కవిత్వం

పునర్ణిరీక్షణ

మార్చి

నీ నడకల సొంపులు కని
తొలినాళ్ళలో పరవశించాను
నీ పలుకుల మధువుల్లో
మునకలువేసి మత్తుడి నయ్యాను
నీ రూపపు సొగసులలో
తాదాత్మ్యం చెందాను
ప్రావృట్కాల మేఘాంతర తటిల్లతవై
నా ఊహలలో ఊగిసలాడిన నీకు
ఊడిగం చేశాను!
అయినా అయోమయంలో ముంచి
వెళ్ళిపోయావు!
అనంతరం
నీకు దూరంగా నేను నడిచిన
రహః పథాలలో నా జాడలు
వెతుక్కుంటూ, వేసారుతూ
నువ్వు
ఏ సీమల్లో నడిచావో
ఏ కోనల్లో తిరిగావో
నీకుగాక మరెవరికి తెలుసు?
ఇప్పుడు
చిర ప్రవాసానంతరం
మళ్ళీ నీ ఒడినిచేరి సేదతీరాలని
నేను వస్తే, శీతల శిశిరానివై
వణికిస్తున్నావు!
ఐతేనేం, నీ తలపుల కంబళీ కప్పుకుని
ఆగామి వసంతానికై
ఎదురు చూస్తుంటాను!



2 Responses to పునర్ణిరీక్షణ

  1. మైథిలి అబ్బరాజు
    March 1, 2014 at 6:42 pm

    ఆ కావ్యకన్య కరుణ మీకు తప్పక లభిస్తుంది , శుభాకాంక్షలండీ

  2. March 2, 2014 at 11:05 am

    శివరామకృష్ణ రావు గారూ!

    మీ ‘పునర్నిరీక్షణ’ బాగుంది. అభినందనలు.

మీ అభిప్రాయం రాయండి

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)