కథన కుతూహలం

దాంపత్యం

జనవరి 2014

రాజేశ్వరి భావుకురాలు. సగటు ఇల్లాలు. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. భర్త అభిప్రాయాలకు అనుగుణం గా నడుచుకోవాలని , ఇల్లు భర్త కు నచ్చినట్లుగా నడవాలనీ తెలుసు.అలాగే నడుచుకుంటుంది కూడాను. రాజేశ్వరి భర్త రమేష్ మంచివాడే దుర్మార్గుడేమీ కాదు. కాకపోతే ఆడవారికి స్పందించే గుణం వుంటుందని తెలీనివాడు. చీరలు నగల కోసం తపించిపోతూవుంటారని అనుకుంటాడు.అవి అమరుస్తే చాలు అనుకుంటాడు.రాజేశ్వరి అలాగే అనుగుణంగా నడుచుకునేది కూడా.కాని భర్త నోటిని భరించలేక పోయేది.అలాగే ఇద్దరు పిల్లలకు తల్లైంది. పిల్లలు చంద్రం, సరోజ కూడా తల్లికే చేరిక అయ్యారు. భర్త నుంచి ఏమాత్రం ఆప్యాయత పొందని రాజేశ్వరి పిల్లలే లోకంగా గడిపింది.అడుగడుగునా తండ్రి పరుషవాక్యాలు, ఎప్పుడేమి వినవలసి వస్తుందోనని తల్లి వణికిపోవటాలు వారికి చిన్నప్పటి నుంచే అలవాటయ్యాయి.అన్నిటికన్నా దారుణమైన విషయమేమిటంటే రాజేశ్వరిని ఇంట్లోనుంచి వెళ్ళిపోమని అరుస్తూవుండటము.ఒక్కసారి అని వూరుకునేవాడుకాదు, రాజేశ్వరి తలుపు తీసుకొని బయటికెళ్ళేదాకా అలా అరుస్తూ వుండేవాడు.ఆ అవమానాలన్నీ భరించింది.

పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళు చేసుకొని జీవితం లో స్థిరపడ్డారు. రాజేశ్వరికి లోకమంతా శూన్యంగా అనిపించింది.కొంతమంది దంపతులలో పిల్లలు స్థిరపడినతరువాత, భర్త రిటైరయ్యి ఖాళీగా వున్నప్పుడు , ఇద్దరి మధ్య సానిహిత్యం ఏర్పడుతుంది. వీరి మధ్య అదీలేదు.అదే సమయము లో ఓసారి ఓచిన్న విషయానికే రెచ్చిపోయి రాజేశ్వరిని ఇంటి నుంచి వెళ్ళిపొమ్మన్నాడు. ఈ సారి రాజేశ్వరి నిజంగానే వెళ్ళిపోయి , ఆ వీధి చివరనే ఓ గది అద్దెకు తీసుకొని వుంటుంది. పిల్లలిద్దరూ వస్తారు. తమతో హైదరాబాద్ రమ్మంటారు.తండ్రిని క్షమించమంటారు. వారి సంభాషణని గమనిస్తున్న కోడలు జానకికి రమ్మనిపిలవటానికి మామగారికి అహంకారము. వెళ్ళటానికి అత్తగారికి అభిమానం అడ్డొస్తోందని అర్ధం అవుతుంది.ఆ ఇంట్లో ఆవిడ కు అన్ని హక్కులూ వున్నాయి. ఆయన వెళ్ళిపొమ్మన్నంతమాత్రాన వెళ్ళిపోనవసరం లేదు. ఆయన తిడితే ఆవిడా తిట్టవచ్చు అని నచ్చచెపుతుంది అత్తగారికి.ఆవిడ స్థానం వదలకుండా హక్కులు ఎలా కాపాడుకోవచ్చో బోధిస్తుంది.తన మనసులోని భావాలనే జానకి బలపరుస్తున్నట్లుగా అనిపించి , ఇంటికి మహరాణిలా తిరిగి వస్తుంది.

స్తూలం గా “దాంపత్యం “కథ ఇది.

సగటు మగవాడు రమేష్. ఆడది అంటే అణిగిమణిగి వుండాలని అనుకొంటాడు.ఆమెకు స్వంత భావాలు వుంటాయని కాని, మనసు వుంటుందని కాని దానికి స్పందించే గుణం వుంటుంది అనికాని అతనికి తెలీదు.భర్త చెప్పిందే భార్యకు వేదం.అతని ఇష్టాయిష్టాలే ఆటోమేటిగ్గా ఆమెవి ఐపోతాయి.భర్త , ఇల్లు, పిల్లలు తప్ప ఆమెకేమీ వేరే ఆలోచనలు ఎదగవని అతని విశ్వాసము.ఆమెకు కావలసిన చీరలు నగలూ అన్నీ అతనే తీసుకొస్తాడు. ఆమెకేమీ లోటు చేయటం లేదు కదా అనుకుంటాడు. అది అతని తప్పు కాదు. అతను పెరిగిన వాతావరణం అది.

