నీరెండ మెరుపు

రాఘవరెడ్డి కవిత్వం

నవంబర్ 2013

పాఠం చెబుతున్నాను

ఇప్పుడేం … పదేళ్ల నుంచీ చెబుతూనే ఉన్నాను
నిజమే … కాస్త ఎర్రగానే చెబుతున్నాను
విద్యార్థి ఇంజనీరో డాక్టరో ఇంకేదో అవ్వాలంటాడు
కానీ మొదట అతను మనిషి కావాలి గదా -
మరి ఎర్రగా కాక ఇంకెలా చెప్పను …
జీవితం గురించి కాక దేనిగురించి చెప్పను …
దారుల గురించి చెప్పొద్దూ …
ఏ దారి ఎక్కడికెళ్తుందో తెలపొద్దూ …
ఎవరు ఏ దారిని ఎందుకు వేశారో అవగతమైతేనే గదా
తను వెళ్లాల్సిన దారిని వెదికి పట్టుకోగలడు –
నీ కోసం నా కోసం పణమయ్యే ప్రాణాలుంటాయని తెలియొద్దూ …
కన్నీళ్లను కోరని త్యాగాలుంటాయని తెలియొద్దూ …
అడవి పాడే పాటలుంటాయని
నిషిద్ధగానపు నిజాలుంటాయని
మరణంతో ఆగని రణాలుంటాయని తెలియొద్దూ …
పాఠాలను కాస్త ఎర్రగానే చెబుతున్నాను
చెప్పాల్సిందే చెబుతున్నాను చేయాల్సిందే చేస్తున్నాను.
ఆలోచన రేపొద్దూ …
గొంతులోనే ఆగిపోయిన పాటలెందుకున్నాయో
కళ్లలోనే ఇంకిపోయిన కలలు ఎందుకున్నాయో
మధ్యరాత్రే ఆరిపోయిన మంటలెందుకున్నాయో – ఆలోచన రేపొద్దూ ..
నడుస్తున్న నాటకం అర్థమైతేనే గదా
తను ధరించాల్సిన పాత్రేదో తరచి చూసుకోగలడు -
పల్లవికీ చరణాలకూ మధ్య చరణాలకూ చరణాలకూ
మధ్య నడకసాగని కాలముండొచ్చు
వేచి ఉండే ఓపికివ్వొద్దా …
ఎక్కడో ఏ మలుపువద్దో ద్రోహమెదురై గాయమవ్వొచ్చు
గుండె చెదరని ధైర్యమివ్వొద్దా …
అడుగు కలిపిన పాదమేదో మధ్యదారిన జారిపోవచ్చు
పట్టు సడలని స్ఫూర్తినివ్వొద్దా …
– చెప్పాల్సిందే చెబుతున్నాను చేయాల్సిందే చేస్తున్నాను
పాఠం కాస్త ఎర్రగానే చెబుతున్నాను.

***

పాఠం ఎవరికి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ప్రశ్నలు రేకేత్తుతూ…

పాఠం అనగానే బడి . తరగతి గదులు. ఆ గదుల్లో కుర్చీలూ, బల్లలూ, బ్లాక్ బోర్డు, కిటకిటలాడే పారం కోళ్ళ లాంటి పిల్లలు, జీతం రాళ్ళకు బానిసలై జవాబుదారీతనం లేకుండా ఏదో పాఠం చెప్పే ఉపాధ్యాయులు, వారిచ్చే హొమ్ వర్క్, పనిష్మెంట్లు , గంటల గంటల పుస్తకాల నూర్పిడి, వార్షిక పరీక్షలు , అర్హత పరీక్షలు , ఎంపిక పరీక్షల రాపిడి .. సారం లేని చదువులతో నిస్సారం అవుతున్న మెదళ్ళు .. బండ బారుతున్న బాల్యం . కళ్ళ ముందు కదలాడుతూ . ఎప్పుడు మారుతుందీ ఒరవడి అని మదనపడుతూ . . అందుకు భిన్నంగా ఏ దారి ఎక్కడికి వెళుతుందో తెలుపుతూ చెప్పే పాఠం విన్పిస్తుందేమోనని ఆశగా వెతుకులాడుతూ ..

