కథను చక్కని శిల్పంగా చెక్కుతాడనీ, ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో నిర్దుష్టంగా మలుస్తాడనీ పేరు పొందిన రచయిత చాగంటి సోమయాజులు (చాసో) . ఆయన రాసిన కథల్లోనే విభిన్నమైనది ‘దుమ్ములగొండె’. అప్పటికే కుంకుడాకు, ఏలూరెళ్లాలి లాంటి రచనలతో పేరు తెచ్చుకున్న చాసో్ ఈ కథను ఆసక్తికరమైన నేపథ్యంతో అల్లాడు.
ఈ కథ మొట్టమొదట సాహిత్య మాసపత్రిక ‘భారతి’ లో 1943 జులైలో వచ్చింది. 70 సంవత్సరాల క్రితం రాసిందైనా ఇప్పటికీ వన్నె తరగలేదు. మానవ స్వభావంలోని ఒక వాస్తవాన్ని వెన్నెల వెలుగులో చూపించిన కథ ఇది!
కథాంశం చిన్నదే. ముగ్గురు జతగాళ్ళు సరదాగా కుమిలీ ఘాటీకి అర్థరాత్రి షికారుకు బయలుదేరటం, ఆ అనుభవం చివరికెలా పరిణమించిందీ అన్నది- ఇతివృత్తం. కథకుడి అనుభవంలోంచి అతడు చెబుతున్న మాటల ద్వారా… జరుగుతున్నది మనం గ్రహిస్తుంటాం.
అర్థరాత్రి నాటకాలకనో, హరికథలకనో బృందాలుగా వెళ్ళటం ఒకప్పుడు గ్రామప్రాంతాల్లో మామూలే. పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం పల్లెటూళ్ళలో కుర్రాళ్ళు అద్దె సైకిళ్ళ మీద దగ్గర్లోని బస్తీలకు ‘సెకండ్ షో’ చూడ్డానికి వెళ్ళేవాళ్ళు. మంచు కురిసి వణికించే డిసెంబరు చలి కూడా వాళ్ళ ఉత్సాహాన్ని తగ్గించేది కాదు.
ఈ కథ విషయానికొస్తే… వెన్నెల రాత్రి కాలినడకన నడిచే ఆ స్నేహితులతో పాటే మనమూ ప్రయాణమవుతాం.
కథ చెబుతున్న వ్యక్తి భావుకుడూ, సౌందర్యపిపాసీ మాత్రమే కాదు- ధైర్యం, ధీమా ఉన్న చమత్కారి కూడా. ‘నా అరికాళ్లు చెప్పుజోళ్ల కన్నా బలమైనవి. వేళ్లకి దెబ్బలు తగలకండా నిపుణతతో అడుగులు వెయ్యడం నా కాళ్లకి తెలుసు.’ అంటాడు. అంతేనా? ‘ఎక్కపెట్టిన రాళ్లని నా కాళ్లు కళ్లున్నట్టు తప్పించుకోగలవు’ అనీ చెబుతాడు.
చలికాలం రాత్రుళ్ళు రోడ్డు మీద పొడుచుకొచ్చినట్టుండే రాళ్ళమీద చెప్పుల్లేకుండా నడవటంలో కష్టం తెలిసినవాళ్ళకి కథకుడి నడకలోని చాకచక్యం మరింత ప్రస్ఫుటమవుతుంది.
ఆహ్లాదకరమైన ఆ రాత్రి – ‘వెన్నెల కర్పూరం లాగ వెలుగుతున్నాది’. ‘నల్లని నీడలో గోతిడు నీళ్లు వెన్నెలపడి తెల్లగా చెంగల్వపువ్వులాగ వికసించాయి’
ఇంత హాయిగా కులాసాగా సాగుతున్న ప్రయాణంలో నక్క కనపడుతుంది. తర్వాత ముచ్చట్లలో దుమ్ములగొండె (హైనా) ప్రస్తావన వస్తుంది. తమ ఊరివాడైన దాసు పిరికితనం గుర్తు చేసుకుని నవ్వుకుంటారు. (పశువులను లాక్కెళ్ళిపోయి ఆనవాళ్ళు కూడా లేకుండా తినెయ్యటం హైనాలకు అలవాటు. మనుషులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచటం కూడా చేస్తుంటాయి. విచిత్రమైన, వికృతమైన నవ్వు వీటి ట్రేడ్ మార్కు.)
అయితే కొద్దిసేపట్లోనే పరిస్థితి తారుమారవుతుంది. దుమ్ములగొండె ఆలోచనలతో కథకుడికి ధైర్యం క్షీణించిపోవటం మొదలవుతుంది.
