కవిత్వం

ఈ కవిత్వానికి శీర్షిక లేదు

జనవరి 2013

“నేను నిప్పును – నేను నీరును
లక్షలాది సైనికుల్లో నేనొక సైనికుణ్ణి “
సైనికుణ్ణి నేనే
యుద్ధాన్నీ నేనే
యద్ధభూమినీ నేనే
త్యాగం నా జవసత్వం
పోరాడ్డం నా జీవగుణం
అడవిపోదల్లోండి బీడుబడ్డ దేహంగుండా
దాహానికొచ్చే సింహంలా
నేను ఎర్రగా ఉదయించాను
ఎర్రగానే అస్తమించాను
మూడుతరాల గోసను మూటగట్టుకుని
నన్ను నేను దగ్ధం చేసుకున్నాను
ఉధ్యమిస్తోన్న దేహాల్లో
ఉడుకు నెత్తురై ప్రవహిస్తున్నాను
అలరారే అమాయకపు నవ్వుల్లో
నేడు మేఘగర్జనలు వింటున్నాను
మెరుపు తీగల్ని కంటున్నాను
నా మేరుపర్వతంపై పడి మేస్తోన్న దున్నపోతుల్లారా !
మీ మేను పులకరింపులిక చాలించండి!
రండి మా బొందలగడ్డకు…
అక్కడ ఎప్పటికీ తెరవని వందల జతల కళ్ళతో
ఒక తాత్విక చర్చ జరుపుదాం
సమాదులపై మొలచిన జవాబులు
మీకు స్వాగతం పలుకుతాయి
చిట్టచివరి కొమ్మల్లో ఆకుల్లో
హోరుగాలి పురుడుపోసుకుంటుంది
తుఫాను మేఘాలు కమ్ముకుంటాయి
చేతులన్నీ ఒక్కటవుతున్న చేతనలోంచి
మరో మహోదయానికి అంకురార్పణ జరుగుతుంది
నా లేత శరీరం కాలాక వస్తోన్న పొగల్లోంచే
రాలిన పూలు
పోయిన ప్రాణాలు
లేచి నిలబడుతాయి!
చర్చ ముగుస్తుందిఇక చరిత్ర మొదలవుతుంది.



మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)