ఈ మధ్య ఒక పుస్తకంలో ఒక ఆలోచింప జేసే ప్రతిపాదన చూసాను. అది చూసిన తరువాత దానిలో నిజానిజాలెంతో మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలనిపించింది.
ముందుగా ఈ ప్రతిపాదన చేసిన మనిషి గురించి నాలుగుమాటలు.
ఈయనకు తన మాతృభాష మీద అసాధారణమైన అధికారం ఉండేది. యూనివర్సిటీ చదువుకు స్వస్తి చెప్పి రచనా వ్యాసంగం మీద దృష్టి పెట్టి పాత్రికేయుడిగా, వ్యాసకర్తగా, బహుగ్రంథకర్తగా, విశ్లేషకుడిగా, మేధావిగా ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి.
కొన్ని దశాబ్దాలపాటు విపరీతంగా చదవటం, వ్రాయటం ప్రధాన ఉద్యోగాలుగా పెట్టుకుని తనభాషలో ముఖ్యంగా వ్యాసరచనలో అసమానుడని మన్నలందుకున్న వ్యక్తి. భాషమీద ప్రేమకు ఇతరేతరకారణాలు అవసరంలేదని దానికదే కారణం అని నమ్మిన వ్యక్తి. తోటి రచయితలను, కవులను విశేషంగా అభిమానించే సంస్కారి.
ఇంకా వీరిగురించి చెప్పాలంటే చాలావుంది గానీ మన అంశానికి నేపథ్యంగా ఈ వివరాలు చాలు.
ఈయనకు ఒక సందేహం. వచనం, వ్యాసాలూ గట్రా బాగానే వ్రాయగలను గానీ కల్పనతో సృజనతో కూడిన సాహిత్యం, అనగా కథ, నవల, కవిత్వం మొదలైనవి తాను అంతబాగా వ్రాయలేనని. ఆ దిశగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని అతని అంచనా.
దీనికి కారణం ఏమిటని ఆలోచించగా ఒకరోజు మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టిందిట.
“సంగీతం” అనేది ఆ ఆలోచన.
ఇంకా వివరంగా చెప్పాలంటే సంగీతాభిమానం, అభిరుచి, ప్రవేశం ఇలా సంగీతంతో అనుబంధం ఎంత ప్రగాఢంగా ఉంటే అంత మంచిది కథా, నవలా రచయితలకు, కవులకు అనిన్నీ, ఇది లేనివారు కేవలం తనలాగా నాన్-ఫిక్షన్ వ్రాసుకోవలసిందే అనిన్నీ అనిపించిందట.
ఈ ఆలోచనను తనకు, తన స్నేహితులకు, తనకు తెలిసిన సృజనాత్మక రచయితలకు అన్వయించి చూసి తనకు ఆటలలాగే సంగీతం పెద్దగా తలకెక్కదని, తనకు తెలిసిన కవులు, నవలారచయితలు అందరికీ సంగీతంలో ఉత్తమ అభిరుచి, ఆసక్తి ఉన్నదనీ ఈయన తేల్చుకున్న విషయం.
కవిత్వం ఒక ఆల్కెమీ అన్నాడు తిలక్. ఈ ఆల్కెమీకి (అలాగే ఫిక్షన్ అంతటికీ) సంగీతాస్వాదన ఒక తప్పనిసరి అయిన ముడి సరుకు అన్న ప్రతిపాదన చాలా ఆసక్తికరంగా అనిపించింది నామట్టుకు నాకు. మనకు కొద్దొ గొప్పో తెలిసిన కవులందరికీ సంగీతం ఇష్టమే అనుకుంటాను. చాలామంది బాగా పాడుతారు కూడా. కొందరు ఇతర లలిత కళలలో కూడా ప్రవేశంవున్నవారున్నారు. అయితే చాలామంది సాహితీ వేత్తల సంగీతాభినివేశం గురించి మనకున్న సమాచారం స్వల్పం.
సంగీతం పట్ల నిరాసక్తంగా నిర్లిప్తంగా ఉండి గొప్ప కల్పనల తో కూడిన కావ్యాలు, నవలలు, కథలు వ్రాసినవాళ్ళు ఎవరైనా వున్నారా అని ఆలోచిస్తే నాకు ఎవరి పేరూ గుర్తు రాలేదు.
మీకెవరైనా గుర్తొచ్చారా? అలాగే ఈయన చెప్పిన ప్రతిపాదనమీద మీ అభిప్రాయం మీ వ్యాఖ్యల ద్వారా దయచేసి తెలియజేయమని విన్నపం.
నా అనుభవంలోని కవి, రచయితలందరూ అంతో ఇంతో సంగీతం మీద ఇష్టం ఉన్న వారే.
కానీ, సంగీతం ఇష్టం ఉండిన ప్రతి ఒక్కరూ సృజనాత్మక రచనలు చేయగా చూడ లేదు.
మనకు పుట్టుకతోనే జోల పాటలు పాడే తల్లులూ, వేమన పద్యాలని సైతం రాగ యుక్తంగా ఆలాపించే పెద్దలూ చుట్టూ ఉంటారు కాబట్టి మన సమాజంలో ఈ సందేహానికి జవాబు దొరకడం కష్టం.