అంతే! దారిలోని బండరాళ్లన్నీ దుమ్ముల గొండెల్లాగ కనబడ్డం మొదలెట్టేయి.
‘మా నడకకి కప్పలమోత మిలటరీ బేండు, కీటకాల మోత నా హృదయంలో మధురరసాన్ని ఊరిస్తూ అప్సరసల్ని కళ్లెదటికి తీసుకొస్తున్నాది’అన్న భావుకత్వం స్థానంలో
భయకంపితమైన ఆలోచనలు పురివిప్పుతాయి. ‘కింకిణీస్వనం లంకిణీదేవి గుర్రులాగుంది. కప్పల ఆర్కెస్ట్రా కొండదేవత బలికి నరులని తీసుకుపోతున్న కిరాతుల డోలు వాయిద్య మైపోయింది’.
భయం గురించి పరిశోధన చేసిన శాస్త్రవేత్తలాగా చాసో దీన్ని అభివర్ణిస్తాడు. ‘భయం శరీరాన్నంతా ఆవహించడం అందరి అనుభవంలోనూ ఉండదు. సాధారణంగా భయం గుండెల్లో ఒక భాగాన్ని మాత్రమే పట్టుకొంటుంది. ఇంకో భాగం ధైర్యాన్ని ఉపాసన చేసి భయపిశాచిని గెంటేస్తుంది’కానీ తనను భయం పూర్తిగా వశం చేసుకుందనీ, శరీరాన్నంతా ఆవహించిందనీ చెప్పుకొస్తాడు.
ఆ భయం పక్కనున్న మిత్రుడు గిరిరావుకి కూడా అంటువ్యాధిలాగా వ్యాపిస్తుంది. వాళ్ళిద్దరికీ కాలు ముందుకుపడదు. ఇదంతా చూసి- అప్పటిదాకా నవ్వుతాలుగా మాట్లాడుతూ హుషారుగా ఉన్న మణ్యం లో కూడా భయంకరంగా ప్రవేశిస్తుంది భయం. ‘అమ్మో’అని పెద్ద కేక వేసి వెనక్కి తిరిగేటంత స్థాయిలో!
మొత్తానికి ముగ్గురూ వెనుదిరిగి వేగంగా వచ్చేస్తారు. మనుషుల అలికిడీ, పశువుల సవ్వడీ విన్నాక- అప్పుడు తన పిరికితనానికి సిగ్గు వేస్తుంది.
(దుమ్ములగొండె)
దుమ్ములగొండె అక్కడ ఉన్నదో లేదో కానీ, ఆ ఆలోచనలే వాళ్ళను వణికించేసి, సరదాయాత్రను అర్థాంతరంగా ఆపేసేలా చేస్తాయి. మనిషిలో భయం ప్రవేశించాలే గానీ , అదెంతగా నిర్వీర్యం చేసి నిస్సహాయుణ్ణి చేస్తుందో ఈ కథ గొప్పగా చిత్రించింది.
ప్రథమ పురుష కథనంగా దీన్ని మలిచివుంటే ఎలా ఉండేది? అప్పుడు ప్రధాన పాత్ర అనుభూతిని అంత గాఢంగా చిత్రించటం కుదిరివుండేది కాదు. పైగా ‘భ్రాంతిమదలంకారం’
కీలకమైన ఈ కథలో ఆ భ్రమను పాఠకులకు విశ్వసనీయంగా చిత్రించటానికి ఉత్తమ పురుష కథనమే అత్యుత్తమనేది నిర్వివాదాంశం.
పునర్ముద్రణల్లో శైలి ఖూనీ!
చాసో కథలను విశాలాంధ్ర వారు పుస్తకంగా తెచ్చారు. 1968లో మొదటి ముద్రణ వచ్చింది. తర్వాత 1983, 88, 93, 97లలో కూడా పునర్ముద్రణలు వచ్చాయి. నా దగ్గర ఆరోదైన అక్టోబరు 2012 ముద్రణ ఉంది.
ఒక్క ‘దుమ్ములగొండె’ కథను పరిశీలించినా భారతిలో వచ్చిన ప్రచురణకూ , దీనికీ పాఠ్యభేదాలు ఎన్నో కనపడ్డాయి. మిగిలిన కథల్లో ఎన్ని మార్పులు జరిగి, పాఠకులకు అందుతున్నాయోనని బాధ వేసింది.
