కథ

మా నాయనమ్మ

సెప్టెంబర్ 2013

“నాయనమ్మ కలలోకి వచ్చిందే” పేపర్లోని వార్తలతో పాటు అమ్మ ఇచ్చిన కాఫీ ఆస్వాదిస్తోన్న సంధ్యతో చెప్పింది వింధ్య.

వావ్ .. నాయనమ్మ .. ఏమందేమిటి ” చూస్తున్న పేపర్ పక్కన పడేసి ఉత్సుకతతో సంధ్య

“సాధనమ్మ పాట పాడిందా.. ” తల్లి మొహంలోకి , పిన్ని మొహం లోకి పరీక్షగా చూస్తూ సాధన.

“సాధనమ్మ పాటా .. అదేంటి ?” ఆశ్చర్యంగా రామ్ .

“ఆ సాధనమ్మ పాటే .. మా తాతి నాపై కట్టిన పాట” గొప్పగా చెప్పింది సాధన

“ఏంటీ తాతమ్మగారు పాటలు కట్టేవారా .. ?” మరింత ఆశ్చర్యంతో రామ్.

“ఆ.. అవును .. మా తాతీ అంటే ఏమనుకున్నావ్ ” కాలరెగరేస్తున్నట్లు ఫోజిస్తూ సాధన

“చక్కటి అర్ధవంతమైన పదాలతో, ప్రాసలతో పాటలు కట్టడం మా నాయనమ్మ ప్రత్యేకత . సాధనని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ మొదటి పాట కట్టింది. ఆ తర్వాత దానికి కథలు చెప్తూ, పాటలు కట్టి పాడిస్తూ ఉండేది . మాకే చాలా ఆశ్చర్యంగా ఉండేది మా నాయనమ్మ సాహిత్యం, భాషా పరిజ్ఞానం చూసి. అయితే అవి ఎక్కడా రికార్డు కాలేదు. మేం యధాలాపంగా తీసుకున్నాం అప్పుడు. అదే చాలా బాధేస్తుంది” అన్నది వింధ్య గొంతులో బాధ ధ్వనిస్తుండగా.

‘నేను చిన్నప్పుడు ఈ ఇంట్లోనే పెరిగానుగా .. అప్పుడు తాతీ నాకు మంచి ఫ్రెండ్ .. నా పై కట్టిన పాట ఇప్పటికీ నాకు గుర్తే ” సాధన రామ్ కేసి చూస్తూ
‘ఏయ్ .. చెప్పు చెప్పు ఆ పాట ఏంటో ‘ కుతూహలం అపుకోలేక రామ్ , సాహిత్ ఇద్దరూ సాధనని తొందర చేస్తూ ..

‘సాధనమ్మ చక్కనమ్మ
వర్నిదమ్మ వయ్యారి భామ
బోధనమ్మ బంగారు బొమ్మ
ఇందూరు బొమ్మ ఇంపయినదమ్మ ” అంటూ నేను చేసే పనులను జోడించి పాట సాగేది.

‘హే .. భలేగుందే బంగారు బొమ్మ ‘ అనుకరిస్తూ రామ్

‘ఇందూరు అంటే మీ నిజామాబాద్ కద!’ సాహిత్

‘అత్తయ్యా మీ నాయనమ్మకి పాతికేళ్ళ క్రితమే ఇందూరు అంటే నిజామాబాద్ అని తెల్సా ..? సందేహంగా రామ్

‘అవును బాబూ .. మా నాయనమ్మ కట్టిన ఈ పాట ద్వారానే నాకూ తెలిసింది. ఆ తర్వాత తెలంగాణా ఉద్యమంతో అందరికీ బాగా తెలిసిందనుకో ‘ పక్కన వచ్చి కూర్చొన్న సాధన భుజంపై చేయి వేస్తూ వింధ్య

‘అమ్మా.. నాపై ఏం పాటలు పాడింది తాతీ ‘ తల్లిని ప్రశ్నిస్తూ సాహిత్

‘నీకు అంత సినిమా లేదమ్మా .. ‘ సాధన తమ్ముడిని ఆట పట్టిస్తూ

‘ఏం ఎందుకని ‘ తల్లి చేతిలోని పేపర్ తీసి పక్కన పెట్టి ఆమె భుజాలు పట్టి కుదుపుతూ సాహిత్

‘తాతీ స్వర్గం నుంచి రావాలిగా .. వెళ్లి తీసుకొస్తావా ‘ తమ్ముడిని ఉడికిస్తూ సాధన

‘పెద్దమ్మా .. ఇంతకీ మీ నాయనమ్మ ఏమంటోంది ? అసలు విషయం చెప్పనేలేదు ‘ దీర్గం తీస్తూ సాహిత్.

