ప్రత్యేకం

భాషే మనుషుల్ని కలిపివుంచే బలమైన సాధనం – విశ్వేశ్వర రావు

మే 20124

విజయవాడ శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావు గారంటే తెలియని తెలుగు కవులు, రచయితలు ఉండరు.
కమ్యూనిస్టుల కుటుంబం నుండి వొచ్చిన విశ్వేశ్వర రావు గారు పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా, స్వయంగా తాను కవి / రచయిత కాకపోయినా, తెలుగు కవిత్వం పట్ల ఆయన చూపించే ప్రేమ, కవులు, రచయితల పట్ల ఆయన చూపించే అభిమానం మనల్ని అబ్బురపరుస్తాయి.
శ్రీ శ్రీ అంటే, ఆయనకు ఎంత వెర్రి అభిమానం అంటే, ‘వ్యాపారం కలిసొస్తుంది – ప్రమీల ప్రింటర్స్ అని పేరు పెట్టండి’ అన్నా పట్టించుకోకుండా, తనకు ఎంతో యిష్టమైన శ్రీ శ్రీ పేరునే పెట్టుకున్నారు. ఆయన ప్రింటింగ్ ప్రెస్ విసిటింగ్ కార్డ్ పై ‘ఎల్లలు లేని సాహితీ మిత్రుల విలాసం’ అన్న ట్యాగ్ లైన్ మనల్ని ఆకర్షిస్తుంది.
నిజమే, ఆయన ప్రింటింగ్ ప్రెస్ విజయవాడ లోని సాహితీ వేత్తలకు, విజయవాడని తడుముతూ వెళ్ళే సాహితీ వేత్తలకు రెండు కాఫీలు తాగి, నాలుగు కబుర్లు చెప్పుకునే ఒక విడిది!

‘ఒక సంవత్సరం లో వెలుగు చూసే ఉత్తమ కథలకు ఒక ‘కథ’ సంకలనం ఉన్నట్టుగా, ఉత్తమ కవితలకు కూడా ఒక సంకలనం ఉండాలన్న పట్టుదలతో, కవిత్వం పట్ల ప్రేమతో, 2004 వ సంవత్సరం నుండి క్రమం తప్పకుండా, ప్రముఖ కవులు పాపినేని శివశంకర్, దర్భశయనం శ్రీనివాసాచార్య గార్ల సంపాదకత్వం లో ‘కవిత’ ప్రచురిస్తున్నారు.
2013 లో వొచ్చిన కవితలలో నుండి ఎంపిక చేయబడిన కవితల సంకలనం ‘కవిత 2013’, మే 1 వ తేదీన విజయవాడ లో వెలువడబోతోంది. ఈ సందర్భంగా విశ్వేశ్వర రావు గారితో ‘వాకిలి’ జరిపిన సంభాషణ:


1. కేవలం ‘కవిత’ ని ప్రచురించడం మాత్రమె కాదు …. ఆవిష్కరణ ని కూడా ఒక గొప్ప పండగలా నిర్వహిస్తారు. సాహిత్యం పట్ల మీ ఆసక్తి, తెలుగు సాహిత్యం లోని ప్రముఖ కవులు, రచయితలతో మీ సాన్నిహిత్యానికి సంబంధించిన నేపథ్యం క్లుప్తంగా మాతో పంచుకుంటారా?

జవాబు: చేసేదేదో చేతైనట్టు చేయాలి. దాంట్లో ముందూ వెనుకా చూడాల్సిన పని లేదు. ఏం చేస్తున్నాం అనేదే కాదు ఎలా చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఇలా మనమే చెయ్యాలి, కాపీ కొట్టే అవకాశం లేకుండా. చిన్నప్పుడు చిరంజీవి మావయ్య కబుర్లు – తెలుగుపూలు పాకెట్ సైజు పుస్తకం ఎప్పుడూ నా దగ్గర – సుమతక్క దగ్గరా వుండేది. ఎప్పుడంటే అప్పుడు తీసి చదవడం గర్వంగా వుండేది. తర్వాత మహాప్రస్థానం … అది నా చేతికి ఎలా వొచ్చిందో గుర్తులేదు. కానీ, ఎదో ఆవేశం కమ్మి, దాని నుండి విడిపోలేని స్థితి ఇప్పటికీ! … చలాన్ని చదివి, ఈ రచయిత రాసినంత నిఖార్సుగా ఉంటాడా అని చూడ్డానికి వెళ్లి, పది రోజులు వుండిపోయిన స్థితి. సి.వి., కుటుంబ రావు లాంటి వాళ్ళని కూడా చదివి, కలిసి మాట్లాడితేనే తృప్తిగా వుండేది.

2. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా, గడచిన సంవత్సరం లో వొచ్చిన మంచి కవితలని ఒక చోట చేర్చి ‘కవిత’ గా తీసుకు రావాలన్న ఆలోచన కు బీజం ఎలా పడింది ?

జవాబు: ‘పాతికేళ్ళుగా నవీన్ వాళ్ళు కథలు తెస్తున్నారుగా? మరి, కవిత్వం సంగతేంటని’ శివారెడ్డి గారినడిగా! ‘మనాల్లతో చాలా సార్లు చర్చించాం , కార్య రూపం దాల్చలేదు’ అన్నారు.
‘మనమే చేస్తే పోలా!’ అనిపించింది. శివశంకర్ గారిని సంప్రదించా. ఇంకొకరు తోడుంటే బాగుంటుందని దర్భశయనం గారితో ఆయనే మాట్లాడారు. ఆ ఇద్దరి కాంబినేషన్ బాగానే వుంది. ఈ పదేళ్ళలో ఎప్పుడూ ఇబ్బంది లేదు. వాళ్ళ పనిలో నేనెప్పుడూ కల్పించుకోలేదు. బుక్ డిజైన్, ప్రింటింగ్, కవర్ పేజి, ప్రచురణ కర్తగా నే రాసింది వాళ్లెప్పుడూ ప్రశ్నించలేదు.

3. ఈ వార్షిక కవితా సంకలనానికి, క్రమం తప్పకుండా పాపినేని, దర్భశయనం గార్లే సంపాదకత్వం వహిస్తున్నారు. సంపాదకులుగా వాళ్లయితేనే న్యాయం చేయగలరని ఎందుకు అనిపించింది ?

జవాబు: నిబద్ధత కలిగిన కవిమిత్రులుగా, ప్రలోభాలకు లోను కాకుండా, బలహీన కవిత్వాన్ని తేలేదనే నా నమ్మకం.

4. ‘ఇక ఈ కవిత ని కొనసాగించలేము’ అని నిరుత్సాహపడిన సందర్భం ఉందా?

జవాబు: పది సంచికలు తెచ్చాక, కవి మిత్రులు ఎదుటి వారి కవిత్వాన్ని చదవడం లేదనే నా అభిప్రాయాన్ని బలపర్చుకున్నాను. ఎవరి కవిత చదివి వాళ్ళు బస్టాండ్ కో, రైల్వే స్టేషన్ కో పరిగెత్తడం, తరువాత చదివే కవి ఏం చదువుతాడో అనే ఆసక్తి లేని కొంత మంది పట్ల జాలిగా చూడడం తప్ప, ఇప్పటికేమీ చేయగలిగింది లేదేమో? ఎవరి మెప్పు కోసమో ఈ పని చేయడం లేదు. నేను చేయగలిగింది, చేతనైనంత చేయడమే నా పని. హై స్కూల్ చదువు పూర్తి చేయని నాకు, ఏ పనీ చేయలేనిదిగా అనిపించలేదు.

5. ‘కవిత’ ప్రచురణ నేపథ్యంలో కవుల ఫిర్యాదులని, ఈగో సమస్యలని కూడా ఎదుర్కొని వుంటారు. అలాంటి సందర్భాలలో కవులకు ఏమైనా చెప్పాలని అనిపిస్తుందా?

జవాబు: కవిత వార్షిక విషయంలో కాదుగానీ, ‘కవిత్వంతో ఒక సాయంకాలం’ మొదటిసారి ఒక కవి గారు, తన పేరు లేకుండా ఆహ్వాన పత్రికా, సమావేశం జరగడానికి వీల్లేదని వీరంగం… తన పేరు చేర్చి, ఆహ్వాన పత్రికలు పునర్ముద్రించమని హుకుం! ‘కుదర్దు పొమ్మన్నాం!’. ‘అయితే సభ జరగనివ్వననీ.. సభా ప్రాంగణం లోనే కిరోసిన్ పోసుకుని చస్తాననీ, మేడ మీంచి దూకి చస్తాననీ’ బెదిరింపు! ‘మంచిది కానివ్వండి బోల్డు పబ్లిసిటి’ అని నేనన్నాను. అంతే ఆ మరుసటి రోజు నుండీ సదరు కవి గారు ఊళ్ళో కనబళ్లా! … ఇప్పటికీ మన సభలకు రాలా! చాలా సీనియర్ కవి మిత్రుడూ, బోలెడు బారెడు గడ్డమూ, జులపాల జుట్టూ, జానపద సాహిత్యాన్ని అరగదీసాను అన్న అభిప్రాయమున్న కవి. ఆయన కవిత, సంకలనం లో రానందుకు నొచ్చుకుని, మిగతావి తన కవితకంటే గొప్పవా అని అడిగి, సంపాదకుల సంజాయిషీ కావాలని నన్నడిగితే, అది నాకు సంబంధించింది కాదనీ, వాళ్ళే సమాధానం చెబుతారనీ చెప్పా ! నన్నడిగి చెప్పమని రిక్వెస్ట్ … కుదరదని నా సమాధానం! కత్తుల రత్తయ్యలు వున్నారు కదా, కొందరి పేర్లు సంచికలో చూసి, భరించలేక ఫోన్లు చేసి అడిగారు. ‘కవుల పేర్లు మాకు ముఖ్యం కాదు, కవిత్వం చదువుతాము, మీరూ రాయండి!’ అన్నందుకు నొచ్చుకున్నారు.