రచయితకు ‘ళ్ల ’అని ఉపయోగించే అలవాటు. కానీ విశాలాంధ్ర పుస్తకంలో వేసిన కథలో కొన్నిచోట్ల ‘ళ్ళ’ అని అచ్చేశారు.
‘వేళ్లకి దెబ్బలు తగలకండా..’
‘ఒకరికి ఒకరం తీసిపోకండా..’
‘మాట్లాడకండా’
ఇలా రాయంటం చాసో శైలిలో భాగం. కానీ విశాలాంధ్ర ప్రచురణలో ‘తగలకుండా’, ‘తీసిపోకుండా’, ‘మాట్లాడకుండా’ అని మార్చేశారు.
‘కప్పల ఆర్కెస్ట్రా మొత్తంమీద ఉద్భవం చేస్తున్న ‘హార్మొనీ’ వింటూ నడుస్తున్నాను’ అనే వాక్యంలో ‘ఉద్భవం’ బదులు ‘ఉధృతం’ అని మార్చేశారు.
‘వాకట్లో పెద్ద పువ్వులాగ పడ్డ కొబ్బరిచెట్టు నీడనీ, గోడమీద రంగవల్లికలుగా ఏర్పాటు అయిన తుప్పల నీడలనీ చూసి ఆనందిస్తూ …’ విశాలాంధ్ర ప్రచురణలో ఈ వాక్యంలో రెండు మార్పులు చేశారు- ‘వాకిట్లో’ అనీ, ‘రంగవల్లికల్లాగ’ అనీ.
విసంధులను సంధి చేయటం, పేరాలు కలిపెయ్యటం, ఫుల్ స్టాపులు తీసెయ్యటం లాంటివి చెప్పనే అక్కర్లేదు.
ఇవన్నీ ఆరు పేజీల ఒక్క కథలోని తేడాలే! పుస్తకంగా వచ్చినపుడు రచయిత తన కథలోని భాషను దిద్దటం వల్ల ఇలా జరిగిందని అనుకోనక్కర్లేదు. రీ ప్రింట్ అయినపుడు కంపోజింగ్ పాఠ్యాన్ని జాగ్రత్తగా చెక్ చేయకపోవటం వల్లనే ఇలా జరిగిందని తేలిగ్గానే గ్రహించవచ్చు.
ఒక రచనను ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇన్ని మార్పులూ చేర్పులతో పాఠకులకు అందించటం అంటే ప్రచురణకర్తలు రచయిత పట్ల అపచారం, పాఠకులకు అన్యాయమూ చేసినట్టే!
ఏడు దశాబ్దాల క్రితం ‘భారతి’ లో వచ్చిన ఈ ‘దుమ్ములగొండె’ కథను భారతి పేజీల్లోనే ఇక్కడ చదవండి…
చాలా మంచి కధ పరిచయం చేసారు వేణు గారూ !!
భ్రాంతి మదలంకారం అందరూ జీవితం లో ఏదో ఒక సందర్భం లో అనుభవించేదే !!
వర్ణన , అప్పటి పలుకు బడి బాగున్నాయి .
ఒకే శబ్దానికి భయం ఎలా వేరే రంగు అద్దిందో – మీరు చేసిన comparision బాగుంది .
వేణు గారూ!
చాలా మంచి కథను పరిచయం చేసి విశ్లేషించటమే కాక, చాసో గారి కథల్లో ఆయువుపట్టుగా భాసిల్లే ప్రత్యేక నుడికారాన్ని పునర్ముద్రణలో ఎట్లా ఖూనీ చేసిందీ చెప్పటం అభినందనీయం. ఇది ఇతర ప్రచురణకర్తలకు ఒక హెచ్చరికగా పని చేస్తుందని ఆశిద్దాం. కానీ ఈ కథను నేను పందొమ్మిది వందల అరవైలలోనో డెబ్భైలలోనో భారతిలోనే చదివినట్టు బాగా గుర్తు. భారతిలో అప్పుడు వేసింది రెండో సారి కావచ్చు. దాదాపు అదే దశకంలో దాదాపు ఇటువంటి ఇతివృత్తమే ఉన్న కథ – భయపడటం గురించినది – భారతిలో అచ్చైంది. దాని పేరు ఆక్టోపస్. దాని రచయిత మధురాంతకం రాజారాం అని జ్ఞాపకం. అభినందనలు.
వేణు గారూ!
కథలు అనగానే ఎక్కువమంది కుంకుడాకు, ఏలూరెళ్ళాలి, ఎందుకు పారేస్తాను నాన్నా.. వంటి ప్రాచుర్యం పొంది కథల్నే ఎంచుకుంటారు.
