలో ఉన్న తెలుగు వారు కొందరు ఇక్కడ లభ్యమయే వైద్య సౌకర్యాలు మన దేశంలో లేవే అని బాధ పడి ఈ సౌకర్యాలని అక్కడకి బదిలీ చెయ్యడానికి ప్రయత్నాలు చేసేరు. ఈ రకం ప్రయత్నాలు రెండు దిశలలో వెళ్లేయి. పెద్ద ఎత్తున, పెద్ద నగరాలలో, ఐదు తారల ఆసుపత్రులు కట్టి ఉన్నత సదుపాయాలని, సేవలని సంపన్నుల అందుబాటులోకి తేవడం ఒక దిశ. కనీసమైన వైద్య సదుపాయాలు లేని పల్లేటూళ్లకి వెళ్లి, అక్కడ వైద్య శిబిరాలు వేసి, బీద ప్రజలకి వైద్యం ఉచితంగా చెయ్యడం రెండవ దిశ. ఈ రెండవ దిశలో ఎంతగానో ప్రయత్నం చేసిన డాక్టరు గవరసాన సత్యనారాయణ, నేను గణించిన అనుభవాన్ని పురస్కరించుకుని, లాభాపేక్ష లేకుండా ఎక్కడో దూరంగా ఉన్న భారత దేశానికి వైద్య సేవలు అందించడంలో ఉన్న కష్ట సుఖాలని బేరీజు వేసుకుని, ప్రయోగాత్మకంగా మరొక కొత్త దారి వెతకడం మొదలు పెట్టేం.
అమెరికాలో కూర్చుని మాతృదేశానికి సహాయం చేద్దామని కలలు కనేవారు అనేకులు ఉన్నారు. ఈ కలలన్నీ కలలుగానే మిగిలిపోవడానికి ఉన్న అనేక కారణాలలో, చాప కింద నీరులా, ఒక ముఖ్య కారణం ఉంది. ఒక సారి, సా. శ. 2000 మొదటి దశకంలో, ఇకో ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి భారత దేశంలో ఉన్న బడుగు వర్గాలవారికి సహాయం చేద్దామని ప్రయత్నించేం. అమెరికా నుండి డాలర్లు ఇండియా తరలించడానికి హైదరాబాదులో ఇకో ఫౌండేషన్ ని స్వచ్ఛంద సంస్థగా నమోదు చేసి, డాలర్లు బదిలీ చెయ్యడానికి అనుమతి కావాలంటూ దరఖాస్తు పెట్టుకున్నాం. పది వేలు ముడుపు చెల్లిస్తే పని నిమిషాల మీద అయిపోతుందని మాకు కబురు పెట్టేరు. “అయ్యా, ఇది స్వచ్ఛంద సంస్థ. లాభాలకోసం వ్యాపారం చేసే సంస్థ కాదు. మా స్వంత డబ్బులు పెట్టుకుని, ఇక్కడకి వచ్చి, ప్రజోపయోగమైన పనులు చెయ్యాలని మా సంకల్పం. మీరు ఈ సందర్భంలో కూడ చెయ్యి చాచడం ధర్మం కాదు.” అని మనవి చేసుకున్నాం. “మీకు ప్రజా సేవ చెయ్యాలని ఉంటే ముందు మా సేవ చెయ్యండి. లేకపోతే మీకు డాలర్లు మార్చుకునే అనుమతి రాదు,” అని నిష్కర్షగా చెప్పేరు. లంచాలు ఇవ్వడం ఇష్టం లేక మా ప్రయత్నాన్ని భారత దేశం నుండి మెక్సికోకి మరలించేం.