కల గురించి తెల్సుకోవాలన్న ఉత్సుకతతో వింధ్య కేసి చూశారంతా

‘కలంతా గుర్తు లేదు. కానీ, నేను తలనొప్పితో బాధపడుతున్నాను. నులక మంచం పై పడుకొని ఉన్నాను. నా మంచం పక్కనే కూర్చొని సాన మీద తీసిన సొంఠి గంధం పట్టు నా కణతలకి వేస్తోంది నాయనమ్మ . అమ్మ నా వైపు ఆందోళనగా చూస్తోంది. ‘ ఎదురుగా పడుతున్న అరుణకిరణాలను చూస్తూ వింధ్య

‘ఓహో మీ నాయనమ్మ నుండి అందిన పైత్యమా .. నీవూ ఏదో చిట్కా వైద్యంతో మమ్మల్ని చావగొడ్తావ్ ‘ వెటకారంగా తల్లికేసి చూస్తూ సాహిత్
‘ఒరేయ్ ఎగతాళా ..” సంధ్య ఏదో అనబోతుండగా
అల్లుళ్ళు ఇంకా నిద్ర లేచినట్లు లేరే స్వగతంలో అనుకుంటూ , మీరూ లేచిన వాళ్ళు లేచినట్లే కూర్చొని కబుర్లు. కానీయండి. మొహాలు కడిగి ఫ్రెష్ అవండి. అంటూ వంటింట్లోంచి తడి చేతుల్ని తుడుచుకుంటూ హాల్ లోకి వచ్చింది కరుణ.

‘అప్పుడే టిఫిన్ కోసం తరుముతున్నావా అమ్మమ్మా .. టైం ఎంతయిందనీ ..!ఎనిమిది కూడా కాలేదు . ఇప్పుడేగా ఇలా తీరిగ్గా కబుర్లు చెప్పుకునేది. మాకింత తీరిక దొరికేది. రేపటి నుండి మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం కదా ‘ సాధన గారాంగా

‘అమ్మమ్మా నీకెందుకంత తొందర ? తెల్లారనీయవూ, పొద్దుగుంకనీయవూ .. అంతా టైం ప్రకారం అంటావు’ సణిగాడు సాహిత్ అమ్మమ్మకేసి చూస్తూ
ఆవెంటనే ‘ అమ్మమ్మా .. అసలు విషయం నీకు తెలియదు కదూ ..? ఈ రోజు పెద్ద్దమ్మకి వాళ్ళ నాయనమ్మ కలలో కనిపించిందట. ఆవిడ తలపులలో ఊరేగుతున్నాం . ‘ నవ్వుతూ సాగదీసి సాహిత్

‘అమ్మా నువ్వు చెప్పు, మమ్మల్ని చిన్నప్పుడు ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్లావా .. ‘ సంధ్య ప్రశ్న

‘లేదు, ఇప్పుడా విషయం ఎందుకు ?’ కరుణ

‘మా నాయనమ్మ వైద్యం గురించి వీడికి వేళాకోళంగా ఉందిలే ‘ సాహిత్ నెత్తి మీద మొట్టికాయ వేస్తూ వింధ్య

‘అవునర్ర్రా .. మీ అమ్మావాళ్ళు పదవతరగతి వరకు ఉన్నది ఎ సౌకర్యాలూ లేని మారు మూల గ్రామంలో. వాగులూ, వంకలూ దాటి పొలం గట్లపై నడిచి బడికి వెళ్ళేవారు. వైద్యం ఏ మాత్రం అందుబాటులో లేదు. అయినా వైద్యం కోసం పట్నం వెళ్ళింది లేదు .. ‘ చెప్తుండగా
‘ఏం మీరు మనుషులు కాదా .. ! జలుబూ .. జ్వరం పారిపోయేవా మిమ్మల్ని చూసి’ తల్లినీ, పెద్దమ్మనీ కవ్వింపుగా చూస్తూ సాహిత్
‘ఒరేయ్, నీ అల్లరి ఎక్కువవుతోంది .. నాలుగు తగిలించాలి.’ లేవబోతున్న సంధ్య

అన్నిటికీ మా నాయనమ్మ వైద్యమే . జలుబు చేస్తే అల్లం, మిర్యాల కషాయం ఇచ్చేది. మీ అమ్మయితే తాగనని గొడవ గొడవ చేసేది. పారిపోయేది. అయినా పట్టుకుని మరీ పోసేది గొంతులో. ‘ గతాన్ని నెమరు వేసుకుంటూ చెల్లి కేసి చిలిపి చూపులతో వింధ్య
నీకు కడుపు నొప్పి వస్తే జిల్లెడు ఆకులకు ఆముదం రాసి నిప్పులపై వేడి చేసి పోత్తికడుపుపై వేసేది కదూ ..’ఆ దృశ్యాలు కళ్ళముందు కదలాడుతుండగా సంధ్య
‘నాయనమ్మ పళ్ళ తీపులు అనేది. పొద్దున్న లేవగానే పెరటి వెనక దడి అమ్మట ఉన్న నేపాళం మొక్కల దగ్గరకి వెళ్లి వాటి ఆకు తున్చితే వచ్చే పాలని చిగుళ్ళకి రాసుకునేది. వేలితో రుద్దేది. ‘ వింధ్య