ఎవరూ అంతగా గుర్తించని కథను, ఎవరూ గుర్తించని కోణాన్ని భలే పట్టుకున్నారు మీరు.
ఈ కథ చదువుతున్నంత సేపూ ఆ ముగ్గురితో కల్సి పాఠకుడూ ప్రయాణం చేసి, మణ్యానికి ఒక్కసారిగా భయం పట్టుకోగానే ఆ భయాన్ని చప్పున అర్థం చేసుకోగలుగుతాడు.. కథలో వర్ణించిన వాతావారణాన్ని, ఆ అర్థ రాత్రి వర్ణనల్ని కూడా ఫాలో అవుతూ ఉండటం వల్ల!
ఇక చాసో రాసిన వాటిని సవరించడం అనేది అతి పెద్ద తప్పు సాహిత్య పరంగా! ఒక ప్రాంతం తాలూకు మాండలీకాల పట్ల అవగాహన లేక పోవడం వల్ల, సదరు ప్రూఫ్ రీడర్ తమ ప్రాంతపు భాషే కరెక్ట్ అనుకుని దానికి అనుగుణంగా సవరించి ఉంటారా? మరి పబ్లిషర్లు ఏం చేస్తున్నట్లో?
మీరు ఎత్తి చూపిన అంశాలు ప్రచురణ కర్తలందరూ దృష్టిలో పెట్టుకోవల్సినవి జాగ్రత్త పడవలసినవీ!
ప్రచురణ కర్తలు తమ పుస్తకాలను మార్కెట్ చేసుకోవడంలో చూపినంత శ్రద్ధ ఇలాటి వ్యాసాలు చదవడం లో చూపించరు. అదే విచారం, విషాదమూ!
కథలు, పుస్తకాలు ఇలా ఎలా ఇవ్వ గలుగుతున్నారు? సుజాత గారు కూడా ఒక నవల మొత్తం ఇచ్చేశారు? technique ఏమిటీ? facebook లో కూడా ఇలా చెయ్యొచ్చా?
మంజరి లక్ష్మి గారూ,
కాపీ రైట్ సమస్య లేని పుస్తకాలని , కథల్ని ఎవరు ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చండీ. మీకో విషయం చెప్పమంటారా? మనలో చాలా మందికి ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్ప వెదుక్కునే అలవాటు ఉండదు. (కొన్ని సార్లు నాకూ బద్ధకమే వెదకడానికి) వెదుక్కుంటే అలాటి పుస్తకాలు ఉచితంగా నెట్ లో బోలెడు దొరుకుతాయి. నేను ఇచ్చిన సిద్దార్థ నవల నాకు ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్ లో పేజీల వారీగా దొరికింది. అందరికీ పంచాలనే ఆసక్తితో వాటిని ఒక చోట కూర్చి మొత్తం పుస్తకంగా చేసి షేర్ చేసాము.
అలాగే ఇక్కడ ఇచ్చిన చాసో కథ భారతి లో ప్రచురించింది. దాని మీద కాపీ రైట్ ఉండదు. అదే విశాలాంధ్ర వాళ్ళు వేసిన పుస్తకంలోంచి స్కాన్ చేసి ఇస్తే కాపీ రైట్ సమస్య వస్తుంది
కాపీ రైట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండి, సమస్య లేని పుస్తకాలను షేర్ చేయొచ్చు. ఫేస్బుక్ లో అయినా సరే, ఎక్కడైనా సరే
ఒకవేళ మీరు టెక్నికల్ విషయాలు అడిగి ఉన్నట్లయితే scribd లోకి కాపీ రైట్ లేని పుస్తకాల్ని అప్ లోడ్ చేయడం నేర్చుకుంటే సరి.. ! సులభమే
సుజాతగారు ధన్యవాదాలు. కాపీ రైట్ గురించి మీరు చెపితేనే నాకు తెలిసింది. ఇంకా ఏదైనా పెట్టెయ్యచ్చేమో అనుకుంటున్నాను. స్క్రీన్ లాగా వచ్చి జరుపుకుంటు చదివేటట్లు ఎలా చేశారా అని ఆశ్చర్యం కలిగింది. అందుకని ఆ technique ఏమిటని తెలుసుకుందామని రాశాను. scribd అని గూగుల్ లో అడగాలా?
మంజరి గారూ! http://www.scribd.com/ లో ఎవరైనా ఉచితంగానే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన దగ్గరున్న పిడిఎఫ్ ఫైల్స్ ను తేలిగ్గానే అప్ లోడ్ చేసేయొచ్చు.