ఇక రాజేశ్వరి విషయానికొస్తే ,పుట్టింట్లో ఒక్కతే అమ్మాయని, మహాలక్ష్మిలా వెలిసింది అని , తలితండ్రుల, అన్నదమ్ముల మధ్య ఆప్యాయంగా గారంగా పెరిగిన అమ్మాయి.మాటలు కూడా దురుసుగా మాట్లాడుకోని , సంస్కారవంతమైన ఇంటి నుంచి వచ్చింది.అందరూ మామూలుగా తిట్టుకునే తిట్లు కూడా శూలాలా అనిపిస్తాయి. పైగా భావుకురాలు. మల్లెల సౌరభానికి, లలితమైన లలిత గీతాలకు కూడా స్పందించే మనసు.భర్త అభిప్రాయాలకు అణుగుణంగా నడుచుకోవాలని,అత్తవారింట్లో ఆమే ప్రవర్తించే పద్దతి మీదే పుట్టినింటి గౌరవం పెరుగుతుందని తెలిసినది.ఇల్లు భర్త మాటమీదే నడవాలని తెలుసు . అలాగే నడుచుకునేది కూడా.చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడే స్వాతంత్ర్యం ఆడవారికి వుండదని తెలీదు.

ఇటువంటి విరుద్దమైన స్వభావాలు కల భార్యా భర్త ల మధ్య జరిగినదే ఈ కథ . ఇది ఒక మామూలి, సగటు గృహిణి కథే కావచ్చు. చాలా మందికి రాజేశ్వరి అనుభవాల లాంటివి జరిగి వుండవచ్చు.కాని ఇందులో రాజేశ్వరి ఆలోచనలు, భావాలు చెప్పిన విధానము బాగుంది.భావుకురాలైన రాజేశ్వరి చిన్ని చిని కోరికలు కూడా తీర్చుకోలేకపోవటము , బాధపడటము , ప్రతిదానికి అడ్జెస్టైపోవటము, ఇద్దరి భావాల మధ్య తేడాను,ఇద్దరి మధ్య నున్న సంఘర్షణను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు రచయిత్రి.కాలమెంత మారినా అమ్మాయిల అదృష్టం మటుకు అంతగా మారలేదనిపిస్తుంది. ఈ తరం లో కొద్దిగా మేలేమో.ఈ కథలో అన్నిటికన్నా నాకు ఎక్కువగా నచ్చింది ముగింపు.చాలా వరకు ఇలాంటి కథలల్లో నాయిక ఇంటి నుంచి వెళ్ళిపోవటమో , లేక ఖర్మ ఇంతేననుకొని వుండిపోవటమో వుంటుంది. ఇందులో రాజేశ్వరి తిరిగి వచ్చినా తలవంచుకొని రాలేదు, మహారాణిలా వచ్చింది. తిరుగుబాటు జండా ఎగరేసింది.అది చాలా నచ్చింది.

కొన్ని కొన్ని చోట్ల రాజేశ్వరి భాధను చాలా బాగా చూపించారు.ఎంతసేపు రమేశ్ భార్య అనే అంటారు కాని ఆడవారి అస్తిత్వానికి నీడలేకుండా చేసిన సమాజం మీద కోపం తెచ్చుకొని , తండ్రిని అడుగుతుంది “నాన్నా ,పెళ్ళిచేసుకొని మరొకరికి ఇల్లాలైనంతమాత్రాన ఒక స్త్రీ లోని ప్రతిభ అణగారిపోవల్సిందేనా ?”అని. చదువుకున్నవాడు, సంస్కారవంతుడూ ఐన రాజేశ్వరి తండ్రి అచ్చం ఆడపిల్ల తండ్రిలాగే “ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీపురుషులు కలిసి జీవించాలనుకున్నప్పుడు నీలో ప్రత్యేకతలేమీ వుండకూడదు.అలావుండాలనుకోవటం ప్రకృతికి విరుద్దంగా నడవటమే ” అంటాడు. ఈ భావం ఎన్ని శతాబ్ధాలు గడిచినా మారదా అని ఓ క్షణం బాధ అనిపిస్తుంది.అంతలోనే ఈ తరం ప్రతినిధి జానకి అత్తగారితో ” ఈ ఇల్లు ఆయనదిలాగే మీది కూడాను.మాటలనే అధికారం ఆయనకే కాదు మీకూ వుంది.ఆయన పొమ్మంటే మీరూ పొమ్మనండి “అని నచ్చచెప్పటం చదివినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది.ఇలా విరుద్ధమైన భావాలు, తరాల మధ్య అంతరాలు బాగా చూపించారు. వ్రాసిన విధానము బాగుంది.మన పక్కింట్లోనే జరుగుతున్న సంగ్జటనల లాగే అనిపిస్తాయి.ఇలాంటి దంపతులు ఎక్కడో లేరు మనమధ్యనే వున్నారు.

ఈ కథను జి.యస్.లక్ష్మిగారు వ్రాసారు.ఇది “రచన” ఫిబ్రవరి 2002 మాసపత్రికలో , కథాపీఠం బహుమతి పొంది, ప్రచురించబడింది . మీరూ చదివి చూడండి, మీకూ ఈ కథ తప్పక నచ్చుతుంది.

కథ లింకు: http://srilalitaa.blogspot.in/2012/09/blog-post_28.html

*** * ***



4 Responses to దాంపత్యం

  1. January 2, 2014 at 6:55 am

    పరిచయం బాగుంది మాలగారు

  2. January 6, 2014 at 12:58 pm

    థాంక్ యు మురళి గారు .

  3. January 6, 2014 at 3:26 pm

    దాంపత్యంలో మీరు మీటిన మరో మిథునం మీ సమీక్ష.అద్భుతః.

    • January 20, 2014 at 7:37 pm

      థాంక్ యు , ఉమాదేవి గారు.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)