పతంజలి గారు చనిపోయి రెండేళ్ళు అయిందా, మూడేళ్ళు అయిందా? ఏదో పుస్తకం చూసో, ఫ్రెండ్ ని అదిగో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ అది ఇప్పుడు ఏమంత ముఖ్యం కాదు. ఎందుకంటే, అది doesn’t matter నాకు . ఏదైనా రాస్తున్నపుడో, రాజ్యం దాష్టీకం గా ప్రవర్తించినపుడల్లా, పోలీసులు క్త్రౌర్యంగా ప్రవర్తించినపుడల్లా, మర్యాదలకోసం పేరు కోసం ఎవరైనా నంగిరిపోయినపుడల్లా, కోర్టులు అన్యాయమైన వ్యాఖ్యలు చేసినపుడల్లా, కంపరమెత్తే పనులెవరైనా చేసినపుడల్లా – రోజు మొత్తం మీద పతంజలి గారు గుర్తు కొచ్చే సంఘటనలు ఎన్నో.
కొందరిని మరిచిపోవడం అసాధ్యం. జాతి జ్ఞాపకంలో, సామూహిక జ్ఞానంలో సజీవంగా నిలిచిపోతారు. ఆ కొద్దిమందిలో పతంజలి ఒకరు. కలలోనైనా వెంతాడుతుంటారు మనల్ని కొందరు. కొందరైతే మనస్సాక్షి స్థాయిలో ఉండిపోతారు. మనఅందరి జీవితాల్లో ఇద్దరో ముగ్గురో అట్లాంటి వాళ్ళు వుంటారు. పతంజలి గారు అందులో ఒకరు. ఆయన వున్నా లేకపోయినా తన కొరడా దెబ్బల్లాటి మాటలు తెలుగు మాట్లాడే ప్రజల్ని హెచ్చరిస్తుంటాయి.
ఎక్కడ దుఖ్ఖం వున్నా , యెక్కడ హింస వున్నా, ముఖ్యంగా వ్యవస్థీ కృతమైన హింస, తనకే దెబ్బ తగిలినట్టు బాధ పడేవారు. విలవిల్లాడి, రగిలిపోయి, మరుక్షణం తన కోపాన్ని అక్షరాలుగా మార్చేసేవారు. రాజ్యాన్ని choicest abusesతో తిట్టేవారు.
టాల్ స్టాయ్ గురించి రాస్తూ, గోర్ఖీ అంటాడు — బహుశా లియోనార్డో డావిన్సీకి అట్లాంటి వేళ్ళు వుండి వుంటాయి అని. నాకు అనిపిస్తుందీ, బహుశా మనుషుల పట్ల వాల్మీకికి ఇంత ప్రేమా, కరుణా, అప్యాయతా వుండేవా అని. ఈ పోలిక అంత వరకే. పక్షుల శోకం చూసి తల్లడిల్లి కవిగా మారిపోయినంతవరకే.
ఒక్క రామ రాజ్యమనే కాదు, అసలు అన్ని విలువలు వదిలేసి ప్రజల్ని కాల్చుకు తింటున్న రాజ్యమంటేనే మండి పడేవారు. కోర్టులలోని డొల్లతనాన్ని, పత్రికారంగంలోని నంగిరితనాన్ని, జుగుప్సని, నరమాంస పచ్చళ్లని తయారుచేసేవాళ్లని, పోలీసు క్రౌర్యాన్ని అనితర సాధ్యమైన వ్యంగ్యంతో ఎండగట్టారు. మొత్తం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు, బాధ్యతతో, తిరుగులేని నిజాయితీతో రాసేవారు. ఇక ధైర్యానికి, సమయోచిత వ్యాఖ్యలకు అంతే లేదు.
