కథ

సంసారంలో సంగీతం…

డిసెంబర్ 2013

ఆఫీస్ నుండి వస్తూ ఇంట్లోకి అడుగు పెట్టగానే రఘుపతికి కమ్మటి పాప్ కారన్ చేసేటప్పుడు వచ్చే ఘుమఘుమ సాదరంగా ఆహ్వానం పలికింది. ఒక్కసారిగా అమందానంద కందళిత హృదయారవిందు డయిపోయాడతను. పాప్ కార్న్ అంటే అంత ఇష్టం అతనికి మరి. అందులోనూ ఈమధ్య ఇన్ స్టెంట్ పేకట్లు వచ్చేక అది చేసుకోవడం మరీ తేలికయిపోయింది. మైక్రోవేవ్ వుంటే వాటి రుచింక మరీ చెప్పక్కర్లేనంత బాగుంటుంది. కాని రఘు భార్య రమ అస్తమానం పాప్  కార్న్ చెయ్యదు. ఇంటి నిర్వహణ బాధ్యతంతా సమర్ధవంతంగా నడిపిస్తున్న రమకి అన్నన్ని డబ్బులు పెట్టి ఆ పేకట్లు కొనడం శుధ్ధ డబ్బు దండగని కొనదు. రఘుకి ఇష్టం కనక నెలకొక్కసారి మటుకు అతనికి చేసి ఇస్తూంటుంది.

కాని ఇప్పుడు రఘు ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఒక పేద్ద బేసిన్ నిండానూ, పక్కనే మరో గంగాళవంత గిన్నె నిండానూ ఘుమఘుమలాడిపోతున్న పాప్ కార్న్ కనిపించేసరికి ఒకవేళ రమ పాప్ కార్న్ నోము నోస్తోందేమోననుకుంటూ..”ఇలా పాప్ కార్న్ నోములు కూడా వుంటాయా రమా”.. అని ఎంతో ప్రేమగా అడిగేడు.

“మీ తెలివి బంగారంగానూ.. పాప్ కార్న్ నోవేవిటండీ.. మరీ విడ్డూరం కాపోతేనూ..” అంది రమ.

“మరి ఇన్నెందుకు చేసేవ్? మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా?”

“అబ్బ కాదండీ.. పోటీ కోసం..”

“పాప్ కార్న్ చెయ్యడంలో పోటీయా..?” ఆశ్చర్యంగా అడిగేడతను. అంత ఆశ్చర్యం యెందుకంటే ఈమధ్యకాలంలో కొంతమంది అన్నం ఎలా వండాలో వర్క్ షాప్ నిర్వహించారని విన్నాడు. ఇది కూడా అలాంటి దేదో అనుకున్నాడతను.

“మీరు మరీనూ.. పోటీ పాప్ కార్న్ చెయ్యడానికి కాదండీ. పోటీ దేనికంటే ఎవరైతే బెస్ట్ అవుటాఫ్ వేస్ట్ చేస్తారో నని పోటీ..”

అర్ధం కాలేదు రఘుకి. ఇంత కమ్మగా పాప్ కార్న్ ఊరిస్తుంటే ఇది వేస్టెలా అవుతుందీ.. అయోమయంగా చూసేడతను. రమ నవ్వింది. రఘుకి లవలేశమైనా కళాహృదయం లేదని ఆమెకి ఖచ్చితంగా తెలుసు. అందుకే “మీకర్ధం కాదులెండి. ఏవైనా పార్టీలయినప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడూ పాప్ కార్న్ తింటుంటారు కదా.. ఆఖర్న ఎంతోకొంత మిగుల్తుంది కదా.. దానితో డెకొరేటివ్ పీస్ అన్నమాట..అయినా దేనికైనా కళాదృష్టి వుండాలిలెండి..” చివరిమాట రఘుని వెక్కిరిస్తున్నట్టుగా అంది.

నిజంగానే రఘుకి అర్ధంకాలేదు. హేవిటో.. ఈ కళాదృష్టి హేవిటో.. ఈ డెకొరేటివ్ పీస్ హేవిటో.. దానికీ ఈ గంగాళాలనిండ వున్న పాప్ కార్న్ కీ సంబంధవేవిటో రఘు మట్టిబుర్రకి అస్సలు అర్ధంకాలేదు. పనికట్టుకుని బోల్డు డబ్బు తగలేసి గంగాళాలనిండా చేసిపోసిన పాప్ కార్న్ కీ, అందరూ తినగా మిగిలిపోయిన పాప్ కార్న్ తో చేసే కళాసృష్టికీ మధ్య గల సంబంధం అతనికస్సలు అర్ధంకాలేదు. పోనీ.. ఈ అర్ధం కాని సంత తన కెందుకనుకుంటూ..”సర్లేకానీ.. ఓ పెద్ద బౌల్ పట్రా.. వీటి పని పడతాను..” అన్నాడు హుషారుగా.

