కవిత్వం

నీటిమీద రాతలు కొన్ని

09-ఆగస్ట్-2013

చెరువు
చాన్నాళ్ళకు
నీళ్ళోసుకుంది.

కలువ, చేపా
కడుపులో
కదలాడుతుంటే-

అలలు అలలు గా
ఒడ్డును తాకుతూ
మాతృత్వపు మధురిమ.

***

నది మీద పడవ
పాటను
మీటుతోంది.

అపస్వరాల్ని
సరిచేస్తూ
తెడ్డు.

***

బరువునంతా
తీరానికి చేర్చేసి,
ఒంటరితనపు
భారంతో
దిగులుగా తిరిగి వెళ్తూ
ఓడ.