విద్యార్థుల మెదళ్ళు రుబ్బు రోళ్లలా పాఠాలు రుబ్బుతూనే .. అసలీ పరీక్షలు విద్యార్థుల జ్ఞాపక శక్తికా ? జ్ఞానశక్తికా ? అర్ధం కాక కొట్టుమిట్టాడుతూన్న క్షణంలో వినిపిందింది ఓ స్వరం. అది ఎడారిలో ఒయాసిస్సులా రాఘవరెడ్డి గారి స్వరంలో “పాఠం చెబుతున్నాను”. ఆనందం. నాలో పట్టలేని ఆనందం .

‘విద్యార్థి ఇంజనీరో డాక్టరో ఇంకేదో అవ్వాలంటాడు
కానీ మొదట అతను మనిషి కావాలి గదా .’

ఆ స్వరం, ఆ పాఠం నాలో ఆశను రేపింది. భవిష్యత్తుపై నమ్మకం పెంచింది. అవును నిజం, అతను మనిషి కాకుండా , జీవితం గురించి తెలుసుకోకుండా , తన దారిని ఎలా వెతికి పట్టుకోగలడు?

“పాఠంచెబుతున్నాను” నాకెన్నో చెప్పింది. అసమానతల అంతరాలు పూడుస్తూ, రేపటి భవిష్యత్తుకు పునాదులు వేస్తూ , అభివృద్ధికి నూతన గవాక్షాలు తెరుస్తూ, బోస్లూ .. భగత్సింగ్ లూ .. బోన్సాయ్ లను గుర్తిస్తూ, గొంతులోనే ఇంకిపోయిన పాటల్ని, కళ్ళలోనే ఇంకిపోయిన కలల్ని సాకారం చేసుకునేలా మట్టిగొట్టుకు పోతున్న మాణిక్యాలను వెన్నుతట్టి లేపుతూ, తను ధరించాల్సిన పాత్రేదో అర్ధం చేస్తూ కొత్తలోకం సాక్షాత్కరింప జేస్తూ ..

మాయమై పోతున్న నిబద్దత, నైపుణ్యం , అంకిత భావం, ఆత్మ పరిశీలన తెలియచేయాల్సిందే. అది గురుస్వభావం. చెప్పే పాఠం అక్షర జ్ఞానం ఇవ్వడం కోసమేనా? కాదు ఆలోచన రేపాల్సిందే. పదును పెట్టాల్సిందే. మేధోమధనం జరగాల్సిందే. ప్రజ్ఞా పాటవం, ప్రపంచ జ్ఞానం అందించాల్సిందే. సామాజిక విలువలూ, సాంఘిక బాధ్యతలూ, బాంధవ్యాలూ, స్వేచ్చా స్వాతంత్ర్యాలు పూయించాల్సిందే . మనో వికాసం కలిగించాల్సిందే , విశాల దృక్పధం ఏర్పరచాల్సిందే. నూతన జీవన మార్గాన్వేషణ మార్గాలు ఎరుక చేయాల్సిందే.

చెప్పాల్సింది చెప్పాల్సిందే .. చెయ్యాల్సింది చెయ్యాల్సిందే .. అది గురువు బాధ్యత. ఆ ఎరుక గురువులందరూ కలిగి ఉండాల్సిందే

నీ కోసం నా కోసం పణమయ్యే ప్రాణాలుంటాయని తెలియొద్దూ …

‘కన్నీళ్లను కోరని త్యాగాలుంటాయని తెలియొద్దూ …
అడవి పాడే పాటలుంటాయని
నిషిద్ధగానపు నిజాలుంటాయని
మరణంతో ఆగని రణాలుంటాయని తెలియొద్దూ ‘

రాఘవరెడ్డి గారి అక్షర విన్యాసాల్లో, పదచిత్రాల్లో నవ్యత, గాఢత. సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సాధారణ పదాలతో అసాధారణ వ్యక్తీకరణ . ఆ వ్యక్తీకరణలో మానవీయ దృక్కోణం . చదువరికి హాయిగొలుపుతూ, నర్మగర్భంగా భావాన్ని పలికిస్తూ, కొత్త అనుభూతిని మిగులుస్తూ, తనవెంట తీసుకుపోతూ, తట్టి లేపుతూ, స్ఫూర్తినిస్తూ సాగుతుంది రాఘవరెడ్డి గారి కవిత్వం.

 

(రాఘవరెడ్డి)

 

ఈ కవితకు మూర్తి గారి ఇంగ్లీష్ అనువాదం ఇక్కడ చదవొచ్చు:
http://teluguanuvaadaalu.wordpress.com/2013/10/13/i-teach-a-lesson-raghavareddy-ramireddy-telugu-indian/