భారతదేశం లాంటి బడుగు దేశమే మా పక్కనే ఉన్న మెక్సికో. వారాంతంలో రెండు రోజులు అక్కడ మా ఉపచారాలు అందించి, తిరిగి ఇంటికి చేరుకోవడంలో ఉన్న సౌకర్యం ఇండియా వెళ్లి తిరిగి రావడంలో లేదు. అందుకని నెలకో వారాంతం, మాలో చిన్న జట్టు మెక్సికో వెళ్లి, అక్కడ బీదలకి ఉచితంగా వైద్యం చేసి వద్దామనే బుద్ధి పుట్టింది. మానవ సేవ చెయ్యడానికి మెక్సికో వాళ్లయితేనేమిటి? మనవాళ్లయితేనేమిటి?
మమ్మల్ని సంప్రదించడానికి వచ్చే రోగులు ఆ మండుటెండలో, ఆ దుమ్మురేగుతూన్న రోడ్ల మీద, నాలుగేసి గంటలు ప్రయాణాలు చేసి వస్తూ ఉంటారు. అందుకని శిబిరం కట్టేసేలోగా, మిగిలిన గంటలో, ఎవ్వరైనా వేచి ఉంటే చూడవచ్చు కదా అని కిటికీలోంచి బయటకి చూసేను.
“ఇదిగో ఈ సినోరిటా తో ఆఖరు. ఈమెని చూసి పంపించేసరికి మన వేను వచ్చే వేళవుతుంది.” అంటూ మాతో పనిచెయ్యడానికి వచ్చిన ఒక స్వచ్ఛంద సేవకి చెప్పింది.
అలా ఆఖరు క్షణంలో వచ్చిన స్త్రీ వయస్సు ముప్ఫయి ట. కాని, నా కంటికి ముప్ఫయి ఏళ్లు పైబడ్డట్లే కనిపించింది. ఈ ప్రాంతాలలో – ఈ ఎండలకి, సరి అయిన పోషణ లేక, జీవనపోరాటంలో అలసిపోవటం వల్ల – ప్రజలు వయస్సుకి మించి పెద్ద వాళ్లల్లా కనిపించడం కూడ సర్వసాధారణం.
బట్టకట్టు, తీరు సంసారపక్షంగానే ఉన్నాయి. అంత ఎండలోనూ ఒళ్లంతా కప్పే జంబుఖానా గుడ్డతో చేసిన ‘పాంచో’ వేసుకుంది. కూర్చోవడమా నిలబడే ఉండడమా అనే తటపటాయింపు, దుబాసీ వైపు చూస్తూ మాట్లాడడమా, నా వైపే చూస్తూ మాట్లాడడమా అనే సంధిగ్ధత – ఈ లక్షణాలన్నీ చూసి సిగ్గేమో అని అనుకున్నాను.
ఆగంతకురాలిని కూర్చోబెట్టి మా దుబాసీ మాట్లాడడం మొదలుపెట్టేడు. ఆమె పేరు మరియా. ఎప్పుడూ నీరసంగా ఉంటుందిట. ఈ నీరసం ఈ నాటిది కాదు; రెండు, మూడు ఏళ్లబట్టి నీరసంగానే ఉంటోందిట. నెల్లాళ్ల కిందటే వాళ్ల ఊళ్లో ఒక డాక్టర్‌ని సంప్రదించిందిట.
“ఎనీమియా అని చెప్పేరు.”
మరియాని మరోసారి ఎగా దిగా చూసేను. ఎనీమియా లక్షణాలేవీ నా కంటికి పొడచూపలేదు. ఇంగ్లీషులో ఎనీమియా అన్న మాటతో సరితూగే తెలుగు మాటలు చాల ఉన్నాయి: రక్తహీనత, రక్తలేమి, రక్తక్షీణత, వికీలాలం, విరక్తం, మొదలైనవి. ఏ పేరుతో పిలిచినా ఈ మాట అర్థం రక్తం లేకపోవడం కాదు; రక్తంలో ఎర్రకణముల సంఖ్య తగ్గడమే!
“మీ ఊరి డాక్టరు రక్తం పరీక్ష చేసే చెప్పేడా?”
“లేదు. నా కళ్లు చూసి చెప్పేరు.”
