(‘కథనశాల’ ప్రత్యేక సంచిక సమీక్ష)
సాహితీ స్రవంతి చేసిన మరో నూతన ప్రయత్నమే “కథనశాల” ప్రత్యేక సంచిక.29 అక్టోబర్ 2013 హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం గం.10 లనుండి సాయంత్రం ఆరు గంటల వరకు కథా కార్యశాల నిర్వహించి వివిధ కథాంశలపై ప్రముఖ కథా రచయితలు రచయిత్రులచే ఔత్సాహికులు,నూతన రచయితల కోసం రచన శిల్పం మెళుకువల గురించి చెప్పించడం జరిగింది.సుమారు రెండు వందల మంది పాల్గొని కథలు రాయడం నేర్చుకున్నారు.ఈక్రమంలో సేకరించిన ప్రముఖ కథా రచయితల ఆభిప్రాయాలు, స్వీయ కథల నేపధ్యాలు స్పందనలు మొదటి తరం కథకుల కథా సూత్రాలు కలిపి ఈ ప్రత్యేక సంచిక తీసుకురావడం జరిగింది. గతంలోనూ ప్రస్థానం ప్రచురించిన ప్రత్యేక సంచికలకు విశేష స్పందన లభించింది.”కథనశాల” ప్రత్యేక సంచిక కూడా అదే కోవాలో పాఠకులకు నచ్చుతుందని చెప్పవచ్చు.
“ రచయిత అనేవాడు నిరంతరం ప్రవహిస్తూ వుండాలి.నిరంతరం పరిశీలిస్తూ వుండలి,పరిశీలించిన దాన్ని గ్రహించ దగిన రీతిలో దహించే రీతిలో పాఠకుడికి అందజేయగలగాలి.దానికి కావలసిన పజ్ఞను పెంచు కోవాలి “ అంటూ సాహితీ స్రవంతి ప్రధాన నిర్వాహకులు శ్రీ.తెలకపల్లి రవి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ఉపన్యాస సారాంశం మొత్తం ముందు మాటగా ఈ సంచికలో ప్రచురించారు.
తెలుగు కథా ప్రస్థానం గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గా , “ఏ చరిత్రయినా మనకు కొన్ని విలపవయిన పాఠాలు నేర్పుతుంది.సాహిత్య చరిత్ర కూడా సాహితీకారులకు,రచయితలకూ కొన్ని పాఠాలు నేర్పుతుంది. కథల చరిత్ర సాహిత్య చరిత్రలో ఒక భాగం” అంటూ మొదటి తెలుగు కథ గురించి ప్రస్థావించి, 80వ దశాబ్దంలో స్త్రీ వాద దృక్పథంలో వచ్చిన కథల నుండి 90వ దశాబ్దంలో వచ్చిన వస్తున్న ప్రాంతీయ స్పృహ కలిగిన కథల వరకు వాటి తీరుతెన్నల్ని సమగ్రంగా సోదాహరణంగా వివరించారు ఓల్గా. “కొత్తగా కథలు రాసేవాళ్ళు రాయాలనుకునే వాళ్ళు అధ్యయనం తప్పని సరిగా చెయ్యాలి.అపుడే కథకు ఒక చూపు,మానవీయమైన సునితత్వం అబ్బుతాయి .అవి పాఠకులను ప్రభావితం చేసి వారిలో సంస్కారాన్ని పెంచగలుగుతాయి” అని సూచించారు ఓల్గా.
ఫ్రముఖ కథా రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు తన ప్రసంగ వ్యాసంలో, “మనకు చాలా నిర్భయత్వం కూడా కావాలి.నచ్చనిది నిర్మొహమాటంగా చెప్పగలగాలి.నచ్చింది శిఖరం ఎక్కి అరిచి వినిపించాలి.సమాజానికి లాలి పాడ్డం మన పని కాదు.మెచ్చేది చెప్పడం మన పని కాదు. అని కథా రచయితకు వుండ వలసిన నిర్భయత్వాన్ని అలవరుచుకోమ”ని చెప్పారు.
మరో ప్రముఖ రచయిత డా.లెనిన్ ధనిశెట్టి వస్తు పరామర్శ చెస్తూ, “కొత్తగా రాసే,రాయాలనుకునే రచయితలు వస్తురూప చర్చల గురించి కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కలిగివుంటే మంచిది.అనుక్షణం దోపిడీ పరమావధిగా నడిచే సమకాలీన సమాజంలోని అనుభవాలకు వస్తు పరంగా రచయిత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తే చాలు.రచయిత ఎన్నుకొన్న వస్తువు అంశం రచనా క్రమంలో శిల్పాన్ని సంతరించు కొంటుంద”ని కొన్ని ఆలోచనలను ఫాఠకుల్తో పంచుకొన్నారు.