6. ‘తెలుగు కవిత్వానికి పాఠకుల ఆదరణ తగ్గిపోయింది’ అనుకుంటున్న కాలంలో క్రమం తప్పకుండా వార్షిక కవితా సంకలనంతో పాటుగా, ‘కవిత’ బులిటెన్ని కూడా తీసుకు వొస్తున్నారు. ఒక ప్రచురణ కర్తగా మీ అనుభవం ఎలా వుంది?

జవాబు: కవిత్వానికి ఆదరణ తగ్గడమనే ప్రసక్తే లేదు. పాఠకుడు కవే కానక్కర లేదు. హృదయమున్న పాఠకుడు కవిత్వాన్ని ఆదరిస్తాడు. కవులతోనే ఇబ్బంది అంతా! ఎదుటి కవుల కవిత్వం చదవాలనీ, పరభాషా కవిత్వం చదవాలనీ, పరస్పరం సంభాషించుకోవడానికి వివిధ భాషల్లోకి అనువాదమవ్వాలనీ, అప్పుడే మన భాష సుసంపన్నమవుతుందనీ నమ్ముతాను నేను. యువ కవిమిత్రులకు అదే పదే పదే చెబుతాను.

7. సాహిత్యాన్ని బాగా చదువుతూ వుంటారు కదా? ఇప్పుడొస్తున్న కథలు, కవిత్వం పైన మీ అభిప్రాయం ఏమిటి? ఒకప్పటి సాహిత్యంతో పోల్చితే, ఇప్పటి సాహిత్యంలో లోపిస్తోన్న అంశాలు ఏమైనా ఉన్నాయా?

జవాబు: కథని కవిత్వంతో పోల్చగూడదు. కవిత్వం అత్యంత సున్నితంగా, సూటిగా, అతి సామాన్యంగా, వెలువరించే తొలి సాహితీ సాధనం. ప్రతిభావంతులు – పరిసరాల అధ్యయనం, స్వీయ అనుభవాలు క్రోడీకరించి శక్తివంతంగా కవిత్వం ప్రకటించ గలుగుతున్నారు. సీనియర్లు, జూనియర్లు అనేమీ లేదు. పరిశీలన, ప్రెజెంటేషన్ ప్రధానం అనుకుంటాను. చలం, శ్రీ శ్రీ, పటాభి, తిలక్, శేషేంద్ర ఒక తరం వాళ్ళు . మో, శివారెడ్డి, నగ్నముని, దేవిప్రియ, చెరబండరాజు, గద్దర్, వంగపండు, గోరటి వెంకన్న మనతో వుండి నమ్మకాల్ని నిలబెడుతున్నారు.

8. రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఒకప్పుడు తెలుగు సాహిత్య కేంద్రంగా విలసిల్లిన విజయవాడ తన పూర్వ వైభవాన్ని పొందుతుందని అనుకుంటున్నారా?

జవాబు: పూర్వ వైభవం అనేది పిచ్చి మాట. రక రకాల చారిత్రక అవసరాలతో సాహితీ సంస్థలూ, ప్రచురణ సంస్థలూ, పత్రికలూ అధికార కేంద్ర ప్రాంతాలకు వలస వెళతాయి కదా! ఇక్కడున్న వాళ్ళం ఆ వాతావరణాన్ని నిలబెట్టేందుకు, మన పని మనం చేయడమే. మరో ప్రత్యామ్నాయం లేదు.

9. ఒక ప్రచురణ కర్తగా చెప్పండి. సాహిత్యాన్ని బతికించుకోవడానికి, రెండు తెలుగు రాష్ట్రాలు ఏ చర్యలు చేపడితే బాగుంటుంది?