ఇప్పటికీ మన దేశంలో కూడ వైద్యులు కింది రెప్పని కిందికి లాగి చూస్తారు. రెప్ప లోపలి భాగం పాలిపోయినట్లు ఉంటే రక్తలేమి అని నిర్ధారిస్తారు. రక్తానికి ఎరుపు రంగునిచ్చే రక్తచందురం బాగా లోపిస్తే తప్ప కంటి రెప్ప లోపలి భాగం పాలిపోయినట్లు అంత త్వరగా కనిపించదు. ఈ సిద్ధాంతాలు ఎలా ఉన్నా మరియాకి రక్తలేమి దోషం ఉందని నాకు అనిపించలేదు.
మరి మరియాకి రక్తలేమి దోషం ఉందని ఎవ్వరు చెప్పేరో నాకు తెలియదు: నాటు వైద్యుడు కావచ్చు, వైద్య కళాశాలలో చదువుకున్న పండితమ్మన్యుడు కావచ్చు లేదా ఏ వైద్యుడి దగ్గరో నర్సుగానో, కంపౌండర్‌గానో కొద్ది కాలం పని చేసి, బల్ల కట్టేసి వైద్యం చేసేస్తూన్న వ్యక్తి అయినా ఆశ్చర్యపోను.
“ఆ వైద్యుడు మందు ఏదైనా ఇచ్చేడా?”
“ఇచ్చేడు.”
“ఆ మందు వేసుకున్నావా?”
“వేసుకున్నాను.”
“గుణం కనిపించలేదా?”
“లేదు.”
రక్తలేమి, లేదా ఇంగ్లీషులో ఎనీమియా, మనిషిని నీరసపరచే రోగమే. కాదనను. పిన్న వయస్సులో ఉన్న ఆడవాళ్లకి రక్తలేమి వచ్చిందంటే దానికి కారణం శరీరంలో ఇనుము కొరత. ఈ కొరతకి ముఖ్య కారణం నెలనెలా రుతు సమయంలో పోయే రక్తం. కాని మరియా రుతుస్రావం మోతాదు మించి లేదని చెబుతోంది. ఆమె మరేవిధంగాను రక్తం నష్టపోవటం లేదని ప్రశ్నల మీద తేలింది. ఇంతకు పూర్వం ఎప్పుడూ కూడ ఆమెలో రక్తలేమి పొడచూపలేదు.
మరియాని మరికొంచెం పరీక్ష చేసేను. ముఖం పాలిపోయినట్లు లేదు. గుండె జోరుగా కొట్టుకోవడం లేదు. ఈ రెండు లక్షణాలు రక్తలేమి సూచికలు. ఇటువంటి పరిస్థితులలో రక్త పరీక్ష చేస్తే అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. కాని ఈ ‘శంకరగిరి మన్యాలలో’ రక్త పరీక్ష సాధ్యం కాదే. నిజంగా నీరసమే కారణం అయితే ఈమె, ఈ ఎండలో, ఇంత దూరం, ఒంటరిగా ఎందుకు వస్తుంది? ఎలా రాగలుగుతుంది? ఇక్కడేదో మర్మం ఉంది.
నీరసం అనేది వైద్యులు ఎదుర్కొనే సర్వసాధారణమైన లక్షణం. కారణం కేన్సరు కావచ్చు. లేదా, నిద్ర సరిపోకపోయినా నీరసం వస్తుంది. తగినంత వ్యాయామం లేకపోయినా నీరసం వస్తుంది. ఉపతాపి వచ్చి “నాకు నీరసంగా ఉంది, మందు ఇవ్వండి,” అని అడిగితే ఏ మందని ఇస్తాం? ఆ నీరసానికి కారణం తెలియాలి కద. రోగి మరే ఆధారమూ ఇవ్వకపోతే వైద్యుడు ‘అ’ నుండి ‘బండిర’ వరకు అన్ని కారణాలు వెతకాలి.