పాశ్చాత్య దేశాల రచయితలు మరియు కవుల గురించి తెలుసుకుంటే కొంత మంచిదేమో. అక్కడ సినిమాలలో పాటలు ఉండవు. కానీ బాల్యంలో మనలాగే రైంస్ (గీతాలు) అవీ అక్కడా సర్వ సాధారణం. ఐతే పుట్టినప్పటి నుండీ పరిచయమైన గీతాల్ని, ఆ నేపధ్యాన్ని విస్మరించిన వాళ్ళెవరినైనా తెలుసుకోవాలి.
తపనే ఏదైనా వ్రాయిస్తుంది. కానీ దానికి అంతర్లీనంగా సంగీతం మీది ఇష్టం దోహదం చేస్తుందా చెయ్యదా అంటే ….?
నారాయణ.
నారాయణగారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇక్కడ ఇంకా లోతైన ప్రశ్నకూడావుంది. సాహిత్యం పట్ల, భాషపట్ల విశేషమైన అభిమానం వుండి గొప్ప రచనలు చేసినవారిలో కూడా, సంగీతాభిలాష లేకపోవడం వారి రచనా వైవిధ్యానికి ఒక లోపంగా పరిణమిస్తుందా అనేది.
ఈ విషయం నాకూ ఆశ్చర్యంగానూ సందేహంగానూ ఉంది. రాయలన్న తపనే రాయిస్తుంది.
సంగీతం పట్ల నిరాసక్తంగా నిర్లిప్తంగా ఉండి గొప్ప కల్పనల తో కూడిన కావ్యాలు, నవలలు, కథలు వ్రాసినవాళ్ళు ఎవరైనా వున్నారా అని ఆలోచిస్తే నాకు ఎవరి పేరూ గుర్తు రాలేదు.
గొప్ప గొప్ప రచయితలందరికీ సంగీతం తో పరిచయం, అందులో మంచి అభిరుచి ఉందని మాత్రం రుజువులు లేవు కదా! ప్రపంచ భాషల్లో గానీ, మన తెలుగులో గానీ!
సంగీతంలో అభిరుచి ఉండటం అనేది ఇండివిడ్యువల్ ప్రయారిటీ, అభిరుచు. అలా ఉన్న వాళ్ళలో మంచి రచయితలు ఉండొచ్చేమో కానీ, గొప్ప కాల్పనిక సాహిత్యం సృజించిన వాళ్లందరికీ సంగీతాభిరుచి ఉందనుకోవడం.. మన ఊహేనేమో
But interesting anyway
సుజాత గారూ, ధన్యవాదాలు. ఈ ప్రశ్నకు సమాధానం తేల్చుకోవడానికి మనకు సరైన సమాచారం అందుబాటులో లేదు. ఆంధ్రదేశంలో రచయితలందరికీ ప్రశ్నలు పంపించి సమాధానాలు తెలుసుకుంటే గానీ గానీ మనకు నిజమైన రుజువు దొరకదు. అంతపని చేయలేకపోయినా ఆలోచించడానికి బాగుంది కదూ!
కళాభిరుచి అనేది కళాకారులకి దాదాపు అన్నీ కళల మీద ఉంటుంది. కాకపోతే అన్ని కళలను నేర్చుకోలేరు కనుక ఏదో ఒక కళలో నిష్ణాతులై ఉంటారు. అభిరుచి అనేదే లేక ఫొతే సంగీతమే కాదు ఏ కళా అబ్బదు కదా? ఏది ఏమైనా అనగననగ రాగ మతిశైలుచునుండు తినగా తినగా వేము తీపీ గానుండు. . . . .సాదనమున పనులు సమకూరుధరలోన అనే మాట మర్చి పోకూడదు. ఏ కళా ఐనా సాదన మీదనే ఆధారపడుతుందీ. అందుకే అవసరం సౄజనకు తల్లివటిది అంటారు.
తిరుపాలు గారూ, నిజం. మీ కామెంటుకు ధన్యవాదాలు.
సంగీతంతో అనుబంధం ప్రగాఢంగా కాకుండా కొంత పరిమితంగా ఉంటేనే ఫిక్షన్ రచనలకు అవకాశం ఉంటుందనుకుంటాను. లేకపోతే వాళ్ళు రచనల సంగతి వదిలేసి (తగ్గించి) సంగీత వ్యాపకంలోనే మునిగితేలే అవకాశముంది
సంగీతాభిరుచి (మాత్రమే) ఉన్న కొడవటిగంటి కుటుంబరావు విస్తృతంగా కాల్పనిక సాహిత్యం సృష్టించినప్పటికీ సైన్స్, సినిమా, ఇతర వ్యాసాలు కూడా విరివిగా రాశారు. చివరిదశలో నాన్ ఫిక్షన్ కే పరిమితమయ్యారు. సాక్షాత్తూ సంగీతవేత్త అయిన ఆయన కొడుకు రోహిణీప్రసాద్ మాత్రం నాన్ ఫిక్షన్ ఎక్కువ రాశారు (పాటలూ, పద్యాలూ రాసినా అవి తక్కువే)!
వేణుగారూ, ధన్యవాదాలు. కొకు విషయంలో (అలాగే ప్రసిద్ధ కవులు రచయితలలో వారి జీవితవిశేషాలు మనకు సమాచారం వున్నంతవరకు) మనకు సమాధానం అవుననే వస్తుంది.