‘వీళ్ళ చిన్నప్పుడు మా ఆడపడుచు పిల్లలూ, మరిది పిల్లలూ అంతా పండుగలకు, వేసవి సెలవులకు వచ్చేవారు. చాలా సందడిగా ఉండేది ఇల్లు . ఓ సారి పిల్లలు పిల్లలు పోట్లాడుకొని కొట్టుకున్నారు. వీళ్ళ తాత వింధ్యని ఒక్కటేసారు. అంతే అది గుడ్లు తేలేసింది. ఉలుకు, పలుకు లేదు. నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. ఏడుపు తన్నుకొస్తోంది. కాళ్ళలోంచి వణుకు .. నీళ్ళు చల్లినా కదలిక లేదు. సమయానికి మీ తాత, తాతి ఇంట్లో లేరు అనుకుంటూ ఉండగా వచ్చింది తాతి. పరిస్థితి గమనించింది. గబగబా లోనకి వెళ్లి ఉల్లిపాయ తెచ్చింది. కసకసా నమిలి కణత దగ్గర రుద్దింది. ముక్కు దగ్గర వాసన చూపింది. కాసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచింది వింధ్య’ ఆనాటి సంఘటన తాలుకు భయం కళ్ళలో కదులుతుండగా మనుమలతో కరుణ

‘ఓహ్ .. గ్రేట్, లైఫ్ సేవ్ చేసిన తాతి నిజంగా గ్రేట్ కదా .. ‘ కళ్ళు పెద్దవి చేసి సాహిత్ తో సాధన

‘యా .. యా ‘ రామ్, సాహిత్

‘ఇప్పటి నుండే మీ అమ్మలు మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు అంటున్నారు. ఇప్పుడు మాకూ వచ్చాయనుకోండి. కానీ, తాతీ ఎప్పుడూ నొప్పులు అనేది కాదు. ముసలి అయినా ఆరోగ్యం అంటే ఎంతో జాగ్రత్త . వంటికి వారం వారం శ్రద్ధగా నూనెతో మర్దనా చేసుకునేది . నలుగు పెట్టి స్నానం చేసేది . మంచం మీద నుండి లేవకుండానే ఎక్సరసైజ్ చేసేదని మేం తోటికోడళ్ళం నవ్వుకునే వాళ్ళం. ఒక సారి మాత్రం కండరాల నొప్పులు వచ్చాయి. గిర్నీ నుండి మెత్తటి తవుడు తెప్పించింది. దాంట్లో కొద్దిగా మినప సున్ని, కర్జుర పండు, కొద్దిగా బెల్లం, నెయ్యి వేసి లడ్డు చేసేది. ప్రతి రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తినేది ..’ కరుణ చెప్తుండగా మధ్యలో అందుకుని

‘చాలా మంచిది. బలం వస్తుంది . తినమని మాకిచ్చేది . ఎప్పుడన్నా అక్క తినేది కానీ నేనూ, చెల్లీ అసలు తినేవాళ్ళం కాదు. చీ .. ఛి గేదలకు వేసే తౌడు .. యాక్ నాకొద్దు అని అనే వాళ్ళం. కానీ ఇప్పుడు తెలుస్తోంది అది ఎంత బలమైనదో .. బి. కాంప్లెక్స్ టాబ్లెట్ కంటే ఎంత ఎక్కువ మంచిదో ..’ సంధ్య. ‘ఆలోచిస్తుంటే నాయనమ్మ గొప్పదనం అర్ధమవుతోంది. ఆవిడని తలచుకుంటే అబ్బురంగా .. అపురూపంగా అనిపిస్తోంది’. మళ్లి తానే

‘అమ్మా మీరు చెప్పేది వింటుంటే తాతీని చూడాలనిపిస్తోంది ‘ తల్లికేసి చూస్తూ సాహిత్

‘ అవును ఆవిడ ఎలా ఉంటుందో చూడాలని ఉంది . ఫోటో ఉందా? ‘ ఆసక్తిగా, అప్పటివరకూ వెంటిలేటర్లో పెట్టిన పిచ్చుక గూడు కేసి చూస్తూన్న రామ్

‘ఇప్పట్లా ఆ రోజుల్లో ఇన్ని ఫోటోలు ఎక్కడ తీసేవారు. చాలా అరుదుగా ఫోటోలు దిగేవాళ్ళం . నాకు తెల్సి ఆవిడ ఫోటో ఒకటి ఉండాలి. పనయ్యాక వెతుకుదాంలే ‘ కరుణ .