వెతికేను. నా మెదడులో దాచుకున్న రోగాల జాబితాని అకారాది క్రమంలో వెతికేను. చివరికి మిగిలిందేమిటి? సున్న. పెద్ద బండి సున్న. ఇదే పరిస్థితి మా ఊళ్లో ఉన్నప్పుడు ఎదురైతే రక్తం పరీక్ష అనీ, ఎక్సు-రే అనీ, రకరకాల పరీక్షలు చేయించి ఉండేవాడిని.
ఇక్కడ? కుళాయిలో నీళ్లు వచ్చి ఎలట్రీ దీపాలు వెలిగితే పరమానందం పడే ప్రదేశం ఇది. కనుక రక్తపు పరీక్షల వంటి విలాసాల గురించి ఆలోచించడం దండగ.
మరియా వైపు మరొక సారి చూసేను. ఈమె వచ్చి ఇరవై నిమిషాలు అవుతోంది. ఇంతవరకు ఈమె నా వైపు కాని, దుబాసీ వైపు కాని కన్నెత్తి చూడలేదు. మొదట్లో సిగ్గు అనుకున్నాను. తరువాత అమెరికా నుండి వచ్చిన పెద్ద డాక్టరు వైపు చూడడానికి భయం అనుకున్నాను. ఇది సిగ్గూ కాదు, లజ్జా కాదు, భయమూ కాదు; మనస్సుని పట్టి పీడిస్తూన్న ఒక విచారమో, తలవంపో అయి ఉండాలని అని అనుమానం వేసింది.
ఆమె ముఖం లోకి మరోసారి చూసేను. ముఖంలో ఎక్కడా ఉద్వేగం లేదు. భుజాలు దిగజారిపోయి ఉన్నాయి. ఆమె మాట్లాడుతూన్నప్పుడు చేతులతో భంగిమలు చెయ్యడం కనబడలేదు. మాటల్లో ఉదాత్త అనుదాత్త స్వరాలు వినబడలేదు. ముఖకళవళికలలో చైతన్యం లేదు. ఆమె మాట్లాడే స్పేనిష్ భాష నాకు అర్థం కాకపోయినా ఈ లక్షణాలకి భాషతో ప్రమేయం లేదు. తటాలున నా మనస్సులో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది.
దుబాసీ వైపు తిరిగి, “సంసారంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అడుగు,” అన్నాను.
ఆమెకి ఇద్దరు పిల్లలుట. చిన్నవాడికి ఒక ఏడు నిండింది. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారుట. కాని వాళ్లని సాకడం అంటే ఎడతెగని పని. మొగుడు ఇంట్లో వేలెత్తి పని సహాయం చెయ్యడుట. పైపెచ్చు ప్రతి రోజూ మస్తుగా తాగి వస్తాడుట. తలకి మించిన పని భారంతో సతమతం అవుతోందిట.
“ఈ బాధలు పడలేనప్పుడు ఏడుస్తావా?”
“రోజూ.”
“చచ్చిపోతే బాగుండును అని ఎప్పుడైనా అనిపిస్తుందా?”
ఈ ప్రశ్నకి సమాధానంగా భుజాల నుండి మోకాళ్ల వరకు దిగజారి ఉన్న పాంచోని పక్కకి తొలగించి చేతులు చూపించింది.
రెండు చేతులకీ, మణికట్టు దగ్గర, మానుతూన్న గాట్లు కనిపించేయి. బహుశా ఏ రెండు వారాల క్రితమో తగిలి, మానుతూన్న కత్తి దెబ్బల గాట్లు అవి!
ఆ గాట్లు ఎవరి వల్ల కలిగేయో తెలుసుకోవాలి. తాగొచ్చిన మొగుడు దౌర్జన్యం చేసేడా? లేక పోతే, ….. రెండు నిమిషాలు ఆలోచించి, కొంచెం తటపటాయించి, “ఇది నీ పనేనా?” అని అడిగేను.
ఒంచిన తల ఎత్తకుండా, నేల మీదే ఎక్కడికో చూస్తూ, “సీ” అని సమాధానం చెప్పింది.
