కవిత్వం

రూమీ –ప్రేమ

సెప్టెంబర్ 2013

ప్రేమ వ్యక్తీకరణలో హేతువు నిర్నిమిత్తం. ప్రేమికులు అయ్యేందుకు ప్రేమ నిజస్వరూపాన్ని చూపేందుకు ఒక్క ప్రేమకే సాధ్యం. మన ప్రవక్తల దారి ఒక సత్యం. జీవించాలని ఉందా, ప్రేమలో మరణించండి, సజీవంగా జీవించాలంటే ప్రేమలో మరణించండి.

మౌలానా జలాలుద్దీన్ రూమీ పేరే ప్రేమకు ప్రతి రూపం, ఒక అనంతంలోకి ఒక అజరామర నిరంతరానికి, ఒక పరవశ గమనం. ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రవక్త , ఒక మానవతా కవిత్వ మేధావి.
రూమీ కవిత్వాన్ని నిర్దేశించిన భావం ప్రేమ. నిరాకారనిరంతరుదిపై అవ్యాజమైన ప్రేమ. ఆలోచనపై అతని ప్రభావం, సాహిత్యం, ఒక సౌందర్య భావన, అనితర సాధ్యమయినవి.

అతని ప్రేమ కవితలు కొన్ని…


ఇదే ప్రేమంటే

ప్రతి క్షణం వందలాది మేలిముసుగులు జారి పోయేందుకు
ఒక రహస్యపుటాకాశం వైపు ఎగరడం
ముందు జీవించడాన్ని త్యజించడం
చివరికి కాళ్ళు లేకుండా అడుగులు వెయ్యడం
నేననిపించేది ఉపేక్షించటం
ప్రపంచం కనిపించినట్టు భావించడం

ప్రేమికుల వృత్తంలో ప్రవేశం
తనను తాను చూస్తూ అవతలి వైపు వీక్షిస్తూ
ఎద లోలోపలికి తొంగి చూసి
స్పర్శ అనుభవానికి
హృదయానిది ఎంత గొప్ప వరం

 

నిద్ర రాక …

నిద్రరాక రాత్రంతా
సంగీతాన్ని సృజిస్తాను
వసంత సుమాల రంగులో ఉన్న వదనం ఒకటి
ఇబ్బందిపెడుతూ ఉంటుంది నన్ను
అటునిద్రా ఇటు సహనమూ లేక
అటు నిరామయుని కీర్తిఇటు అపఖ్యాతీ లేవు
వెయ్యి తొడుగుల జ్ఞానం తరలిపోయింది
నా సత్ప్రవర్తన వేలమైళ్ళ దూరానికి కదలిపొయింది.

హృదయానిమూ మేధస్సూ కోపాలు రువ్వుకుంటూ
చుక్కలూ జాబిలీ ఒకరినొకరు ద్వేషిస్తూ
ఈ పరాధీనత భౌతిక ప్రపంచాన్ని క్షణక్షణానికీ బిగదీస్తూ..

“సూర్యుడు లేకుండా ఎంత సేపిలా వేళ్ళాడుతూ ఉండను?” జాబిలీ ఆరా
నాలోలోపల ప్రేమ రత్నం లేకుండా నా ఉనికి రహదారి
రాళ్ళు రాళ్ళుగా శిధిలమైపోనీ
వెయ్యిపేర్లతో పిలువబడే ఓ ప్రేమా
ఈ శరీరపు పాత్రలోకి మధువెలా వంపాలో
తెలుసు నీకు
వెయ్యి సంస్కృతులకు సంస్కృతి నిచ్చే నువ్వు
వెయ్యి మొహాలు ఉండీ ఏ మొహమూ లేని నువ్వు
టర్కీ వారో , యూరోపియన్లో , జానజిబారీలో –వారి మొహాలకు
ఆకృతి నిచ్చే ఓ ప్రేమా
నీ సీసాలోచి ఓ గ్లాస్ నాకూ ఇవ్వు
లేదూ నీ శాఖ నుండి ఓ గుప్పెడు గంజాయిని నాకివ్వు
ఇంకోసారి బిరాడాను తియ్యి
జానపద గాయకుల వృత్తం గీతాల మధ్య
వేలాది మంది ప్రముఖులు ప్రణమిల్లి కనిపిస్తారక్కడ
అప్పుడు లాలస జాతి వ్యసనపరుడు మళ్ళీ జీవిస్తాడు
తీర్పు చెప్పే ఉదయానికి
ప్రతీక్షలో ఆశ్చర్యంతో.

 

ఈ ప్రేమను ఎరుగని వారు…

నదిలా వారిని లాగే
ఈ ప్రేమను ఎరుగని వారు
వసంతజలం లా
ఒకకప్పు ఉదయాన్ని తాగలేని వాళ్ళు
రాత్రి భోజనంగా
సూర్యాస్తమయాన్ని తీసుకోలేనివాళ్ళు
ఏ మాత్రం మారదల్చుకోనివాళ్ళు
వాళ్ళను నిద్రపోనీ

ఈ ప్రేమ
నటనా నాటకాలకు
మతాలకూ ఉపదేశాలకూ అతీతమైనది
నేనూ నువ్వూ మన మనసులు ఆదిశలో
మెరుగు పరచుకుందాం
పడుకోనీ

నా మేధస్సు పై ఆశ వదిలేశాను
వస్త్రాన్ని ముక్కలు ముక్కలు చేసే
విసిరేశాను
నువ్వు పూర్తిగా నగ్నంగా లేకపోతె
అందమైన మాటల వస్త్రాన్ని
నీ చుట్టూ చుట్టుకో
ఆపైన మరి నిద్రపో

(వచ్చే నెల రూమీ నిగూఢ కవిత్వం)2 Responses to రూమీ –ప్రేమ

  1. vijay kumar svk
    September 6, 2013 at 2:10 am

    చాలా కొత్తగా వుంది మీ కవిత… సలాం…

  2. October 19, 2013 at 8:25 pm

    కాస్త ఆలస్యంగా చదివినందుకు క్షమించేయండి….నాకూ రూమీ ఓ అబ్సెషన్…మళ్ళీ రూమీని ఇలా నాకు కొత్తగా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ ప్రయత్నం అభినందనీయం.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)