మాట్లాడుకుందాం

పని అంటే ఏమిటి?

09-ఆగస్ట్-2013

“పని” అంటే ఏమిటి? ఇదీ ఓ ప్రశ్నేనా “అనే సందేహం కలగడం సహజం.కానీ, పని గురించి మనకు చాలా విషయాలు తెలీవు.”పని”అంటే వ్యాపారం అని చెబుతుంది “శబ్ద రత్నాకరం”.వ్యాపారంలో వస్తు మార్పిడి గానీ, ద్రవ్య మార్పిడి గానీ ఉంటుంది.వ్యాపారం కానిదేదీ పని కాదు. సో..క్రియలన్నీ పనులు కావు.చేతలు కొన్ని పనులు కొన్ని.”ఏం పని చేస్తున్నావ్?” అని ఎవరైనా ప్రశ్నిస్తే—“ఏం చేయడం లేదు.పళ్లు తోము కుంటున్నాను” అని అనాలి.ఎందు కంటే పళ్ళు తోము కోవడం పని కాదు గనుక.ఎందుకు పని కాదు?ఇందు లో ఏ వ్యాపారం జరుగ లేదు గదా!నీ పళ్ళు నువ్వు తోము కుంటున్నావ్.ఇందులో వస్తు మార్పిడి గానీ,ద్రవ్య(డబ్బు) మార్పిడి గానీ జరగడం లేదు గదా.అందు చేత నీ పళ్ళు నువ్వు తోము కోవడం,నీ తల నువ్వు దువ్వుకోవడం, నిద్ర పోవడం,నడవడం,చదువుకోవడం పనులు కావు.ఇవి చేతలు మాత్రమే.చేతలంటే క్రియలు.క్రియలు రెండు రకాలు.పనులు,చేతలు.పనులేవీ చేతలు కావు.కానీ,చేతల్లో కొన్ని పనులుంటాయి.నీ పళ్ళు నువ్వు తోముకుంటే చేత.ఇదే చేత డబ్బులు తీసుకొని ఏ గుడ్డి గుర్రానికో పళ్ళు తోమితే అది పని.నీ వంట నువ్వు చేసుకుంటే చేత.అదే నువ్వు డబ్బులు తీసుకొని ఎవరికైనా వంట చేసి పెడితే అది పని.సో..ఒక క్రియ ఆత్మాగతమైతే చేత.పరగతమైతే పని.

ఇక ఇప్పుడసలు విషయానికి వద్దాం.అమ్మ లేదా భార్య ఇంట్లో చేసే చేతలు పనులా? పై నిర్వచనాలతో పోల్చి చూద్దాం.అమ్మ లేదా భార్య ఇంట్లో వంట ఎవరి కోసం చేస్తుంది?ఇల్లు ఊడవటం,బట్టలు ఉతకడం—ఈ చేతలన్నింటిలోనూ వ్యాపారం లేదు గదా.సో—ఇవి పనులు కావు,చేతలు.ఈ చేతలు ఆత్మగతమే కాకుండా తన వారి కోసం ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేస్తుంది. కాబట్టి ఇది వ్యాపారం కాదు.వ్యాపారం కానిదేదీ పని కాదు.”ఏమ్మా ఏం పని చేస్తున్నావ్?” అని ప్రశ్నిస్తే,”ఏమీ చేయడం లేదు.వంట చేస్తున్నాను, బట్టలుతుకు తున్నాను”—అని చెప్పటం రైట్.లేక పోతే అది పని అనుకుంటే కొడుకు లేదా భర్త నీ పనులకు డబ్బు చెల్లించాలి.మరి “అలాంటప్పుడు అమ్మ లేదా భార్య చేసే క్రియల్ని ఏమనాలి?”.అవి చేతలే.చేతలు మానవ సంబంధాలను వ్యాపార రహితమైన,అనిర్వచనీయమైన,అవ్యక్తమైన క్రియలుగా చెప్పవచ్చును.

వ్యాపార దృక్పధం లేని చేతల్ని సేవలు అన వచ్చునా? అనవచ్చు.కానీ,చేతలన్నీ సేవలు కావు.ఫలాపేక్ష లేకుండా,బంధం లేకుండా పరులకోసం చేసే చేతలు సేవలు అనవచ్చు.కానీ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన వైద్య,విద్య వంటివి సేవలా?— అవి పాక్షిక సేవలు.ప్రభత్వం,ప్రజల మధ్య ఎలాంటి వ్యాపారం లేనపుడు అవి పాక్షిక సేవలు.ఎందు కంటే,వైద్యం చేసే డాక్టర్,విద్య చెప్పే టీచర్ వాళ్ళు చేస్తున్న చేతలకు జీతం తీసుకుంటున్నారు.అంటే ఇందులో వ్యాపారం జరుగుతుంది.కానీ ఈ చేతలను అనుభవిస్తున్న ప్రజలకు ,ఈ సేవల్ని అందిస్తున్న ప్రభుత్వానికీ మధ్య ఎలాంటి వ్యాపారం జరగడం లేదు.పరోక్ష ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి.కాబట్టి ఇవి పాక్షిక సేవలు.
ఏతా వాతా తేల్చి చెప్పబోతున్దేమంటే..అమ్మ లేదా భార్య అలాగే తండ్రి లేదా భర్త చేసే చేతలు పనులు కావు.చేతలు మాత్రమే.కాబట్టి వీరి చేతలకు విలువ కట్టాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు గదా!

ఇంకా చర్చిద్దాం.