కవిత్వం

నేనూ నా పక్షులూ

8-నవంబర్-2013

ఏ తిరునాళ్ళలోనో తప్పిపోయిన పిల్లల్ని
ఏళ్ళ తర్వాత కలుసుకున్నట్టుంది
నేనెవరో మర్చిపోయి చాన్నాళ్ళయ్యాక
ఇన్నాళ్ళకి ఈ పిల్లల ముఖాల్లో
నన్ను నేను చూసుకున్నట్టుంది.

వాళ్ళను చూసిన క్షణాల్లో
జ్ఞాపకాల తూనీగలు
ఒక్కసారిగా నామీద దాడిచేశాయి
నవోదయ తోటలో పక్షుల్ని
ఒళ్ళంతా వేళ్ళాడేసుకుని కదిలేవాడిని
పాఠాలు ఏం చెప్పానో కానీ
ఆ పిట్లల పాటల పరిమళం దమ్ములాగుతూ
ఒక రౌడీచెట్టులా కొమ్మలెగరేసుకుంటూ తిరిగేవాడిని

ఇన్నాళ్ళ తర్వాత ఇన్నేళ్ళ తర్వాత
గుండె ఆల్బం దుమ్ము దులిపాను

నేనో పిల్లలో..పిల్లల్లో నేనో
నాలో పిల్లలో..
ఒక్కో బొమ్మా
నా కళ్ళ ముందు కదలాడిన దృశ్యం
ఏ ఆస్కార్ కీ అంది వుండదు.
కలవాలి..
అప్పుడప్పుడైనా
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడైనా
పిల్లల రూపంలో
నిన్ను నువ్వు కలవాలి.
పిల్లలు పెద్దవాళ్ళయి
మనల్ని పిల్లల్ని చేసే సందర్భానికి
ఒంగిఒంగి వందనాలు పలకాలి.

 

 

( చాలా సంవత్సరాల తర్వాత నేను పాఠాలు చెప్పిన బీహార్ విద్యార్థుల్ని కలిసిన ఆనందాన్ని తట్టుకోలేక..ఇలా. 26-10-2013)