వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు
చుట్టూ ఉన్నవారి ఆంతరంగిక పయన వేగాలకు అడ్డుపడకుండా ఎవరి భద్రతకూ విఘాతం కాకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు
అంతా లోపమనుకున్నంత మాత్రాన
వాళ్లకి లోపమెలా అవుతుంది !?
ధైర్యంగా ముందుకు సంభాషిస్తున్న
మనోనిబ్బరానికి పునాది గాక..
ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు గాని
వాళ్ళు మాట్లాడుకుంటున్నది
అందమైన భాష పెదాలపై వరమై
అవయవాలన్నీ సక్రమమై
ఎడమొహం పెడమొహమవుతూ
కలవలేకపోతున్న మనసుల గురించైతే బాగుణ్ణు
స్వరపేటిక నరాలలో
కురిసే చినుకుల పరిచయాల్లా
తరుశాఖల విరుల పరిమళాల్లా
జనించాల్సిన మాటలు
వదంతులై
భయం గిట్టల కింద
ఇనుప చక్రాల కింద
నిస్సహాయతను నిర్దాక్షిణ్యంగా నలిపేయడం గురించి చెప్తున్న మౌనమైతే ఇంకా బాగుణ్ణు..
ఉండడంలో ఉన్న అహంకారానికీ
లేకపోవడంలో ఉన్న ఎదురీతకూ నడుమ
వాళ్ళ సంకేతశాస్త్రం
రణగొణ ధ్వనుల మధ్య
పసిపాప నవ్వులా ఉంది
మఖకవళికల్తో మొదలౌతున్న మూకీ పదచిత్రాలు
హావభావాల్తో పరస్పరం అల్లుకుంటూ
చుట్టూ ఉన్న ఒంటరితనాల సమూహాల మధ్య
చెట్టూ చెట్టూ గాలికి కదలాడుతున్నట్లు
పిట్టా పిట్టా కలిసి ఎగురుతున్నట్లు
ఆనందాల్నీ ఓదార్పుల్నీ
ఆలోచనల్నీ అవసరాల్నీ
పంచుకుంటున్నారు
చెలికాళ్ళై విలుకాళ్ళై వెళ్ళిపోతున్నారు
వాళ్ళు వెళ్ళిపోతున్న దారిలా
నిశ్శబ్దం ఒక మహాకావ్యానికి ముఖచిత్రమౌతుంది
ఎవరైనా ఏకీభవిస్తారో లేదో గాని
మౌనం
వాళ్ళకి మాత్రమే ప్రసాదించబడిన అపురూప అదృశ్య అవయవం అది ఎక్కడా లిఖించబడని అక్షర స్వప్నంలా అనుభవాల అమ్ములపొదిలో గొప్ప తరగని ఆయుధం !
( విశాఖపట్నం బస్సులో ఇద్దరు మూగవాళ్ల సంభాషణను చూసినప్పుడు.. )
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
Painting: జావేద్
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్