“సర్లెండి.. ఇవేవీ మీరు తినడానికి కాదు. రేపు పోటీకోసం నేను ప్రాక్టీసు చెసుకుందుకు..” అంటూ ఒక్కసారిగా రఘు ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసింది రమ. ఆ తర్వాత రమ చేసిన విఫల ప్రయత్నాలన్నీ రఘు కళ్ళూ, నోరూ వెళ్లబెట్టుకుని మరీచూసాడు. ముందు రమ స్థిమితంగా ఒక మూల కూర్చుని ఓ పేద్ద చీపురుకట్టంత వున్న సన్నని తీగల్లంటివి తనకి ఎడంపక్కన పెట్టుకుంది.  కుడివైపు పాప్ కార్న్ తో నింపిన బేసిన్, గంగాళం పెట్టుకుంది. ముందు ఓ తీగ తీసుకుని టేప్ తో పొడుగు కొలుచుకుని ఆ కొలత పక్క కాగితం మీద శ్రధ్ధగా రాసుకుంది.

తర్వాత బాగా పెద్దగా  తయారైన ఓ పాప్ కార్న్ ని తీసుకుని ఆ తీగకి గుచ్చింది. అది తీగ చివర ఒక కొమ్మకి పువ్వులా వేళ్ళాడుతోంది. దాన్ని ముందు పెట్టుకున్న ట్రేలో జాగ్రత్తగా పెట్టి, ఇంతకన్న తక్కువ కొలత వున్న ఇంకో తీగ తీసుకుని అలాగే ఇంకోటి చేసి పెట్టింది రమ. చూస్తున్న రఘుకి ఆ పాప్ కార్న్ కి గుచ్చుతున్న తీగ తన గుండెల్లో గుచ్చుకున్నంత బాధ కలిగింది. అలా ఓ పదిపన్నెండు తీగలకి పాప్ కార్న్ గుచ్చి వాటినన్నింటినీ కలిపి మధ్యకి దారంతో కట్టి, పొడుగ్గా వున్న ఓ ఫ్లవర్ వాజ్ లో సున్నితంగా వుంచి, గొప్ప విజయం సాధించినట్టు రఘు మొహం లోకి చూస్తూ, “ఎలా వుందీ?” అనడిగింది.

“నా మొహంలా వుంది..” ఉక్రోషంగా అన్నాడు రఘు.

“అంతేలెండి. ఇంట్లో భార్య ఏం చేసినా గుర్తింపు వుండదు. ఇంత కష్టపడి వేస్ట్ గా పడేసే దానితో ఇంటిని అందంగా అలంకరించే బ్రహ్మాండమైన అయిడియా చెపితే..ఇదా మీ స్పందన? హూ.. అయినా దేని అందాన్నైనా ఆస్వాదించడానికి రసహృదయం వుండాలండీ. ఎంతసేపూ పిండిమరలా ఏం వేసి నోటినాడిద్దామా అనే ధ్యాసున్నవాళ్లకి అందాలూ, అలంకారాలూ ఏం తెలుస్తాయిలెండి..” ముక్కు చీదేసింది.

ఊరుకోదల్చుకోలేదు రఘు. “అసలు వేస్ట్ అంటే ఏంటి? దేనికీ పనికిరానిదని. కాని నువ్వేం చేసేవ్? బోల్డు డబ్బులు తగలేసి కొత్త పేకేట్లు కొని తెచ్చేవ్. పోనీ కాసిన్నైనా నా నోట్లో  పడేసేవా? అదీలేదు. అవన్నీ పట్టికెళ్ళి ఆ తీగల మొహాన్న గుచ్చేవ్. ఇవి సగం రేపటికి ఆతీగలనించి ఊడి కింద పడిపొతాయ్. లేదూ.. ఏ రాత్రో చీవలన్నీ చేరి వీటి చుట్టు పుట్టలు పెట్టేస్తాయ్. ఎల్లుండి పొద్దున్నకి దుమ్ము పడి నల్లగా అయిపోతాయ్. అసలు అవి చెయ్యవలసిన పనేంటీ… ఒకళ్ళ నోట్లోకి వెళ్ళడం.. కాని నువ్వేం చేసేవ్.. వాటిని ఉరేసినట్టు ఆ తీగెలకి వేళ్ళాడదీసేవ్.. హు.. కరుణశ్రీగారి పుష్పవిలాపం లాగ.. ఆ పేకట్లలో అలాగే పడుండక నీ అలంకరణ కోసం అవి వేడిలో వేగి, తీగలకి ఉరేసుకున్నాయ్. నీ పాపానికి నిష్కృతి లేదు రమా… లేదంతే..” ఆయాసపడ్డాడు రఘు.