‘ఆహా.. హ్హ .. అమ్మా ఆ ఫోటో నీ దగ్గర ఉండనుకుంటూ న్నావా .. ! ఉ హు .. లేదు , నేనెప్పుడో తీసుకు వెళ్లానుగా.. ‘ నవ్వుతూ వింధ్య

‘అవును తాతి ఫోటో అమ్మ దగ్గర ఉండడం నేనూ చూశా. ఈ సారి నేను వర్ని వెళ్ళినప్పుడు దాన్ని స్కాన్ చేసి నీకు పంపుతాలే ‘ తమ్ముడితో సాధన

‘అమ్మా నువ్వు చెప్పు తాతీ ఎలా ఉండేదో ..’ తల్లి గడ్డం పట్టుకుని బతిమాలుతున్నట్లుగా సాహిత్

‘మా నాయనమ్మ చామన ఛాయలో ఉండేది . కళ్ళు పెద్దవే కొద్దిగా లోతుగా నిశితంగా చూస్తూ .. సూటిగా మాట్లాడే ఆమె తత్వం లాగే సూటి ముక్కు. ఏడూ గజాల ముదురు రంగు నేత చీర , తెల్లటి రవిక , మెడలో పసుపుతాడు , చెవులకు ఏడు రాళ్ళ పోగులూ , చేతులకు మట్టి గాజులూ, నుదుట కాణీ సైజులో బొట్టూ , మధ్య పాపిడితో పైకి దువ్వి వేసిన వేలుముడి.. కరుణ వర్ణిస్తుండగా

‘కాళ్ళకు బాటా స్లిప్పర్లూ ..’ జత చేసింది వింధ్య

‘కాణీ అంటే .. ‘ సాధన

‘ఆరుపైసల కాయిన్ ‘ కరుణ

‘అక్కా నీవు లంగా ఒణిలు వేసుకోవడం ఆరంభించిన దగ్గర నుండి నాయనమ్మ చీరలు కట్టేదానివి కదూ ..!’ సంధ్య

‘అవునే నాయనమ్మ కొత్త చీరలు అసలు కట్టేది కాదు. నీళ్ళలో తడిపిన తర్వాతే కట్టేది. అందుకని నీనే మొదట కట్టేదాన్ని’ వింధ్య
‘ముసలమ్మ చీరలా .. ‘ మొహం ఎలాగో పెట్టి సాధన

‘ఆ .. అవే .. కానీ అందరూ బాగున్నాయనే వారు, ఆ చీరలకు జరీ ఉండేదికాదు. చాలా సాదా సీదా చీరలవి .. ‘ చెప్తోంది వింధ్య
మనమందరం ఆ బట్టలు బాగున్నాయి. ఈ నగలు బాగున్నాయి. ఆ బట్టలు కొనాలి. ఈ నగలు చేయించుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా!. ఎన్ని బట్టలు, నగలు ఉన్నా ఇంకా ఏవో కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ నాయనమ్మలో అలాంటి కోరికలు, ఆశలు, ఆలోచనలు ఉన్నట్లే ఎప్పుడూ నా కనిపించలేదు.’ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ సంధ్య

‘నిజమే, ఆవిడ తన కోసం ఇది కావాలి. అది కావాలని అనుకోవడం కానీ కుతుర్లని , కొడుకుల్ని, కోడళ్ళని అడగడం ఎప్పుడూ లేదు. ఆ మనసులో ఏముండేదో తెలియదు. నాకు తెలిసినప్పటి నుండి ఆవిడ ఎలాంటి నేత చీరలు కట్టేదో అదే రకం చీరలు చివరి వరకు కట్టేది . మేమూ ఆవిడ అవసరాన్ని గమనించి కొనేవాళ్ళం’ కరుణ

‘నీ కదే వచ్చిందేమో .. బట్టలు సింపుల్ గా ఉండాలని అంటావ్, నగల మీద మోజేలేదు. ఉన్నవే లాకర్లో పడేస్తావ్ ‘ సాధన తో రామ్

‘ అయితే అయితే అయుండొచ్చు’ ముంగురుల్ని సవరించుకుంటూ సాధన

‘తాతీ ఒడిలో కూర్చొని పెరిగిందిగా వచ్చాయేమో ‘. వింధ్య. రామ్ ని చూసి కళ్లెగరేస్తూన్న సాధన కుయ్ కుయ్ అంటూ తోక ఊపుతూ వచ్చిన పప్పీ ని ఒళ్లోకి తీసుకుంటూ

‘నలుగురు అన్నదమ్ముల్లో మీ పెద్ద తాత చిన్నవాడు. అమాయకుడు. పెళ్ళయిన కొద్ది కాలానికే వేరు కాపురాలు పెట్టించారట. మీ తాతకు 15 ఏళ్ళు వచ్చేవరకు వ్యవసాయం పనులు, పిల్లల పెంపకం, చదువులు, ఇంటిపని అన్నీ తానై చూసుకునేది. ఆ తర్వాత మీ తాతకి కొన్ని బాధ్యతలు అప్పగించడం , కొడుకుతో కలసి ఆలోచించడం చేసేది . కొడుకు పెరిగాక కుటుంబ బాధ్యతంతా అప్పజెప్పింది.

