మాట్లాడుకుందాం

సంగీత సాహిత్యమే …

సెప్టెంబర్ 2013

ఈ మధ్య ఒక పుస్తకంలో ఒక ఆలోచింప జేసే ప్రతిపాదన చూసాను. అది చూసిన తరువాత దానిలో నిజానిజాలెంతో మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలనిపించింది.

ముందుగా ఈ ప్రతిపాదన చేసిన మనిషి గురించి నాలుగుమాటలు.

ఈయనకు తన మాతృభాష మీద అసాధారణమైన అధికారం ఉండేది. యూనివర్సిటీ చదువుకు స్వస్తి చెప్పి రచనా వ్యాసంగం మీద దృష్టి పెట్టి పాత్రికేయుడిగా, వ్యాసకర్తగా, బహుగ్రంథకర్తగా, విశ్లేషకుడిగా, మేధావిగా ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి.
కొన్ని దశాబ్దాలపాటు విపరీతంగా చదవటం, వ్రాయటం ప్రధాన ఉద్యోగాలుగా పెట్టుకుని తనభాషలో ముఖ్యంగా వ్యాసరచనలో అసమానుడని మన్నలందుకున్న వ్యక్తి. భాషమీద ప్రేమకు ఇతరేతరకారణాలు అవసరంలేదని దానికదే కారణం అని నమ్మిన వ్యక్తి. తోటి రచయితలను, కవులను విశేషంగా అభిమానించే సంస్కారి.

ఇంకా వీరిగురించి చెప్పాలంటే చాలావుంది గానీ మన అంశానికి నేపథ్యంగా ఈ వివరాలు చాలు.

ఈయనకు ఒక సందేహం. వచనం, వ్యాసాలూ గట్రా బాగానే వ్రాయగలను గానీ కల్పనతో సృజనతో కూడిన సాహిత్యం, అనగా కథ, నవల, కవిత్వం మొదలైనవి తాను అంతబాగా వ్రాయలేనని. ఆ దిశగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని అతని అంచనా.

దీనికి కారణం ఏమిటని ఆలోచించగా ఒకరోజు మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టిందిట.

“సంగీతం” అనేది ఆ ఆలోచన.

ఇంకా వివరంగా చెప్పాలంటే సంగీతాభిమానం, అభిరుచి, ప్రవేశం ఇలా సంగీతంతో అనుబంధం ఎంత ప్రగాఢంగా ఉంటే అంత మంచిది కథా, నవలా రచయితలకు, కవులకు అనిన్నీ, ఇది లేనివారు కేవలం తనలాగా నాన్-ఫిక్షన్ వ్రాసుకోవలసిందే అనిన్నీ అనిపించిందట.

ఈ ఆలోచనను తనకు, తన స్నేహితులకు, తనకు తెలిసిన సృజనాత్మక రచయితలకు అన్వయించి చూసి తనకు ఆటలలాగే సంగీతం పెద్దగా తలకెక్కదని, తనకు తెలిసిన కవులు, నవలారచయితలు అందరికీ సంగీతంలో ఉత్తమ అభిరుచి, ఆసక్తి ఉన్నదనీ ఈయన తేల్చుకున్న విషయం.

కవిత్వం ఒక ఆల్కెమీ అన్నాడు తిలక్. ఈ ఆల్కెమీకి (అలాగే ఫిక్షన్ అంతటికీ) సంగీతాస్వాదన ఒక తప్పనిసరి అయిన ముడి సరుకు అన్న ప్రతిపాదన చాలా ఆసక్తికరంగా అనిపించింది నామట్టుకు నాకు. మనకు కొద్దొ గొప్పో తెలిసిన కవులందరికీ సంగీతం ఇష్టమే అనుకుంటాను. చాలామంది బాగా పాడుతారు కూడా. కొందరు ఇతర లలిత కళలలో కూడా ప్రవేశంవున్నవారున్నారు. అయితే చాలామంది సాహితీ వేత్తల సంగీతాభినివేశం గురించి మనకున్న సమాచారం స్వల్పం.

సంగీతం పట్ల నిరాసక్తంగా నిర్లిప్తంగా ఉండి గొప్ప కల్పనల తో కూడిన కావ్యాలు, నవలలు, కథలు వ్రాసినవాళ్ళు ఎవరైనా వున్నారా అని ఆలోచిస్తే నాకు ఎవరి పేరూ గుర్తు రాలేదు.

మీకెవరైనా గుర్తొచ్చారా? అలాగే ఈయన చెప్పిన ప్రతిపాదనమీద మీ అభిప్రాయం మీ వ్యాఖ్యల ద్వారా దయచేసి తెలియజేయమని విన్నపం.