“అసలు మీరు జర్నలిజంలోకి యెందుకు వచ్చారు,” అనడిగేరు, మహానగర్ పత్రికలో వుద్యోగం కోసం వెళ్ళినపుడు. అది ఇంటర్వ్యూ నో, లేకపోతే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేరో తెలీదు. సరిగ్గా కొన్ని నెలల క్రితమే నా మొట్ట మొదటి వుద్యోగం వూడి పోయింది. ఒక్క నాదే కాదు మొత్తం కొన్ని వందల ఉదయం ఉద్యోగుల పరిస్థితి అదే.
“సీతప్ప లాగా మిగిలిపోకూడదని,” అన్నాను, జవాబుగా.
నవ్వేరు, ప్రతిగా. “కరెక్టే నండీ. బాగా చెప్పేరు. మిగతా అన్ని వుద్యోగాల్లో సీతప్పలు అనువణువు మనిపిస్తారు,” అన్నారు.
“అమ్మయ్య. పతంజలి గారు ఒప్పుకోగలిగిన విషయం చెప్పగలిగాను,” అనుకున్నాను. కానీ నా సంతోషం ఎంతో సేపు నిలవలేదు.
“కుటుంబరావు గారు చాలా గొప్ప రచయిత. చాలా గొప్పగా సమాజంలోని సీతప్పల జుగుప్స గురించి రాసేరు. కానీ, మీకెవరు చెప్పేరండీ జర్నలిజంలో సీతప్పలు లేరని,” అని అడిగారు.
ఉద్యోగం పోవడం మొదటి నాకు జర్నలిజంలో మొదటి పాటమైతే, సీతప్పల జర్నలిజం గురించి వినడం రెండవది. బయటి సమాజంలో వలెనే జర్నలిజంలో కూడా సీతప్పలు వుంటారని, ఆ సంఖ్య ఎక్కువేనని నాకు అర్థం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. జర్నలిజం పై నాకు భ్రమలు పోడానికి లేదా వాస్తవిక అంచనాలు ఏర్పడడానికి ఈ సంభాషణ ఎంతో వుపయోగపడింది.
ఇక అది మొదలు మహానగర్ లో గురూ గారి దగ్గరనుంచి నేర్చుకున్నవి ఎన్నో. మానవీయ విలువలగురించి, ప్రాపంచిక దృక్పథానికి సంబంధించిన విషయాలే కాదు, జర్నలిస్టులకు వుండాల్సిన కనీస అర్హతల గురించి, తోటి మనిషి పట్ల చూపల్సిన గౌరవం గురించి తెలుసుకున్నవెన్నో. చిన్న పత్రిక కావడం వల్ల, పని వత్తిడి ఎంతో వుండేది. తక్కువ మంది మనుషులతో (అంటే కొన్ని సార్లు ఒక్కరే అని అర్థం) పత్రిక తేవాల్సిన అవసరం వుండేది. వారంలో ఒకటి రెండు రోజులైతే ఒక ఎడిటర్ (తను), ఒక సబ్-ఎడిటర్ (నేనూ) మాత్రమే వుండేవాళ్లం. పత్రిక ప్లానింగ్, ఎడిట్ పేజ్ ఆర్టికల్స్ తను, వార్తలు ఎంచడం-రాయడం-పేజీలు పెట్టడం. తన పని మధ్యలో వచ్చి, ఏంటండీ విశేషాలనీ లేకపోతే ఏమైనా రాయమంటారా అని అడిగి, చాలా స్పీడుగా నాలుగైదు వార్తలు రాసిచ్చి తన పనిలోకి వెళ్లిపోయేవారు. ఇది ఒక కల్చరల్ షాక్ నాకు. ఎడిటర్లు తిడతారని, వంకలు పెడతారని, ఎద్దేవా చేస్తారని తెలుసుగానీ, అత్యంత జూనియర్ సబ్-ఎడిటర్ (అప్పటికి నేను జర్నలిజంలో చేరి ఒక్క సంవత్సరం కూడా పూర్తి కాలేదు.) అడిగింది రాసే ఎడిటర్ ఎక్కడైనా వుంటారా? నేనైతే ఎక్కడా వినలేదు. అదేదో పెద్ద సాయం చేసినట్టుండేది కాదు. పనిలో భాగంగానూ, తను చేయాల్సిన పనే కదా ఇదీ అన్నట్టుండేది.