జనార్దన మహర్షి కథ ఎప్పుడు రాయాలో చెబుతూ, “బాధేసినప్పుడు రాయండి.ఆనందమేసినప్పుడు రాయండి.కోపం వచ్చినప్పుడు రాయండి.రిలాక్స్ కావాలన్నప్పుడు రాయండి.బిజీగా రాయండి.ఖాళీ దొరికితే రాయండి.—-అందర్ని చదవండి.—–అందరూ చదివేలా రాయండి”. అన్నారు.
బాలల కథ రచయిత పి.చంద్రశేఖర్ ఆజాద్ బాలల కథల గురించి మాట్లాడుతూ, “రేపటి తరాన్ని తయారు చేయటంలో ఈ సాహిత్యానికున్న అవసరాన్ని గుర్తించాలన్నారు. పిల్లలు ప్రతిదీ నేర్చుకుంటారు.అది చూడటం,వినడం. ఆ తరువాత కాలంలో చదవడం ద్వారా జరుగుతుంది.నా వరకూ నాకు కథలకు బీజం పిల్లలే.వారిని నిశితంగా గమనించటం,వారితో మాట్లాడటం వల్ల నాకు సీరియస్ కథలకు నవలలకి వస్తువు దొరకింది” అని వారి అనుభావాలు వివరించారు.
ప్రముఖ కథా రచయిత్రి కుప్పిలి పద్మ తన కథ “టీ జంక్షన్” గురించి స్వీయ కథా విశ్లేషణ చేస్తూ, “స్త్రీలు రాత్రి పూట చేసే ఉద్యోగాల్లోకి ప్రవేశించటం వెనుక వున్న ఆర్థిక నేపధ్యం ఏమిటంటే గ్లోబలైజేషన్ ప్రవేశించటం. అప్పుడు చిన్న చిన్న ఊర్ల నుండి అధిక సంఖ్యలో స్త్రీలు నగరాల్లో ఉద్యోగం చేయ్యటానికి నగరాలకు వచ్చారు. రాత్రి పూట స్త్రీలుఉద్యోగాలు చెయ్యాల్చిన పరిస్థితి వచ్చింది.అలానే స్త్రీల జీవతాల్లో అనేక రకాలైన కల్చరల్ మార్పులు జరిగాయ్.అప్పుడొచ్చింది టీ జంక్షన్ కథ అని చెపతూ, చీకటి గదిలో దీపం వెలిగించినప్పుడు అందులోని వస్తువులు ఒక్కొక్కటిగా కనిపిస్తాయి.మనం ఎంత దీపం వెలిగిస్తే అంత వెలుగు ప్రసరించి అంతే స్ఫష్టంగా మనకి అందులోని వస్తువులు కనిపిస్తాయి” అని అన్నారు.”గుప్పెడు గింజలు” కథ ను గురించి స్వీయ కథా విశ్లేషణ చేస్తూ, ఆ కథా రచయిత యాళ్ల అచ్యుతరామయ్య “కథ రాయడాన్ని ఆషామాషిగా తీసుకోకూడదు.అది ఒక సామాజిక చర్య.ఎంతో నిబద్ధతతో,నిజాయితితో చెపట్టాల్సిన పవిత్ర కార్యక్రమం” అంటూ, “ఇక్కడ పావురాళ్లను సింబాలిక్ గా తీసుకోవడం జరిగింది.పక్షులకు ఆకలివేయడం,పరిసరాలలోని తిండిగింజల్ని ఏరుకొని తినడమనేది ప్రకృతి సహజం.కానీ……దీనికి విరుద్ధంగా నేటి సమాజంలో జరుగుతుంది.రోజంతా కష్టపడే వాళ్ళకి గుప్పెడు గింజలు కూడా దొరకని పరిస్థితి ఒక వైపు,ఏ మాత్రం శ్రమపడని కొద్దిమంది ఆధీనంలో తిండిగింజలు మురుగి పోవడం జరుగుతుంది.—ఈ సామాజిక వాస్తవాన్ని కళాత్మకంగా ఆవిష్కరించటంగా ఈ కథ రూపుదిద్దుకుంది.” అని చెప్పుకొచ్చారు.
శిరంశెట్టి కాంతారావు తన కథ “అడవి లోపల” నేపధ్యాన్ని ఆసక్తిగా వివరించారు.2010లో ఓ దినపత్రికలో వచ్చిన వార్త చదివి రచయితకు అనేక సందేహాలు కలిగాయి. ఆ వార్త “ఇల్లందు అడవుల్లోని రాళ్ళమేకల దొడ్డికి నరబలి”.రాళ్ళ మేక లంటే రాళ్లమీద చెక్కిన మేకలా? రాళ్ళల్లో పెరిగే మేకలా? లేదా కంచి మేకల్లా పెరిగే మరో రకం మేకలా ?“ ఏ ఒక్కరు కూడా రచయితకు సంతృప్తినిచ్చే సమాధానమివ్వలేదు.చివరకు రచయిత ఆ వార్త రాసిన విలేఖరిని కలిసినా సరియైన జవాబు దొరకలేదు.కారణం ఆ విలేఖరి కథ కోసం పరిశోధనా అంటూ విస్తుపోయాడు.తాను పడ్డ బాధలూ గాదలు చెప్పాడు.ఏదేమైనా రచయిత నిరాశ చెందక రాళ్ల మేకలు పెంచే వారి జాడ తెలుసుకొని వివరాలు సేకరించి కథ రాశారు. ఈ కథ చినుకు మాసపత్రికలో ప్రచురింపబడింది. అనేక మంది అభిమానులచేత కొనియాడబడింది.ఒక కథ రాయడానికి ఇంత తతంగం అవసరమా? అంటే సామాజిక బాధ్యత కలిగిన రచయితకు అవసరమే.ఏదో కాలక్షేపం కథలు రాయడానికైతే అవసరం లేక పోవచ్చు.
