కవిత్వం

తమకు తెలియని ధర్మమే … ధర్మరాజా !!!

జనవరి 2013

నిజం మాట్లాడే వారిని నిజమే మాట్లాడనివ్వండి
- సోక్రటీస్

నిజం చెప్పు తెరేష్
నీకోసం ఈలోకం
ఎన్ని నీతినియమాలు విధించిందీ
ఎన్ని కట్టుబాట్లు రచించిందీ
అయినా సరే
నీతుల కంచెలు దాటి నిషిద్ధ ఫలాన్ని తిన్నావు కదూ
నియమాల గోడలు దూకి నిశీధితో రమించావు కదూ

నిజం చెప్పు తెరేష్
నీ గుండె నిజం గా నిముషానికి
డెబ్భై రెండుసార్లే కొట్టుకుంటుందా
నీ రక్తపోటు అంకెలు స్థాయీ భేదాలు ఎరుగవా
నీ నోట్లో ఊరే లాలాజలం
నీ కొలెస్టరాల్ శాతాన్ని ఎప్పుడూ పెంచలేదా

నిజం చెప్పు తెరేష్
అంబేడ్కర్ని చదివావా లేదా
మనువాదాన్ని ప్రశ్నించావా లేదా
సాహితీ హత్యా చారాల్ని ఎండగట్టావా లేదా
హవ్వ ! నిన్నటికి నిన్న
ప్రపంచ తెలుగు మహాసభల్ని
బహిరంగం గా బహిష్కరించింది నువ్వు కాదూ

చెప్పు చెప్పు
నిజం చెప్పు తెరేష్
[అప్పుడు 'తెరేష్' పైకి లేచి ,నవ్వి, చిన్నగా దగ్గి
విలాసం గా సిగరెట్ పొగ రింగులు రింగులుగా వదుల్తూ
ఇలా చెప్పును]
“చెడిపోవడానికి భయపడతారు మీరు
చెడిపోకపోతే బాగుపడడం ఎట్లా ?
విడిపోవడానికి తడబడతారు మీరు
విడిపోకపోతే కలుసుకోవడం ఎట్లా?
మనిషి పోయేదాకా చెడి విడి ,విడి చెడి ,
చెవిచెవి ,డిడి డిడి
చెచ్చెడి,వివ్విడి
అప్పుడు పోవాలి
నీతి తప్పని బతుకు దుర్భరం
హద్దు దాటని మనుగడ దుస్సహం

తమరు మాత్రం తక్కువ తిన్నారేంటి
తమకు తెలియని ధర్మమే ! ధర్మరాజా ”