ఈ “సీ” తో ఆమె అసలు రహశ్యం బయటపడింది. నిరాశావృతం అయిన ఆమె జీవితానికి పరిష్కారం దొరక్క, నిస్పృహతో, తన పిల్లల యెడల తనకున్న బాధ్యతలని కూడ విస్మరించి – ఒక్క క్షణ కాలం – ఆమె అఘాయిత్యానికి తలపెట్టింది. ఒంచిన తల ఎత్తకుండా ఉండడానికి కారణం స్త్రీ సహజమైన సిగ్గు కాదు. తను తలపెట్టిన తలవంపుల పనికి తలెత్తుకు తిరగ లేక.
పాశ్చాత్య దేశాలలో మానసిక వైద్యుడి దగ్గరకి వెళ్ళడంలో నామోషీ లేదు. ఫ్రతి చిన్న విషయానికి మానసిక వైద్యుణ్ణి గంట సేపు సంప్రదించి, రెండొందలు చెల్లించుకుని, మూడు వారాల తరువాత మళ్లా వస్తూ ఉంటారు వీళ్లు. కాని సనాతన ఆచారాలు పాతుకుపోయిన దేశాలలోను, బడుగు దేశాలలోనూ, వర్ధమాన దేశాలలోనూ, మానసిక వైద్యుణ్ణి సంప్రదించడం అంటే నామోషీ.
మానసిక రుగ్మతలు ఎన్ని ఉన్నా చాపకిందకి తోసెస్తారు తప్ప పైకి పొక్కనివ్వరు. అందువల్లనే మరియా సాయంత్రం వరకు ఆగి, మా క్లినిక్ మూసేసే వేళకి, రోగులంతా వెళ్లిపోయిన తరువాత, అంత ఎండలోనూ, జంబుఖానా లాంటి పాంచో ఒంటి నిండా కప్పుకుని, వచ్చింది – ఎవ్వరైనా చూస్తే గుర్తు పడతారేమోనన్న భయంతో.
విపరీతమైన విచారం, ఆత్మ న్యూనత, విలాసాల మీద అయిష్టత – ఇవన్నీ మనోవ్యాకులత లేదా డిప్రెషన్ అనే మానసిక రుగ్మతకి లక్షణాలు. ఈ మనోవ్యాకులతతో బాధ పడేవారికి భయం, విచారం వంటి ఉద్వేగభరితమైన లక్షణాలే కాకుండా భౌతికమైన లక్షణాలు కూడ పొడచూపుతాయి: ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అలసట, నీరసం. మానసిక లక్షణాలు చెబితే పిచ్చివాళ్లల్లా జమకట్టెస్తారేమోనని సాధారణంగా రోగులు వైద్యుడి దగ్గరకి వెళ్లినప్పుడు కేవలం భౌతిక లక్షణాలని ఎత్తి ఏకరవు పెడతారు. మనోవ్యాకులత లేదా డిప్రెషన్‌ని గుర్తించడం ప్రగతి సాధించిన పాశ్చాత్య దేశాలలోనే కష్టం. అటువంటిది, అసలు లక్షణాలని కప్పెట్టి, వడ్డీ లక్షణాలని ఎత్తి చూపే బడుగు దేశాలలో డిప్రెషన్ ని గుర్తించడం కష్టతరం.
నాకు బయలుదేరే వేళ అయిపోతోంది. ఆత్మహత్యకి తలపెట్టిన ఈ పిల్లల తల్లికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? ముందుగా మరియాని బాధిస్తూన్న రోగం ఏమిటో ఆమెకి వివరంగా చెప్పేను. మానసిక రోగాలు సర్వసాధారణం, ప్రపంచ వ్యాప్తం అని కూడ బోధ చేసేను. శరీరానికి రోగం వస్తే మందు వేసుకున్నట్లే, మనస్సు దెబ్బ తింటే దానికి కూడ మందులు ఉన్నాయనీ, వాటిని వాడడం సంఘంలో తలవొంపులకి దారి తియ్యదనీ నచ్చచెప్పేను.