తాతీకి తన పెళ్ళప్పుడు తొమ్మిదో ఏట పెళ్ళయిందట. పిల్ల తెలివికలది . ఉషారుగా ఉందని పెద్ద తాత అమాయకుడు కదా కుటుంబాన్ని సమర్థించుకుంటుందని చేసారట. ఆ రోజుల్లో ఘోషా పధ్ధతి ఉండేది . ఆడవాళ్ళు విధుల్లో నడచి వెళ్ళేవారు కాదు. మగ వాళ్ళ కంట పడే వారు కాదు. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే ఎడ్ల బండికి రెండువైపులా తెరలు కట్టుకునేవారు. అలాంటి రోజుల్లో మనో ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. ముందుకు సాగింది .’ లేచి పొయ్యి మీద పాలు చూడడానికి వెళ్ళబోతూ కరుణ
ఇంతకీ తాతమ్మ పేరేంటి ? ‘ రామ్

‘కామేశ్వరమ్మ ‘ వెంటనే సాధన

‘ఓ.. అందుకే పిన్నికి ఆ పేరు పెట్టారా ‘ సాహిత్ అక్క చేతి లోని పప్పిని తీసుకొంటూ

‘కబుర్లతో టైం తెలియదు .. లేవండి లేచి ఫ్రెష్ అవండి . గారెలు వేసేస్తాను, వేడి వేడిగా తిందురుగాని ‘ కిచెన్లోకి వెళ్తూ తొందర చేసింది కరుణ.

సరే .. సరే .. అన్నారు కానీ ఒక్కరూ కూర్చున్న చోటు నుండి కదలలేదు

‘నాయనమ్మ ఏ వంట చేసినా .. ఆ రుచే వేరు ..’వింధ్య

‘ఆ అవునవును, నాకు నాయనమ్మ చెయ్యి వచ్చిందంటారు మా అత్త వాళ్ళు ‘ నవ్వుతూ సంధ్య

‘అవునా .. ‘ తల్లిని ఉడికిస్తూ సాహిత్

‘వంటల్లో నూతనత్వం, సృజనాత్మకత మీ నాయనమ్మ ప్రత్యేకత ‘ లోపల్నుంచి కరుణ

‘వంటల్లో సృజనాత్మకతా .. ‘ సందేహంగా రామ్

‘అవును బాబూ.. ఆ రోజుల్లో మా ఇంటి దొడ్డి ఎకరం స్థలంలో ఉండేది. మామిడి తప్ప అన్ని రకాల పళ్ళు, పూవులు ఉండేవి . పొగాకు దగ్గరనుండి మాకు అవసరం అయినవి అన్నీ పండించే వాళ్ళం . కొట్టుకు వెళ్లి కొనే సరుకులు చాలా చాలా తక్కువ. మా దొడ్లో పుల్లటి దానిమ్మ పండ్లు చాలా కాసేవి. వాటి రసం తిసి పులిహోర కలిపేది. రసం తీయగా మిగిలిన గింజలతో రోటి పచ్చడి చేసేది. దోరగా ఉన్న పుల్ల రేగ్గాయలతో నిలువ పచ్చడి చేసేది. అలా ఆవిడ గూర్చి చెప్పాలంటే ఎన్నో .. ‘ లోపల పనిచేస్తూ చెప్తున్న కరుణ దగ్గరకి వెళ్లి ఆసక్తిగా విన్నాడు రామ్ .

‘ అన్నీ దొడ్లోనే పండితే ఇక డబ్బుల అవసరం ఉండదుగా.. హాయిగా బతికేయొచ్చు కదూ .. ఇప్పుడు జేబులో పచ్చ నోటు లేకుండా బయటికి వెళ్ళలేం కదా .. ఆ లైఫ్ బాగుంటుందిగా మరెందుకు ఇప్పుడవి లేవు’ ఏదో తెలుసుకోవాలన్న కుతూహలంతో సాహిత్

‘ మారుతున్న ప్రపంచంతో మేమూ, పల్లె వదిలాం.. పంట వదిలాం .. మకాం మార్చాం ..కాసులవేటలో పడ్డాం.. కానీ, ఇప్పుడు తెలుస్తోంది మేం కోల్పోయింది ఏమిటో … ‘ కరుణ ఇంకా ఏదో చెప్పబోతుండగా

‘అమ్మమ్మా , నాకో సందేహం .. నువ్వూ , చిన్న అమ్మమ్మ ఎప్పుడైనా మీ అత్తగారి ఆరళ్ళు ఎదుర్కొన్నారా ‘ మైక్ తో ఆమె ముందుకు ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా సాధన. అంతా ఒక్కసారిగా నవ్వేశారు.

