మా అప్పులేమో ఊటబావులు
ఆదాయం ఎండమావులు
మా రెప్పల కింద జలాశయాలు
రెక్కల కింద అగాధాలు
నిరంతరం… తరంతరం
ఆర్థిక దాస్యానికే వారసత్వం
కాడికిందికి మెడసాచే మా బానిసత్వం
పిడికిలి నిండని ముక్కారు శ్రమ ఫలితంలో
గింజుకున్నా గింజ మిగలని రైతుకు
భవిష్యత్తు ఓ ప్రశ్నార్థకం! నాగేటి చాళ్ళలో ధారపోసిన స్వేదం
మట్టిపొత్తిళ్ళలో ఇంకిపోయి
అగ్నిశ్వాసగా మారిపోతున్నప్పుడు
ఈ గుండెల్లో గునపాలు దించినంత
దుస్సహమైన బాధ
మట్టిపొరల్లోంచీ అంకురం
మొలకెత్తుతున్నప్పుడు
తప్పిపోయిన మా పసివాడు
ఇంటికి చేరుకున్నంత సంతోషం!
కంకిమీద గింజ కన్పిస్తే చాలు!
మా అరచేతుల్లోకి
అన్నం ముద్దా చేరినంత ఆనందం!
ఇది పిరికివాడి స్వర్గం, శరణార్థుల శిబిరం
ఇది ఎండిన నేల, ఎడారి ఉపరితలం
ఇది పిరికివాడి స్వర్గం, శరణార్థుల శిబిరం
ఇది ఎండిన నేల, ఎడారి ఉపరితలం………..రాధేయ గారు రాయలసీమ ఆత్మను ఆవిష్కరించారు .