మరియాకి మరొక విషయం కూడ చెప్పేను. ఇందులో ఆమె చేసిన తప్పు కాని, పాపం కాని ఏదీ లేదని మరీ మరీ చెప్పేను. మందులు వేసుకుంటే కొంత కాకపోయినా కొంత ఊరట కలుగుతుందని ప్రోత్సాహ పరచేను. “నేను డాక్టర్ని. నేనేమిటి చెబుతున్నానో నాకు తెలుసు” అంటూ మరియాకి నా మాటల మీద నమ్మకం కలగాలని స్వోత్కర్ష అయినప్పటికీ ఉపదేశ వాక్యాలు చెప్పేను.
మా వైద్య శిబిరంలో మందుల కంపెనీలు దానంగా ఇచ్చిన మందులు కొన్ని ఉన్నాయి. వాటిల్లోంచి డిప్రెషన్‌కి పనికొచ్చే మందు ఒకటి, నెల్లాళ్లకి సరిపడా, ఇచ్చి ఆ మందు రోజూ వేసుకుని, నెల్లాళ్లు పోయిన తరువాత మళ్లా శిబిరానికి రమ్మనమని చెప్పేను. “నేను రాకపోయినా ఎవరో ఒకరు చూసి మళ్లా మందు చీటీ రాసిస్తారు” అని ధైర్యం చెప్పేను.
మందు మాత్రలు అంటే ఇచ్చేను కాని మానసిక రోగులకి “ఒక పెద్ద దిక్కు, ఒక సలహాదారు” అంటూ ఒకళ్లు అవసరం. అంటే మన బాధని సానుభూతితో వినే నాథుడు ఉండాలి. బడుగు దేశాలలో అయితే మనకి తాతలో, అవ్వలో, అత్తలో, స్నేహితులో, ఎవ్వరో ఒకరు ఉంటారు. మన గోడు వాళ్ల దగ్గర వెళ్లబోసుకుంటాం. మన సంఘంలో మనకి ఏ పక్కింటి పిన్నిగారో, బామ్మగారో మనకి సైకియాట్రిస్టులు. గంటకి రెండు వందలు పుచ్చుకోకుండా పని చేసి పెడతారు. పైపెచ్చు, సలహా చెబుతూన్నట్లు కాకుండా ఏ పువ్వులజడో వేస్తూ, చెప్పవలసిన విషయం నెమ్మదిగా చెబుతారు. అందుకని మరియాని అడిగేను.
“నీ కష్టసుఖాలు చెప్పుకోడానికి, నీతో చనువుగా ఉండి నీ హితవు కోరే వాళ్లెవరైనా ఉన్నారా?”
“మా చెల్లెలు ఉంది. ఒక మంచి స్నేహితురాలు కూడ ఉంది.”
“అయితే నువ్వు ఇక్కడికి వచ్చిన వయినం, నేను మందు ఇచ్చిన వయినం వారితో చెప్పి, మానసిక రోగం సర్వసాధారణం అని డాక్టరు గారు చెప్పేరనిన్నీ, దీనికి మందులు ఉన్నాయని చెప్పేరనిన్నీ చెప్పు. చెప్పి గుండె మీద బరువు దింపుకో. నీ పిల్లలని సాకుతూ, నెల తిరిగిన తరువాత మళ్లా వచ్చి డాక్టరుని చూడు. నీకు నయం అవుతుంది.”
అలాగే అన్నట్లు తల ఆడించింది.
నేను చెప్పినది అంతా అర్థం అయిందో లేదో అని ఆమె ముఖ కళవళికలు పరీక్షగా చూసేను. ముఖంలో మార్పు ఏమీ కనిపించలేదు. అయినా మందు సీసా అందించిన అయిదు నిమిషాలలో గుణం కనిపిస్తుందని ఆశించడం పేరాసే!