‘నా పెళ్లయ్యేప్పటికే మా అమ్మ చనిపోయింది. వంటపని అసలే రాదు. నలుగురు అక్కలు ఇద్దరు అన్నల మధ్య చాలా గారాభంగా పెరిగాను . ఇంటిపనులు, వంట పనులు అన్నీ తాతీ దగ్గరే నేర్చుకున్నా. ఒకటి రెండు సార్లు అత్తగారిలా ప్రవర్తించినా మొత్తం మిద మమ్మల్ని అమ్మలాగే చూసుకొనేది. వెలుగు రాకముందే లేచి వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గు వెయ్యాలని ఇరుగుపొరుగూ ఆవిడకి మాపై నూరి పోయ్యాలని చూసినా ఆవిడ వారి మాటల్ని ఖండించేది. మరో మారు వాళ్ళు అలాంటి మాటలు తన దగ్గర తెచ్చేవారు కాదు. తను మాత్రం తెల్లవారుజామునే లేచేది . మజ్జిగ చేయడంతో పనులు ప్రారంభించేది.’ చెప్తోన్న కరుణ మాటలకు జత చేస్తూ
‘అవునవును , నేను నాయనమ్మ దగ్గరే పడుకొనే దాన్ని కదా .. ఆవిడతో పాటే లేచి వెనకే తిరిగేదాన్ని. పెద్ద కవ్వానికి తాడుకట్టి
మట్టిపిడతలో జాగ్రత్తగా మజ్జిగ తిప్పేది. ఆవిడ అలా తిప్పెప్పుడు కవ్వం కదలిక, నాయనమ్మ నడుము కదలిక చూడడం భలే ఉండేది . ప్రతి రోజు వెన్న ముద్ద లోంచి కొద్దిగా తీసి నానోట్లో వెసెది. ఒక్కోసారి అరచేతిలో పెట్టేది . వెన్నని ముద్దలా చేసి మజ్జిగలోనే ఉంచేసేది. చేతులకి అయిన వెన్న జిడ్డుని నా మొహానికి , కాళ్ళకి , చేతులకి రాసేది ‘ వింధ్య

“అందుకే నాయనమ్మ అంత స్లింగా ఉండేదేమో !’ సంధ్య

‘అమ్మా .. తాతీ రాసిన వెన్న మహత్యమేమో .. నీ ఒళ్ళు నున్నగా ఇంకా మెరుస్తోంది’ ఆటపట్టిస్తూ సాధన .
‘పొయ్యిలో బొగ్గులు కొద్దిగా పక్కకు లాగి దానిపై పాలపిదత పెట్టేది . నిదానంగా సన్నని సెగపై కాగిన పాలు, మీగడ , పెరుగు ల రుచే వేరు.’ గత స్మృతులతో వింధ్య

‘తాతీ చేసే తోటకూర దప్పళం నాకెంతో ఇష్టం . అలా వండాలని నేనెన్నిసార్లు ప్రయత్నించినా ఈ రోజుకూ ఆ రుచితో వండలేకపోతున్నా .. మా అమ్మ చేతి రుచి ప్రత్యేకత నీ కెలా వస్తుంది అని నవ్వేవారు మీ తాత. ‘ కరుణ
మనింట్లో వాడే చిపుర్లు, తుంగ చాపలు, ఈత చాపలు, విస్తరాకులు, తాటాకు బుట్టలు, కాళ్ళు తుడుచుకునే డోర్ మ్యాట్లు అన్నీ నాయనమ్మ తయారు చేసేది కదూ ..’ సంధ్య

‘ఆ అవును, తన దగ్గర నేను నేర్చుకున్నా ‘ వింధ్య. నిజమా అన్నట్లు చూస్తూ పిల్లలు

‘ఆవిడ ఏది వృధాగా పోనిచ్చేది కాదు. ఇంట్లోకి అవసరమైన వస్తువులు తాయారు చేసేది. ఆవిడ చేసే పనులన్నీ రాకపోయినా ఆ పనిలో సహయంచేసేదాన్ని దొడ్లో పెరిగిన ఈత, తాటి చెట్ల ఆకులతో బుట్టలు, చీపుర్లు , చాపలు చెసెది. చెరువు నుండి తెప్పించిన తుంగతో మగ్గం కట్టినట్టు కట్టి చాపలు నేసేది . గోగునారనో, జనపనారనో, కొబ్బరి పీచునో జడలు జడలుగా అల్లి కాలు తుడుచుకునే పట్టాలు , బుట్టలు చేసేది . మిషను మీద కుట్టినట్లుగా నీటుగా కుట్టేది . అది చూసి నేనూ చాలా నేరుచుకున్నా. తర్వాత మిషను కొన్నా .. ‘ ప్రవాహంలా చెప్పుకుపోతోంది కరుణ