జర్నలిస్టు పతజంజలి గారి ధైర్యసాహసాలకి ఉదాహరనాలెన్నో. ఒకటి, మడుసూదంరాజ్ యాదవ్ ఎంకౌంటర్. ‘నగరం నడిబొడ్డులో పోలీసు హత్య’ అని ఎనిమిది కాలాల బేనర్! వరంగల్ పోలీసులొచ్చిఎలా ఎన్కౌంటర్ చేసిందీ రాయడం మాత్రమే కాదు, అది రాజ్యం చేసిన హత్య అనీ, అందువల్ల కల్పబెల్ హోమిసైడ్ గా కేస్ బుక్ చేయాలని బాక్స్ ఐటెమ్ రాసేరు. ఆ రోజు మరే పత్రికా ఆ విషయాన్ని గుర్తించలేదు, రాయలేదు. ఆయన దార్శనికత ఎంత గొప్పదంటే, ఆరోజు పత్రికల్లో వచ్చిన వార్తల్ని చూసి ఆగ్రహం చెందిన హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ప్రభాశంకర్ మిశ్రా కల్పబెల్ హోమిసైడ్ కేస్ బుక్ చెయ్యల్సిందేనని ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత ఏమైందన్నది వేరే విషయం. కానీ, పత్రికలు ప్రజల పక్షమనీ, అవెప్పుడూ శాశ్వత ప్రతిపక్షంగా వుండి వాళ్ళ కోసం పనిచెయ్యాలన్న జర్నలిజపు ప్రాథమిక సూత్రాన్ని పతంజలి రుజువు చేశారు. ఇట్లాంటి ఉదాహరనాలెన్నో.
సరిగ్గా ఇదీ జరిగిన కొన్ని రోజులకే స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. పీటీయయ్, యుఎన్నయ్ ఏజెన్సీలు ఎర్రకోట పైనుంచి ప్రధానమంత్రి ప్రసంగాన్ని రీములకు రీములు వార్తలుగా రాస్తున్నాయి. ఆ రోజు కూడా నేనొక్కడినే డెస్క్ లో. నాకు చాలా అసహనంగా వుంది. ప్రధానమంత్రి ఏం వాకృచ్చారో రాసి, ఫోటోతో సహా ఫ్రంట్ పేజీలో వెయ్యకతప్పదా అనుకున్నాను. ఈలోపల పతంజలి గారు వచ్చారు. ఎప్పటిలాగే ‘ఏంటండీ వార్తలు’ అన్నారు. అప్పటికే సార్ట్ చేసిన వార్తల్ని ఆయన చేతిలో పెట్టాను.
ఆయన వాటిని చూస్తుంటే, నేనన్నాను. “నేనైతే, ఆ వార్తని మొదటి పేజీలో వెయ్యను,” అన్నాను. వార్తలు చూడ్డం ఆపి, ‘నేనైతే అసలు వెయ్యనే వెయ్యను. కానీ ఇప్పటికి వేసెయ్యండి. ఎడిషన్ అయిపోయాక రండి,” అన్నారు.
“ఎడిషన్ అయిపోయాక రండి,” అన్నది రోజువారీ డైలాగ్ అయిపోయింది. దాదాపు ప్రతిరోజూ సాహిత్యమో, సమాజమో, రాజకీయాలో, జర్నలిజమో ఏదో ఒక విషయం గురించి గంటల తరబడి చెప్పేవారు. ఆగస్టు 15 రాత్రి, నాకు గుడ్డివాళ్ళ లోకం గురించి చెప్పేరు. హెచ్ జీ వెల్స్ రాసిన The Country of the Blind గురించి చెప్పేరు. ఆ కథ ఆయన చెప్తుంటే ఎంత గొప్పగా వుందంటే స్వయంగా ఆ రచయిత చెప్పినంత. గుడ్డివాళ్ళ లోకంలో గుడ్డివాళ్లలాగా నటించకపోతే మనం చేసేపని చెయ్యనివ్వరని, చెయ్యలేమని చెప్పేరు. మధుసూదన్ రాజ్ ఎన్కౌంటర్ తర్వాత మనం రాసిన రాతలకు చోటు కావాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటి వార్తలు రాయక తప్పదని చెప్పేరు.