అలా అప్ లోడ్ చేసిన ఫైల్స్ తాలూకు ఎంబెడెడ్ కోడ్ ని క్లిక్ చేసి, దాన్ని కాపీ చేసి, బ్లాగులో కానీ, మరెక్కడైనా కానీ పేస్ట్ చేస్తే సరి! యూ ట్యూబ్ వీడియోలను కూడా ఇదే పద్ధతిలో బ్లాగుల్లో/ ఇతర సోషల్ మీడియా సైట్స్ లో ఉపయోగిస్తుంటారు.
మంజరి గారూ
http://www.scribd.com/
ఇక్కడ మీరొక అకౌంట్ క్రియేట్ చేసుకుని , కాపీ రైట్ లేని రచనల ఫైల్స్ ని అప్ లోడ్ చేసి, దాని తాలూకు లింక్ ని ఇవ్వడమేనండీ
రామ్ గారూ,
చాసో కథల్లో నేను కొంచెం ఆలస్యంగా చదివిన కథ ఇది. మీ స్పందనకు థాంక్యూ.
Elanaaga గారూ,
థాంక్యూ. వివిధ రచనల ముద్రణ విషయంలోగానీ, పునర్ముద్రణ విషయంలో గానీ శ్రద్ధ పెట్టే ప్రచురణకర్తలు మనకు తక్కువే. మీరు చెప్పిన ‘ఆక్టోపస్’ కథ భారతిలో సుమారుగా ఏ సంవత్సరంలో వచ్చిందో చెప్పగలరా?
సుజాత గారూ,
థాంక్యూ. చాసో జీవితకాలంలో వచ్చిన ముద్రణల్లోనైనా ఈ కథ సక్రమంగా అచ్చయిందో లేదో! ప్రస్తుతం మార్కెట్లో ‘చాసో కథలు’ ఏడో ముద్రణ (2013) ఉంది. దీన్ని కూడా పరిశీలించాను. ఆరో ముద్రణకూ దీనికీ ఏమీ మార్పుల్లేవు!
సుజాత గారికి, వేణూగారికి థాంక్స్. మీరు చెప్పినది చేయటానికి ప్రయత్నం చేస్తాను.
ఇది చూసి నా దగ్గరున్న చాసో గారి కధల పుస్తకం తీసి ఈ కధ చదివాను. దాని ప్రచురణ కాలం ఆగష్టు 1983. దానిలో `వేళ్ళకు దెబ్బలు తగలకుండా’ అనే రాశారు. అలాగే `వాకిట్లో’, రంగ(అచ్చు తప్పు `గ’కు బదులు o పడింది.)వల్లికల్లాగా’ అనే ఉన్నాయి. అయితే ఉధృతం బదులు ఉద్భవం అనే ఉంది.
మంజరి లక్ష్మి గారూ! ‘ఉద్భవం’ అనే మాట సరిగా నిలిపివుంచినందుకు 1983 ప్రచురణను అభినందించాలి. తర్వాత ప్రచురణల్లో రీ కంపోజింగ్ చేసినపుడు ఆ మాటను ‘ఉధృతం’ గా మార్చివుంటారు.
దీనికంటే ముందు వచ్చిన 1968 ప్రచురణ ఎలా ఉందో!
అవును మొదటి ప్రచురణ 1968 అని ఉంది అందులో. కదలని ఈ కోణం నుంచి కూడా చూడాలని ఈ వ్యాసం వల్లే తెలిసింది. అంతకు ముందంతా కథలో ఏం చెప్పారు, ఎలా చెప్పారు, అంతవరకే చూసేదాన్ని. మాండలీకానికి అంత ప్రాధాన్యత ఉంటుందని తెలియదు.
ఒక స్నేహితురాలి చలవ వల్ల మొన్ననే చాసో కధల పుస్తకం పూర్తిచేశానండీ!
అన్నిటిలో ఈ దుమ్ములగొండె కధ పూర్తిగా వేరుగా ఉంది.. చదువుతుంటే అక్కడక్కడా ‘వనవాసి ‘ తాలూకా భావుకత్వం కాస్త స్పృశించినట్టనిపించింది..
నాకు బాగా నచ్చినవి ‘వాయులీనం’.. ‘పోనీ తిను ‘.
ఒక రచనను ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇన్ని మార్పులూ చేర్పులతో పాఠకులకు అందించటం అంటే ప్రచురణకర్తలు రచయిత పట్ల అపచారం, పాఠకులకు అన్యాయమూ చేసినట్టే! – మీ ఆవేదన తో నేనూ గొంతు కలుపుతున్నాను