అరగంట తిరిగేసరికి 6,000 అడుగుల ఎత్తున ఇంటికి వెళ్లే చిన్న విమానంలో ఉన్నాను.
రెండు నెలలు పోయిన తరువాత మా బృందంలో పనిచేసే మరొక వైద్యుడు తటస్థ పడ్డాడు. అతను మరియాని నెల కిందట చూడడం జరిగిందిట. బాగా మెరుగ్గా ఉందని చెప్పేడు. నేనిచ్చిన మందు సీసా అయిపోతే మరొక సీసా ఇచ్చేరుట.
మరియాలో కనిపించిన మార్పుకి కారణం ఎక్కడుందా అని ఆలోచించేను. ఎంత ప్రాణాంతకమైన రోగం అయినా ఎదురైనప్పుడు పరికరాలు, పనిముట్ల కంటె వైద్యుడి సమయస్పూర్తి, పనితనం ముఖ్యం. ఒకొక్కప్పుడు వైద్యం చెయ్యడానికి కావలసిన మొదటి పరికరం వినే చెవి. ఉపతాపి గదిలోంచి ఎప్పుడు వెళుతుందా అని ఎదురు చూడకుండా చెప్పినవన్నీ జాగ్రత్తగా వినడం మొదటి మెట్టు. కావలసిన రెండో పరికరం వైద్యుడి కన్ను. వైద్యుడు రోగిని పరీక్షగా చూస్తూ, చెప్పేది వింటూ, నోటితో చెప్పని విషయాలని చేష్టలని బట్టీ, కళవళికలని బట్టీ సంగ్రహించాలి. ఇదీ నేను నేర్చుకున్న పాఠం.
Its very nice
@”ఒక్కొక్కప్పుడు వైద్యం చెయ్యడానికి కావలసిన మొదటి పరికరం వినే చెవి.”
చివరి పేరాలోని ఈమాట చాలా నిజం. అమెరికా సంగతి నాకు తెలియదుగాని, ఇక్కడ నేను చూసిన చాలామంది డాక్టర్లలో ఈగుణం ఒక్కొక్కప్పుడు కూడా కనపడలేదు. కొట్టొచ్చినట్లు కనపడేవి అసహనం, నిర్లక్ష్యం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల నిర్లక్ష్య ధోరణికి జనం అలవాటు పడిపోయారు గాని, కొంతమంది ప్రైవేట్ డాక్టర్లలో కూడా ఈ లక్షణాలు కనపడటమే ఆశ్చర్యం. (నేను వ్రాసింది డాక్టర్లకు కోపం తెప్పించొచ్చు. కాని నేను మాట్లాడుతున్నది టేబుల్ కి ఇవతలి పక్కనుంచి.).
మీ అనుభవం గురించి వ్రాసినది ఆసక్తికరంగా ఉంది. బహుశా డాక్టర్లకి కూడా ఉపయోగపడుతుందేమో.
(“ఉపతాపి” అంటే రోగి అని అర్ధమా?)
ఉపతాపము అంటే illness, grief, trouble మొదలైన అర్థాలు ఉన్నాయి. కనుక ఇంగ్లీషులో patient అన్న మాటకి ఉపతాపి సమానార్థకంగా వాడేను. వైద్యుడిని సంప్రదించడానికి వెళ్లిన వారు అంతా రోగులు కానక్కర లేదు అన్న భావాన్ని వ్యక్త పరచడానికి తెలుగులో కూడ “రోగి” కంటె సున్నితమైన మాట ఉంటే బాగుంటుందని మరుగున పడిపోయిన ఈ మాటని పునరుద్ధరించడానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది.
రచనలో తెలుగుపట్ల మీరు తీసుకున్న శ్రద్ధకు జోహార్లు. ఆంగ్ల పదాలు పాతుకుపోయిన ఈ కాలంలో, అదీ విదేశంలో జరిగిన కథకు సహజంగా అచ్చతెలుగును వాడటమన్నది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎంత కష్టపడ్డారో తెలియదుగానీ, ఇది సాధ్యమని నిరూపించిన మీ పనితనానికి జోహార్లు!