ప్రముఖ విమర్శకులు కె,కె,రంగనాథాచార్యులు 1900-1947 మధ్య తెలుగు సాహిత్యం గురించి సింహావలోకనం చేస్తూ, “ఒక్కొక్క జాతి జీవితంలో పురోగమనానికి కారణమైన వివిధ ఉద్యమాలన్నీ పరస్పరం పెనవేసుకొని వస్తుంటాయి.కందుకూరి సంఘసంస్కరణోద్యమం,గిడుగు వ్యావహారిక భాషోద్యమం, కందుకూరి-గురజాడల సాహిత్యోద్యమాలు, కొమర్రాజు చరిత్ర పరిశోధన,విజ్ఞాన శాస్త్ర ప్రచార, గ్రంథాలయోద్యమాలు-వీటితో పాటు భారతదేశం స్వాతంత్ర్యం కోసం సాగుతున్న జాతీయోద్యమం ఈ శతాబ్ది పూర్వార్థాన్ని తెలుగు దేశ చరిత్రలోనే మహోన్నత యుగంగా నిలబెట్టాయి.ఈ కాలంలో తెలుగు కవిత్వం ప్రధానంగా రెండు పాయలుగా కనిపిస్తుంది. ఒకటి సంప్రదాయ కవిత,రెండవది ఉద్యమశీలమైన నవ్య కవిత లేదా ఆధునిక కవిత”. అంటూ, “గురజాడతో ప్రారంభమై తెలుగు కథానిక ఆధునిక సాహిత్యంలో ఉత్తమ స్థాయిని పొందిన ప్రక్రియలలో ఒకటి”. –అన్నారు. ఇక ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా.కాత్యాయనీ విద్మహే వ్యాసం “అర్థశతాబ్దపు తెలుగు కథ ఒక అంచనా “ ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో 50 ఏళ్ళ తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య వికాస పరిణామాల సమీక్షగా ప్రచురించిన “తెలుగు పసిడి” నుండి సేకరించి ఈ ప్రత్యేక సంచికకే వన్నె తెచ్చారు. బుచ్చిబాబు, రావిశాస్త్రి,శ్రీపాద,తిలక్ వంటి ప్రసిద్ధ కవుల కథలపై ఒక అవగాహన ఏర్పరుచుకోటానికి ఈ వ్యాసం నేటి తరం కథకులకు కరదీపికగా ఉపయోగపడుతుంది.
ఇంకా ఈ ప్రత్యేక సంచికలో “గురజాడ కథలు” పై ప్రొ.అత్తలూరి నరసింహారావు, “సురవరం కథలు-వస్తు శిల్పాలు” అంటూ రాసిన ముదిగంటి సుజాతారెడ్డి “సంకెళ్ళు లేని స్వేచ్ఛను స్వపించిన చలం “గురించి కేతు విశ్వనాథరెడ్డి ,”సామాజిక వాది రావిశాస్త్రి కథల” పై సింగమనేని నారాయణ ,”తొలి తెలంగాణ కథకుడు సీతారాం” పై ఆచార్య ఎన్.గోపి గార్ల వ్యాసాలు ఒక దిక్సూచిగా ఉపకరిస్తాయి.
చలం, కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య,మధురాంతకం రాజారాం సింగమనేని వంటి ఉద్ధండులు ఆయా సందర్భాలలో చెప్పిన అంశాలను “కథాసూత్రాలు” అంటూ బాక్స్ లలో ప్రచురించడం బాగుంది.” కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు” అంటూ బాపు బొమ్మలతో ఆరుద్ర వ్యాసం కథా కార్యశాల విద్యార్థులకు పుస్తకంగా ఉపయోగ పడుతుంది.
“కథనశాల కొత్తపుంతలు, కిటకిటలాడిన కథా ప్రాంగణం, బాధ్యతను పెంచిన వర్క్ షాపు, ఆలోచింపజేసింది” అంటూ వర్థమాన కథకులు, వర్క్ షాపు విద్యార్థులు తెలిపిన స్పందనలు ఈ పుస్తకంలో చేర్చి , నిర్వాహకులు తమ లక్ష్యాన్ని సాధించినట్లుగా నిరూపించుకున్నారు.
మంచి Book గురించి పరిచయం చేసారు.కాకపోతే ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పనేలేదు.
Sir sameeksha baavundi.kaaryasaala 29 September na anukuntaaanu