కవిత్వం

అది నేనే ఇది నేనే

జనవరి 2014

స్థలకాలపు సాతత్యంలో
భూతభవిత సంధించే యీ
వర్తమాన మొక బిందువుగా

పూర్వమొక్క జన్ముండినదా?
ఉంటే నేనేమై పుట్టా?
మానవుడై జన్మించానా?
జంతువుగా జన్మించానా?
గాడిదనా? గానుగెద్దునా?
బాక్టీరియమై పుట్టానా?
లేకుంటే ఉండీ ఉండని
వైరస్సా, యీస్టుగనా?

ఆడదిగా పుట్టానా?
మగవాడిగ పుట్టానా?
ఏ దేశంలో పుట్టా నేను?
ఏ భాషను పలికా నేను?
ఏ దేవుని కొలిచా నేను?
ఏ మతమును ఆదరించినా?
రాజుగ నే పుట్టానా?
రాణిగ నే పెరిగానా?
పేదగనా, పెద్దగనా?
శుంఠగనా, కవిగానా?
ప్రశ్నలపై ప్రశ్నలకు
జవాబులే దొరకవుగా!

పునర్జన్మ నాకుందా?
ఉంటే నేనెక్కడ పుడుతా?
ధారుణిపై పుడుతానో?
వారాన్నిధి లోతులలోనా?
కుజూడిపైన నా జన్మా?
చంద్రుడిపై జననమ్మో?
ప్రశ్నలపై ప్రశ్నలకు
జవాబులే దొరకవుగా!

కాలచక్రం తిరుగుతున్నదా?
పుట్టుట గిట్టుటకొరకా?
గిట్టుట మళ్లీ పుట్టుటకా?
ఇదియే సృష్టి న్యాయమా?
సృష్టికి ఒక కర్త ఉన్నదా?
సృష్టికి ఒక భర్తున్నాడా?
సృష్టికి ఒక హర్త ఉన్నదా?
ఇది అంతా యాదృచ్ఛికమా?
సృష్టి అన్నదొక కేళికయా?
సృష్టి ఒక ప్రహేళికయా?
సృష్టి అన్నదామె మాయయా?
సృష్టియు వాడాడే దాయమా?
ఆది మధ్యాంతాలు అవి
ఉన్నాయా ఈ సృష్టికి?
తోక తినే సర్పములాగ
ఇది ఒక్క విలయవలయమ్మా?

ఘనవిస్ఫోటంలో పుట్టిన
ఆ అణువులు నాలో ఉన్నాయ్!
ముగురమ్మల మూలపుటమ్మ
మైటొకాండ్రియా నా రక్తంలో
మహాత్ముల మహనీయులలో
జన్యుకణాలకు వారసుడైనా
పాతకుల ఘాతకుల
కిరాతకుల కీచకుల
జన్యుకణాలున్నాయ్ నాలో,
వారికి నే వారసుడనే
భువనరహస్యం కనుగొన్న
మహనీయులు నావారే
భువనాన్నే కొల్లగొట్టిన
ఉన్మాదులు నావారే
గౌతముడు, మీరా, బాఖ్,
నెఫ్రెతిరీ, హిట్లరులు
చెంగిజ్‌ఖాన్, మోహన్‌దాస్,
అలెక్సాండర్, క్లియొపాత్రా
వీళ్లందరు నావారే.
వీళ్ల జన్యుకణాలూ నావే!

పూర్వజన్మ ఉందా లేదా?
పునర్జన్మ ఉందా లేదా?
ఉందంటారెంతోమంది
లేదంటారెంతోమంది
మనిషిగా ఈసంఘంలో
నాకుందొక పూర్వజన్మ
దాని ఫలితమే నా యీ భాష,
దాని ఫలితమే నా యీ యాస
నా సంగీతం, నా సాహిత్యం,
నా జ్ఞానం నా ఆలోచనలు
నా మతము, నా సంస్కృతులు,
ఆ గతమే, ఆ స్మృతులే!
దాని ఫలితమే భాషాద్వేషం,
దాని ఫలితమే పరమతద్వేషం
దాని ఫలితమే నా అజ్ఞానం,
దాని ఫలితమే నా దురాలోచన

స్వర్గానికి నిచ్చెన వేస్తా,
చంద్రుడిపై వలసుకు వెళ్తా
కుజగ్రహముపై పాదము పెడతా,
నరకానికి పరుగులు తీస్తా
పాతాళం లోతులు చూస్తా,
అణ్వాస్త్రాలను పేలుస్తా

అది నేనే ఇది నేనే,
ఇది నేనే అది నేనే
వారానికి మూడు రోజులు
పాపాలను చేసే దేవత
వారానికి మూడు రోజులు
పుణ్యాలను చేసే రాక్షసి
ఏడవరోజీ నేను
తప్పతాగి తందనాలతో
నన్ను నేనే మరచిపోతా
నిన్నుకూడా మరచిపోతా
ఏమీ చేయలేని ఒక సగటు మానవుడిగా !
ఏమీ చేతకాని ఒక వెగటు మానవుడిగా!

***

స్థలకాలపు సాతత్యం = space-time continuum
ఘనవిస్ఫోటం = big bang
జన్యుకణాలు = genes

(kavita written in mAtrAChaMdassu)మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)