మీలాంటి పాఠకులు కోటికి ఒక్కరు ఉంటేచాలు, నా లాంటి రచయితలని ప్రోత్సహించడానికి! ఇంగ్లీషు కథలలోను, వ్యాసాలలోను, అనవసరంగా ఇతర భాషా పదాలు గుప్పిస్తే ఎవ్వరూ మెచ్చుకోరు. ఒక వేళ అత్యవసర పరిస్థితులలో ఇతర భాషా పదాలు వాడవలసి వచ్చినా వాటిని ఇంగ్లీషు లిపిలోనే రాయాలి, రాస్తారు. ఈ సంప్రదాయం పాశ్చాత్య భాషలన్నిటిలోనూ ఉంది. తెలుగు వ్యాసాలలోను, కథలలోను, మనం ఇంగ్లీషు మాటలు నిస్సంకోచంగా వాడెయ్యడమే కాకుండా, ఇంగ్లీషు లిపి కూడ వాడెస్తాం. ఈ అలవాటు మార్చుకుంటే మన భాష అభివృద్ధి పొందుతుందని నా అభిప్రాయం.
వేమూరి వెంకటేశ్వర రావు గారు,
మీ విజ్ఞాన సాహిత్యానికి నేను గత ఐదు సంవత్సరాలుగా (నేను మొదట చదివినప్పటి నుండి) అభిమానిని. మీ జీవనది పుస్తకం కినిగే లో కొని చదివాను. సామాన్యులకు రక్తం గురించిన పూర్తి అవగాహన కల్పించిన ఆ పుస్తకం ప్రయోజనం పూర్తిగా సఫలీకృతమని అనిపించినది.
నీరసించిన ఉపతాపి గురించిన మీ ఈ వ్యాసం వచ్చిన కొద్ది రోజులకే, అబ్దుల్ కలాం గారు కూడా డాక్టర్లు మనసుతో వైద్యం చేస్తే బాగుంటుందని ఒక హొస్పిటల్ లో ఏర్పాటు చేసిన సభలో చెప్పారు.
మీరన్నట్టు మానసిక వైద్యం, పదిమందితో బాధలు పంచుకుని కొంత మానసిక భారం దింపుకునే పరిస్థితులు అభివృద్ది చెందుతున్న దేశాల ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలకు చాలా అవసరం.
ఈ వ్యాసం గురించిన నా అభిప్రాయం ఆలస్యంగా తెలియపరుస్తున్నందుకు మన్నించండి.
మున్ముందు మరిన్ని వ్యాసాలు ఆశిస్తూ,
అభినందనలు మరియు కృతజ్ఞతలతో,
నారాయణ గరిమెళ్ళ.
మీ జీవనది పుస్త కాన్ని నేను కూడా చదివాను సార్, మీరు ఇంగ్లీష సాంకేతిక పదాలకు తెలుగు పదాలను సృష్టించడం అద్బుతంగా వుంది. మీవంటి వారివల్లనే తెలుగు అభివృద్ది చెందాలి
అభినందనలు.
నారాయణ గారికి, తిరుపాలు గారికి:
వ్యాసంలా ఉన్న నా కథ (లేక కథలా ఉన్న నా వ్యాసం) చదివి కేవలం స్పందించడమే కాకుండా నా జీవనది పుస్తకం ప్రస్తావన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. పాఠకులలో కనీసం ఒక్కరైనా ఇలా స్పందించినంత కాలం ఇలాంటి రచనలు చెయ్యాలనే ఉత్సాహం పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇటువంటి “కథ” మరొకటి సంపాదకవర్గం పరిశీలనలో ఉంది. వారికి నచ్చి, ప్రచురిస్తే దానిని కూడ త్వరలోనే చూడగలరు.
- వేమూరి