‘అమ్మా నాయనమ్మ అక్క చెల్లెళ్ళు కూడా ఇలాగే పనిమంతులా .? సంధ్య ప్రశ్న

‘ఏమో ..’ ఒక్క క్షణం ఆగి ‘ నాకు తెలిసినంత వరకూ కాదు. వాళ్ళ జీవితాలు అందరిలాగే సాదాసీదాగా భర్త చాటున గడచి పోయాయి . తాత కాస్త అమాయకుడు కావడం వల్లేమో మీ నాయనమ్మ తన తెలివి తేటల్ని ఉపయోగించే అవకాశం వచ్చింది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఆటుపోట్లు అనుభవించింది. తనకు ఎదురైన అనుభవాలను విశ్లేషించుకుంటూ ముందు కేల్లేది… ‘ చెప్తోన్న కరుణ మాటలకు మధ్యలో అందుకున్న సాధన ‘ ఆడవాళ్ళ తెలివి తేటలు అవకాశాలు లేక పోతే అసలు బయటికి వచ్చే అవకాశమే లేదు కదా అమ్మా ‘ తల్లికేసి చూస్తూ

‘ అవునే, అసలు మా నాయనమ్మకు ఇంత ప్రపంచ జ్ఞానం ఎలా అబ్బిందో నాకిప్పటికీ ఆశ్చర్యమే .. ఇప్పట్లో ప్రచార, ప్రసార సాధనాలు అందుబాటులో లేని ఆరోజుల్లో’ అబ్బురంగా సంధ్య

‘నిజమే .. కానీ, మనం పెరిగేటప్పటికే రేడియో వచ్చింది. నాకు బాగా గుర్తు . మన ఊర్లో ఒకరింట్లోనే రేడియో ఉండేది. వార్తలు వచ్చినప్పుడు ఊరంతా వినబడేలా సౌండ్ పెట్టేవారు. ఆ వార్తలు నాయనమ్మ, నాన్న బాగా ఆలకించేవారు. అమ్మా, పక్కింటి లక్ష్మి అక్కవాళ్ళు పాటలు దడి దగ్గర నిలబడి వినేవారు కదూ ..’ఆ రోజుల్ని గుర్తుతెచ్చుకుంటూ తల్లి మొహంలోకి చూస్తూ వింధ్య.
‘వార్తలు వస్తుంటే మీ నాయనమ్మ ఎవర్నీ మాట్లాడనిచ్చేది కాదు. మీ నాన్న తెప్పించే పుస్తకాలు , పేపర్లు వీలు దొరికినప్పుడల్లా చదివేది. జీవితానికి అన్వయించుకునేది. ‘ కిటికీ రెక్కలు తెరచి భాను కిరణాలను లోనికి ఆహ్వానిస్తూ కరుణ.

‘వాట్ .. తాతీ చదువుకుందా ?’ ఆశ్చర్యంతో సాహిత్

‘అవున్రా .. ఆ రోజుల్లో బడికి వెళ్లి మూడవ తరగతి చదివిందట మేనమామల ప్రోత్సాహంతో. ఆనాడు అదో గొప్ప విషయం. అరుదైన సంఘటన . తొమ్మిదో ఏటే పెళ్లి కావడంతో చదువు ఆగిపోయిందట ‘ తెలిసిన విషయం చెప్పింది వింధ్య

‘అక్కా మన నాయనమ్మ చాలా గ్రేట్ కదా .. ! నామమాత్రపు చదువుతో ఆమె చూపిన చొరవ, పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం నేడు చదువుకున్న వాళ్ళలో కనిపించడం లేదే ‘ నాయనమ్మ పట్ల గౌరవం పెరుగుతుండగా నేటి మహిళని తలచుకొని దిగులుతో కూడిన ఆవేశంతో సంధ్య

‘పిన్నీ .. కూల్.. కూల్ .. ఈ చదువు డిగ్రీలు తెచ్చుకోవడానికే, తాతీకి డిగ్రీలు లేక పోవచ్చు కానీ తను లోకాన్ని చదివింది. డిగ్రీలు ఇవ్వలేని జ్ఞానాన్ని పొందింది. ఆ జ్ఞానంతో కుటుంబాన్ని ముందుకు నడిపించగలిగింది. తన ముద్ర కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తోంది ‘ విశ్లేషిస్తూ సాధన

