కవిత్వం

నేనూ ఓ మట్టిపొయ్యి

జనవరి 2013

రోడ్డు మీదవోయేటోల్లంతా మా సుట్టాలే
ఎవరొస్తె ఆళ్ళకు చాయ్ వోస్తం
ఆల్లే మాకు తిండివెట్టేది
ఆరు గజాల గుడిశే మా ఇల్లు
నేను నా మొగుడు ముగ్గురు పిల్లలు
అండ్లనే మా చాయ్ దుకాణం హైవే మీద

బస్సులన్నీ నా ఇంటిముందే ఆగుతయ్ గానీ
పక్కనున్న దాబాలకే అన్ని కాళ్ళు నడిశేది
ఎవరో ఒకరిద్దరు మా మట్టి చాయ్ కోసమొస్తరు
ఏసీ బస్సులల్ల తిరిగేటోల్లు
మా చాయేందాగుతరని సర్దుకుంటగానీ
ధాబాల సలీంగాని చెమటరాలే చేతుల
కంపుశాయి ఈళ్ళకి ఇంపెట్లయితదో
నాకెంతకీ అర్ధంగాదు

పొద్దుపొద్దుగాల పోరలని పుల్లలేరవంపుత
అవే మా పొయ్యెలిగించేది
బడియాలకొచ్చి ఇంత శాయిదాగివోతరు
మజ్జానం బల్లెనే తింటరుగానీ
పొద్దుమూకేసరికి పొట్టశేతవట్టుకొని
కూసుంటరు నా సుట్టు
సందళవడేసరికి ఓ ఏబైరూపాలన్నా
అమ్మితెనే పొదుగాల పాలకివోను
మాకు నోట్ల గంజినీళ్ళు లేదంటే చాయినీళ్ళు
మా పొయ్యెప్పుడు మంతనేవుంటది
మా కడుపెపుడు కాల్తనేవుంటది

నే మూడు పూటల చాయ్తోనే కడుపునింపుత
నా మొగుని సంపాదన ఆని తాగుడుకేసాలవు
పొద్దంత కాగవెట్టిన చాయి మిగిల్తే కడుపులవోస్త
ముందు పుండ్లువడ్డయి రానురాను రాచపుండయింది
ముందు ఏందింటే అదే కక్కుతుండె
ఇప్పుడు ఏందిన్నా రకతమేగక్కుతున్న
నాలో ఇంత రకతమెక్కడిదో అర్ధమేకాదు

చిన్నప్పుడు పొలంల
ఒకీడుకొచ్చినంక దొరసానింట్ల
పెండ్లయినంక అత్తకింద
పెనిమిటికి పెళ్ళాంగా
పిల్లలకి పాలిచ్చి సాదనీకె
నా రక్తం దారవోస్తనేవున్నగదా
ఇంకా ఏమన్న మిగిలిందేమోనని
నాకీ పాడు రోగమిచ్చిండేమో ఆ దేవుడు
ఈ కడుపుల కేన్సరుకి కూడా
మా గుడిశల ఒకటే మందు
మా మట్టిపొయ్యి చాయే
ినే సచ్చినంక నా నోట్ల తులసినీళ్లువోస్తరో
లేక నా మట్టిపొయ్యి చాయే వోస్తరో…. ప్చ్!!!



One Response to నేనూ ఓ మట్టిపొయ్యి

  1. January 4, 2013 at 8:28 am

    మా పొయ్యెప్పుడు మంతనేవుంటది
    మా కడుపెపుడు కాల్తనేవుంటది
    super lines and heart touching poem

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)