కళ్ళమ్మట నీళ్ళెట్టేసుకుంది రమ. ఖంగారుపడ్డాడు రఘు. “అంటే.. నా ఉద్దేశం ఏంటంటే నువ్వేం చెసినా అది మనకేదైనా కలిసొచ్చేలా  ఉండాలి కానీ.. ఇలా డబ్బులు తగలేసేలా కాదు అని . ”

“అంటే..” అంది రమ బుధ్ధిగా.

“నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఏవైనా కొన్నావనుకో. దానిని మనం పదిరకాలుగా వాడుకుని తొమ్మిది రూపాయలు ఆదాచేసేలా వుండాలన్న మాట..” వివరించేడు భార్యకి రఘు. మరింకొన్ని వివరాలడిగి రఘు చెప్పిందాన్ని ఇంకాస్త వివరంగా అర్ధం చేసుకుంది రమ.

నాలుగురోజులు గడిచిపోయాయి. ఆరోజు రఘు ఇంటికొచ్చేటప్పటికి రమ చేటంత మొహంతో ఎదురొచ్చింది. మనసులో దడ మొదలైంది రఘుకి.

“నేనీరోజు ఏం చేసేనో తెల్సా..?” అంది రమ చేటంత మొహంతో.

అన్నింటికీ సిధ్ధమైన రఘు పడబోయే వేటుకోసం చూసేడు.. రమ గబగబా లోపల్నించి రెండు పెద్దపెద్ద గుడ్దసంచుల్ని తీసుకొచ్చి రఘు కళ్లముందు ఆడిస్తూ “ఈ రెండూ ఇవాళ నేనే కుట్టేనండీ. ఇంట్లో ఎక్కువగా పడున్న గుడ్దనే వాడి, సరుకులు తెచ్చుకుందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామనీ కుట్టేను. ఎలా ఉన్నాయండీ.” అడిగింది ఆత్రంగా. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రమ చేసింది తెలివైనపనే. కాని ఆ సంచులకి వాడిన బట్ట చూస్తే రఘుకి ఏదో అనుమానం వచ్చింది. “ఏదీ.. ఇలాతే..” అంటూ చేతుల్లోకి తీసుకుని, బాగా పరీక్షించి చూసి కెవ్వుమంటూ ఒక్క కేక పెట్టేడు..”ఏవైందండీ..” ఖంగారుపడింది రమ. “ఇదెక్కడి బట్ట..”

రమ చాలా ధైర్యంగా చెప్పింది. “మీరే కదండీ చెప్పేరూ.. దేనినైనా సరే ఒకవిధంగానే కాకుండా పదిరకాలుగా వాడాలనీ.. అందుకే మీ ప్యాంటులు రెండు మోకాలి దగ్గరికి కట్ చేసి, ఆ కింద ముక్కలతో ఈ రెండు సంచులూ కుట్టేను.”

చాలా కష్టం మీద తన ఆవేశాన్ని అదుపు చెసుకుంటూ అడిగేడు. “మరి పైవి ఏం చేసేవ్..”

“అదేంటండీ.. అవి మీ ప్యాంటులు కదా.. కట్టుకుంటారూ.. ఇంకేం చేస్తారూ.. చూసేరా.. ఒక్కదాన్ని రెండు విధాలుగా ఎలా ఉపయోగించేనో..” గొప్ప చూపించుకుంది రమ.

రఘు ఒక్కసారి మోకాలిదాకా ప్యాంటు వేసుకున్న తనను ఊహించుకున్నాడు. యింకోసారి కెవ్వుమన్నాడు. మళ్ళీ హడిలిపోయింది రమ “ఏమైందండీ..” అంటూ.

“మోకాలిపైకి ప్యాంటు ఎలా కట్టుకోమంటావ్..” నవ్వేసింది అర్ధాంగి.

“మీరు మరీనూ. ఇప్పుడందరూ మోకాళ్లపైకేకదండీ లాగూలు వేసుకుంటున్నారూ.. మీరొక్కరే.. ఏదో ముసలాళ్ళైపోయినట్టు అంత పొడుగు ప్యాంటూ వేసుకుంటారు. అందుకే మిమ్మల్ని మోడర్న్ గా కూడా చెయ్యొచ్చనే ఈ ఆలోచన చేసేను తెల్సా..”

మెరుస్తున్న కళ్ళతో అంది రమ.

ప్యాంటుల్నీ, లాగూల్నీ ఒకే రాటకి కట్టేసిన భార్యామణి విఙ్ఞానానికి ఆనందపడాలో.. బంగారంలాంటి ప్యాంట్లు పనికిరాకుండా పోయినందుకు దుఃఖించాలో తెలీక అలా నిలబడిపోయేడు రఘు.

*** * ***