కవిత్వం

పచ్చని తోరణాల పందిరి!

జూలై 2014

అప్పటి వరకూ నన్నలా తన భుజం మీద మోసీ మోసీ అతడు, ఉన్నట్టుండి నట్టడవిలో దించేస్తూ…
యిలా అన్నాడు !
‘యిక యీ పులుల సింహాల దారిలో
గమ్యానికి చేరుకుంటావో.. లేదూ గమనం ముగించుకుంటావో..
తేల్చుకో అనీ !’
అప్పుడర్థమైంది – అతడు నన్ను దించేసింది బరువుని కాదు బతుకంటే పోరాటమనీ.. !!

నా ముంజేయి పట్టుకుని అనంత జలనిధిలోకి నెట్టేస్తూ..
మళ్లీ యిలా అన్నాడు !
‘యిక తీరానికి చేరుకుంటావో.. తిమింగలాలకు చిక్కిపోతావో..
తేల్చుకో అనీ !’
అప్పుడర్థమైంది – అతడు నన్ను నెట్టేసింది సముద్రంలోకి కాదనీ అంతకంటే లోతైన జనసముద్రంలోకనీ !!

యజ్ఞగుండలో సమిధిలు వేసినట్టు
అతడు నన్ను అగ్నిగుండంలో పడదోస్తూ.. యిలా అన్నాడు !
‘మంటలోంచి మల్లెపూవులా వస్తావో.. మండి మసై పోతావో..
తేల్చుకో అనీ !’
అప్పుడర్థమైంది – అతడు నన్ను పడదోసింది అగ్నిగుండాన కాదనీ, సమిధిని జేసింది సమాజం కోసమనీ !!

యింతకీ అతడెవరంటే ఏం చెప్తాను ?
నాలుగు మొక్కలిచ్చి నందనవనం పెంచమన్నాడు !
రెండు రెక్కలు తగిలించి స్వేచ్ఛగా ఎగిరిపొమ్మన్నాడు !
ఎవరైనా కష్టంలో ఉంటే కన్నీటికడవై కరిగిపొమ్మన్నాడు !
మట్టి మీద నా చూపుడు వేలితో ‘మనం’
అన్న పదాన్ని దిద్దించాడు
ఎవడైనా.. ఎంతవరకు తోడుంటాడు ?
తాడి చెట్టెక్కి వాడి నడుం పట్టి ఎంత వరకు తోస్తాడు ?
బంగారాన్ని పుటం పెట్టినట్టు
ఎవడి బతుకును వాడు పుటం పెట్టుకోవాల్సిందే !
ఎవడి ఆంతరంగిక అరణ్యాలను వాడు తగలబెట్టుకోవాల్సిందే !
ఎవడి మనోసాగరాన్ని వాడీదుకు రావాల్సిందే !

ఎవడైనా సరే !
బతుకు పులి మీదెక్కి స్వారీ చేయాల్సిందే !
ఒక ఒయాసిస్సు తలకెత్తుకొని
ఎడారి జయంచాల్సిందే !
బతుకును పచ్చని తోరణాల పందిరిగా మార్చుకోవాల్సిందే !!

 

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
చిత్రం: జావేద్



మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)