జవాబు: భాష, జాతి జీవన విధానం, సంస్కృతి– వీటిని నిలబెట్టుకోవడం ప్రతి మనిషి కర్తవ్యం. రాజకీయ నాయకుల కుతంత్రాల వల్ల తెలుగు జాతి నిట్టనిలువునా చీలి, రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దీంట్లో సాధారణ ప్రజల ప్రమేయం ఏముంది? తెలంగాణ ఆకాంక్ష భాషది కాదు, పెత్తనానిదే! ఇరు ప్రాంతాల ప్రజలు, రాజకీయ చైతన్యం లేక, ప్రలోభాలకూ, భ్రమలకూ లోనై, స్వలాభాలకు కక్కుర్తి పడే రాజకీయ నాయకుల కుతంత్రాలే ప్రధానమై, వ్యవహారమంతా రాజకీయాలే అయినపుడు, సాహిత్యకారులు, కళాకారులు, మేధావులు, నిజమైన సాంస్కృతిక వికాసానికి కావలసిన ప్రయత్నాలు చేసుకుని, భాషని నిలబెట్టాలని నా ఆకాంక్ష. భాషే సంస్కృతి, భాషే జాతికి జీవనాడి, భాషే మనుషుల్ని కలిపివుంచగల సున్నితమైన, బలమైన సాధనం!

10. చివరగా ఒక ప్రశ్న – ‘రాష్ట్రాలు విడిపోయాక, ఇక ఏ రాష్ట్రం లోని కవులు, రచయితల రచనలని ఆ రాష్ట్రం లోని వాళ్ళే చదువుకోవాలి’ అన్న ఒక తీవ్రమైన వ్యాఖ్య ఒకటి ప్రచారంలో వుంది. అలా జరిగే అవకాశం వుందని భావిస్తున్నారా?

జవాబు: పై సమాధానాలు చాలు! ‘సరిహద్దులు లేని సకల జగజ్జనులారా మానవుడే నా సందేశం’ అన్నాడు శ్రీ శ్రీ!5 Responses to భాషే మనుషుల్ని కలిపివుంచే బలమైన సాధనం – విశ్వేశ్వర రావు

 1. balasudhakarmouli
  April 30, 2014 at 11:00 pm

  ఇంటర్వ్యూ బాగుంది. వాళ్లు చేస్తున్న కృషీ ఆదర్శనీయం.

 2. ఆర్.దమయంతి
  May 1, 2014 at 9:13 am

  ‘కవుల పేర్లు మాకు ముఖ్యం కాదు, కవిత్వం చదువుతాము, ” సరిగ్గా ఇదే నా అభిప్రాయం కూడా!
  ఇంటర్వ్యూ లో నిర్మొహమాటంగా, నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచిన శ్రీ విశ్వేశ్వర రావు గారికి నా అభినందనలు.

 3. May 7, 2014 at 9:46 pm

  కవిత్వం పట్ల వున్నా ప్రేమా మోహంతో అలుపెరుగని సాహితీ కృషీవలుడు శ్రీ శ్రీ విశ్వంజీ.. ఆయన సూటి సమాధానాలే ఆయన వ్యక్తిత్వానికి నిబద్ధతకు నిదర్శనం. మంచి ప్రశ్నలతో ఇంటర్వ్యూ బాగుంది. వాకిలి వారికి అభినందనలు. ఈ కవితా సంకలనంలో నా కవితా చోటు చేసుకున్నందుకు ఆనందంగా వుంది.

 4. May 8, 2014 at 5:55 pm

  తప్పకుండా ఈ కవిత్వం చదివి ,ఆస్వాదించి …ఈ సంకలనం కొని దాచుకోవాలి అని నిర్ణయించుకున్నాను ..

  ఇంటర్వ్యూ కూడా చాలా సూటిగా ,నిబద్ధత తో నిండి ..శ్రీ శ్రీ గారి మాటలే సమాధానం ..వ్యక్తులు , సరిహద్దులు ,నిర్ణయించవు కవిత్వాన్ని ..బాగుంది ..

  వసంత లక్ష్మి

 5. June 12, 2014 at 4:32 pm

  పాపినేని , ధర్భాసయనం గార్ల నిబద్దతని నమ్మి ప్రలోభాలకు లోను కాకుండా, బలహీన కవిత్వాన్ని తేలేదన్న మీ నమ్మకం పుణ్యమా అని ఈసారి వాటిలో నా కవిత కూడా అచ్చయ్యింది…. ధన్యవాదాలు విశ్వేశ్వరరావు గారూ !

  చాలా చక్కని ఇంటర్వ్యూ

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)