ఇంగ్లీష్ జర్నలిజంలోకి వెళ్లాలని నేను ప్రయత్నిస్తుంటే ఎంతో ఎంకరేజ్ చేశారు. కానీ, ఒక పత్రికలో పనిచేస్తానంటే మాత్రం ఒప్పుకోలేదు. “మీరు ఇంగ్లీష్ పత్రికల్లోకి వెళ్ళాలి. కానీ, వాడి దగ్గర మీరు పని చెయ్యడం నాకిష్టం లేదు. వాడు జర్నలిస్టు కాదు కదా కనీసం మనిషి కూడా కాదు. అక్కడ చేరకండి,” అన్నారు.
ఆ సలహా వినడం నాకెంతో ఉపయోగపండింది వృత్తిలో.
తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఎన్నడూ డబ్బుల కోసం తన అభిప్రాయాల్ని మార్చుకోవడం కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నిచలేదు. ఎక్కడెక్కడి ఇరుకు గదుల్లో తాగుతూ కూడా మాటల్లో, అభిప్రాయాల్లో ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, రాజ్యం పట్ల ఏ కోశానా రాజీ పడిమాట్లాడింది లేదు.
నాకే కాదు, ఆయన్ని ప్రేమించిన, అభిమానించిన ఎంతమందికో ఆయన అలవాటు ఆయన్ని మింగేస్తుందని తెలుసు. “సార్, మీరు దాన్ని తాగుతున్నారా లేకపోతే అది మిమ్మల్ని తాగుతుందా,” అని అడిగేను. నవ్వేరు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. జవాబు ఇద్దరికీ తెలుసు.
టాల్ స్టాయ్ గురించి రాస్తూ, గోర్ఖీ అంటాడు — బహుశా లియోనార్డో డావిన్సీకి అట్లాంటి వేళ్ళు వుండి వుంటాయి అని. నాకు అనిపిస్తుందీ, బహుశా మనుషుల పట్ల వాల్మీకికి ఇంత ప్రేమా, కరుణా, అప్యాయతా వుండేవా అని. ఈ పోలిక అంత వరకే. పక్షుల శోకం చూసి తల్లడిల్లి కవిగా మారిపోయినంతవరకే….chaalaa nachchindi ee maata..
It is a very nice piece showcasing side profile of Patanjali as a writer, journalist and human being.
meeru rasindi chala bagundi.. patanjaligari vyaktitvaniki ido udaharana
వ్యంగ్యాన్ని పదునుగా ఉపయోగించిన ఆధునిక రచయితల్లో పతంజలిది ప్రత్యేక ముద్ర! ఆయనతో మీ జ్ఞాపకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
పతంజలి గారి వ్యంగ్యం నాకు చాలా ఇష్టం. చూపున్న పాట, పిలక తిరుగుడు పువ్వు లతో పాటూ ఒక పల్లెటూరి మనిషి పక్కన రచయిత చేసిన బస్సు ప్రయాణానికి సంబంధించిన కధలు చదివాను. ఆయనని వాకిలి వేదిక మీద మరొకసారి గుర్తుకు తేవడం బాగుంది.
నారాయణ G.
పతంజలిగారిని నాకు పరిచయం చేస్తానని కూర్మనాధ్ గారు అన్నారు.ఈ మధ్యలో పతంజలిగారే శాశ్వతంగా వెళ్ళిపోయారు.