చెరువు
చాన్నాళ్ళకు
నీళ్ళోసుకుంది.
కలువ, చేపా
కడుపులో
కదలాడుతుంటే-
అలలు అలలు గా
ఒడ్డును తాకుతూ
మాతృత్వపు మధురిమ.
***
నది మీద పడవ
పాటను
మీటుతోంది.
అపస్వరాల్ని
సరిచేస్తూ
తెడ్డు.
***
బరువునంతా
తీరానికి చేర్చేసి,
ఒంటరితనపు
భారంతో
దిగులుగా తిరిగి వెళ్తూ
ఓడ.
నా కవితను ప్రచురించినందుకు, వాకిలి సంపాదకులకు ధన్యవాదాలు. అలాగే, రచనలు అందినపుడు, స్వీకరించామో లేదా తిరస్కరిస్తున్నామో, ఎప్పుడు ప్రచురిస్తామో అనే సమాచారాన్ని రచయితలకు తెలియజేసే మంచి సాంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను.
కవితలు ఎలాగైనా వ్రాయొచ్చు అంటే నీనేమీ చెప్పలేను
మీకు నచ్చినా నచ్చక పోయినా నా అభిప్రాయం చెబుతున్నాను
“చెరువు చాన్నాళ్ళకు నీళ్ళోసుకుంది.
కలువ, చేపా కడుపులో కదలాడుతుంటే-
అలలు అలలు గా ఒడ్డును తాకుతూ మాతృత్వపు మధురిమ.”
కలువలు నీటిపై తేలియాడుతూ ఉంటాయి
చెరువులో చేపలు ఎప్పుడూ ఉంటాయి
చెరువు నిత్యమూ నీళ్ళు పోసుకుంటూనే ఉంటుంది
చెరువు కదలిక లేనిది. అలలు ఉండవు
“నది మీద పడవ పాటను మీటుతోంది. అపస్వరాల్ని సరిచేస్తూ తెడ్డు.
బరువునంతా తీరానికి చేర్చేసి, ఒంటరితనపు భారంతో
దిగులుగా తిరిగి వెళ్తూ ఓడ.”
అవును మీ భావన బాగుంది కాదనడం లేదు
కాని నది మీద పడవ అలను మీటుతుంది తెడ్డు దిశను సరిచేస్తుంది
బరువునంతా తీరానికి చేర్చిన ఏ ఓడ తిరిగి కాళీగా వెళ్ళదు
వేరే బరువును వెంట తీసుకు వెళుతుంది
మీరు బాగానే వ్రాస్తున్నారు
కవిత చదవడానికి మాత్రమె బాగుంటే సరిపోదు
దడాల వెంకటేశ్వరరావు
very good poeem.
వెంకటేశ్వరరావు గారూ, మీ సునిశిత విశ్లేషణకు ధన్యవాదాలు.
కవితలు ఇలాగే రాయాలి (ప్రదానంగా వచన కవిత్వం) అనే నిబందనలు ఎక్కడైనా వున్నాయేమోకానీ, నాకు నిజంగా తెలియదు.
దృశ్యాలకు కాస్త ఊహలు అద్ది, పాఠకులకు అందంగా చూపించాలనే ప్రయత్నం మాత్రమే ఇది.
నీళ్ళు లేక ఎండిన చెరువు, వర్షాకాలంలో నీళ్ళోసుకున్నట్టు చెప్పడంలో అంతరార్థం అదే.
కలువా, చేపా,ఎక్కడైనా వుండనీ,. చెరువులో అంతర్భాగమనే నా ఉద్దేశం. కదలిక అంటే హిమాలయాల్లో పుట్టి, బంగాళాఖాతం వరకూ ప్రవహించడమే కాదు కదా? అలలంటే సముద్రపు కెరటాలంత వుండాలా?
వున్నదాన్ని వున్నట్టు చెబితే, పాఠకుడికి తృప్తి ఎలా ఇవ్వగలం. పడవ పాటను మీటడం, తెడ్డు అపస్వరాల్ని సరిచెయ్యడం లాంటి ప్రతీకలు అలాంటివే.
ఖాళీ గా ఓడ ఎందుకు వెళ్ళదు అని,నేను మీతో చిన్నపిల్లాడిలా వాదించడం, బాగుండదు.
అంతర్గతంగా ఓడను జీవితంతో అలా పోల్చి చెప్పాలనే ప్రయత్నం చేసాను.