‘ఏదో తాతీ గూర్చి బాగా తెలిసినట్లు చెప్తున్నావే .. ‘ అప్పటి వరకూ శ్రోతలా వింటున్న రామ్ భార్యకేసి చూసి నవ్వుతూ రామ్

‘కరెక్ట్ గా చెప్పావ్.. మా నాయనమ్మ మనందరిపై తనదైన ముద్ర వేసింది. ఆనాటి సమాజంలో కులమతాల పట్టింపులెక్కువ. అయినా కులమతాల కతీతంగా ఉండేది. బహుశ నాన్న, చిన్నాన్న పైనా .. మేనమామల ఇంట పెరిగిన నాయనమ్మపైనా ఆనాటి కమ్యునిస్ట్ ఉద్యమ ప్రభావం ఉండేదేమో ! సాలోచనగా వింధ్య

‘ఆ కమ్యూనిస్ట్లు అంటే గుర్తొచ్చింది. అమ్మమ్మా , మీరు ఎమర్జెన్సీలో చాలా బాధలు అనుభవించారట కదా .. తాత వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నారట కదా .. అమ్మ చెప్పింది ‘ లేచి అమ్మమ్మ దగ్గరకి వెళ్లి సాధన

‘వాట్ గ్రౌండ్ లోపల ఉన్నారా .. ‘ సాహిత్

‘ఒరే జోకులాపి బుద్దిగా విను ‘ కళ్ళెర్ర చేస్తూ సాధన

‘ఆ అవును , మీ తాత, చిన్న తాత గ్రామాల్లో పెత్తందారి వ్యవస్థకి, పోలీసు పటేల్, మాలి పటేల్ వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రజలని చైతన్యం చేసే వారు. అందుకే వాళ్ళపై దాడులు చేయించారు పెత్తందార్లు. ఆ తర్వాత కొంతకాలానికే ఎమర్జేన్సి ప్రకటించారు. ప్రజా చైతన్యాన్ని అణగదొక్కడం కోసం ఆనాటి పెత్తందార్లు మీ తాతల పై నక్సలైట్ ముద్ర వేసారు. అరెస్ట్ చేయించి వాళ్లకు అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. దానితో వాళ్ళు తప్పని సరై అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోయారు. వాళ్ళెక్కడ ఉన్నారో తెలియదు . అసలు ప్రాణాలతో ఉన్నారో .. లేదా ఎన్కౌంటర్ పేరుతో హతమయ్యారో తెలియదు. మీ అమ్మ వాళ్ళు చిన్న పిల్లలు. నేనూ , చిన్న అమ్మమ్మ ఏడుస్తూ ఉంటే, బాధ పడుతూ ఉంటే తాతీ మమ్మల్ని ఓదార్చేది . తన కొడుకుల గూర్చి తన బాధ ఏ మాత్రం కనిపించనిచ్చేది కాదు. గుండె దైర్యం ఎక్కువ. మమ్మల్ని ఓదారుస్తూ, వ్యవసాయం చేయించేది. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడి మీద భారం వేసి కూర్చోవడం ఆవిడకి తెలియదు . ఆవిడ పూజలు చేయడమూ నేను చూడలేదు. సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం ఉంది తీరుతుందని ఆవిడ నమ్మకం . ఏనాటికైనా చీకటి విడిపోతుందని వెలుగు వచ్చి తీరుతుందనీ మాకు దైర్యం చెప్పేది. ఎమర్జెన్సీ సమయంలో అయిన వాళ్ళంతా వాళ్లకి ఎక్కడ ఆపద వస్తుందోనని మమ్మల్ని పలుకరించడానికి సాహసించక పోయినా తాతీ తన మనొదైర్యాన్ని కోల్పోలేదు. మనుషులకు కాకపోతే మానులకొస్తాయా కష్టాలూ .. నష్టాలూ .. ఎదుర్కోవాలి. జీవితం అంటే సుఖం, ఆనందమే కాదు కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. అన్నిటిని సమంగా స్వీకరించి ముందుకు సాగించాలి అంటూ ఆవిడ నింపిన దైర్యమే ఈ నాడు నన్ను మీ ముందుంచింది ‘ ఆత్మహత్య చేసుకోబోయిన తనకు అత్తగారిచ్చిన దైర్యం గుర్తొచ్చి కరుణ

‘మా నాయనమ్మ కబుర్లు చెప్పుకుంటూ కుర్చొంటే .. గంటలూ , రోజులూ దోర్లిపోతాయి లేవండి .. ‘ సంధ్య అంటుండగా

‘ఆమె స్పూర్తితో మనం మన వ్యక్తిత్వాల్ని మలుచుకుంటూ ముందుకు సాగాలి కదక్కా ‘ అంటూ లేచాడు సాహిత్.
ఆ వెనుకే అందరూ .