ఐతే, మీరు ముక్కుసూటిగా మీ అభిప్రాయాన్ని చెప్పారు. దానికి మనస్పూర్తిగా నూటికి నూరు మార్కులు వేస్తున్నాను.
మీరన్నట్టు, కవిత చదవడానికి మాత్రమే కాదండి.అలాగే, చదివిన తర్వాత ఏమి చెయ్యాలో పాఠకుల్ని, నేను నిర్ధేశించలేను కదా.
ఏది ఏమైనా కవిత చదివిన పాఠకులు “ఇవి నీటిమీద రాతలే” అని అనుకొకూడదని నా అభిప్రాయం
భావాలు చాలా బాగున్నై సర్… ఇలా ప్రతి కవితకి అర్ధాలు వెతుకుతూ వెళ్తే సరైన కవిత రానట్టె లెక్క… సూపర్ కవిత సలాం…
Reddy ramakrishna garu, vijaykumar svk garu., thank you very much sir
రామకృష్ణ గారు,
నాదో చిన్న డౌట్! తీరుస్తారని ఆశిస్తా. భావకవిత్వానికి, మీ కవిత్వానికి తేడా ఏమిటి?
అంటే- నా ఉద్దేశం మీకవిత్వం బాగా లేదని కాదండోయ్! కేవలం తెలుసుకోవాలనే.
గౌ. తిరుపాలు గారు., మీ ప్రశ్నకు సరైన సమాధానం నిజంగా నాదగ్గర లేదండి. పైన చెప్పినట్టు, కవిత్వానికి సంబంధించి నిబంధనలు గానీ, వర్గాలుగానీ నాకు అవగాహన లేదు.
భావకవిత్వం లేదా వచన, మినీ, హైకూ, చందస్సు, ఇంకా చాలా వున్నా, నా ఆలోచనాపరిధి, అవగాహన, పరిశీలన, వీటికి లోబడి మాత్రమే నా కవితల్ని రాస్తున్నాను. .
మీలాగే ఈ ప్రశ్నకు సంబందించి నాకూ తెలుసుకోవాలని వుంది. వాకిలి పత్రిక సంపాదకులు దారి చూపగలరని విన్నపం.
రామకృష్ణ గారు,
మీకు తెలియక పోయినా కూడా మీ రెస్పాన్స్ కు ధాంక్స్!
కవిత్వం ఏ వర్గమైతేనేమి మనకక్కర్లేదు గాని, ఏదో రాస్తుంటె అదే ఏదో వర్గాని కి చెందుతుంది.
ప్రకృతి వర్ణనలతోటి మనకు బోలెడంత కవిత్వముంది.ఆ ప్రకృతిలో భాగమైన మన గురించి-ప్రకృతి తో పాటు సమాజం గురించి కూడా పట్టించు కొంటే మీకవిత్వం భవిష్యుత్తులో నీటి మీద రాతలు కాకుండ ఉంటుంది.
ధన్య వాదాలు
గౌ. తిరుపాలు గారు. మీ అభినందనకు ధన్యవాదాలు.
ఇక సున్నితంగా మీరు గుచ్చిన విమర్శకు నా సమాధానం :
సమాజాన్ని, సాహిత్యాన్ని ఉద్దరించడానికి నేను కవిత్వం రాయడం లేదు, రాయను. ముందుగా ‘నన్ను నేను ‘ ఉద్దరించుకోనివ్వండి. నా రచనలు ( ఎన్నో లేవు ) కొలమానికమో, తలమానికమో కావు.
సంపాదకులకు నచ్చినపుడు ప్రచురిస్తారు. మీకు నచ్చినపుడు మెచ్చుకుంటారు లేదా విమర్శిస్తారు. కానీ ఇలా రాయండి, అలా రాయండి అని తేలిగ్గా చెప్పేస్తే, రాసే శక్తి నాకు వుండాలి కదండి?
అలాగే ఏదో ఒక వర్గానికి ముడిపెట్టుకోడానికి, అందులోనే స్థిరపడిపోవడానికి నేను సిద్దంగా లేను.
నేను రాస్తూన్న కవిత్వానికి బిరుదులూ, గండపెండేరాలు అవసరం లేదండి. నా పరిధి చాలా స్వల్పం. నా సాహిత్యం నీటిమీద రాతలే. అందుకు ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు.